Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చిరుజల్లు-127

[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]

పలుకే బంగారమా?

కావటానికి అదొక ఆఫీసే అయినా, నిజానికి అదొక అడవి. అక్కడ గాండ్రించే సింహాలున్నాయి. మీదపడి నోట కరుచుకుపోయే చిరుత పులులు ఉన్నాయి. నిలువునా మనిషిని మింగేసి చెట్టుకు చుట్టుకుపోయే కొండచిలువలున్నయి. మాట మాటకు ఎత్తులు మార్చే జిత్తులమారి నక్కలున్నయి. మొత్తం మీద కొన్ని వందల వన్య ప్రాణుల మధ్య కొన్ని సాధు జంతువులూ తిరుగుతూ ఉండగా –

ఓ శుభముహుర్తాన తడబడే అడుగులతో, చెదిరిపోతున్న బెదురు చూపులతో, లేత పరువాల బరువులు మోస్తూ, ఓ బంగారు ‘లేడీ’ ఆ ఆవరణలోకి అడుగుపెట్టింది.

ఆ మర్నాడే ఆమె అక్కడ ఉద్యోగం చేరిపోయింది. ఆ మర్నాడే రెండో అంతస్తు మెట్లు ఎక్కుతుండగా, మెట్లు దిగుతున్న మూర్తి ఎదురుపడ్డాడు. కళ్లు బైర్లు కమ్మి మీద పడబోయినంత పని చేసి, తమాయించుకుని ‘వాటే బ్యూటీ’ అనుకుని, నిముషాల మీద ఆమె హిస్టరీ, జాగ్రఫీ అంతా సేకరించాడు.

పని లేకపోయినా, అనవసరంగా ఆమె ఉండే సెక్షన్‌కి వెళ్ళి బోలెడు జోకులు పేలుస్తూ బోలెడంత కాలయాపన చేశాడు. కానీ ఆమె వంచిన తల ఎత్తేది కాదు. కాదు. అయినా మూర్తి విసుగు చెందని విక్రమార్కుడే అయినాడు.

ఇంటి దగ్గర వంచిన తల ఇంటికెళ్ళాకే ఎత్తేది. అదేమంటే ఆమె తల ఆమె ఇష్టం. అయినా గానీ గడ్డం పుణికి పుచ్చుకుని మొహం పైకెత్తి ‘దేవుడు కళ్ళు ఇచ్చినందుకు లోకాన్ని చూడకపోతే, వచ్చే జన్మలో చూడటానికి కళ్ళు లేకుండా చేస్తాడు దేవుడు’ అని చెప్పాలని ఉబలాట పడేవాడు.

ఇంకా –

‘ఈ అందమైన సాయం సమయాన్ని చూడు. గుండె నిండా గాయం చేసుకుని దిగులుగా దిగిపోతున్న సూర్యుని అస్తమయాన్ని చూడు. ప్రాణవాయువుల్లో స్నానం చేస్తూ, మధురమైన వీణానాదం వింటూ ఇద్దరం నింగీనేలా ముద్దు పెట్టుకుంటున్న దిగంతాల దాకా సరదాగా నడచి వెళ్దాం, వస్తావా?’ అని అడగాలని అనిపించేది.

ఆ సౌందర్యరాశిని చూసినప్పుడల్లా, వీనస్ శిల్పసుందరి మదిలో మెదిలేది. మనసులో మనోహరమైన ఇంద్రధనస్సు విరిసేది. ఆమె నడుస్తున్నప్పుడు మయూరాల వయ్యారాలు కనిపించేవి. వెళ్లిపోతున్నప్పుడు విరిగిపడి వెనక్కి జారిపోతున్న పాలకడలి కెరటాలను వెన్నెల్లో చూస్తుండేది చూస్తునట్లుండేది.

కొంతమంది చెంతనుంటే చాలు, బ్రతుకంతా వసంతమే. ఇద్దరూ కల్సి కాపురం చేయటానికి కౌగిళ్ళు చాలవా, వేరే లోగిళ్ళు ఎందుకు? ఆమె చిరునవ్వులు చాలవా, వేరే సిరులెందుకు?

లంచ్ టైంలో ఆడవారంతా జట్లు జట్లుగా కాంటీన్‌కి వెళ్లేవాళ్ళు, అందులో అమ్మాయిలుంటారు. అమ్మలుంటారు. అమ్మమ్మలుంటారు. అప్పుడక్కడ అబ్బాయిలుంటారు. అయ్యలుంటారు. తాతయ్యలుంటారు. వాళ్ళూ వీళ్ళూ విడివిడిగానూ, కలివిడిగానూ కబుర్లు కలబోసుకుంటారు.

“మా దగ్గర ఒక బ్రహ్మచారి ఉండిపోయాడు. మందలో కలిపేద్దామా?” అన్నాడొకాయన ప్రతిపక్షం పడతులతో.

“ఏవయ్యా, సంబంధాలు చూడమంటావా? మన ఆఫీసులోనే ఉన్నారు బోలెడు మంది” అన్నదో అమ్మ మనసున్న కావమ్మా.

“నాకే నిలవ నీడ లేదు” అన్నాడు మూర్తి మొహమాటంగా.

“అయితే, బాగా లావుపాటిదాన్ని చూస్తాం లే. నీకు నిలువటానికి ఇంత నీడ దొరికేలాగా..”

అంతా పగలబడి నవ్వితే, ఆ అమ్మాయి ముసి ముసి నవ్వులు నవ్వింది. కళ్ళెత్తి చూసి కనకాభిషేకాలు చేసింది. అంతలోనే తల దించుకుంది. పెళ్లి ఆలోచన రాగానే పడుచు పిల్ల కళ్ళల్లో ఎన్నెన్ని సిగ్గులు మొగ్గలు తొడుగుతాయనీ?

ఇలాంటి తడిక రాయబారాలు సాగుతునే ఉన్నయి. ప్రతిసారీ ఆమె కాంక్షలు నిండిన కళ్ళతో చూసినప్పుడు, మల్లెపూల పల్లకి వచ్చి ముందు నిలిచేది. అందులో ఊరంతా ఊరేగినట్లు పగటి కలలు వచ్చేవి.

ఎప్పుడు ఎదురుపడినా కాళ్ళకు బ్రేకులు పడేవి. కళ్ళు కళ్ళూ కలిసి, చూపులు ఒరుసుకుని మెరువులు మెరిసేవి తళ తళమని. ఎక్కడికో పద పదమని మనసు తొందర చేసేది. పెదవులపైన చిరునవ్వుల పువ్వులు విరిసేవి.

ఆమె అందాల గంధాలతో తనకు ఆజన్మ బంధాలేవో ఉన్నాయని చెప్పాలని ఉవ్విళ్ళూరేవాడు. కానీ ఆమె గురించి ఆలోచిస్తూ దిక్కుతోచకుండా వరండాలో తిరుగుతుండేవాడు. తన సీటు ఎక్కడో మర్చిపోతే, “ఏమిటా మతిమరుపు?” అని ఆఫీసరు అదిలించేవాడు. ఆయనకేం తెల్సు, అది మతిమరుపు కాదు, మైమరుపు అని.

ఇలా మైమరచిన సమయంలోనే ఓ మెరుపు మెరిసింది. మాటల్లో చెప్పలేనిది చేతల్లో చెప్పవచ్చునని.

ఒక రోజు మధ్యాహ్నం అంతా క్యాంటీన్‍కు వెళ్ళినప్పుడు ఆమె సీటు దగ్గర ఓ కాగితం మీద – ఐ లవ్ యు – అని రాసి, పెట్టాడు. అది ఆమె చూస్తుందనీ, లంకె కుదురుతుందనీ గ్రహించాడు. ఆ రోజు మరో ఇద్దరితో కల్సి సెక్షన్ లోకి వచ్చింది. పక్కన ఎవరో ఉన్నారు. కాగితాన్ని చూసి చూడనట్లు చూసి, మడిచేసి ముడివేసి నులిమేసింది.

ఇప్పుడా ఎదురుపడితే ఇదివరకటి లాగా ఆగటం లేదు. కళ్ళల్లోకి సూటిగా చూడటం లేదు.

ఇదిలా ఉండగానే ఆమె మెడలో పసుపు తాడులో కనిపించింది.

ఎవరో ఒక అదృష్టవంతుడు, సౌందర్యాన్ని సొంతం చేసుకుని, మూడు ముళ్ళలో తన గేటు గుమ్మానికి కట్టేసుకున్నాడు. బాధను గరళంలా గొంతులోనే దాచుకున్నాడు మూర్తి.

ఇంతలో ఇంకెవరో వచ్చి పిల్లనిస్తామంటే ఒప్పేసుకున్నాడు. అవును మరి. రైలు వెళ్లిపొయ్యాక, ఇంకా ఫ్లాట్‌ఫారం మీద పడిగాపులు ఎందుకు?

సాయంత్రానికి ఎవరి గూటికి వారు చేరినా, పగలంతా ఆఫీసులోనూ, కారిడార్లలోనూ ఎదురవుతూనే ఉన్నారు. ఎవరికి మటుకు కనిపించని ఆంక్షలు ఏదో ఎదురవుతుండేవి. ప్రేమించిన వాళ్లు పెళ్ళి చేసుకోలేకపోవచ్చు. అంతమాత్రన ఆగర్భ శత్రువులుగా మారవలసిన పని లేదు గదా. వలపు ఆటలో గెలుపు ఓటములు దైవాధీనాలు. కొందరికి అవకాశాలు కల్సి వస్తయి. కొందరికి దురదృష్టం అడ్డు తగులుతుంది.

కొన్నాళ్ల తరువాత చూస్తే ఆమె నిండు నదిలా నెమ్మదిగా నడుస్తోంది. జీవితంలో కొత్త దశ. వింత కాంతి. ఎంతో నిలకడ. అభినందనలు చెప్పాలనుకున్నాడు. చెప్పాననుకున్నాడు.

మళ్ళీ ఎప్పుడో చూస్తే గాలి తీసిన బెలూన్‌లా కనిపించింది. “పాపా, బాబా” అని అడగాలనుకున్నాడు. అడిగాననుకున్నాడు.

ఈలోగా అతనికి ట్రాన్స్‌ఫర్ అయింది. నాలుగు జిల్లాల అవతలకు వెళ్ళిపోయాడు.

కాలప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఎండలొచ్చాయి. వానలొచ్చాయి. వరదలొచ్చాయి. కరువులొచ్చాయి.

కాలం మారింది. ప్రభుత్వాలు మారాయి. మనుషులు మారారు.

ముప్ఫయి సంవత్సరాలు ముప్ఫయి రోజల్లా గడిచిపోయినయి. మూర్తి అసిస్టెంట్ కమీషనర్ అయినాడు. మళ్ళీ అదే ఆఫీసుకు వచ్చాడు. బట్టతల వచ్చింది. అతని స్థితి పెరిగింది. సంసారం పెరిగింది. అంతస్తు పెరిగింది. ఇప్పుడాయన ఆఫీసు రూం ఆరో అంతస్తులో ఉంది.

ఆమె ఇంకా అదే ఆఫీసులో పని చేస్తోంది. సెక్షన్ ఆఫీసర్ అయింది.

ఆమెను చూడాలన్న కోరిక ఆయనకు లేకపోలేదు. ఎప్పుడో మీటింగ్‌లో అంత దూరంలో కనిపించింది. అదే వీనస్ శిల్పసుందరి. వయస్సుతో వచ్చిన మార్చు కొంచెం గంభీర్యాన్ని తెచ్చి పెట్టింది. చెంపల దగ్గర జుట్టు తెల్లబడింది. కళ్ళజోడు వచ్చింది. తన రూంలోకి పిలిపించుకోవాలని అనుకుని, బావుండదని ఊరుకున్నాడు. ఒక రోజు ఆయన లిఫ్ట్‌లో పైకి వస్తున్నారు. మొదటి అంతస్తులో ఆగినప్పుడు ఆమె లోపలికి వచ్చింది. ఇద్దర్ని దగ్గరకు నెట్టి యంత్రం తలుపులు మూసింది.

ఏకాంతం, సామీప్యం, చేతులు చాస్తే ఆమె ఆయన కౌగిలిలోనే ఉంటుంది. తమకం నిండిన కళ్ళతో చూస్తూ ఆమె భుజం మీద చెయ్యి చేశాడు. ఆమె స్త్రీత్వానికి నిలువెల్ల పులకింత. తన తనువు తనకే బరువనిపించింది.

ఆయన చేతులు అప్రయత్నంగానే ఆమె నడుమును చుట్టేశాయి. తీయని వేదన గుండెల్ని పిండేసింది. ఆపుకోలేని తమకంతో ఆమె అదిరే అధరాలను అందించింది. ముద్దుపెట్టుకున్న సమయంలో తనువూ, మనసూ ఆలా గాలిలోకి వేల పైకి, పై పైకి స్వర్గ ద్వారాల దాకా పయనించిన అద్భుతమైన అనుభూతి. ఏనాటి కోరిక అది?

కోహినూర్ వజ్రం కన్నా విలువైనవి ఆ కొద్ది క్షణాలు చాలు ఈ జీవితానికి అనుకుంది.

దయలేని లిఫ్ట్ ఆగింది. నిర్ణయగా నోరు తెరిచింది. ఇంకెవరో వచ్చారు, ఇద్దర్నీ విడదీస్తూ.

వెళ్ళిపోతూ కృతజ్ఞత నిండిన నేత్రాలతో చూసింది. మళ్ళీ మానమర్యాదల డొల్లల్లోకి వంచిన తల ఎత్తకుండా వెళ్ళిపోయింది. డొల్లలోకి మనసు ముడుచుకు పోయింది ఎప్పటి లాగానే,

ఆ రాత్రంతా ఆయనకు నిద్ర పట్టలేదు. మంచం మీద ఖాళీగా ఉన్న భాగం వైపు చూశాడు. భార్య పోయింది తీరని వెలితిని మిగిల్చి.

ఇద్దరు కొడుకులూ ఎక్కడో ఉద్యోగాల్లో ఉన్నారు. కూతుర్లు కాపురాలకు వెళ్ళారు. ఆయనకు ఒంటరితనమే మిగిలింది.

జీవితంలో సాధించింది ఏమీ లేదు, సాధించే అల్లుళ్ళనూ, కోడళ్ళనూ తప్ప. ఆదరంగా పలకరించే దిక్కు లేదు. అప్యాయంగా నిమిరే స్నేహ హస్తం లేదు. మిగిలినవి ఎన్ని ఉన్నా, మనసారా ప్రేమించే మనిషి లేక, ఏమీ లేనివాడే అయినాడు.

ఆమెకూ ఈయన జ్ఞాపకానికి వచ్చేవాడు. ఆనాడు అజ్ఞానంతో భూతల స్వర్గాన్ని తనే కాలదన్నుకుంది.

ఆమె భర్తకు కాన్సర్. తాగుడు, జరదా కిళ్ళలు మానడు. ఆమె మీద చెయ్యి చేసుకోవడం మానడు. నరకం వేరే ఎక్కడో లేదు, ఈ నాలుగు గోడల మధ్యే ఉందనిపించేది. ఆమె కొడుకులిద్దరూ వ్యసనాలకు బానిసలయ్యారు. చదువులు అబ్బలేదు.

వీళ్ళ కోసం ఏడ్చినంత కాలం ఏడ్చింది. కన్నీటి చెలమలు ఇంకిపోయినయి. గుండెలు అవిసిపోయినయి. ఏ క్షణంలో ఏ దుర్వార్త వినటానికి అయినా సిద్ధంగా ఉంది. మనసు రాయిగా మారాక మనిషికి ఇంక దిగులేముంది?

మూర్తి రిటైర్ అయినాడు. ఆ సాయంత్రం ఆయనకు వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు.

అందరూ ఆయన చేసిన సేవల గురించి, సాధించిన విజయాల గురించి మాట్లాడారు.

ఆయనకు దండలు వేశారు. పెళ్ళినాడు చూడలేదు, ఇవాళ చూసింది.

అందరి దగ్గరా శలవు తీసుకుంటూ మూర్తి ఆమె దగ్గరకు వచ్చాడు. తన చేతిలోని గులాబీమాలను ఆమెకు అందించాడు. ఆప్యాయంగా అందుకుంది. మాల తన మెడలో వేసినట్లే భావించింది. ఆమె కన్నుల్లో వేలవేల దీపాలు వెలిగాయి. ఎంతో గర్వంగా ఫీలయింది.

‘థాంక్స్’ చెప్పాలనుకున్నా, అంతులేని సంతోషంతో నిండిపోయిన కంఠం లోనుంచి ఆ ఒక్క మాటా పెగల్లేదు.

ముప్ఫయి సంవత్సరాల క్రిందట ‘ఐ లవ్ యు’ అని కాగితం రాసి టేబుల్ మీద దొంగచాటుగా పెట్టటం కన్నా, నోటితో ఆ ఒక్క మాట చెప్పి ఉంటే ఎంత బావుండేది అనుకున్నది గానీ పైకి అనలేదు.

ఆయన పరిస్థితీ అంతే. మాటలు మర్చిపోయిన పసివాడు అయినాడు.

ఒక్కోసారి ఒక్క మాట నోరు జారితే కొంపలంటుకుంటాయి. జీవితాలు నాశనం అవుతాయి.

ఒక్కోసారి ఒక్క మాట పెదవి దాటి బయటకు రాకపోతే జీవితాలు తారుమారు అయిపోతాయి.

ఆయన కమీషనర్ గారి కారులో వెళ్ళిపోయాడు.

ఇన్నేళ్ళ జీవితంలో ఎంతమంది మగవాళ్ళతో ఎన్ని పోసుకోలు కబుర్లు చెప్పలేదు? కానీ ఆయన ముందు ఎందుకు నోరు మెదపలేకపోయింది?

కారణం వాళ్ళందర్నీ ప్రేమించలేదు. అందుచేతనే నిర్భయంగా మాట్లాడింది. ఇతన్ని కోరుకుంది. కనుకనే జంకు, నోరు పెగలలేదు.

ఇంతకీ ఈ భయం లోకాన్ని చూసి కాదు. అంతరాత్మను చూసి.

ఇంటి తలుపులు తీస్తూ అనుకుంది.

ఆ కార్లో ఆయన భార్య హోదాలో, ఈ పూలమాల ఒళ్ళో పెట్టుకుని వెళ్ళి ఉంటే?-

తల గుమ్మానికి ఠక్కున కొట్టుకుని నొప్పి పుట్టింది. బొప్పి కట్టింది.

Exit mobile version