[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]


దీపం పురుగులు
నందిని రూంకి వచ్చేటప్పటికి రాత్రి పది గంటలు అయింది. వస్తూనే పది నిముషాలు పడుకుని ఉండిపోయింది. తరువాత నెమ్మదిగా లేచి కూర్చుంది.
“ఏంటి ఇంత లేటు అయింది?” అని అడిగాడు సురేష్.
“ప్రముఖ నటి కల్పనగారి మేకప్‌మాన్ ఒక విషయం చెప్పాడు, జయంతి బ్యానర్ వాళ్లు భారీ చిత్రం తీస్తున్నారట. కథ అంతా రెడీ అయింది. కల్పన గారిని బుక్ చేశారు. సెకండ్ హీరోయిన్ ఎవరైనా కొత్త ఆవిడను తీసుకుందామని చూస్తున్నారు. నన్ను వెళ్లి ప్రొడక్షన్ మేనేజర్ శంకర్ గారిని కలవమన్నాడు. వాళ్ల ఆఫీసు దగ్గర ఆయన కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను. ఆయన కొంచెం ఎంకరేజింగ్ గానే మాట్లాడాడు. రేపు వస్తే డైరెక్టర్‌కి పరిచయం చేస్తానన్నాడు..” అన్నది నందిని.
“గుడ్ లక్. దశ తిరగబోతోందన్న మాట..” అన్నాడు సురేష్.
“అప్పుడే అన్నీ అనుకోవటానికి లేదు, వాళ్లు ఇంకా ఎంతమందిని చూస్తున్నారో?” అన్నది నందిని.
“నీ ముఖంలో ఒక రకమైన గ్లామర్ ఉంది. ఆకర్షణ ఉంది. ఛాన్స్ దొరికితే నటి కల్పన గారిని డామినేట్ చేయగలవు” అన్నాడు సురేష్ నవ్వుతూ.
“అందుకనే ఆమే అడ్డు తగిలినా తగలవచ్చు..”
“డైరెక్టర్ గట్టివాడు అయితే, ఎవరి మాటా వినడు.. అన్నట్లు నీ కోసం బిర్యానీ తీసుకొచ్చాను. తినేసి పడుకో..” అన్నాడు సురేష్.
పడుకోబోయే ముందు నందిని అడిగింది “నీ దగ్గర ఓ ఫైవ్ హండ్రెడ్ ఉంటే ఇస్తావా? బొత్తిగా ఆటోకి కూడా డబ్బుల్లేవు..” అని.
అతను అయిదు వందలు ఇచ్చాడు.
సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసే వాళ్లందరికీ ఒక అసోసియేషన్ ఉంది. నిర్మాతలు, ‘మాకు ఇంత మంది రేపు కావాలి’ అని ఈ అసోసియేషన్ వాళ్లను అడిగితే, తమ అసోసియేషన్ మెంబర్లు అయిన వాళ్లను ఆ రోజు ఆ సినిమాలో షూటింగ్‌కి పంపిస్తారు. నిర్మాత వాళ్లకు ఇచ్చే డబ్బులో కొంత ఈ అసోసియేషన్ వాళ్లకు ఎవరిస్తే వాళ్లనే పంపిస్తుంటారు. ఈ విషయంలో మిగిలిన వాళ్లు అభ్యంతరాలు చెప్పినా, వినే నాథుడు ఎవడూ ఉండదు.
“రేపు అడ్డా మీదకు రావా?” అని అడిగాడు సురేష్.
“లేదు. జయంతి ఆఫీసుకు వెళ్తాను. అక్కడ ఎంత టైం పడుతుందో తెలీదు” అన్నది నందిని.
మర్నాడు నందిని వెళ్లి ప్రొడక్షన్ మేనేజర్ శంకర్‌ని కల్సుకుంది. ఆయన కాఫీ, టిఫిన్ తెప్పించాడు. నందినితో ఎన్నో విషయాలు విపులంగా చెప్పాడు.
“మనం జీవితంలో ఏదైనా ఒకటి పొందాలీ అంటే, మన దగ్గర ఉన్నదానిని దేన్నో ఒక దాన్ని పోగొట్టుకోవాలి. ఉదాహరణకి ఒకాయన తన దగ్గరున్న డబ్బు పెడుతున్నాడు గనుక ప్రోడ్యూసర్ అయ్యాడు. ఒకాయన కళాత్మకంగా ఆలోచించి, సన్నివేశాన్ని ఎలా రక్తి కట్టించాలని తెల్సు గనుక డైరెక్టర్ అయ్యాడు. ఒకాయన ముఖారవిందం అందంగా ఉంది గనుక హీరో అయినాడు. అలాగే నీ దగ్గర అందం ఉంది. గనుక దాన్ని కావల్సిన పద్ధతిలో వినియోగిస్తే, రేపు ఒక పెద్ద హీరోయిన్‌వి అవుతావు. ఇక్కడ ఇగోలు, భేషజాలు పనిచేయవు. అందంగా ఉన్నవాళ్లు చాలామంది ఉంటారు. అదొక్కటే సరిపోదు. దానితో పాటు, మనకు కావల్సిన అవకాశం, డబ్బు వాళ్లు ఇస్తున్నప్పుడు, వాళ్లకు మనం ఏం ఇవ్వాలో తెల్సుకుని, అది ఇవ్వాలి..” అని శంకర్ ఆమెకు హితబోధ చేశాడు.
ఇదంతా నందినికి తెలియని విషయం కాదు. మనుష్యుల్ని కంటి చూపుతో, ఒంటి విరుపుతో ఎలా ప్రసన్నులను చేసుకోవాలో ఆమెకు బట్టర్‌తో పెట్టిన విద్య.
డైరెక్టర్, నిర్మాత వంటి ప్రముఖులు వచ్చారు. నందినిని చూశారు. స్క్రీన్ టెస్ట్‌లు చేశారు. “అక్కడక్కడ ఎక్స్పోజింగ్ సీన్లు ఉంటాయి, నీకు ఇష్టమేనా?” అని అడిగాడు డైరెక్టర్.
“మీరు ఎలా చేయమంటే అలా అలా చేస్తాను” అని నందిని చెప్పిన తరువాత ఆమెను సెలెక్ట్ చేశారు.
నందిని ఆ సినిమాలో ఒక ముఖ్యమైన వేషానికి ఎంపిక అయినందుకు ఆమె కన్నా శంకర్ ఎక్కువ సంతోషించాడు. ఆమెకు మరిన్ని హితబోధలు చేశాడు.
“ఈ పరిశ్రమలోకి ఎవరు వస్తున్నారో, ఎవరు నిష్క్రమిస్తున్నారో అందరూ గమనించి చూస్తుంటారు. అందుచేత ప్రచారం కూడా చాలా అవసరం. మిగిలిన నిర్మాణ సంస్థల వారందరితో నాకు మంచి పరిచయాలున్నయి.. నీ గురించి వాళ్లందరికీ గొప్పగా చెప్పి, నీకు మంచి పేరు తెచ్చే బాధ్యత నాది. నువ్వు నేను చెప్పినట్లు వింటే నిన్ను అగ్రశ్రేణి నటీమణిని చేస్తాను. పేరుకు పేరు, డబ్బుకు డబ్బు.. మహామహా వారంతా నీ ఇంటి ముందు క్యూ కట్టి నిలబడతారు. అదంతా నేను చూసుకుంటాను..” అని శంకర్ ఆమె కళ్లముందు ఒక అందమైన రంగుల ప్రపంచాన్ని సృష్టించాడు.
పరిశ్రమలో నలుగురితో పరిచయం ఉన్న వ్యక్తి అవసరం తనకు ఉన్నదనీ, నిలదొక్కుకోవాలంటే ఇప్పుడు శంకర్ సహాయం తప్పనిసరి అని నందిని గ్రహించింది.
సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచీ, నిర్మాత, డైరెక్టర్లను అంటి పెట్టుకుని తిరుగుతోంది. ముఖ్యమైన హీరోయిన్ అయిన కల్పనను అక్కా, అక్కా అంటూ వరసలు కలుపటం మొదలు పెట్టింది. మిగిలిన వాళ్లంతా నందినికి బ్రహ్మరథం పడుతున్నందున కల్పన కూడా నందినితో నవ్వుతూ మాట్లాడాల్సి వస్తోంది.
“ఇక్కడ ఎవరూ శాశ్వతం కాదు. కొత్త నీరు వస్తుంటుంది. పాత నీరు కొట్టుకు పోతుంటుంది” అని నిర్మాత ఒకసారి కల్పనతో మాటల సందర్భంలో అనటంతో నందినికి పెరుగుతున్న ఆదరణను కల్పన కూడా అర్థం చేసుకుంది.
ఈ సినిమాలో సెలక్ట్ అయిన తరువాత ఒకటి, రెండు సార్లు మాత్రమే తాను ఇదివరలో ఉండిన రూంకి వెళ్లి పాత స్నేహితుడు సురేష్‌తో ఒక గంట రెండు గంటలు గడిపి వచ్చింది. కంపెనీ వాళ్ల గెస్ట్ హౌస్ లోనే సకల సౌకర్యాలతో ఆమెకు వసతి ఏర్పాటు చేశారు.
ఇది ఉభయ తారకంగా ఉంది. ఆయాచితంగా మంచి వసతి దొరికినందుకు నందిని సంతోషిస్తే, రాత్రీ పగలూ ఈ కొత్త హీరోయిన్ తమకు అందుబాటులో ఉండి, అన్ని విధాలుగా సహకరిస్తున్నందుకు ప్రొడక్షన్ వాళ్లూ ఆమెకు అయ్యే అన్ని ఖర్చులూ భరిస్తున్నారు.
కొన్ని రోజులు షూటింగ్ అవుట్డోర్ అని ఆంధ్రాలలోని కోనసీమకు తీసుకెళ్లారు. కొన్ని రోజులు విదేశాలకూ తీసుకెళ్లారు. శంకర్ ఆమెకు నీడలా ఉంటూ ఎప్పటికప్పుడు ఉచిత సలహాలు ఉచితంగానే ఇస్తున్నాడు.
ఎవరు ఏది అడిగినా, ఆమె శంకర్ వైపు చూస్తోంది. ఆమె తరఫున శంకర్ సమాధానాలు చెబుతున్నాడు. నందిని శంకర్ చెప్పినట్లు ఆడే బొమ్మ మాత్రమే అని తెలియటంతో శంకర్ పాత్ర కూడా పెరిగింది.
సినిమా రిలీజ్ అయింది. సూపర్ హిట్ కావటంతో పాటు, నందిని అందరి దృష్టినీ ఆకర్షించింది.
వెంట వెంటనే మరికొన్ని అవకాశాలు రావటం మొదలు పెట్టాయి. అరడజను మంది నిర్మాతలు ఆమెను బుక్ చేసుకోవటానికి ఆసక్తి చూపించారు.
“ఇప్పుడే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచి ఫైల్ లోకి వస్తున్నావు గనుక, నీ ఆకర్షణను ఉపయోగించుకోవాలని మిగిలిన నిర్మాతలు అనుకుంటారు.. కానీ ఆయా సినిమాల్లోని వేషాలు సరియైనవి కాకపోతే, ఇప్పుడిప్పుడే వస్తున్న పేరు కాస్తా ఇట్టే కనుమరుగై పోతుంది. ఆ వేషాలు నీకు మరింత పేరు తెచ్చేవి అయితేనే ఒప్పుకోవాలి. ఇది మొదటి విషయం. ఇక రెండవది డబ్బు.. ఒక సినిమా హిట్ అయినాక, అందులో నీ వేషాన్ని బట్టి గుర్తింపు వస్తుంది. దానితో నలుగురి దృష్టిలో నీ ప్రాముఖ్యత పెరుగుతుంది. అలాంటప్పుడే నీ రేటు పెంచుకోవాలి. అలా అని మరీ ఎక్కువ చెప్పి చెట్టు ఎక్కి కూర్చుంటే, నీకు ఇచ్చే వేషం ఇంకెవరికో వేస్తారు, నీకు అవకాశాలు తగ్గిపోవటమే కాక పోటీ పెరుగుతుంది. ప్రత్యమ్నాయంగా ఇంకొకరు ఎదుగుతారు. అందుచేత, వచ్చిన ఏ ఒక్క అవకాశమూ వదులుకోకుండానే నీ పారితోషకం పెంచుకుంటూ పోవాలంటే, లౌక్యం చాలా అవసరం – మన నోటితో అడగకుండానే, పార్టీ పారితోషికం పెంచేలా చేయాలి. ఇదో ఆర్ట్. ఈ విషయాలన్నీ నేను చూసుకుంటాను. నిన్ను ఎవరు వచ్చి అడిగినా శంకరిని అడగండి అని చెప్పు. చాలు”. అన్నాడు.
అతను చెప్పింది నిజమే అనుకుంది. అలానే చేసింది. చివరకు ఆమె కాలు కదిపి బయటకు వెళ్లాలన్నా శంకర్ మీదే ఆధార పడాల్సి వచ్చింది.
క్రమంగా ఆమెకు పేరు, డబ్బు వచ్చాక, శంకర్‌ని నందిని వివాహం చేసుకుంది – అని పేపర్లో వార్తలు వేయించాడు. ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నందున, అందరూ అది నిజమేనని నమ్మారు.
“ఏమిటిది శంకర్?” అని అడిగింది.
“నీకు అంటూ ఒక ఇల్లూ, సంసారం, పిల్లలూ ఉండాలి కదా. డబ్బు ఉన్నా, ఎంతో పేరు ప్రఖ్యాతులున్నా, ఒంటరితనంలోని వెలితి కనబడుతునే ఉంటుంది. నీకూ వయసు వస్తోంది. మరీ వయసు మీరిన తరువాత ఏ ముసలి పాత నిర్మాతకో ఉంపుడుగత్తెగా సమాజం దృష్టిలో మిగిలిపోతావు. అందుకని నీ మంచి కోరే చెబుతున్నాను” అంటూ నచ్చచెప్పాడు.
కొద్ది మంది ప్రముఖుల మధ్య నందిని శంకర్‌ని వివాహం చేసుకుంది.
ఇప్పుడు ఆమె జీవితం మూడు పూలూ, ఆరు కాయలుగా ఉంది. వద్దంటే డబ్బువచ్చి పడుతుంది.
సినిమా నిర్మాణంలో దిగాలని శంకర్ ప్లాన్ చేస్తున్నాడు. అలాంటి సమయంలో ఒక రోజు స్టూడియోలో జీవితం ఆరంభ దశలో కల్సి ఉన్న సురేష్ కనిపించాడు. అతను ఇప్పుడు దర్శకుడు అయ్యాడు. ఒకటి రెండు సినిమాలు తీశాడు.
నందిని అడిగింది – “సురేష్, నేను నిర్మాత మారుతున్నాను. నువ్వు ఒక సినిమా డైరెక్ట్ చెయ్యి” అన్నది.
“సినిమా నిర్మాణం అనేది గాలిలో దీపం లాంటిది. ఎలా తయారవుతుందో, చివరకు ఎలా మిగులుతుందో తెలియదు. బాగా సంపాదించుకున్నావు. ఆస్తులు ఏర్పరుచుకో. జీవితంలో స్థిరపడు” అని సలహా ఇచ్చాడు.
కానీ నందిని పూర్తిగా శంకర్ చేతిలో కీలుబొమ్మ అయింది. అతనే డైరెక్టర్‌గా మారి రెండు సినిమాలు తీశాడు. రెండూ అట్టర్ ఫ్లాఫ్స్ కావటంతో నష్టపోయింది. శంకర్ మాత్రం సినిమా నిర్మాణాల పేరుతో ఆమె డబ్బునంతా తన డబ్బుగా మార్చుకుని ఆస్తులు ఏర్పరుచుకున్నాడు. కేవలం లౌక్యంతో, మాట చాకచక్యంతో నందినిని అడ్డం పెట్టుకుని, వందల కోట్లు సంపాదించాడు.
నందినితో అవసరం తేలిపోయాక, శంకర్ ఆమెను ఎంగిలి ఇస్తరాకులా వదిలేసి వెళ్లిపోయాడు. ఇద్దరి మధ్యా నిత్యం గొడవలు, స్పర్థలూ ఎక్కువైనయి.
విడిపోయారు.
నందిని విడిగా ఉంటోంది. సినిమా అవకాశాలు లేవు. రోజు గడవటం లేదు.
సురేష్ వచ్చి ఆమెను ఆదుకుంటున్నాడు.
సినిమా అనేది బాగా వెలిగే దీపం లాంటిది. దాని చుట్టూ ఎన్నో పురుగులు చేరుతుంటాయి. కొన్ని ఆ దీపంలో పడి కాలిపోతుంటాయి.
శ్రీధర పేరుపొందిన కథ, నవలా రచయిత. అత్యంత చమత్కార భరితమైన సంభాషణలతో అందమైన రచనలు చేసే శ్రీధర ఇటీవల “ఇచ్చట జూదమాడంగరాదు” అనే నవలను ప్రచురించారు.