Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చిరుజల్లు-122

[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]

చరిత్రకు చితి

చీకటి కుంభవృష్టిగా కురిసింది.

చీకట్లో కుంభవృష్టి కురిసింది.

తీరా వాన వెలిసే వేళకు, చీకటికోనా వెలిసిపోయి, తూరుపు తెలతెలవారుతోంది. షవర్ బాత్ చేసి నగ్నంగా నిలబడ్డ భూదేవి ఒంటిని ఎండ పొడల తుండుగుడ్డతో తుడుస్తున్నాడు సూర్యుడు.

ఆరయింది. ఏడయింది. ఎనిమిది అయింది. లోకంలోని వాళ్లంతా నిద్ర లేచి, ఎవరి లోకంలో వాళ్లు మునిగిపోయారు.

మావిళ్ల వారి వీధిలో చిట్ట చివరన ఎడం వైపు ఉన్న ఆ కాంపౌండులోకి పట్టపగలు కూడా ఎవరూ వెళ్లరు. అదంతా చిన్న చిట్టడివిలా ఉంటుంది. చేసే నాథుడు లేక ఇప్పుడిలా అరణ్యంలా అయిపోయింది గానీ, ఆ రోజుల్లో..

పాతికేళ్ల కిందటి మాట. అన్నపూర్ణ ఆ ఆవరణలో ఎంత అందమైన తోటను పెంచిందనీ.. తన చేత్తో నాటిన ఫలవృక్షాలు ఎప్పుడు పెద్దవవుతాయా, ఎప్పుడెప్పుడు ఎగిరెగిరి కాయలు కోసుకుంటానా అని ఎంతో ఆశపడింది. అయితే ఆ తోట వాళ్ల సొంతం కాదు. సొంతం చేసుకోగలదని ఆమె కలలో గూడా అనుకోలేదు. అనుకోకుండా ఆమె ఆ ఇంటికీ, ఆ తోటకీ యజమానురాలు అయింది. అంతలోనే చిత్రంగా ఆమె ఆ ఇంటికి దూరమైంది.

చాలా కాలం అది పాడుబడిన కొంప లాగే ఉండిపోయింది. ఈ మధ్యనే ఆరునెలల క్రిందట ఆనందరావు మళ్లీ ఆ ఇంట్లోకి అడుగు పెట్టాడు.

కానీ ఎంచేతో రాత్రినుంచి, ఆనందరావు మంచం మీద నుంచి కాలు క్రింద పెట్టలేక పోతున్నాడు. శరీరం తన స్వాధీనంలో లేదు. నిస్సహాయంగా పైకప్పుకేసి చూస్తున్నాడు. ఉండుండి తలుపులు, కిటికీలు, ఫెడీల్, ఫెడీల్ మని గాలికి కొట్టుకుంటున్నాయి. గాలీ, వానా కల్సి కావలసినంత బీభత్సం సృష్టిస్తున్నయి.

జల్లు పడి తన మంచం తడిసినందుకూ కాదు, మనిషి పూర్తిగా తడిసినందుకూ కాదు, ప్రాణపదంగా దాచుకున్న డైరీలన్నీ ఆ చెక్కపెట్ట నిండా ఉన్నాయి. ఆ చెక్కపెట్టె కిటికీ పక్కనే ఉంది. అది తడిసిపోతోంది. ఇన్నేళ్ల తన అనుభవాలూ, అనుభూతులూ వాటినిండా నిక్షిప్తమై ఉన్నయి. ఇంతకు ముందు అవి ఎన్నో సార్లు కన్నీటివానలో తడిసిపోయినయి. ఇప్పుడే వాన జల్లులో తడిసిపోతున్నాయి. క్రమంగా చినిగి పోతాయేమో.

ఆనందరావు ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో, నిస్తేజంగా మంచం మీద పడి ఉన్నాడు. గొంతు ఎండిపోతోంది. లేచి గొంతు తడుపుకుంటే స్థితిలో లేడు. మంచం పక్కకు జరుపుకోలేని స్థితిలో పక్షవాతంతో ఉన్నాడు.

మంచంలో నుంచి తను ఇక లేవలేడు. నలుగురూ కల్సి తనను లేపుకు పోయే సమయం ఆసన్నమైంది. కానీ తనకు ఎవరున్నారు? చుట్టూ ఉన్న ఈ చిట్టడవి లాంటి ఇంట్లోకి ఎవరూ రారు.

పద్మజ కోసం ఆనందరావు కళ్ళు ఆశగా ఎదురుచూస్తున్నాయి. గొంతెత్తి పిలవాలని ఉన్నా, ఆ పిలుపు తనకే వినపడదు.

నిన్నటి నుంచీ ఎక్కడా ఎవరూ కదిలిన అలికిడే లేడు, జాలి దలచిన గాలి పొద్దున్నే కసువు చిమ్మేసి వెళ్తే, కరుణించిన వరుణదేవుడు కలాపి నీళ్ళు చల్లేసి వెళ్ళాడు. ఆ ఇంటి చరిత్ర అంతా తెలిసిన పున్నాగు చెట్టు వానకు తడిసిన నాలుగు పున్నాగు పూలను రాల్చింది.

ఆనందరావు బ్రతకటానికి అన్ని అవకాశాలూ ఉండీ, పడరాని అవస్థలు పడే పరమ మూర్ఖుల జాబితాలోని మొదటివాడిగా ఉంటాడు. వాళ్ళ మీద ఎవరూ జాలి పడరు. ఆనందరావు పాతికేళ్ళ కిందట ఒకనాడు తన డైరీలో ‘జీవితం ఒక టెక్నికలర్ కల’ అని రాసుకున్నాడు..

‘దురదృష్టపు సైకత తీరం వద్ద నిస్సహాయంగా చూస్తూ నిలబడ్డ తనను అదృష్టమనే ఉత్తుంగ తరంగం చుట్టేసి కాళ్ళ కింద కోసేసి ఉక్కిరిబిక్కిరి చేసి ఎక్కడికో లాక్కుపోయి, తిక్క కుదిరినాక, తెచ్చి ఇక్కడ పారేసి దిక్కలేని వాడిని చేసింది’ అని పాతిక రోజుల కిందట డైరీ లోనే రాసుకున్నాడు.

రెండూ నిజాలే. ఆనందరావు చాలా నిక్కచ్చి అయిన మనిషి. నిప్పులాంటి వాడు. ఆ మాటకొస్తే, నిప్పు అయినా నీటికి లొంగుతుందేమో గానీ, ఆనందరావు ఎవరికీ లొంగే ఘటం కాదు. ద్రోహచింతన లేదు. తనకు ఎవరైనా ద్రోహం తలపెడితే, వాడు ఎంతటి వాడైనా సరే, అసహ్యించుకునే వాడు. అందుకే బందువులూ, స్నేహితులూ, పై అధికారులూ – అందరూ అతనికి శత్రువులే అయినారు.

ఆనందరావుకు పట్టూ విడుపూ తెలియవు. అందువల్ల ప్రతి చిన్న విషయానికే అందరితో గొడవ పడేవాడు. సర్దుకుపోవటం తెలియనందు వల్లనే, ఆనందరావును తొక్కిపెట్టి, తన కులం వాడికి ఆఫీసర్ ప్రమోషన్ ఇచ్చాడు. అందుకని బహిరంగంగానే ఆఫీసర్‍ని నిందించాడు. అందరికీ దూరం అయ్యాడు. ఇందులో తన తప్పు ఏమీ లేదని డైరీలో రాసుకున్నాడు..

తన బంధువులంతా రాబందులేనని స్వానుభవంతో తెల్సుకుని ఎవరినీ చేరనిచ్చేవాడు కాదు. స్నేహితుడు అనేవాడు ఎవడూ లేదు. ఏతావాతా ఆనందరావుకు నా అన్నవాడు ఎవరూ మిగలలేదు. తొండ ముదిరి ఊసరవెల్లి అయిందన్నట్లు, అతని ఉలిపిరి కట్టె లక్షణంతో, చివరకు భార్యా బిడ్డలూ పరాయివాళ్ళు అయినారు.

నిత్యం తన రుచులూ, అభిరుచులూ భార్య మీద రుద్దటం మొదలు పెట్టాడు. ఆమె బదులు చెబితే రెచ్చిపోయేవాడు. “మగాడు చెప్పాలి. ఆడది వినాలి” అనేవాడు.

“మరి అయితే, దేవుడు ఆడవాళ్ళకు నోరు ఎందుకిచ్చాడు?” అని అడిగేది అన్నపూర్ణ.

“మమ్మల్ని మింగటానికే” అని అరిచేవాడు ఆనందరావు. అలా అన్నాడు గదాని, అతన్ని మింగలేక, దుఃఖాన్ని మాత్రమే దిగమింగింది.

ఒంటరిగా ఉన్నప్పుడు కళ్ళు వాచిపోయేలా ఏడ్చేది. ఎందుకు ఏడ్చావని భార్యను అడిగి ఆమె అంతరం తెలుసుకునేవాడు కాదు.

భర్త కష్టసుఖాల్లో భార్య పాలుపంచుకోవాలనీ, తనతోని సహకరించకపోతే, అది ఆమె తప్పేనని డైరీలో రాసుకున్నాడు. అతను లేనప్పుడు ఆమె ఆ డైరీలు చదివి, ఎంత మూర్ఖంగా తనను తాను సమర్థించుకుంటున్నాడోనని విస్తుపోయేది అన్నపూర్ణ.

చిన్న కుటుంబమే అయినా చింతలకు నిలయం అయింది వాళ్ళ సంసారం. కాఫీ, సిగరెట్టు లాంటి అలవాట్లుకు కూడా దూరంగా ఉండే ఆనందరావుకు డబ్బు ఇబ్బందులు ఏమిటి? ఇంట్లో వెచ్చాలకీ, బియ్యానికీ కరువు ఏమిటి? జీతం డబ్బులు ఏమైనాయని అడిగితే, రెండు నెలల నుంచీ జీతం రాలేదన్నాడు. ఆశ్చర్యపోయింది అన్నపూర్ణ. ఆఫీసుకు వెడుతున్నా, మిగిలిన వాళ్లందరికీ వచ్చినా, ఇతనికే జీతం ఎందుకు రావటం లేదో ఆమెకు అర్థం కాలేదు.

అతని డైరీ తీసి చదివింది అన్నపూర్ణ. పరిస్థితులు ఇలాగే కొనసాగితే నీతికి, నిజాయితీకి నిలువ నీడ దొరకదనీ, ఎన్ని కష్టాలు ఎదురైనా ఆఫీసర్‌ని తను క్షమాపణ వేడుకునే ప్రశ్నే లేదని రాసుకున్నాడు.

ఒకరోజు వాచీ అమ్మాడు. వారం తరువాత సైకిల్ అమ్మాడు. ఇంకో వారం తరువాత భార్య మెడలో గొలుసు అమ్మాడు. ఇంక పెళ్ళాన్ని అమ్మేరోజు ఎప్పుడొస్తుందా అని అన్నపూర్ణ ఎదురు చూసింది. తప్పేముంది? పురాణ పురుషులు ఏనాడో దారి చూపించారు గదా. హరిశ్చంద్రుడి లాగానే ఈయనా, భార్యనీ, పిల్లాణ్ణి పెద్ద బజార్లో నిలబెట్టి ‘జవదాటి ఎరుగదీ యువతీ లలామ’ అని పద్యం పాడతాడేమో. ఏమో మరి. ఈ మధ్య గడ్డం కూడా పెంచుతున్నాడు మరి.

ఒకనాడు అన్నపూర్ణ ఇంట్లోకి కావల్సిన సరుకులు కోసం వెళ్తే, ఒక లాటరీ టిక్కెట్లు అమ్మేవాడు తన వాక్చాతుర్యంలో ఆమెను ప్రలోభ పెట్టాడు. ఈ అయిదు రూపాయలతో ఎలాగూ తమ దరిద్రం తీరదు. తగిలితే నిజంగానే తమ దరిద్రం తీరుతుందని భావించింది. డ్రా అయిన మర్నాడు ఆ టిక్కెట్టు భర్త చేతికి ఇచ్చి ‘ఏమన్నా తగిలిందేమో’ చూడమంది. అది ‘కొన్నందుకు నీకు తగలాలి తన్నులు’ అని విసుక్కున్నాడు. ఈ జూదాల మూలంగానే పాండవులు పడరాని పాట్లు పడ్డారని పరవస్తు చిన్నయసూరి లెవెల్లో నీతి చంద్రికను వల్లించాడు.

అయిష్టంగానే లాటరీ టిక్కెట్టును జేబులో పెట్టుకుని బజారుకు వెళ్లి పేపరు తిరగేసిన ఆనందరావు కళ్ళు బైర్లు కమ్మాయి. ఒకటికి పదిసార్లు చూసుకుని మొదటి బహుమతి అయిదు కోట్లూ తనదేనని తేల్చుకుని ఇంటికి వచ్చాడు.

మొదటి బహుమతి మనకే అనగానే అన్నపూర్ణ నోట మాట రాక నివ్వెర పోయింది. సంతోషం పట్టలేక ఆనందరావు, అన్నపూర్ణను కౌగలించుకుని ముద్దు పెట్టుకున్నాడు.

డబ్బు చేతిలో పడినాక, ఏం కావాలో కోరుకోమన్నాడు. తను ప్రాణాధికంగా ప్రేమించే, ఈ ఇల్లు, ఈ తోట తనకి కావాలన్నది. బేరమాడి కొనేశాడు. అయితే కొనటంలో ఆనందరావు తోట, ఇల్లూ తన పేరున కొనుక్కున్నాడు.

తెప్పలుగ చెరువు నిండిన కప్పలకు కొదవా? వానాకాలంలోని రెక్క పురుగుల్లాగా, తండోపతండలుగా బంధువులు వచ్చి వాలిపోయారు. ఆనందరావు సాక్షాత్తూ ఇంద్రుడే అన్నారు. చీకట్లోనూ వెలుగునిచ్చే చంద్రుడే అన్నారు. పైకి పొగుడుతూనే లోపల గోతులు తీయటం మొదలు పెట్టారు. లాటరీ తనకు వస్తే, డబ్బు అంతా మొగుడికి అప్పజెప్పి, ఎప్పటిలా పప్పు రుబ్బుతూ కూర్చున్నందుకు, అన్నపూర్ణ అమాయకత్వం మీద సానుభూతి వర్షం కురిపించేశారు.

అన్నపూర్ణ భర్తను పోరటం మొదలు పెట్టింది. డబ్బు మనిద్దరిలో ఎవరి దగ్గర ఉంటేనేం అన్నాడు. ఎవరి దగ్గర ఉన్నా ఒకటే అయినప్పుడు తన దగ్గరే ఎందుకు ఉంచటం లేదని ప్రశ్నించింది. ఇప్పుడే ఇలా ఉంటే, ఆ కాస్తా హారతి పట్టేశాక, నీ పరిస్థితి మళ్ళీ మొదటికి వస్తుందని, అన్నపూర్ణకు హితబోధ చేసింది పినతల్లి.

ఎలాగయితేనేం, తలా ఒక సమిధను వేసి భార్యాభర్తల మధ్య అగ్నిగుండం రగిల్చారు. అన్నపూర్ణ కొచ్చిన కొదవేం లేదనీ, తాము అంతా ఉన్నామని భరోసా ఇచ్చి ఆమెను ఆ ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్ళి లాయర్ నోటీసులు ఇప్పించారు.

దానితో అన్నపూర్ణకీ, ఆనందరావుకీ అనుబంధం తెగిపోయింది. ‘ఎవరి స్వార్థం గురించి వాళ్లు ఆలోచించుకోవడం వ్యాపార సరళి. కానీ సంసారం వ్యాపారం కాదు. ఇంట్లో ఉన్న నలుగురూ ఒకరి బాగోగుల కోసం మరొకరు పాటుపడటమే సంసార ధర్మం. అన్నపూర్ణ లోకులకు ఇచ్చిన విలువ భర్తను అయిన తనకు ఇవ్వలేదు. ఇద్దరూ విడిపోవటానికి డబ్బు కారణం కాదు, చెప్పుడు మాటలు విని వాటికి విలువనివ్వటమే అసలు కారణం’ అని ఆనందరావు తన డైరీలో రాసుకున్నాడు.

అతను ఎవరితోనూ నోరు విప్పి చెప్పడు. మనసులోని మాటలన్నీ డైరీలో రాసుకుంటాడు. చాటుమాటుగా అయినా ఆ డైరీలు చదవటానికి అన్నపూర్ణ దగ్గర్లో లేదు. చీమలు పెట్టిన పుట్టెలో పాములు చేరినయి. ఫలితంగా ఆనందరావు సంసారం విచ్ఛిన్నమైంది.

కోర్టు కేసుల దాకా వ్యవహారం వెళ్ళటంతో, ఆనందరావు కొంత కాలం ఇల్లు విడిచి తీర్థయాత్రలకు బయల్దేరాడు. తిరిగి తిరిగి విసుగు చెంది మళ్ళీ ఉన్న చోటుకే వచ్చాడు.

ఎన్ని చోట్లు తిరిగినా, ఎంత ఖర్చు చేసినా, స్వంత ఇల్లు, స్వంత మనిషి దగ్గర లభించే హాయి, తృప్తి ఎక్కడా లభించదని నిర్ధారించుకున్నాడు.

ఏడాది గడిచిపోయింది. ఒకడి చేతి క్రింద పని చేసే తత్వం కాదు అతనిది. అందుచేత మంచి సెంటరు చూసి, బట్టల దుకాణం పెట్టాడు. రజియా ఒక రోజు బట్టల దుకాణంలోకి, తరువాత అతని జీవితంలోకి నడిచివచ్చింది. రజియా తరుచూ బట్టల దుకాణంలోకి వచ్చేది. చనువుగా మాట్లాడేది. క్రమంగా ఆనందరావు బట్టల దుకాణంలోని ఖరీదైన చీరలన్నీ, రజియా పడక గదిలోకి వెళ్ళినయి.

రజియాకు చీరల పిచ్చి. కొత్తచీర కట్టుకున్నప్పుడల్లా ఆమె కన్నుల వెలిగే వెన్నెల వర్ణనాతీతమని డైరీలో రాసుకున్నాడు.

రజియా ఒంటరి జీవితాన్ని గడుపుతోంది. ఆనందరావు ఆమె జీవితాన్ని శోభాయమానం చేస్తానని అన్నప్పుడు ఆమె అవునని అనలేదు, కాదనీ అనలేదు. మౌనం అర్ధ అంగీకారమే కదా. సాన్నిహిత్యం పెరిగిపోయింది. ఒక కంచంలో తిని ఒక మంచంలో పడుకునేదాకా వచ్చారు.

ఆరు నెలల తరువాత, ఒక రోజు రాత్రి ఆనందరావు ఛాతి మీద తలవాల్చి పడుకుని, అతని హృదయంతో గుసగుసలాడింది, తనకిప్పుడు మూడో నెల అని. ఆనందరావు ఆనందించాడు.

క్రమంగా ఆమె ముఖమండలం మీద తాండవం ఆడుతున్న నైరాశ్యాన్ని అతను గమనించక పోలేదు. ఎంత గుచ్చిగుచ్చి అడిగినా, ఆమె తన బాధ ఏమిటో చెప్పలేదు. ఆమె గత జీవితం గురించి తెల్సుకుందామని ప్రయుత్నించనా. ఆమె పెదవి విప్పలేదు.

రజియా అనే అర్థంకాని పజిల్‍తో ఆనందరావు బుర్ర బద్దలు కొట్టుకున్నాడు. కాలమే పరిష్కరించింది.

రజియా ఒక ప్రైవేటు హాస్పటల్‌లో పసిపిల్లను అతని చేతికి అందించి, ఆమె అందని లోకాలకు వెళ్ళిపోయింది.

ఆనందరావు చుట్టూ పగలే చీకటి కమ్మేసింది. ఈ పడిగుడ్డు ఆలనా పాలనా అతనేం చూడగలడు? కొంత చందా ఇచ్చి ఒక అనాథ శరణాలయంలో ఆ పిల్లను చేర్చాడు. ఎంత అయినా, అనాథ శరణాలయం ఇల్లు కాలేదు. ఈ పిల్ల పెరిగి పెద్ద అయిన తరువాత, తండ్రి అయి ఉండీ అనాథ శరణాలయంలో వదిలేశాడన్న భావం వస్తే, తన పట్ల నిష్కారణంగా ద్వేషం పెంచుకొనవచ్చు. కనుక ఆ పిల్ల తన కూతురు అన్న విషయం ఎవరికీ తెలియనివ్వలేదు. స్నేహితుల పిల్ల అని చెప్పాడు.

తనకు ఏదో శాపం ఉంది. అన్నపూర్లను అణచివేసి తన పాదదాసిగా చేయాలనుకున్నాడు. కాదని వెళ్ళిపోయింది. రజియాను హృదయానికి హత్తు కోవాలనుకున్నాడు. ఆమే వెళ్ళిపోయింది.

ఆనందరావు నిరాశే మిగిలింది. చేస్తున్న వ్యాపారం పట్ల శ్రద్ధ లేదు. పనివాళ్లు ఎవడి శక్తి మేరకు వాళ్ళు జాగ్రత్త పడ్డారు. ఎవరో దుకాణం దోచేశారు. ఏమి మిగలలేదు.

పిడుగుపాటుకు క్రుంగిపోయిన మనిషిలా అయిపొయినాడు.

సంజ కెంజాయలను చూస్తూ, ఉదయ రాగాలను వింటూనూ యవ్వనాన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఆ బలమూ లేదు, బలగమూ లేదు.

అనాథ శరణాలయంలో పెరిగి పెద్దది అయిన పద్మజను తన దగ్గర తెచ్చిపెట్టుకున్నాదు. చాలా సంవత్సరాల తర్వాత తన పాత ఇంట్లో మళ్ళీ దీపం వెలిగింది. పద్మజ రెక్కలు విచ్చుకున్న తూనీగలాగా ఆ ఇంట్లోను, తోటలోనూ తిరుగుతోంది.

ఈ అవసానదశలో అన్నపూర్ణకు జరిగిన అన్యాయం గురించి అమితంగా బాధపడజొచ్చాడు. ఆమెను తిరిగి తెచ్చుకోవాలని చూసినా ఆమె రాలేదు. కొడుకును పంపింది. మురళి చెట్టంత మనిషి అయినాడు.

ఇంటికి తీసుకొచ్చి పద్మజను పరిచయం చేశాడు. ఉన్న డబ్బు, ఇల్లు వాకిలీ కొడుకుకు అప్పగించాడు. పద్మజను గౌరవంగా ఒక ఇంటికి పంపే బాధ్యతా అప్పగించాడు.

వాళ్ళు ఇద్దరూ అన్నా, చెల్లెలు అన్న విషయం వాళ్ళకు తెలియదు. ఆనందరావు అప్పుడు చెప్పలేదు. ఇప్పుడు చెప్పలేడు. నోట మాట రాదు. కదల లేడు, మెదలలేడు.

ముసలి ఎద్దులా, జాలిగా చూస్తూ కన్నీరు కారుస్తున్నాడు.

యవ్వనం పద్మజను, మురళినీ కాటేసింది. శృంగారం శృతిమించి పోయింది. వాళ్ళిద్దరూ ఒకటిగా కల్పిపోయారు.

ఈ చరిత్రకు ఇదా ముగింపు?

ఎక్కడ కరెంటు తీగల్ని ఎలుకలు కొరికాయో తెలియదు లేక అది దైవ నిర్ణయమేమో తెలియదు. చురచురమని మంటలు రగులుకుని, చెక్కపెట్టెకు మంటలు అంటుకుంటున్నాయి. డైరీలన్నీ తగలబడిపోతున్నాయి. అతని చరిత్రకు చితి రగులుతోంది.

Exit mobile version