[మాయా ఏంజిలో రచించిన ‘Little Girl Speakings’ అనే కవితని అనువదించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు కవయిత్రి హిమజ గారు.]
(చిన్న పిల్లలకు తల్లిదండ్రులే అందరికన్నా గొప్ప. పసిపిల్లల మాటలకు పెద్దగా అర్థాలుండవు. అలాంటి పసిపలుకులే ఈ కవిత!)
~
మా నాన్నకంటే మంచివారెవరూ లేరు
నీ క్వార్టర్ నాణెం నీ దగ్గరే ఉంచుకో
నేనేం మీ కూతురిని కాదు
నా డాలీ ఏమంత అందంగా లేదు
నేను చెప్పేది విన్నారా
దాని తలపై తట్టవద్దు
నా డాలీ ఏమంత అందంగా లేదు
మా అమ్మకంటే కమ్మగా
వంట చేసే మహిళ లేదు
నేనేం అబద్ధం చెప్పను
కావాలంటే
ఆ పాయసం వాసన చూడండి
మా అమ్మకంటే కమ్మగా
వంట చేసే మహిళ మరి లేదు!!
~
మూలం: మాయా ఏంజిలో
అనువాదం: హిమజ
సుతిమెత్తగా కవిత్వం రాసే ‘హిమజ’ కవితా సంకలనం ‘ఆకాశమల్లె’కి కవయిత్రి మొదటి పుస్తకానికి ఇచ్చే సుశీలా నారాయణరెడ్డి పురస్కారం (2006), రెండవ పుస్తకం ‘సంచీలో దీపం’కు ‘రొట్టమాకు రేవు’ అవార్డు (2015) వచ్చాయి.
‘మనభూమి’ మాసపత్రికలో స్త్రీలకు సంబంధించిన సమకాలీన అంశాలతో ‘హిమశకలం’ పేరున సంవత్సర కాలం ఒక శీర్షిక నిర్వహించారు.
ప్రపంచ ప్రఖ్యాత ఆఫ్రో అమెరికన్ కవయిత్రి ‘మాయా ఏంజిలో’ కవిత్వాన్ని అనువదించి 50 వారాలు ‘సంచిక’ పాఠకులకు అందించారు.
ఇప్పుడు ‘పొయెట్స్ టుగెదర్’ శీర్షికన భిన్న కవుల విభిన్న కవిత్వపు అనువాదాలు అందిస్తున్నారు.