Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చిరుజల్లు-152

[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]

ఏమున్నది గర్వకారణం?

కొంతమందికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. అందం, ఐశ్వర్యం, అధికారం, కీర్తి ప్రతిష్ఠలు మొదలైన గొప్పదనాలు ఏవో ఉండటం వలన, మిగతా వారికన్నా గొప్పవారిమన్న భావం ఏర్పడుతుంది. క్రమంగా గర్వమూ తొంగి చూస్తుంది. సామాన్య మనుషులంతా చిన్న చిన్న చీమల్లా కనిపిస్తారు. ఒక మోతాదు వరకూ గర్వం ఉన్నా ఫర్వాలేదుగానీ, శృతి మించితేనే కష్టం.

గర్వం, అహంభావం గురించి చెప్పుకునేటప్పుడు, ముందుగా గుర్తుకు వచ్చేది సత్యభామ. ఆమె సామాన్యమైన స్త్రీ కాదు. జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణుల వారి ముద్దుల భార్య. ఇష్టసఖి. ఎవరి వల్ల ఆమెకు అంతటి ప్రాముఖ్యం వచ్చిందో, ఆ భర్తనే ఖాతరు చేయలేదు. ఆమె అలిగింది. ఆయన బ్రతిమిలాడుకున్నాడు. అయినా శాంతించలేదు. ఎడమ కాలిలో భర్త శిరస్సును తన్నింది. ఎప్పుడు తగ్గాలో, ఎప్పుడు హెచ్చిపోవాలో తెల్సిన ఆయన అదో అవమానంగా భావించటం మానేసి “నీవు తన్నుట నాకు మన్ననమే గాని, నా తనువు తాకిన నీ పద పల్లవంబు ఎంత నొచ్చుకున్నదో” అని బాధపడిపోయాడు. రసికత తెల్సిన భర్త కాబట్టి, ఆమె ఆటలు సాగినయి,

అప్పుడే కాదు, ఇప్పుడు కూడా అలాంటి భామలు ఉన్నారు. ఒక శ్రీమంతుడు తన గారాల కూతురుకు చాకు లాంటి కుర్రాడిని తెచ్చి వివాహం చేశాడు. తన వ్యాపారాన్ని అల్లుడికి అప్పగించాడు. శ్రీమంతుడి కూతురు ప్రతి మాటలోనూ, తన తండ్రి వల్లనే, ‘నీకీ స్థితి వచ్చింది’ అని గుర్తుచేస్తూనే ఉంటుంది. అది నిజమే అయినా, అనుక్షణం గుర్తు చేస్తుంటే భరించక తప్పని సరి పరిస్థితి అతనిది. చాకు లాంటి కుర్రాడు కాస్తా, అవమాన భారంతో క్రుంగిపోతూ, తుప్పుపట్టిన కత్తిలా తయారైనాడు. న్యూనతాభావం అతన్ని మూసికంగా క్రుంగదీసింది. అందువల్ల ఆమే నష్టపోయిందన్న విషయం గ్రహించలేక పోయింది. ‘తండ్రి మైనస్ తను?..’ అన్న ప్రశ్న వేసుకుంటే, ఆమెకు అసలు విషయం అర్థమయ్యేది కానీ, ఆ పరిస్థితి రాలేదు.

అహంకారాన్ని ప్రదర్శించటంలో పురుషులూ తక్కువ తినలేదు. నిన్న మొన్నటి దాకా, సాదాసీదా జీవితం గడిపిన వాడికి, ఒక పదవి గానీ, అధికారం గానీ వస్తే, ఆతని దర్పం అంతా ఇంతా కాదు. కీర్తి ప్రతిష్ఠల కోసం ప్రాకులాడే వాళ్లు ఉంటారు. ప్రతిభ కన్నా, పట్టు పరిశ్రమ వల్ల ఎప్పటికో ఒక పురస్కారమో, ఒక బిరుదో సంపాదిస్తారు. ఇక అక్కడి నుంచీ ప్రతి నిముషం ఆయన్ని డాక్టర్ ఫలానా అనీ, పద్మశ్రీ ఫలానా అని పిలిపించుకోవాలని ఆరాటపడిపోతుంటారు. ఇలాంటి వారి సంగతి తెల్సిన వారు ముందు పొగిడినా, వెనక మాత్రం ప్రొఫెసర్ ఉబలాటం అని అంటుంటారు.

ఎంత అన్యున్నత స్థాయిలో ఉన్నా, నిరాడంబరంగా, నిగర్భంగా ఉండేవారు చాలామంది ఉంటారు. అలాంటి వారికి వినయం ఎనలేని ఆభరణం అవుతుంది. కాల్విన్ కూలిడ్జ్ అమెరికా అధ్యక్షుడుగా ఉన్నప్పుడు వైట్ హౌస్‍లో ప్రముఖ నాటకకర్త డేవిడ్ బెలాస్కో ఆయన్ను కల్సుకుని “మిమ్మల్ని కల్సుకోవటం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను” అని అన్నాడు. “అమెరికా అధ్యక్షులు అయిన వారు చాలామంది ఉంటారు. వాళ్ళల్లో నేనూ ఒకడిని. కానీ ప్రముఖ నాటకకర్త బెలాస్కా మీరు మాత్రమే. మరొకరు అయ్యే అవకాశం లేదు. అందుచేత మిమ్మల్ని కల్సుకోవటం నా అదృష్టంగా భావిస్తున్నాను” అని అధ్యక్షుడు కూలిడ్జ్ చెప్పాడు, ఎంతో వినయాన్ని ప్రదర్శిస్తూ.

ప్రముఖ రచయిత వోల్టేర్ రచనలు చదివి ఎంతగానో ప్రభావితురాలైన ఒక పాఠకురాలు ఆయన్ను కల్సుకోవాలని ఉవ్విళూరింది. కానీ అంత పెద్ద రచయిత తనతో మాట్లాడుతాడా – అన్న సందేహం కలిగింది. ఆయన నుంచి పెద్దగా స్పందన రాకపోయినా, ఆయనను ఒకసారి చూసి రావాలనుకుని, ఎలాగో ఆయన అడ్రసు సంపాదించి, ఆయన ఇంటికి వెళ్లి తలుపు తట్టింది. తలుపు తీసిన వ్యక్తిని “వోల్టేర్ ఉన్నారా?” అని అడిగింది. “నేనే వోల్టేర్‌ని” అని ఆయన చెప్పాడు. ఎన్నాళ్లనుంచో కల్సుకోవాలని కలలు కంటున్న ఆ మహా రచయిత ఎదురుగా ఉన్నాడని తెలియగానే, ఆనందంతో ఆరాధనతో వంగి ఆయన పాదాలకు నమస్కారం చేసింది. వెంటనే ఆయన కూడా వంగి ఆమె పాదాలకు నమస్కారం చేశాడు. “అయ్యో, మీ అంతటి గొప్పవాళ్లు నాకు నమస్కరించటం ఏమిటి?” అని ప్రశ్నించిందామె. “ఈ సృష్టిలోని ప్రతిప్రాణి గొప్పదే. నా గొప్పదనాన్ని గుర్తించి మీరు నమస్కరించారు. మీ గొప్పదనాన్ని గుర్తించి నేను మీకు నమస్కారం చేశాను. అంతే” అన్నాడాయన.

గొప్పవారు అంత వినయంగా ఉంటారు మరి.

Exit mobile version