[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]
దేవుడు చేసిన బొమ్మలు
చిన్నప్పుడు దేవకి వేసవి శలవుల్లో వాళ్ల తాతగారి ఊరికి వెళ్ళేది. అక్కడ దేవకిని ఎంతో అపురూపంగా చూసేవారు. దేవకికి కాలక్షేపం కోసం ఆమె ఈడు పిల్లల్ని కొంతమందిని పోగు చేసి, వాళ్లతో దేవకి ఆడుతూ పాడుతూ ఉంటే, తాతగారు, అమ్మమ్మ సంతోషించేవారు. ఆ కొద్దిరోజులూ ఆ పిల్లలతో దేవకి ఊరంతా తిరిగివచ్చేది. ముఖ్యంగా ఇద్దరు ముగ్గురు అమ్మయిలతో దేవకికి మంచి స్నేహం ఏర్పడింది.
ఆ ఊరిలోనూ, ఆ స్నేహితురాళ్లతోనూ దేవకి అనుబంధం చాలా ఏళ్లు కొనసాగింది. దేవకి కాలేజీ చదువు పూర్తయింది. పెళ్లి అయింది. భర్తతో విదేశాలు తిరిగి రావటమూ అయింది. కాలం తెచ్చిన మార్పులెన్నో జరిగాయి. అయినా చిన్ననాటి ఆ ఊరు, ఆ స్నేహితురాండ్రూ ఆమె స్మృతి పథంలో ఇప్పటికీ మెదులుతూనే ఉన్నారు.
నలభై ఏళ్ల వయస్సు వచ్చాక, చూడాలని మళ్లీ ఆ ఊరు వెళ్ళింది. చిన్నప్పుడు పిండివంటలు వండి పెట్టిన అమ్మమ్మ, దగ్గర పడుకోబెట్టుకుని ‘అనగనగా ఒక రాజు’ అంటూ కథలు చెప్పిన తాతయ్య లేరు. వాళ్ల సంతానమే ఉన్నారు. అతిథి మర్యాదలన్నీ బాగానే చేశారు. కానీ ఆనాటి ఆ ఆత్మీయత ఏదో లోపించింది. అది స్పష్టంగానే కనిపిస్తోంది.
ఊరు కూడా ఎంతో మారి పోయింది. ఆనాటి పూరిళ్లు, డాబాలు లేవు. మేడలు వెలిశాయి. రెండు చక్రాలు, నాలుగు చక్రాలు వాహనాలన్నీ ఇళ్ల ముందు బారులు తీరి ఉన్నాయి.
చిన్నతనంలో తనతో ఆడుకున్న రాణి అప్పట్లోనే ఎంతో అందంగా ఉండేది. బ్రహ్మదేవుడు తీరి కూర్చుని తీరికగా తీర్చిదిద్దిన బొమ్మలా ఉండేది. ఇంతలేసి కళ్లతో నవ్వుతుంటే, చూడటానికి వేయి కళ్లు చాలవు అనిపించేది. ఆ రాణి ఇప్పుడు ఎక్కడుంది, ఎలా ఉంది అని వాకబు చేస్తే, తెల్సిన విషయాలు దేవకిని ఆశ్చర్యపరచాయి.
ఆ ఊరిలో సంపన్న కుటుంబీకుడు అయిన రామచంద్రం కన్ను ఆమె మీద పడింది. అతనికి వేరే భార్యాపిల్లలు ఉన్నారు. అయినా సరే రామచంద్రం రాణిని తన దానిని చేసుకున్నాడు. ఒక మేడలో ఆమెను అలపైడి బొమ్మలా ఉంచుకున్నాడు. ఆమె కాలు బయలు పెట్టటానికి అవసరం లేకుండానే అన్నీ ఆమె కాళ్ల దగ్గరకీ వచ్చేవి. అప్పుడప్పుడు ఆయనతో కారులో నగరాలకు విహారయాత్రకి వెళ్లి వస్తుండేది. తనను నమ్ముకున్నందుకు రామచంద్రం ఆమెకు ఏ లోటూ రానివ్వలేదు. పువ్వులలో పెట్టి పూజించాడు. నోరు తెరిచి ఎవరూ ఒక్కమాట అనకుండా, ఎంతో గౌరవంగా ఆమెను చూసుకునేలా చేశాడు. ఘనంగా, దర్జాగా, ఠీవిగా బతికింది.
రోజులు ఎప్పుడో ఒకేలా ఉండవు. గ్రహాలు మారుతుంటాయి. పరిస్థితులు మారుతుంటాయి. ఓడలు బండ్లూ బండ్లు ఓడలూ అవుతుంటాయి. రామచంద్రం అకస్మాత్తుగా ఒక రోజు రాత్రి గుండెపోటుతో చనిపోయాడు. వెంటనే అతని భార్యా పిల్లలూ, ఆమె తరఫు వాళ్ళు జాగ్రత్త పడ్డారు. ఆస్తిపాస్తులన్నీ వాళ్లే చేజిక్కించుకున్నారు. రాణిని తన్ని తరిమేశారు. అవమానం భరించలేక ఉరు విడిచి వెళ్లిపోయింది. ఇప్పుడు ఎక్కడుందో, ఎలా ఉందో, అసలు ఉందో లేదో కూడా ఎవరికీ తెలియదు. ఇదంతా ఆమె స్వయంకృతం అనీ, ఒళ్లు తెలియకుండా ప్రవర్తించిందనీ, విమర్శించిన వారూ ఉన్నారు అందరు స్త్రీల మాదిరిగానే ఆమె కూడా ఒక మగవాడిని నమ్మింది. తాళి కట్టించుకోలేదన్న మాటేగానీ, ఆయన ఉన్నంత కాలం సిరిసంపదల లోనే తులతూగింది. కావాలనుకుంటే, ఆయన బ్రతికున్న రోజుల్లో ఆస్తి అంతా రాణి పేర పెట్టమంటే, కళ్లు మూసుకుని, కాగితాల మీద సంతకాలు చేసేవాడు. ధనరాశులు ఆమె పాదాల దగ్గర పోగు పోసేవాడు. వెర్రిబాగుల మనిషి గనుక, ముందుచూపు లేక, చుట్టాల నుంచీ, చట్టాల నుంచీ రక్షణ కల్పించుకోలేక పోయింది. ఆమె మంచితనమే ఆమెను కాటేసింది.
అప్పట్లో ఆ ఊళ్ళో ఉన్న మరో స్నేహితురాలు స్వరాజ్యం. బాగా పాటలు పాడేది. పక్క ఊరు నుంచి సంగీతం మాష్టారు వచ్చి సంగీతం నేర్పి వెళ్లేవాడు. క్రమంగా మంచి గాయకురాలు అయింది. స్కూల్లోగానీ, ఇతర సభల్లోగానీ స్వరాజ్యం చేతనే ప్రార్థనా గీతం పాడించేవారు. రాత్రి పూట పెరట్లో, వెన్నెల్లో, వేప చెట్టుకింద నవారు మంచం మీద పడుకుని, పాటలు పాడమని అడిగితే, దానికి వచ్చిన పాటలతో పాటు సినిమా పాటలూ బాగా పాడేది ‘వరవీణా మృదుపాణీ’ అంటూ పాడుతుంటే చుట్టుపక్కల ఉన్న ఆడా, మగా అంతా, ముసలీ ముతకతో సహా మంత్రముగ్ధులై పోయేవారు, “ఇక్కడెందుకే! నువ్వు మద్రాసు పోయి సినిమాల్లో పాడవే” అనేవారు. “మనల్ని ఎవరు రానిస్తారు పిన్నీ?” అనేది. తను అన్ని చోట్లా పాడాలి, ప్రశంసలు పొందాలి అనే ఆరాటం మాత్రం స్వరాజ్యానికి ఉండేది. తరువాత ఇప్పుడు స్వరాజ్యాన్ని వెతుక్కుంటూ వెళ్తే, గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. కొంచెం లావు అయింది. నల్లబడింది. ముగ్గురు పిల్లల తల్లి అయింది. మొగుడు శ్రీశైలం దగ్గర ఒక పెద్ద గవర్నమెంటు ఆఫీసులో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. దేవకి చిన్ననాటి విషయాలు గుర్తు చేస్తే విరక్తిగా నవ్వింది.
“చిన్నప్పుడు అంటే ఎవరు ఛాన్స్ ఇస్తారు అనేదానివి. పెద్ద అయినాక అయినా సినిమాల్లో పాడటానికి ప్రయత్నించలేదా?” అని అడిగింది దేవకి.
“ఆయనకు ఈ ఆటలూ, పాటలూ ఇవన్నీ నచ్చవు. ఎక్కడా పాడనివ్వరు. బయరుకు వెళ్లనివ్వరు. ఆయనకు ఇష్టం లేదని తెల్సాక, ఇంక రోజూ పోరుపెట్టి ప్రయోజనం లేదని ఆ కోరిక చంపుకున్నాను” అన్నది స్వరాజ్యం.
“నీ పాట వినాలని ఉంది. ఒకసారి పాడవా?” అని అడిగింది దేవకి.
“నేనా విషయమే మర్చిపోయాను. పాడటం మానేసి చాలా కాలం అయింది. ఇప్పుడు గొంతెత్తినా అన్నీ అపశృతులే పలుకుతాయి” ఆన్నది స్వరాజ్యం కళ్లల్లో నీళ్ళు నింపుకుని. భర్త ప్రోత్సహించి ఉంటే స్వరాజ్యం మరో సుబ్బలక్ష్మి అయి ఉండేదేమో.
ఆ ఊళ్లోని చిన్ననాటి స్నేహితురాళ్లల్లో బాగా గుర్తున్న మనిషి కాంతం. అప్పట్లో దేవకిని అంటిపెట్టుకుని నీడలా తిరిగేది. కాలేజీలో చదువుకుని, లెక్చరర్, ప్రొఫెసర్ కావాలని ఉబలాటపడింది. కానీ దాని ఆశలేవీ నెరవేరలేదు. హైస్కూలు చదువు కాగానే, పెళ్లి చేసేశారు. దేనికి కాంతాన్ని చూడటం కోసం వాళ్ల ఇంటికి వెళ్లేటప్పటికి గేదెల దగ్గర కూర్చుని పాలు పితుకుతోంది. దేవకిని చూసి నవ్వింది. కుర్చీ తెప్పించి కూర్చోమంది. మాట్లాడుతున్న కాసేపూ పనివాళ్ళు వచ్చి ఏదో ఒకటి అడుగుతునే ఉన్నారు. ఓపికగా సమాధానాలు చెబుతూనే ఉంది.
“ప్రొఫెసర్ కావాలని అనుకునేదానిని ఇలా కూరుకుపోయావేమిటి?” అని అడిగితే, నవ్వింది. “ఎప్పుడేనా ఏదేనా కథో, వ్యాసమో రాద్దామని కూర్చుంటే, ఆయన ఎగతాళి చేస్తారు! ‘నువ్వు కలం పుచ్చుకుంటే ఏం జరుగుతుందో తెల్సా? పాళీ విరుగుతుంది’ అని పకపకా నవ్వుతారు. అంతటితో నేనే కుచించుకుపోతాను. నాకేమీ రాదనిపిస్తుంటుంది” అన్నది కాంతం.
ఒక నిముషం ఆగి మళ్లీ తనే అన్నది “మా అమ్మలాగా, మా అమ్మమ్మలాగా, నడ్డి వంగిపోయే దాకా, జుట్టు తెల్లబడే దాకా అన్నం వండుతూ, వడ్డిస్తూ, అంట్లు తోముతూ, బట్టలు ఉతుకుతూ జీవితాన్ని గడిపేస్తాను.” అని కన్నీళ్లు తుడుచుకుంది.
ఇలాంటి వాళ్లు మన దేశం నిండా వందలు, వేలల్లో, లక్షల్లో, కోట్లల్లో ఉన్నారు.
వీళ్లంతా దేవుడు చేసిన బొమ్మలు.
శ్రీధర పేరుపొందిన కథ, నవలా రచయిత. అత్యంత చమత్కార భరితమైన సంభాషణలతో అందమైన రచనలు చేసే శ్రీధర ఇటీవల “ఇచ్చట జూదమాడంగరాదు” అనే నవలను ప్రచురించారు.
