[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]
అనంత రామయ్య హాస్పటల్లో చనిపోయాడు. ఆ సమయంలో ఆయన పక్కన యామిని తప్ప ఇంకెవరూ లేరు. ఇంకెవరూ రారు.
హాస్పటల్లో బిల్లు కట్టి బాడీని తీసుకు పొమ్మన్నారు, హాస్పటల్ సిబ్బంది. ఎలా తీసుకువెళ్లాలో యామినికి తెలియటం లేదు. హాస్పటల్‌కి వచ్చేటప్పుడు అంటే, ఆయన బ్రతికే ఉన్నాడు. గనుక, ఆటోలో పక్కన కూర్చోబెట్టుకొని తీసుకువచ్చింది. కానీ ఇప్పుడు ఆయన ఒక ‘బాడీ’ మాత్రమే. ఆటో లోనో, టాక్సీ లోనో తీసుకు వెళ్లటానికి వీల్లేదు.
“ఎలా తీసుకుపోవాలి?” అని అడిగింది నర్సుని.
“అంబులెన్స్ మాట్లాడుకోండి. వాళ్లు మీ ఇంటి దగ్గర దించుతారు” అన్నది నర్సు.
అంబులెన్స్‌లు ఎక్కడ ఉంటాయో తెలియదు. అక్కడ చనిపోయిన వాళ్లను తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఇద్దరు ముగ్గురు ఉంటారు. వాళ్లు శవాల కోసమే పుట్టారు. శవాల మధ్యనే పెరిగారు.
ఒకడు వచ్చాడు. ఇల్లు ఎక్కడ అని ఆరా తీశాడు.
యామిని చెప్పింది.
గేటెడ్ కమ్యూనిటీ అనగానే వాడు రేటు పెంచి చెప్పాడు.
“పదివేలు” అన్నాడు.
యామిని ఇప్పుడు, ఎక్కువా, తక్కువా – అని బేరమాడే స్థితిలో లేదు.
‘సరే’ అన్నది.
ఇంకో ఇద్దరు వచ్చారు. వాడు వెళ్లి అరగంటలోనే అంబులెన్స్ తెచ్చాడు.
అనంత రామయ్య బాడీని గుడ్డలో చుట్టారు. జారిపోకుండా తాళ్లతో కట్టారు. ఒక బల్లనో, బీరువానో తీసుకుపోయినట్లు ఆయన్నీ తీసుకెళ్లి అంబులెన్స్ లోకి ఎక్కించారు.
హాస్పటల్ బిల్లు తెచ్చి ఇచ్చింది నర్సు. కార్డు ఇచ్చింది యామిని.
ఆమె కూడా వెళ్లి ఆంబులెన్స్‌లో కూర్చుంది – బాడీ పక్కన.
వాహనం కదిలింది.
యామిని చూస్తూనే ఉంది. కానీ కళ్ళకేమీ కనిపించటం లేదు. మనసు నిస్తేజంగా ఉంది. ఆలోచించటం మానేసింది. ఒక మర మనిషిలాగా యాంత్రికంగా కదులుతోంది. మరమనిషికి బాధ, దుఃఖం, కన్నీళ్లు వంటివి ఏముంటాయి? అందుకే యామిని ఏడవటం లేదు.
వాహనం గేటెడ్ కమ్యూనిటీ చేరింది. వాచ్‌మన్ గేటు దగ్గర నిలబడ్డాడు.
యామిని చెప్పింది. “బి-బ్లాక్, ట్వంటీ టూ..”
వాహనం ముందుకు కదిలింది. బి-బ్లాక్ దగ్గర ఆగింది. కింద పార్కింగ్ ప్లేస్‌లో తెల్లని గుడ్డలో కట్టిన పార్సెల్‌ను అక్కడ దించారు. డబ్బు ఇచ్చింది. వాళ్లు వెళ్లిపోయారు.
అయిదు నిముషాలు అలాగే నిలబడి ఉంది. ఒక చలనం శరీరం. ఒక చలనం ఉన్న శరీరం. రెండిటికీ అంతే తేడా.
వాచ్‌మన్ వచ్చాడు. తమ అపార్ట్మెంట్ తాళంచెవులు వాడికి ఇచ్చింది. పైకి వెళ్లి, రెండు ప్లాస్టిక్ కుర్చీలు తెచ్చాడు లిఫ్ట్‌లో.
తెల్లగుడ్డ పార్సిల్ ముందు ఆ రెండు కుర్చీలు వేశాడు.
శవం రాకముందే ‘బి’బ్లాక్ ట్వంటీ టూ లోని వ్యక్తి చనిపోయినట్లు గేటెడ్ కమ్యూనిటీ అంతా తెల్సిపోయింది. అంతా తలుపులు, తలపులు బిగించుకుని లోపలే ఉండి పొయ్యారు. ఒక్కరంటే, ఒక్కరు కూడా కిందకు వచ్చే ప్రయత్నం చేయలేదు. గేటెడ్ కమ్యూనిటీ కదా. హృదయాల గేట్‌ను మూసేసుకొని లోపలనే టీ.వీ.లు చూస్తూ ఉండిపోయారు.
బి బ్లాక్ ట్వంటీ టూ లో బాగా వయస్సు మళ్లిన అనంత రామయ్య, ఇంకా వయసు వచ్చీరాని పద్దెనిమిదేళ్ళ యామిని మాత్రమే ఉంటారు. ఒకరికొకరు ఏమవుతారో తెలియదు. దూరపు బంధువే అయినా, బలమైన బంధమే వాళ్ల మధ్య ఏర్పడింది.
యామినికి తండ్రి, తల్లీ ఇద్దరూ ఉన్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఒక కూతుడు కలిగింది. తొలినాటి ప్రేమ ఏమైందో తెలియదు. ఘర్షణలు మొదలైనయి.
చిన్న చిన్న విషయాలే చినికి, చినికి గాలివానగా మారాయి. ఇద్దరూ విడిపోయారు.
మూడేళ్ల పిల్ల యామిని ఇద్దరికీ బరువైపోయింది. ‘నీ కూతురు’ అంటే ‘నీ కూతురు’ అంటూ వదిలించుకునే ప్రయత్నం చేశారు.
ఆ సమయంలో దూరపు బంధువైన అనంత రామయ్య ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశాడు. ఆయన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదుగానీ, పసిపిల్లను ఆయన దగ్గర వదిలేసి చెరో దోవ చూసుకున్నారు. చాలా చిత్రంగా యామిని అనంత రామయ్య ముందు కాళ్లకు బంధమై పోయింది. అందుకాయన విచారించ లేదు. ఏకాకిగా మిగిలిపోయిన తనకు దేవుడే ఈ అనుబంధాన్ని కల్పించాడనుకున్నాడు. సొంత కూతురి కన్నా మిన్నగా ఆ పిల్లను గుండెల మీద పెట్టుకుని పెంచాడు.
ఆయన చివరి దశలో ఆ పిల్లే ఆయనకు అండా దండా అయింది. కానీ నిండా రెండు పదుల వయస్సు కూడా లేని యామిని లేత చేతులు ఈ భారాన్ని మోయలేక పోతున్నయి.
నిన్నటి దాకా అనంతరామయ్య పెన్షన్‌లో కాలక్షేపం అయింది. రేపటి నుంచీ ఆయన లేడు. పెన్షన్ రాదు. ఎలా గడుస్తుంది – అన్నదే యామిని ముందున్న బేతాళ ప్రశ్న.
రాత్రి ఎనిమిది గంటల సమయంలో శివరాం వచ్చాడు. వస్తూ వస్తూ ఫ్రీజర్ తీసుకొచ్చాడు. వాచ్‌మన్ సహాయంతో ఆనంత రామయ్య శవాన్ని అందులోనికి చేర్చాడు.
యామిని కృతఙ్ఞత నిండిన కళ్లతో శివరాం వంక చూసింది. ఇద్దరి హృదయాలు బరువెక్కి బండరాళ్లుగా మారాయి. మాట్లాడటానికి ఏమీ తోచలేదు.
కొద్దిసేపటికి శివరాం అన్నాడు “మీ నాన్నకు ఫోన్ చేయక పోయావా?”
“చేశాను. వినేసి ఊరుకున్నారు. కర్మకాండకు డబ్బు లేదన్నాను. ఆయన దగ్గరా లేదన్నాడు. ఏనాడో తెంచేసుకున్న ఈ బంధాన్ని మళ్లీ తగిలించుకోవటం ఆయనకు ఇష్టం లేదని నాకు అర్థమైంది. ఇప్పుడు ఆయనకు అంటూ వేరే భార్యాపిల్లలు – కుటుంబం ఉంది గదా. ఇటువైపు తిరిగి చూస్తే, మళ్లీ నా బరువు బాధ్యతలు ఆయన మీద పడతాయి. ఇప్పుడు ఆయన ఉన్న పరిస్థితుల్లో ఇవన్నీ భుజానికి ఎత్తుకోలేడు – అని నాకు అర్ధమైంది. బలవంతం చేయదల్చుకోలేదు..” అని ఆగిపోయింది.
కొద్దిసేపు నిశ్శబ్ధం ఇద్దరి మధ్యా నిండు గర్భిణిలా నిలబడింది.
శివరాం అన్నాడు.
“మీ అమ్మకు చెప్పావా?”
“చెప్పదల్చుకోలేదు. ఏనాడో నన్ను వదిలించుకున్నారు. ఆయన లంపటం ఆయనకు ఉంది. ఆమె కూడా ఎవరి నీడనో రోజులు వెళ్లదీస్తోంది. రోజులు గడిచి పోతున్నాయి. నేను వాళ్ళకు జీవితాల్లోకి తొంగి చూసి, లేని సమస్యలు తెచ్చిపెట్టదల్చుకోలేదు..”
“మరి ఇప్పుడెలాగ?” అని అడిగాడు శివరాం.
“అదే.. ఏం చెయ్యాలో తెలియదు. రేపు ఉదయం ఇక్కడి నుంచి తీసుకు పోవాలి..”
శివరాం చాలాసేపు సెల్ ఫోన్లో ఏవో నెంబర్లు నొక్కుతూ కూర్చున్నాడు.
అనంత రామయ్య ఉన్న రోజుల్లో కూడా శివరాం అప్పుడప్పుడు వస్తుండేవాడు. ఆయన పని చేసిన రోజుల్లో శివరాం అనంత రామయ్య దగ్గర పని చేసేవాడు. ఆ పరిచయం కొద్దీ శివరాం నెలకో, రెండునెలలలో ఓ సారి వచ్చి గంటా, రెండు గంటలు కూర్చుని వెళ్తుండేవాడు. కానీ అతను రావటం, చూసీ చూడనట్లు తన వైపు చూపులు ప్రసరించటం యామినికి ఇష్టం ఉండేది కాదు.
కానీ ఇప్పుడు అతను ఒక కల్పవృక్షంగాను, కామ ధేనువుగానూ ఉన్నాడు.
రాత్రి పదకొండు గంటల దాకా శివరాం వాళ్ల ఆఫీసు వాళ్లతో మాట్లాడుతూనే ఉన్నాడు.
తరువాత శివరాం, యామినితో అన్నాడు.
“ఏదో ఒక సంస్థ వాళ్లు అనాథ శవాల దహనకాండ జరిపిస్తారట. మా ఆఫీసులో ఒక కొలిగ్ చెప్పాడు. తెల్లవారే లోపల వాళ్ల ఫోన్ నెంబరు సంపాదిస్తానన్నాడు” అని చెప్పాడు.
ఆ మాట విన్నాక యామినికి పెద్ద బరువు దించుకున్నట్లు అయింది.
“అదేదో చూడండి. మీకు పుణ్యం ఉంటుంది. తెల్లవారాక ఇక్కడ ఎంతోసేపు ఉండనివ్వరు” అన్నది యామిని.
వాచ్‌మన్ రెండు కప్పులతో ‘టీ’ తెచ్చి ఇచ్చాడు.
తెల్లవార్లూ రెండు చేతుల్లో మొహం కప్పుకుని కూర్చుంది. ఎప్పటికో కునుకు పట్టి, కుర్చీలోనే రెండు సార్లు జోగింది.
తెల్లవారింది. గేటెడ్ కమ్యూనిట్ లోని వాళ్లంతా రోజూ లిఫ్ట్ దగ్గర సందడి చేస్తుండేవాళ్లు. ఇవాళ ఎవరూ కిందకు దిగలేదు. ఒకరో, ఇద్దరో వచ్చి పాల పాకెట్లు తీసుకుని వెళ్ళారు.
పన్నెండు గంటలకు అనంత రామయ్య పనిచేసిన ఆఫీసు వాళ్ళు వచ్చారు, ఎవరెవరికో ఫోన్లు చేశారు.
రెండు గంటల సమయం. శవాన్ని తీసుకుపోయారు. యామిని కూడా వాళ్ల వెంట వెళ్లింది.
బండెడు కట్టెల్లో, అనంత రామయ్య కట్టె కాలిపోయింది.
యామిని కన్నులు, వర్షించే మేఘాలు అయినయి.
శ్రీధర పేరుపొందిన కథ, నవలా రచయిత. అత్యంత చమత్కార భరితమైన సంభాషణలతో అందమైన రచనలు చేసే శ్రీధర ఇటీవల “ఇచ్చట జూదమాడంగరాదు” అనే నవలను ప్రచురించారు.
You must be logged in to post a comment.
అలనాటి అపురూపాలు-6
సిరివెన్నెల పాట – నా మాట – 15 – జీవిత సారాన్ని రంగరించిన గీతం
దంతవైద్య లహరి-16
బ్రామ్ముడు
రెండు ఆకాశాల మధ్య-42
జీవన రమణీయం-34
జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-32
జ్ఞాననేత్రం
నూతన పదసంచిక-103
విరుగుడు
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *👏👏 Keep moving the story..*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Best wishes to you & your friends and supporters..🙌*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: * Your episodes are going very nice .👍*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up 👍.*
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma 👌👏 *
All rights reserved - Sanchika®