[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]
మూడు ముళ్లు
సుబ్బులు చూడటానికి కుందనం బొమ్మలా ఉంటుంది. కానీ ఆ అందానికి తగిన తెలివితేటలు లేవు. “వంటింట్లోకి పిల్లి దూరుతుందేమో చూడవే” అంటే పిల్లి దూరటం, గిన్నెలు నాకెయ్యటం, వెళ్లిపోవటం – అన్నీ చూస్తూనే ఉంటుంది. కానీ సినిమా పరిజ్ఞానం అపారం. ఎప్పుడు ఏ సినిమా రిలీజు అయింది – అందులో ఎవరెవరు ఏయే వేషాలు వేశారూ – అన్న విషయాలను నిద్రలో లేపి అడిగినా, చెప్పేస్తుంది. ఏ వయసులో జరగాల్సినవి ఆ వయసులో జరగాలి కదా – అని పెళ్లి సంబంధాల వేటలో పడ్డారు. పెళ్లిచూపులు చూడటానికి – ఎవరో ఒక చాదస్తపు కుటుంబం వారు వచ్చారు. “నీకు పాటలు ఏమన్నా వచ్చా?” అని కాబోయే అత్తగారు అడిగితే, ‘ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు ఎంత కఠినం’ – అంటూ చెవుల తుప్పు వదిలే లాగా పాడింది. “పాట పాడమని ఆడిగినందుకు నిన్న చెప్పుతో కొట్టాలి” అని కాబోయే మామగారు అత్తగారిని తిట్టిపోశాడు. అది అలా తప్పిపోవటంతో, మరో సంబంధం వచ్చి నప్పుడు, “ఏది అడిగినా నాకు రాదు” అని చెప్పమని సుబ్బులు తల్లిదండ్రులు హితబోధ చేశారు. వచ్చిన వాళ్లు “ఇంటి పనీ, వంట పనీ వచ్చా?” అని అడిగితే “నాకు ఏమీ రాదు!” అని బల్ల గుద్ది మరీ చెప్పింది.
అలాంటి సుబ్బులుకి కూడా చివరకు ఎవరో ఒకరు దొరికాడు. పెళ్లి అయింది. తల్లీ అయింది.
వివాహం చేసుకోబోయే ముందు బాగా కళ్లు తెరిచి చూడాలనీ, వివాహం తరువాత కళ్లు మూసుకుని ఉండాలనీ – ఒక సామెత ఉంది. అంటే ఆజన్మాంతం ఆ మనిషితో కల్సిమెల్సి ఉండగలమా లేదా – అని పరిశీలించి చూడాలనీ, పెళ్లి చేసుకున్నాక కనిపించే లోపాలన్నిటినీ చూసీ చూడనట్లు సర్దుకుపోవాలనీ దాని అర్థం. ఎంత కళ్లు తెరిచి చూసినా, కొంతమందికి సరియైన జోడీ దొరకక అలా వయసు దాటే దాకా అన్వేషణలోనే గడిపి, ఒక వయసు దాటాక ఎవరో ఒకరు దొరికితే చాలు లెమ్మని రాజీపడి అయిష్టంగానే ఒప్పుకుంటున్నారు.
రేఖ కాలేజీలో చదువుతున్నప్పుడే ఆ అమ్మాయిని ఇష్టపడి, వెంటపడి ‘ఐ లవ్ యు’ అని చెప్పిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు తారసపడేటప్పటికి చెట్టు ఎక్కి కూర్చుంది. తల్లిదండ్రులు తెచ్చిన సంబంధాలూ కంటికి ఆనలేదు. తరువాత ఎప్పుడో, ఏదో పత్రికలో పడిన ప్రకటన చూసి ఎవడి మెడలోనో మాల వేసింది. ఆనక తెల్పింది – వాడికి లేని దుర్గుణం లేదని.
పెళ్లి ఆలస్యం అయ్యే కొద్దీ అనేక సమస్యలు. ఎవడో ఒకడు తారసపడతాడు. కారులో షికార్లు చేస్తారు. హోటల్‌కి వెళ్తారు. సరదాగా కలిసి పిక్‌నిక్ లకూ వెళ్తారు. కోరికల గుర్రాల మీద విహరిస్తారు. పెళ్లి తరువాత కావల్సినవన్నీ ముందే జరిగిపోతాయి. సుందరిది ఇలాంటి కేసే. తెలివిగా కాబోయే వాడిని ట్రాప్ చేసింది. జరగాల్సినవన్నీ జరిగాక “ఇప్పుడు నాకు మూడో నెల. మనం కల్సి తిరిగినట్లు నా దగ్గర సాక్ష్యాలన్నీ ఉన్నాయి. పెళ్లి చేసుకుంటావా? పోలీసు స్టేషన్‌కి వెళ్లమంటావా?” అని బెదిరించి పెళ్ళి చేసుకుంది. తరువాత ఆమె చెప్పినదంతా అబద్ధమేనని తెల్సి అతను “ఇదేమిటి?” అని అడిగితే- “నూరు అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చెయ్యమన్నారు. నేను ఒక్క అబద్ధమే కదా ఆడింది”, అని నవ్వేసింది.
శ్రీధర పేరుపొందిన కథ, నవలా రచయిత. అత్యంత చమత్కార భరితమైన సంభాషణలతో అందమైన రచనలు చేసే శ్రీధర ఇటీవల “ఇచ్చట జూదమాడంగరాదు” అనే నవలను ప్రచురించారు.