Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చిన్నితెర మాణిక్యాలు – ‘మ్యాడ్ మెన్’లో ఉత్తమ ఎపిసోడ్

[సంచిక పాఠకుల కోసం చిన్నితెర మాణిక్యాలు – ‘మ్యాడ్ మెన్’లో ఉత్తమ ఎపిసోడ్‌ని అందిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]

‘మ్యాడ్ మెన్’ సీరీస్ ఒక అడ్వర్టయిజింగ్ ఏజెన్సీలో పని చేసేవారి కథల సమాహారం. 1960 దశకంలో న్యూయార్క్‌లోని మ్యాడిసన్ అవెన్యూలో ఎన్నో ఏజెన్సీలు ఉండేవి. పురుషులు ఆ ఏజెన్సీలలో పని చేసేవారు. స్త్రీలు (ముఖ్యంగా యువతులు) సెక్రెటరీలుగా ఉండేవారు. మ్యాడిసన్ అవెన్యూలోని ‘మ్యాడ్’ని తీసుకుని పురుషులని ‘మ్యాడ్ మెన్’ అనేవారు. ఆ పేరు వారికి వారే పెట్టుకున్నారు. ‘ఉన్మాదులు’ అనే అర్థం వస్తుంది. పెద్ద కంపెనీలకి ప్రకటనలు తయారు చేయటం, వారికి ప్రచార వ్యూహాలు తయారు చేసి ఇవ్వటం ఈ ఏజెన్సీల పని. కంపెనీ పెద్దమనుషులని ప్రసన్నం చేసుకోవటానికి వేశ్యలని ఏర్పాటు చేయటం సాధారణం. సెక్రటరీలని ఆటబొమ్మలుగా చూడటం అలవాటు. తెలుగులో ‘సెక్రటరీ’ సినిమాలో కూడా సెక్రటరీలంటే చులకనగా చూడటం చూపించారు. ‘మ్యాడ్ మెన్’ సీరీస్ 2007 నుంచి 2015 వరకు ఏడు సీజన్లలో ప్రసారమయింది. మొత్తం కథ 1960 నుంచి 1970 వరకు జరిగినట్టు చూపించారు. ఈ కాలంలో కెన్నెడీ హత్య, క్యూబా మిసైల్ సంక్షోభం, మొహమ్మద్ ఆలీ బాక్సింగ్ చాంపియన్ కావటం, మార్టిన్ లూథర్ కింగ్ హత్య, వియత్నాం యుద్ధం, చంద్రునిపై మనిషి అడుగుపెట్టడం చారిత్రక ఘట్టాలు. ఈ ఘట్టాలని కథలో నేపథ్యంగా వాడుకున్న తీరు అద్భుతంగా ఉంటుంది. ఇదే కాకుండా జాతివివక్ష, హోమోసెక్సువాలిటీ లాంటి విషయాలు కూడా స్పృశించారు. ఈ సీరీస్‌కి మొదటి నాలుగు సీజన్లకి ఉత్తమ డ్రామా సీరీస్‌గా ఎమ్మీ అవార్డులు వచ్చాయి. ఈ సీరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో, లయన్స్‌గేట్ ప్లేలో లభ్యం. పెద్దలకు మాత్రమే.

ఈ సీరీస్‌లో అన్ని పాత్రల వృత్తిజీవితానికి, వ్యక్తిగతజీవితానికి ప్రాధాన్యత ఇచ్చిన తీరు ఆకట్టుకుంటుంది. ముఖ్యమైన పాత్రలు రెండు – డాన్ డ్రేపర్, పెగ్గీ ఓల్సన్. డాన్ డ్రేపర్ ఒక ఏజెన్సీలో క్రియేటివ్ డైరెక్టర్. సీరీస్ మొదట్లో అతని వయసు 34. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు. పెగ్గీ అతని సెక్రటరీగా చేరుతుంది. ఆమె వయసు 20. ఆఫీస్ మ్యానేజర్ జోన్ ఆమెని గర్భం ధరించకుండా ఏర్పాట్లు చేసుకోమని డాక్టర్ దగ్గరకి పంపిస్తుంది. పరిస్థితులు అంత దారుణంగా ఉండేవన్నమాట. ఏజెన్సీలో పని చేసే పీటర్ అనే అతను పెగ్గీ మీద కన్నేస్తాడు. అతనికి అప్పటికే పెళ్ళి కుదిరింది. ఏజెన్సీ యజమానులు బర్ట్ కూపర్, రోజర్ స్టర్లింగ్. బర్ట్ వయసు మళ్ళినవాడు. ఈ తతంగాలన్నీ మామూలే అన్నట్టుంటాడు. రోజర్ నడివయసువాడు. భార్య, కూతురు ఉంటారు. జోన్‌తో అక్రమసంబంధం ఉంటుంది. కొన్నాళ్ళకి డాన్ పెగ్గీకి కాపీరైటర్‌గా అవకాశం ఇస్తాడు. కాపీరైటింగ్ అంటే ప్రకటనకి ట్యాగ్ లైన్లు రాసే పని. అప్పట్లో స్త్రీలకి ఇలాంటి అవకాశాలు వచ్చేవి కాదు. సీరీస్ సాగే కొద్దీ పెగ్గీ అంచెలంచెలుగా ఎదుగుతుంది. డాన్ పతనమవుతూ ఉంటాడు.

ఈ సీరీస్‌లో ఉత్తమ ఎపిసోడ్ నాలుగో సీజన్లో వస్తుంది. ఆ ఎపిసోడ్ పేరు ‘ద సూట్‌కేస్’ (సీజన్ 4, ఎపిసోడ్ 7). ఉత్తమ ఎపిసోడ్ అని చెప్పటానికి కారణం ఏమిటంటే ఇది ప్రేక్షకులలో అధికులకి నచ్చిన ఎపిసోడ్. నాలుగో సీజన్ అంటే కథ చాలావరకు ముందుకి సాగిపోయిందని వేరే చెప్పక్కరలేదు. వెనక సీజన్లలో జరిగిన సంఘటనలు (స్పాయిలర్లు) చెప్పకతప్పదు. ఈ వ్యాసం కనీసం మూడు సీజన్లు చూసినవారు చదవితే ‘కథ తెలిసిపోతుంది’ అనే భయం ఉండదు. మొదటి మూడు సీజన్లు భవిష్యత్తులో చూడాలనుకునేవారు ఈ క్రింద చుక్కలు వచ్చేవరకు ఉన్న భాగాన్ని వదిలేసి చదవండి.

డాన్‌కి ఎడ్వర్టయిజింగ్ లో చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అతను తయారు చేసిన ప్రకటనలు గొప్పగా ఉంటాయని అందరూ అనుకుంటారు. అతనికి ఏజెన్సీలో భాగస్వామ్యం కూడా ఉంటుంది. అంటే లాభాలలో వాటా అన్నమాట. అయితే అతని గతం కష్టాలమయం. డాన్ అసలు పేరు డిక్. అతని తల్లి ఒక వేశ్య. అతని తండ్రి ఒక విటుడు. తల్లి ప్రసవసమయంలో చనిపోతే తండ్రి పెంచుతాడు. అతని భార్య పిల్లలు లేకపోవటంతో డాన్‌ని సాకుతుంది. తండ్రి మాత్రం పిల్లవాడిని కొడుతూ ఉంటాడు. 1930 దశకంలో ఆర్థికమాంద్యం కారణంగా డిక్ పేదరికంలో పెరుగుతాడు. హఠాత్తుగా తండ్రి చనిపోతాడు. గర్భవతి అయిన తల్లి వేరే దారిలేక తన చెల్లెలి దగ్గరకి వెళుతుంది. ఆ చెల్లెలి భర్త ఒక వేశ్యాగృహం నడుపుతూ ఉంటాడు. డిక్‌కి ఒక తమ్ముడు పుడతాడు. తల్లి పడుపు వృత్తి చేయకపోయినా చెల్లెలి భర్తతో సంబంధం పెట్టుకుంటుంది. డిక్ వేశ్యల మధ్య పెరుగుతాడు. ఒక వేశ్య బలవంతంగా అతనితో లైంగిక సంబంధం పెట్టుకుంటుంది. ఈ వాతావరణం నుంచి తప్పించుకోవటానికి డిక్ కొరియా యుద్ధంలో సైనికుడిగా వెళతాడు. అక్కడ డాన్ అనే తోటి సైనికుడు చనిపోతే అతని మెడలో ఉన్న నామఫలకాన్ని డిక్ తీసుకుని తన నామఫలకాన్ని అతని మెడలో వేస్తాడు. డిక్ చనిపోయాడని అతని కుటుంబం అనుకుంటుంది. డిక్ డాన్‌గా చెలామణి అయ్యి కొత్త జీవితం ప్రారంభిస్తాడు. కానీ అసలు డాన్‌కి ఒక భార్య ఉంటుంది. ఆమె పేరు ఆనా. ఆమె డాన్‌ని వెతుక్కుంటూ వస్తుంది. డాన్ పేరుతో చెలామణి అవుతున్న డిక్‌ని కలుసుకుంటుంది. డిక్ నిజం చెబుతాడు. ఆమె తన భర్త చనిపోయాడని తెలిసి ఇక చేసేదేమీ లేక మౌనంగా ఉండిపోతుంది. డిక్ ఆమెకి ఇల్లు కొనిపెడతాడు. ఇద్దరూ స్నేహితుల్లా ఉంటారు. డిక్ బెట్టీ అనే ఆమెని పెళ్ళి చేసుకోవాలని ఆనా నుంచి చట్టబద్ధంగా విడాకులు తీసుకుంటాడు. అందరికీ అతను డాన్ గానే తెలుసు. భార్య బెట్టీకి కూడా అతని గతజీవితం తెలియదు. మూడో సీజన్ చివర్లో తెలుస్తుంది. అప్పటికే డాన్‌కి అక్రమసంబంధాలు ఉంటాయి. అది కూడా బెట్టీకి తెలుస్తుంది. ఆమె విడాకులు తీసుకుంటుంది. తర్వాత ఆనాకి క్యాన్సర్ సోకుతుంది. ఆమెకి తెలియదు. డాన్‌కి తెలుసు. ఆమె అక్క, అక్క కూతురు ఆమెని చూసుకుంటూ ఉంటారు.

డాన్ అక్రమసంబంధాలు ఎందుకు పెట్టుకున్నాడు? దీనికి అతనికే సమాధానం తెలియదేమో! బాల్యంలో పేదరికం, తండ్రి ప్రేమ లేకపోవటం, వేశ్యాగృహంలో పెరగటం, బలవంతంగా లైంగిక సంబంధం అతనిపై ఎలాంటి ప్రభావం చూపించాయో ఊహించటం కష్టం. పెళ్ళి చేసుకున్నాడుగా, హాయిగా ఉండొచ్చుగా అనవచ్చు. కానీ భార్యకి అతని గతం తెలియదు. మనసు విప్పి చెప్పుకోలేడు. చెబితే ఆమె వదిలి పోతుందని భయం. పిల్లలు కూడా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అతను ఏదో వెలితిని పూడ్చకోవటానికి అన్నట్టు అక్రమసంబంధాలు పెట్టుకుంటాడు. అతను అందగాడు కావటం వల్ల స్త్రీలు అతని పట్ల ఆకర్షితులవుతూ ఉంటారు. లైంగిక స్వేచ్ఛ పెరిగిన కాలమది.

డాన్ గతం గురించి తెలిసినవారు మరో ఇద్దరు. పీటర్ ఒకడు. అతనికి అనుకోకుండా డాన్ రహస్యం తెలుస్తుంది. అతను దాన్ని బ్లాక్‌మెయిల్ చెయ్యటానికి వాడుకుంటాడు. తనకి ప్రమోషన్ ఇవ్వమని అడుగుతాడు. డాన్ ఇవ్వనంటాడు. భయం ఉంటుంది కానీ పీటర్ లాంటివాడి ముందు లొంగిపోవటం డాన్ అహానికి మింగుడుపడని విషయం. పీటర్ ఏజెన్సీ యజమానుల్లో ఒకరైన బర్ట్ దగ్గరకి వెళ్ళి డాన్ గురించి చెప్పేస్తాడు. డాన్ కూడా అక్కడే ఉంటాడు. బర్ట్ ఎంతో జీవితానుభవం కలవాడు. “మన దేశంలో చాలామందికి ఇలాంటి చీకటి రహస్యాలు ఉన్నాయి. అయినా ఈ దేశనిర్మాణంలో వారి పాత్ర ముఖ్యమైనది. నాకు అతని గతం అనవసరం” అంటాడు. ఆర్థిక మాంద్యం, రెండో ప్రపంచయుద్ధం, కొరియా యుద్ధం, రష్యాతో ప్రచ్ఛన్నయుద్ధం – ఇవన్నీ చూసినవాడు బర్ట్. అతనికి ధర్మం ముఖ్యం కాదు, సామర్థ్యం ముఖ్యం. అదే అమెరికా సమాజంలో ఉండే పెద్ద లోపం. తర్వాత బర్ట్ ఒక సందర్భంలో డాన్‌ని బ్లాక్‌మెయిల్ చేస్తాడు. అన్నిటి కన్నా స్వార్థం ముఖ్యం!

ఇక పెగ్గీ సంగతి. ఆమె సెక్రటరీగా ఉద్యోగంలో చేరగానే పీటర్ ఆమె వెంటపడతాడు. తాను అందగత్తెని కాదని ఆమె అభిప్రాయం. కాస్త లావుగా ఉంటుంది. పీటర్ వెంటపడటంతో లొంగిపోతుంది. ఆశ్చర్యం ఏమిటంటే ఆమె గర్భం ధరించి ప్రసవసమయం వచ్చేదాకా ఆమెకి తాను గర్భవతినని తెలియదు. కొందరికి ఈ విషయాల్లో అవగాహన తక్కువ ఉంటుంది. ఆమెకో రూమ్‌మేట్ ఉంటుంది కానీ పెగ్గీ తన పనేదో తనది అన్నట్టు ఉంటుంది కాబట్టి ఆమెకి చెప్పేవారు కూడా ఎవరూ లేరు. ఒకరకంగా ఇదీ మంచిదే, ఎందుకంటే ఎవరికీ ఆమె గర్భవతి అయిందని తెలియదు. అప్పటికే పీటర్‌కి పెళ్ళయిపోతుంది. పెగ్గీ కాపీరైటర్‌గా పని చేస్తూ ఉంటుంది. నొప్పులతో హాస్పిటల్‌కి వెళ్ళాక గర్భవతినని తెలుస్తుంది. బిడ్డని ప్రసవిస్తుంది కానీ చూడటానికి కూడా ఒప్పుకోదు. బిడ్డని హాస్పిటల్ వాళ్ళు దత్తతకి ఇచ్చేస్తారు. ఆమె కుంగిపోతుంది. తల్లికి, అక్కకి విషయం తెలుస్తుంది. వారు ఆమెని మానసిక వైద్యశాలలో చేర్పిస్తారు. ఆమెకి ఏమైందని ఆదుర్దాపడి ఆమెని చూడటానికి వచ్చిన మనిషి ఒక్కరే – డాన్. అతను “ఇదంతా మర్చిపో. ముందుకి సాగిపో. కొన్నాళ్ళకి ఇదంతా అసలు జరగలేదని నీకే అనిపిస్తుంది” అంటాడు. పెగ్గీ కోలుకుంటుంది. బరువు కూడా తగ్గుతుంది. మళ్ళీ ఏజన్సీకి వచ్చి పనిలో చేరుతుంది. అక్కడి వాళ్ళందరూ ఆమె బరువు తగ్గించుకోవటానికి ఏదో క్లినిక్‌లో చేరి ఇన్నాళ్ళకి వచ్చిందని అనుకుంటారు. పీటర్‌కి కూడా ఆమె నిజం చెప్పదు. క్యూబన్ మిసైల్ సంక్షోభం సమయంలో అందరం చనిపోతాం అనుకున్నప్పుడు చెబుతుంది. మూడో సీజన్‌కి వచ్చేసరికి పెగ్గీ కింద కొందరు కాపీరైటర్లు పని చేస్తూ ఉంటారు. ఒకసారి ఆమె ఇచ్చిన ఐడియా వల్ల డాన్ మంచి టీవీ ప్రకటన తయారు చేస్తాడు. అతనికి ఆ ప్రకటనకి అవార్డు కూడా వస్తుంది. బృందమంతటికీ అవార్డు ఇవ్వరుగా. తన ఐడియాకి అతనికి అవార్డు రావటం పెగ్గీకి అక్కసుగా ఉంటుంది. ఏజెన్సీలో కూడా మార్పులు వస్తాయి. పాత ఏజెన్సీ వేరే ఏజెన్సీలో విలీనం అవటం, మళ్ళీ విడిపోవటం జరుగుతుంది.

***

‘ద సూట్‌కేస్’ ఎపిసోడ్ సమయానికి డాన్‌కి విడాకులు అయిపోయాయి. పిల్లలు తల్లి దగ్గర ఉంటారు. సెలవు రోజుల్లో తండ్రి దగ్గరకి వస్తారు. పెగ్గీకి డక్ అని ఒక ప్రియుడు ఉండేవాడు. అతను ఈ ఏజెన్సీలో ఉన్నత స్థాయిలో పని చేశాడు. ఇప్పుడు వేరే ఏజెన్సీలో ఉన్నాడు. పెగ్గీ ప్రమోషన్  వస్తుందని ఆశపడి అతన్ని ప్రేమించింది. ప్రేమించిందో, వాడుకుందో ఆమెకి కూడా తెలియదు. ప్రస్తుతం పెగ్గీ ప్రియుడు మార్క్. ఆ రోజు 1965, మే 25. మొహమ్మద్ ఆలీ వెర్సస్ సన్నీ లిస్టన్ బాక్సింగ్ మ్యాచ్ కోసం అందరూ ఎదురుచూస్తూ ఉంటారు. ఇది ప్రఖ్యాతమైన మ్యాచ్. అప్పట్లో క్రీడలకి టీవీలో ప్రత్యక్షప్రసారాలు లేవు. సినిమాహాలు వాళ్ళు ప్రత్యక్షప్రసారం చేసి టికెట్లు అమ్మేవారు. ఏజెన్సీలో మగవారు చాలామంది టికెట్లు కొంటారు. కొందరు పందేలు కూడా వేస్తారు. లిస్టన్ గెలుస్తాడని అధికులు అనుకుంటారు. డాన్ కూడా లిస్టన్ మీద పందెం కాస్తాడు. మొహమ్మద్ ఆలీ కొత్త కెరటం. లిస్టన్ అనుభవజ్ఞుడు.

శామ్సనైట్ సూట్‌కేస్ కంపెనీకి టీవీ ప్రకటన తయారు చేసే పనిలో పెగ్గీ బృందం ఉంటుంది. డాన్ వారిని తన ఆఫీసు గదిలోకి పిలిచి పని ఎంతవరకూ వచ్చిందని అడుగుతాడు. వారు తాము అనుకున్న టీవీ ప్రకటనని నటించి చూపిస్తారు. డాన్‌కి నచ్చదు. అతను మిగతా వారిని పంపించి పెగ్గీతో “నువ్వు వైఫల్యం చెందటానికి భయపడకపోవటం మంచిదే. ఐడియా ఉంటే సరిపోదు. దాన్ని మంచి కథలా చూపించాలి” అంటాడు. విమర్శని ఎంత తెలివిగా చేయవచ్చో చూపిస్తాడు. ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్‌లో ఇలాంటివే నేర్పిస్తున్నారు. ఐడియా ఏమిటంటే శామ్సనైట్ అమెరికన్ టూరిస్టర్ లాంటి మిగతా సూట్‌కేసుల కంటే బలమైనది అని. అది పెగ్గీ ఐడియా కాదు. ఆమె బృందంలోని ఒకరి ఐడియా. ఆ ఐడియా డాన్‌కి నచ్చింది. కానీ వారు అల్లిన కథ నచ్చలేదు. పెగ్గీ తన ఆఫీసు గదికి తిరిగి వస్తుంది. ఆమెకి ఎవరో పంపించిన పువ్వులు ఆమె బల్ల మీద ఉంటాయి. ఆరోజు ఆమె పుట్టినరోజు. పువ్వులు పంపినది ఆమె మాజీ ప్రియుడు డక్. ఆమె సంబరంగా అతనికి ఫోన్ చేస్తుంది. అతను ఇంట్లో తాగుతూ ఉంటాడు. అతని ఉద్యోగం పోయింది. “నువ్వూ నేనూ కలిసి ఒక ఏజెన్సీ పెడదాం” అంటాడు. అతని పరిస్థితి బాగాలేదని ఆమెకి అర్థమవుతుంది. అతన్ని సముదాయించి ఫోన్ పెట్టేస్తుంది.

మధ్యాహ్నం డాన్ తన ఆఫీసు గదిలో లేని సమయంలో ఆనా అక్క కూతురు స్టెఫనీ నుంచి ఫోన్ వస్తుంది. అతని సెక్రటరీ ఫోన్ ఎత్తుతుంది. స్టెఫనీ “డాన్‌ని ఫోన్ చేయమని చెప్పండి. అర్జెంట్” అంటుంది. సెక్రటరీ అతను వచ్చాక చెబుతుంది. ఆనాకి క్యాన్సర్ ఉందని డాన్‌కి తెలుసు. ఆమె ఎక్కువ కాలం బతకదని తెలుసు. అర్జెంట్ అంటే ఆనా పరిస్థితి విషమించిందన్నమాట. అతనికి దుర్వార్త వినటం ఇష్టం లేదు. అతను ఫోన్ చేయడు. ఆనా అంటే అతనికి ఎందుకు అంత ప్రీతి? ఆమె తలచుకుంటే అతని జీవితాన్ని తలకిందులు చేసేది. కానీ మౌనంగా ఉండిపోయింది. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. అతని గతం గురించి తెలిసీ అతని మీద తీర్పులేవీ ఇవ్వనిది ఆమె ఒక్కతే. బెట్టీ వదిలిపోయింది. మిగతా వాళ్ళు అతన్ని బ్లాక్‌మెయిల్ చెయ్యటానికి ప్రయత్నించారు.

సాయంత్రం ఏజెన్సీ యజమానుల్లో ఒకరైన రోజర్‌తో కలిసి రెస్టారెంట్‌కి వెళ్ళి రేడియోలో బాక్సింగ్ మ్యాచ్ కామెంటరీ విందామని డాన్ ప్రణాళిక వేసుకుంటాడు. అనుకోకుండా రోజర్‌కి వేరే క్లయింటుని కలిసే పని పడుతుంది. డాన్‌ని రమ్మంటాడు కానీ అతను రానంటాడు. అతనికి ఆనా గురించి బెంగగా ఉంది. కానీ ఫోన్ చేస్తే ఏం వినాల్సి వస్తుందో అని భయం. రోజర్‌తో “నేను శామ్సనైట్ పని పూర్తి చేయాలి” అంటాడు. మధ్యాహ్నమంతా పెగ్గీ బృందం కొత్త కథని తయారు చేయటానికి కుస్తీ పడుతూ ఉంటుంది. సాయంత్రం అందరూ ఇంటికి బయల్దేరతారు. పెగ్గీ ప్రియుడు మార్క్ ఆమె పుట్టినరోజు సందర్భంగా మంచి రెస్టారెంట్‌కి తీసుకెళతానని చెప్పాడు. ఆమె ఉత్సాహంగా బయల్దేరుతుంది. వెళ్ళే ముందు ఆమెకి వాష్‌రూమ్‌లో పీటర్ భార్య కనిపిస్తుంది. ఆమె గర్భవతి. భర్తతో పాటు సినిమా హాల్లో బాక్సింగ్ మ్యాచ్ చూడటానికి ఆమె వచ్చింది. ఇరవై ఆరేళ్ళు వచ్చినా పెగ్గీ పెళ్ళి చేసుకోకుండా ఉద్యోగం చేస్తోందని ఆమెకి జాలి. “ఇరవై ఆరేళ్ళంటే ఏమంత పెద్ద వయసు కాదులే” అంటుంది. ఇద్దరూ కలిసి బయటకి వచ్చేసరికి పీటర్ ఎదురుచూస్తూ ఉంటాడు. ఇద్దర్నీ చూసి అతనికి కంగారు పుడుతుంది. కానీ పెగ్గీ ఏం జరగనట్టు ఉండేసరికి ఊపిరి పీల్చుకుంటాడు. నిజానికి పీటర్ భార్య చూపించిన బూటకపు జాలికి మరో అమ్మాయి అయితే ఏమన్నా అనేది. పెగ్గీకి స్థైర్యం ఎక్కువ.

పెగ్గీ బయల్దేరే లోపలే డాన్ పిలిపిస్తాడు. పెగ్గీ అతని ఆఫీసు గదికి వెళుతుంది. ఆమె బృందంలో మిగతావారు అది చూసి హడావిడిగా పారిపోతారు. డాన్ పని చేయిస్తాడని వారికి తెలుసు. డాన్‌కి ఇంటికి వెళ్ళటం ఇష్టం లేదు. వెళితే ఒంటరిగా ఉండాలి. ఆనాకి ఏమయిందో అని మథనపడాలి. అందుకని మనసుని మళ్ళించటానికి పనిలో పడతాడు. ఎవరో ఒకరు తోడు ఉండాలిగా. అందుకు పెగ్గీని పిలుస్తాడు. కొత్త కథలు ఏం అనుకున్నారో చూపించమంటాడు. ఆమె తన పుట్టినరోజు అని చెప్పి తప్పించుకోవకచ్చు. కానీ ఆత్మాభిమానం ఎక్కువ. ఆమె చార్టులు తీసుకువచ్చి కొత్త కథలు వినిపిస్తుంది. ఏవీ డాన్‌కి నచ్చవు. ఎందుకంటే అతనికి పని జరగటం ముఖ్యం కాదు. పనిలో తనని తాను మర్చిపోవాలి. ఆనాని మర్చిపోవాలి. “ఇప్పుడే కొత్త కథ తయారు చేద్దాం” అంటాడు. అది అభ్యర్థన కాదు, ఆదేశం. పెగ్గీకి చిరాకు వస్తుంది. “ఏం చేసినా మీరెలాగూ మార్చేస్తారుగా” అంటూ గది నుంచి బయటకి వస్తుంది. అతను చిన్న చిన్న మార్పులు చేసి మొత్తం పేరంతా తనే కొట్టేస్తాడని ఆమె భావన.

ఆఫీసు ఖాళీగా ఉంటుంది. పెగ్గీ రెస్టారెంట్‌కి ఫోన్ చేసి మార్క్‌కి ఇవ్వమంటుంది. మార్క్‌తో “నేను పదిహేను నిమిషాల్లో బయల్దేరుతాను” అంటుంది. మార్క్ నిజానికి ఆమెకి సర్‌ప్రైజ్ ఇవ్వాలని ఆమె తల్లిని, అక్కని, బావని, ఆమె రూమ్‌మేట్‌ని తీసుకుని రెస్టారెంట్‌కి వస్తాడు. ఇది ఆమెకి తెలియదు. పెగ్గీ, డాన్ పని చేయటానికి కూర్చుంటారు. గంట గడిచిపోతుంది. డాన్ ఫోన్ మోగుతుంది. అతని గుండె ఝల్లుమంటుంది. ఆనా గురించి స్టెఫనీ ఫోన్ చేస్తోందేమో అనుకుంటాడు. పెగ్గీ ఫోన్ ఎత్తుతుంది. ఫోన్ చేసింది రోజర్. డాన్‌ని రమ్మని బతిమాలుతాడు.  డాన్ ససేమిరా అంటాడు. పెగ్గీకి మార్క్ ఫోన్ చేస్తాడు. ఇంకా రాలేదేమని అడుగుతాడు. అందరూ వచ్చారని చెబుతాడు. పెగ్గీ వెంటనే వస్తానంటుంది. డాన్ దగ్గరకి వెళ్ళి తన పుట్టినరోజని చెబుతుంది. అతను “ఇంత వయసు వచ్చాక ఇంకా పుట్టినరోజు ఏమిటి?” అంటాడు. చివరికి “నేనే పని చేసుకుంటాను. నువ్వెళ్ళు” అంటాడు. ఆమె బయల్దేరుతుంది. కానీ లిఫ్ట్ దాకా వెళ్ళి వెనక్కి వస్తుంది. మార్క్‌కి ఫోన్ చేస్తుంది. “నేను రాలేను. అతనికి నా అవసరం ఉంది” అంటుంది. అతను తనకి ఆ ఉద్యోగం ఇచ్చాడని కృతజ్ఞత కొంత, అతనిలో ఏదో అలజడి ఉందన్న జాలి కొంత, పని చేయకపోతే అతను రేపు ఆమెని దెప్పుతాడని భయం కొంత. మార్క్‌కి డాన్ గురించి పెగ్గీ చెప్పింది. “డాన్‌ని పార్టీకి పిలిచి ఉంటే పరుగెత్తి వచ్చేదానివి” అంటాడు. “మా వాళ్ళని మంచి చేసుకోవటానికి నా పుట్టినరోజుని వాడుకుంటున్నావు” అంటుందామె. నిజానికి ఆమెకి తల్లి అంటే ఇష్టం లేదు. ఎప్పుడూ విమర్శిస్తూ ఉంటుందని. పార్టీకి వెళ్ళకపోవటానికి అదే అసలు కారణం. ఆమె తల్లి తక్కువదేమీ కాదు. మార్క్ నుంచి ఫోన్ లాక్కుని “నీ కోసం మంచి కుర్రాళ్ళు క్యూ కట్టి ఏం నిల్చోలేదు. ఇతన్ని వదులుకోకు” అంటుంది. దానితో పెగ్గీకి ఇంకా చిర్రెత్తుకొస్తుంది. మార్క్‌తో మాటా మాటా పెరుగుతుంది. అతను “నీకో గుడ్‌బై” అని ఫోన్ పెట్టేస్తాడు.

పెగ్గీ డాన్ ఆఫీసుకి వస్తుంది. అతని మీద కూడా ఆమెకి కోపం ఉంది. “నా పనికి విలువ లేదు. నా ఐడియాతో మీరు అవార్డు గెలుచుకున్నారు. కనీసం థాంక్స్ కూడా చెప్పలేదు” అంటుంది. “ఏ ఐడియా అయినా ఏజెన్సీకి చెందుతుంది. నీకు జీతం ఇవ్వటం కంటే థాంక్స్ ఏముంది?” అంటాడతను. ఆమె కన్నీళ్ళు పెట్టుకుని వెళ్ళిపోతుంది. తన ఆఫీసు గదిలో కూర్చుంటుంది. కాసేపటికి ఇద్దరూ చల్లబడతారు. ఆమె పుట్టినరోజు కాబట్టి అతను ఆమెని రెస్టారెంట్‌కి తీసుకువెళతాడు. “మేమిద్దరం రెస్టారెంట్‌కి వెళ్ళి రొమాంటిక్‌గా గడుపుదామనుకుంటే అతను మా అమ్మని పిలుస్తాడా? నన్ను అర్థం చేసుకున్నాడా అసలు? నా తప్పేం లేదు” అంటుందామె. ‘అతను బ్రేకప్ చేశాడంటే నా తప్పేమో’ అనే ఆలోచన ఆమెలో సహజంగానే ఉంటుంది. ఆమెకే కాదు, ఎవరికైనా ఏదైనా తగాదా వస్తే నా తప్పు ఉందా అనే ఆలోచన వస్తుంది, మరీ దుర్మార్గులైతే తప్ప. ‘నన్ను అతను అర్థం చేసుకోలేదు కాబట్టి అతనిదే తప్పు’ అని డాన్‌తో అని ఆమె కాస్త సాంత్వన పొందుతుంది.

డాన్ సూట్‌కేస్ ప్రకటన గురించే ఆలోచిస్తూ ఉంటాడు. “మా చిన్నాన్న ఎప్పుడూ ఒక సూట్‌కేస్ సర్దుకుని తయారుగా ఉంటానని అనేవాడు. ఎవరైనా ఎపుడైనా ప్రయాణం కావటానికి సిద్ధంగా ఉండాలి అనేవాడు” అని ఏదో అర్థమయినట్టు “అందులో శ్లేష ఉందేమో” అంటాడు. ఎవరైనా ఎపుడైనా మరణించవచ్చు అనే అర్థం ఉంది అందులో. ఈ చిన్నాన్న వేశ్యాగృహం నడిపిన చిన్నాన్న. అతనిలో కూడా వేదాంతం ఉంది. తర్వాత వారిద్దరూ తమ గతంలో ఇబ్బందికరం కాని విషయాల గురించి మాట్లాడుకుంటారు. తలిదండ్రుల గురించి ప్రస్తావన వస్తుంది. అతను కొరియా యుద్ధంలో పాల్గొనటం గురించి చెబుతాడు. ఆమె తానెప్పుడూ విమానం ఎక్కలేదంటుంది. కాసేపటికి అతను “కాస్త చీకటిగా ఉన్న చోటికి వెళదాం” అంటాడు. అతనికి రెస్టారెంట్లో వెలుగు మరీ ఎక్కువగా అనిపించింది. బార్ దగ్గరకి వెళతారు. అక్కడ కాస్త చీకటిగా ఉంటుంది. అతని మాటకి రెండర్థాలు. ‘మన గతంలో చీకటి కోణాలు కూడా స్పృశిద్దాం’ అనే అర్థం వస్తుంది. ఇది రచయితల ప్రతిభ.

డాన్‌గా జాన్ హామ్, పెగ్గీగా ఎలిజబెత్ మాస్ నటించారు. ఇద్దరికీ మంచి పేరు వచ్చింది. ప్రకటనలు ఎలా తయారు చేస్తారో ఆసక్తికర్మగా చూపించారు ఈ సీరీస్‌లో. ముఖ్యంగా రచయితల గురించి చెప్పుకోవాలి. ఎందరో రచయితలు ఉన్నా మ్యథ్యూ వీనర్ ముఖ్య రచయిత. ఈ ఎపిసోడ్ అతను రాసిందే. అప్పటి సమాజంలో ఉన్న పోకడలని అద్భుతంగా ఆవిష్కరించాడు. ఉదాహరణకి జావి వివక్ష మీద ఈ ఎపిసోడ్‌లో ఒక లైన్ ఉంటుంది. డాన్ సెక్రటరీ ఒక వయసు మళ్ళిన స్త్రీ. ఆలీ, లిస్టన్‌ల మ్యాచ్ గురించి అందరూ ఆసక్తిగా ఉంటే ఆమె “ఇద్దరు నీగ్రోలు కొట్టుకోవటం చూడాలంటే నా కిటికీలోంచి ఓ డాలరు కాగితం బయట పడేస్తే చాలు. ఇంత హంగామా ఎందుకు?” అంటుంది. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు సీరీస్ మొత్తంలో ఉంటాయి.

ఈ క్రింద ఎపిసోడ్ ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

డాన్, పెగ్గీ మద్యం తాగుతూ మాట్లాడుకుంటారు. పెగ్గీ “డేటింగ్ చేయటం నాకు చేత కాదు” అంటుంది. పాశ్చాత్య దేశాలలో ఉద్యోగం ఎంత ముఖ్యమో డేటింగ్ అంత ముఖ్యంగా పరిగణిస్తారు. తోడుగా ఎవరో ఒకరు ఉండాలి. కొందరికి లైంగిక వాంఛలు తీరటం ప్రధానం. కొందరు పెళ్ళి చేసుకోవాలనే ఉద్దేశంతో డేటింగ్ చేస్తారు. డాన్ “నువ్వు అందగత్తెవి. ఎవరో ఒకరు తోడుగా వస్తారులే” అంటాడు. “నేను మీతో పక్క పంచుకుని కాపీరైటర్ ఉద్యోగం సంపాదించానని అందరూ గుసగుసలాడుకుంటున్నారు” అంటుందామె. “నాకు కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. ఆఫీసు వారితో సంబంధం పెట్టుకోను” అంటాడతను. ఇది పచ్చి అబద్ధం. ఇద్దరు సెక్రటరీలతో సంబంధం పెట్టుకున్నాడు. మహిళా క్లయింట్లతో కూడా సంబంధం పెట్టుకున్నాడు. ఆమెకి అతను అబద్ధం చెబుతున్నాడని తెలుసు. “మీ ఇతర సెక్రటరీలంత ఆకర్షణ నాలో లేదేమో” అంటుంది. ఇదో వింత ప్రవృత్తి. ‘అతను ఇతర సెక్రటరీలతో సంబంధం పెట్టుకున్నాడు. నాతో పెట్టుకోలేదంటే నాదే లోపమేమో’ అనుకోవటం అప్పటి సంస్కృతికి దర్పణం పడుతుంది. అతనికి అర్థమయిందేమిటంటే ‘మీరు మీ సెక్రటరీలతో సంబంధం పెట్టుకోవటం నాకు తెలుసు’ అని ఆమె అంటోందని. అతను వెంటనే “నాకు నీతిపాఠాలు చెప్పే అర్హత నీకుందా?” అంటాడు. ఆమె గతంలో ఎదుర్కొన్న పరిస్థితులు, హాస్పిటల్లో చేరటం వంటివి దృష్టిలో పెట్టుకుని అతను ఈ మాట అన్నాడు. ఇది కోపంతో అన్న మాట కాదు. ఇద్దరూ ప్రశాంతంగానే ఉంటారు. డాన్ మళ్ళీ “మనిషన్నాక తప్పు చేస్తాడు” అంటాడు. పెగ్గీ పంథా మారుస్తుంది. “మా అమ్మ మీ వల్లే నేను హాస్పిటల్లో చేరానని అనుకుంటుంది. మీరొక్కరే నన్ను చూడటానికి వచ్చారు కదా. మీరంటే మా అమ్మకి ద్వేషం” అంటుంది. అతను కోపగించుకోడు. “అతనెవరో నీకు తెలుసా?” అంటాడు. ఆమె “తెలుసు” అంటుంది. “ఎప్పుడన్నా దాని గురించి ఆలోచిస్తావా?” అంటాడతను. “ఆ ఆలోచన అణచివేయటానికి ప్రయత్నిస్తాను. కానీ ఒక్కోసారి ఆపలేను. పిల్లల ఆటస్థలాలు చూసినప్పుడు ఆ ఆలోచన వస్తుంది” అంటుంది. స్త్రీలు ఎలాంటి దారుణ పరిస్థితులు ఎదుర్కొన్నారో ఇక్కడ తెలిసిపోతుంది. 2017లో ‘మీ టూ’ ఉద్యమం వచ్చేవరకు స్త్రీలు ఇలాంటివి ఎన్నో భరించారు. ఇప్పుడు లైంగిక వేధింపులకి వ్యతిరేకంగా చట్టాలు వచ్చాయి కాబట్టి పరిస్థితులు మెరుగుపడ్డాయి. అయితే లైంగిక స్వేచ్ఛ ఇప్పుడు విశృంఖలంగా పెరిగింది. తెలిసి తెలిసీ ఇలాంటి సంబంధాలలోకి స్త్రీలు దిగుతున్నారు.

రేడియోలో బాక్సింగ్ మ్యాచ్ కామెంటరీ వస్తూ ఉంటుంది. మొహమ్మద్ ఆలీ దెబ్బకి రెండు నిమిషాల్లోనే లిస్టన్ మట్టికరుస్తాడు. అక్కడ ఉన్నవాళ్ళందరూ మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిపోయిందని అంటారు. డాన్ “నా పందెం వంద డాలర్లు పోయాయి” అంటాడు. ఇద్దరూ ఆఫీసుకి తిరిగివస్తారు. లిఫ్ట్‌లో వేగంగా రావటం వల్ల డాన్‌కి కడుపులో తిప్పి వాంతి వస్తుంది. అతన్ని పురుషుల వాష్‌రూమ్‌లోకి తీసుకెళుతుంది పెగ్గీ. డాన్ వాంతి చేసుకుంటాడు. పురుషుల వాష్‌రూమ్‌లోకి వెళ్ళటం పెగ్గీకి అదే మొదటిసారి. వింతగా చూస్తుంది. ఇంతలో ఆమెని ఎవరో పిలుస్తారు. ఆమె బయటకి వస్తుంది. ఆమె మాజీ ప్రియుడు డక్ అక్కడ తిరుగుతూ ఉంటాడు. ఆమె రూమ్‌మేట్ ఆమె ఆఫీసులో ఉందని చెప్పటంతో అతను ఆఫీసుకి వచ్చాడు. అతనికి డాన్ అంటే కోపం. డాన్ వల్లే అతను వేరే ఏజెన్సీకి వెళ్ళాల్సి వచ్చింది. డాన్ కనపడగానే అతను “పెగ్గీ కూడా కులటేనన్నమాట” అంటాడు. తనని అంటే డాన్ ఊరుకునేవాడేమో. పెగ్గీని అన్నందుకు అతనికి కోపం వస్తుంది. తన కాళ్ళ మీద తాను నిలబడాలన్న పెగ్గీ తీవ్ర ఆకాంక్ష అతనికి నచ్చింది. అతను డక్ మీద కలబడతాడు. ఇద్దరూ బాహాబాహీకి దిగుతారు. చివరికి డక్‌దే పై చేయి అవుతుంది. మొహమ్మద్ ఆలీ చేతిలో లిస్టన్ ఓడిపోయినట్టు. ఎక్కడైనా జయాపజయాలు దైవాధీనాలు. యుద్ధం రంగంలో అయినా, కార్పొరేట్ రంగంలో అయినా. కార్పొరేట్ రంగంలో కూడా అప్పుడప్పుడూ ముష్టిఘాతాలు అప్పట్లో ఉండేవి. డక్ వెళ్ళిపోతాడు. ఇదీ మంచిదే. పెగ్గీకి డాన్‌తో సంబంధం ఉందని అతను అపోహపడ్డాడు. ఇక పెగ్గీ జోలికి రాడు.

పెగ్గీ డాన్ గదిలో వస్తుంది. అతను సోఫాలో కూర్చుని ఉంటాడు. అతనికి ఇంకా ఆనా గురించే చింత. పెగ్గీ అతని పక్కన కూర్చుంటుంది. అతను ఆమె ఒళ్ళో తలపెట్టుకుని పడుకుంటాడు. “నీకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించి ఉంటే క్షమించు” అంటాడు. ఆమె “ష్” అంటుంది, మాట్లాడకుండా పడుకో అన్నట్టు. కాసేపటికి ఇద్దరూ అలాగే నిద్రపోతారు. డాన్‌కి అడుగుల చప్పుడుతో మెలకువ వస్తుంది. ఆనా ఒక సూట్‌కేస్ పట్టుకుని గాలి లోంచి వస్తుంది. అతన్ని చూసి చిరునవ్వు నవ్వి గాలిలో మాయమయిపోతుంది. అతను మళ్ళీ పడుకుంటాడు. పొద్దున్నే నిద్రలేచి స్టెఫనీకి ఫోన్ చేస్తాడు. “ఆమె వెళ్ళిపోయింది. తన శరీరాన్ని ప్రయోగాల కోసం యూనివర్సిటీకి ఇచ్చేసింది. ఫీజు కట్టకుండా మెడికల్ కాలేజీకి వెళ్ళాలని ఆమె చిరకాల కోరిక” అని అంటుందామె. డాన్ భారంగా ఫోన్ పెట్టేస్తాడు. తలెత్తి చూస్తే పెగ్గీ మేల్కొని అతన్ని చూస్తూ ఉంటుంది. అతనిలో దుఃఖం కట్టెలు తెంచుకుంటుంది. కన్నీళ్ళు పెట్టుకుంటాడు. ఆమె అతని దగ్గరికి వచ్చి “ఏమైంది?” అంటుంది. “నేనెవరో నిజంగా తెలిసిన ఒకే ఒక వ్యక్తి మరణించింది” అంటాడతను. ఆమె అతని భుజం మీద చెయ్యి వేసి “అలా అనుకోవద్దు” అంటుంది. అతనిలో ఏవో సుడిగుండాలున్నాయని ఆమెకి తెలుసు. అవేమిటో ఆమెకి తెలియక్కరలేదు. అతన్ని ఓదార్చటమే ఆమె పని.

తర్వాత పెగ్గీ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రావాలనుకుంటుంది కానీ వెళ్ళలేక తన ఆఫీసులోనే మళ్ళీ పడుకుంటుంది. డాన్‌కి అఫీసులోనే బట్టలు పెట్టుకోవటం అలవాటు. అతను అక్కడే ఫ్రెష్ అవుతాడు. ఆఫీసు మొదలయ్యే సమయానికి పెగ్గీ నిద్ర లేస్తుంది. డాన్ గదిలోకి వెళుతుంది. పేపర్లలో మొహమ్మద్ ఆలీ లిస్టన్‌ని పడేసి పిడికిలి బిగించిన ఫొటో మొదటి పేజీలో వస్తుంది. ఇది దరిమిలా ఎంతో ప్రఖ్యాతి పొందిన ఫోటో. దాన్ని చూసి అప్పటికే డాన్ శామ్సనైట్ ప్రకటనకి ఒక స్కెచ్ వేస్తాడు. అందులో శామ్సనైట్ సూట్‌కేస్ అమెరికన్ టూరిస్టర్ సూట్‌కేస్‌ని బాక్సింగ్ రింగ్‌లో పడేసి పిడికిలి బిగించినట్టు ఉంటుంది. దాన్ని పెగ్గీకి చూపిస్తాడు. ఆమె బావుందంటుంది. అతని ఆమె చేతిని తన చేతితో సున్నితంగా నొక్కుతాడు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు. థాంక్స్ చెప్పటానికి అతను ఎంచుకున్న పద్ధతి అది. థాంక్స్ ప్రకటన రూపకల్పనలో సాయపడినందుకు కాదు. తనకి ఆసరాగా ఉన్నందుకు. తర్వాత అతను “ఇంటికి వెళ్ళి రా. ఈ ప్రకటనకి పది ట్యాగ్ లైన్లు రాసివ్వు” అంటాడు. ఆమె వెళుతూ “తలుపు తెరిచి ఉంచనా? మూసేయనా?” అంటుంది. “తెరిచే ఉంచు” అంటాడతను. ఆమెకి అతను తన హృదయగవాక్షం తెరిచి చూపించినందుకు సంకేతమది.

ఈ ఎపిసోడ్ అంతా 24 గంటల్లో జరిగిన కథ. ఇలాంటి కథల్లో ఒక విలక్షణత ఉంటుంది. మనుషుల స్వభావాలు బయటపడతాయి. మనందరం మోసే గతం తాలూకు బరువుకి సంకేతమే ‘ద సూట్‌కేస్’ అనే పేరు. పైకి మాత్రం కథలో సూట్‌కేస్ ప్రకటన ఉంది కదా అనిపిస్తుంది. ఆనా ఆత్మ సూట్‌కేస్ పట్టుకుని రావటం ఆమె అంతిమయాత్రకి సూచన. అందరి జీవితాల్లోనూ విషాదాలు, సవాళ్ళు ఉంటాయి. సహానుభూతి ఉండాలి. ‘వారికేం కష్టాలు ఉన్నాయో’ అనుకుంటే ఆ సహానుభూతి కలుగుతుంది. కొందరిలో పైకెదగాలనే కోరిక బలంగా ఉంటుంది. అది వేరే వారికి ఇబ్బంది కాకూడదు. అప్పట్లో తమ జీవితంలో, ఉద్యోగంలో ఎదురయ్యే కష్టాలని ఎవరికీ చెప్పుకోలేక సతమతమయ్యేవారు. ఉద్యోగాలు వదులుకున్నవారు ఉన్నారు. జీవితాలను వదులుకున్నవారు కూడా ఉన్నారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. మారాయంటే మెరుగయ్యాయని కాదు. వేరే ఒత్తిళ్ళు వచ్చాయి. వారాంతాలలో పని చేయాలి అనే యజమానులు పెరిగారు. పనిగంటలు పెరగాలి అంటున్నారు. ఈ పరిస్థితులు మీద కొన్నాళ్ళకి కొత్త సీరీస్ వస్తుందేమో. ఇలా సీరీస్‌లు వస్తూ ఉంటాయా లేక పరిస్థితులు చక్కబడతాయా? ఏమో!

Exit mobile version