Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చిన్నమ్మ!

[రాయపెద్ది హనుమంతరావు – సంజీవ లక్ష్మి స్మారక కథల పోటీ 2025 లో పౌరాణిక కథల విభాగంలో బహుమతి పొందిన కథ ‘చిన్నమ్మ!’. రచన రాయప్రోలు వెంకట రమణ శాస్త్రి.]

వాల్మీకి మహర్షి దగ్గరకు పరిగెత్తుకు వచ్చిన కొంతమంది ఆశ్రమ చిన్నారులు “నువు చెప్పు”, “నువ్వే చెప్పు” అనుకుంటూ ఒకరినొకరు ముందుకు తోసుకుంటున్నారు. వాల్మీకి వారివంక చూసి, వారిలో ఉన్న పన్నెండు, పదమూడు వత్సరాల వయస్సుగల బాలికను దగ్గరకు రమ్మని సంజ్ఞ చేసి “సురభీ, నువ్వు చెప్పు. ఏమిటో ఆ విషయం” అన్నాడు.

“మన ఆశ్రమం ప్రధాన వాకిలి వద్ద ఉన్న అశ్వత్థ వృక్షం క్రింద ఒక స్త్రీ నిలిచి ఉన్నది తాతగారూ! మహారాణి దుస్తుల్లో మిల మిల మెరిసిపోతున్నది” చెప్పింది సురభి.

“ఎప్పుడు చూశారు ఆమెని?” మహర్షి అడిగాడు ఆశ్చర్యపడుతూ.

“ఇప్పుడే. పూల కోసం – సుమవనం – వైపు వెళ్తూంటే కన్పించింది. వీళ్ళని పిలిచి చూపించాను. కానీ ఎందుకో ఆమె విలపిస్తోంది తాతగారూ! భయం వేసి మీ దగ్గరకు పరిగెత్తుకొచ్చాం” చెప్పింది సురభి.

“పదండి.. చూద్దాం!” అంటూ కమండలం చేత తీసుకొని లేచాడు వాల్మీకి. ఆయనకు దారి చూపుతున్నట్లు ముందు ఇద్దరు పిల్లలు పరిగెత్తారు. సురభి ఆయనతో సమానంగా నడుస్తోంది.

వాళ్ళందరూ అశ్వత్థ వృక్షం దగ్గరకు వచ్చారు.

ఆమెను చూసిన వాల్మీకి తన తపఃశక్తితో – ఆమె, శ్రీరామునిచే పరిత్యజించబడి, తమ ఆశ్రమ సమీపంలో లక్ష్మణుడు వదలి వెళ్ళిన జానకీదేవిగా గ్రహించాడు.

వెంటనే “బాలలారా మీరు అందరూ వెళ్ళండి, మీ మీ పనులు చూసుకోండి. ఇప్పుడు ఈమె మన అతిథి!” అని, సురభితో “సురభీ.. నీవు ఆమె వెంట తెచ్చుకున్న వస్త్రాభరణాలను అతిథి కుటీరానికి చేర్చి, దానిలో వసతి సదుపాయాలన్నింటినీ కూర్చవలసింది. ఈ సాధ్వి మనతోనే ఉండగలదు” అని పలికాడు వాల్మీకి. పిల్లలు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. సురభి తనకు ఆదేశించిన పనికి ఉపక్రమించింది.

పిల్లలందరూ వెళ్ళిపోయాక వాల్మీకి జానకితో “అమ్మా జానకీ! నా తపోశక్తితో జరిగినదంతా తెలుసుకున్నాను. నీవు చింతాగ్రస్థురాలివై క్రుంగి పోవలదు. ఇది నా ఆశ్రమం! నీవు మా అతిథి! ఇక్కడ నీకు అన్నివిధాలా సౌకర్యంగా ఉండేలా చూసుకొనే బాధ్యత మాది. మా ఆతిధ్యాన్ని స్వీకరించి మా ఆశ్రమ వాసులందరినీ చరితార్థులను చేయవల్సింది” పలికాడు.

జానకి చేతులు జోడించి వాల్మీకి మహర్షికి నమస్కరించి “నమస్సులు మహర్షీ! మీ తేజస్సు, మీ ప్రశాంత వదనం మీరే వాల్మీకి మహర్షి అని తెలుపుతున్నాయి. నన్ను రక్షించి, నా యోగక్షేమాలను చూడ నిర్ణయించుకున్నందుకు కృతజ్ఞురాలిని” అని పలికి పాదాభివందం చేసి ఆయనను అనుసరించింది.

ఆమెను ఆశ్రమంలోని మునిపత్నులకు పరిచయం చేస్తూ “ఈ సుగుణవతి అయోధ్యా చక్రవర్తి అయిన శ్రీరామచంద్రుని భార్య, లోకపావని జానకీదేవి! ఋషి శిఖామణుల ఆశ్రమాలను దర్శించి, సపర్యలు చేయగోరి భర్త అనుమతి పొంది వచ్చిన మహాసాధ్వి. అదే తరుణంలో తనపై వచ్చిన లోకాపనిందను మాపుగొనుటకు శ్రీరాముడు ఈమెను త్యజించడం జరిగింది. ఈ విషయాలను మీరు పిల్లల వద్ద ప్రస్తావించవద్దు. వారి మనస్సు సున్నితమైనది. వారిలో రామచంద్రుని మీద వ్యతిరేక భావనలు కలుగవచ్చు. అది వారి భావి జీవితానికి శ్రేయస్కరం కాదు.

ఈ లోకపావని ఇప్పుడు మాతృమూర్తి అయ్యే దశలో ఉన్నది. ఈమెకు సపర్యలు అత్యవసరం! ఆమె కోరుకున్నంత కాలం మన ఆతిథ్యం పొందగలదు! ఆమె సంరక్షణ మన అందరి బాధ్యత! అందుకుగాను నేను మీకు కొన్ని విధులు చెబుతాను. వాటిని పాటించవలసింది. ఆమె మనసుకు కావలసిన ప్రశాంతతా, ఊరటా మన ఆశ్రమం నుండి పొందేలా మనం మెలగాలి” అని పలికి, జానకి వైపు తిరిగి “తల్లీ లోకపావనీ! నీవు మా ఆశ్రమంలో నిశ్చింతగా ఉండవలసింది. నీకు ఇప్పుడు మనసు కుదుట పడేందుకు తగినంత విశ్రాంతి అవసరం”, అని చెప్పి తన కుటీరం వైపు నడిచాడు వాల్మీకి.

మునిపత్నులు జానకీదేవికి అతిథి కుటీరంలో వసతి కల్పించారు. ఆమెకు ఫలరసాదులు ఇచ్చి సేవింప చేశారు.

***

వాల్మీకి తన ఆశ్రమానికి సురభి తల్లిదండ్రులను పిలిపించి –

“శిష్యా.. సదానందా, గోమతీ.. మీతో ఒక ముఖ్య విషయం చర్చించాలి” అన్నాడు

“సెలవీయండి మహర్షీ.”

“లోకపావని మన ఆశ్రమంలో ఉన్నంత కాలమూ చేదోడు వాదోడుగా ఉండేందుకు, ఒక ఆడకూతురు అవసరం. అందుకు మీ పుత్రిక సురభిని నియమిస్తున్నాను. సురభికన్న వేరొక అర్హురాలు నాకు తోచడం లేదు. సురభిలోని పరిణతి చెందిన మనస్తత్వం, చురుకుదనం లోకపావనిని సౌకర్యంగా ఉంచగలదు. ఇందుకై మీ అనుమతి కోరుతున్నాను.”

“మహద్భాగ్యం మహర్షీ! మీ మాట మాకు శిరోధార్యం. ఇది సురభికి పూర్వజన్మ సుకృతంగా భావిస్తాం!” వినమ్రతతో పలికారు ఆ దంపతులు.

“మీకు శుభం కల్గుగాక! మీరు వెళ్ళి సురభిని పంపండి, అన్ని వివరాలూ నేను చెబుతాను. రేపటి నుండే సురభిని ఆ విధుల్లో ఉంచుదాం. కానీ, ఆ లోకపావనియే సీతాదేవి అని మీరు సురభికి చెప్పవలదు!” మరోసారి గుర్తు చేసినట్లు చెప్పాడు వాల్మీకి.

“తప్పకుండా మహర్షీ. సెలవు!” అంటూ తమ నివాసం వైపు నడిచారు గోమతీ, సదానందలు.

కొద్దిసేపటికి వాల్మీకి వద్దకువచ్చి నమస్కరించింది సురభి –

“తాతగారికి ప్రణామములు!”

“సురభీ.. మన ఆశ్రమానికి విచ్చేసిన అతిథిని చూశావు కదా! ఏమనిపించింది నీకు ఆమెను చూడగా!” స్నేహపూర్వకంగా ఉన్నాయి వాల్మీకి మహర్షి మాటలు.

“ఆమె చాలా అలసిపోయి ఉన్నారు. ఆమె ముఖ వర్చస్సు, వస్త్రధారణా ఆమె సాధారణ స్త్రీ కాదని తెల్పుతున్నాయి తాతగారూ” చెప్పింది సురభి.

“చక్కగా ఊహించావు. నీవు అనుకున్నట్లే ఆమె సాధారణ స్త్రీ కాదు. ఒక మహారాణి. ఒక మహాధీశాలి యైన చక్రవర్తి ధర్మపత్ని. పూజ్యురాలు. పరిస్థితుల ప్రభావం వలన భర్త ప్రేమానురాగాలకు దూరమైంది. ఆమె మనసు చాలా కల్లోలమై ఉన్నది ఈ సమయంలో. ఆమెకు ఒక తోడూ, ఒక స్నేహం చాలా అవసరం. ఆ తోడూ, నేస్తం కాగల అర్హతలు నీలో పూర్తిగా ఉన్నాయి. అందుకు నిన్ను అభినందిస్తూ, నియమిస్తున్నాను. ఆమె నీకు తల్లిలాంటిది, మరో తల్లిగా భావించు. నీ తల్లిదండ్రులతో ఎలా మసలుకుంటావో అలాగే గౌరవిస్తూ, సేవిస్తూ ఆ మహాసాధ్వితో మసలుకో వలసింది” వివరించాడు వాల్మీకి.

“సరే.. తాతగారూ.”

“మరొక ముఖ్య విషయం.”

“చెప్పండి తాతగారూ.”

“ఆమెను నువ్వు ఎటువంటి వ్యక్తిగత ప్రశ్నలూ వేయవలదు! ముఖ్యంగా, ఆమె గతం గురించి! ఆమె మనసు ఇప్పుడు ఒక గాజు పాత్రలా సున్నితంగా ఉంది. దాన్ని పరిరక్షించుకోవల్సిన అవసరం ఉంది మనందరకూ. ఆమెకు మన ఆశ్రమంలో దొరికే ఆహ్లాదం, అభిమానం ఆమెకు ఉపశమనాన్నివ్వ గలవు. అంతే కాకుండా ఆమె ఇప్పుడు గర్భవతి. ఆమె శారీరకంగా, మానసికంగా ఎంత ఆరోగ్యంగా ఉంటే, అది ఆ గర్భస్థ సంతానానికి అంత మంచిది!”

“తప్పక నా వంతు కృషి, సహాయం చేస్తాను! ఆమె పూర్వాశ్రమ విషయాల మీద ఆసక్తి చూపించను” మాట ఇచ్చింది సురభి!

“నువ్వు తప్పక కృతకృత్యురాలవు కాగలవు తల్లీ. ఇంక వెళ్ళమ్మా. రేపటి నుండీ నీకు ఆ లోకపావనితోనే బస, సిద్ధంగా ఉండు.”

“తప్పకుండా తాతగారూ” అని నమస్కరించి, తన ఇంటివైపు సాగింది సురభి.

***

మరునాడు ఉదయమే సురభిని తల్లి గోమతి వెంట తీసుకువచ్చి, జానకీ దేవికి పరిచయం చేసి, కుటీరంలో విడిచి వెళ్ళింది.

జానకికి పాదాభివందనం చేసి, తనతో తీసుకువచ్చిన పూలనూ, ఫలాలనూ పూజా మందిరంలో ఉంచి, పనులకు ఉపక్రమించింది సురభి. జానకి సురభినే తదేకంగా చూడసాగింది. నిర్మలంగా కన్పడే సురభిలోని చురుకుదనం, పనితీరు జానకిని ఆకర్షించినయ్! సురభి కుటీరమంతా శుభ్రం చేసి, జానకి తనతో తెచ్చుకున్న వస్త్రాభరణాలను ఒక వెదురు బుట్టలో జాగ్రత్త పరిచింది.

మరి కాసేపటికి జానకి ఆలోచనలు అయోధ్య, శ్రీరాముని మీదకు మళ్ళినయ్. తన జీవితంలో జరిగిన హఠాత్పరిణామానికి ఆమె నీరసించి పోయింది. ఏ విషయమూ ఆసక్తికరంగా అన్పించడంలేదు! అనాసక్తిగా కూర్చున్న జానకివైపు పలకరింపుగా చూసింది సురభి.

“సురభీ.. రా. ఇక్కడకు వచ్చి కూర్చో. పనులేమైనా ఉంటే మళ్ళీ చేసుకుందాం” అని జానకి అనడంతో, అటక పైనున్న దర్భల చాపను తెచ్చి పరచుకొని ఆమె ప్రక్కనే కూర్చొని, కొన్ని పండ్లను ఒలిచి పళ్ళెరంలో పెట్టి ఆమె ముందు ఉంచింది సురభి.

“నీ పేరు బాగుంది, సురభీ” అంది జానకి సురభితో మాటలు పెంచేందుకు. శ్రీరాముని వియోగంతో క్షోభకు గురవుతున్న ఆమెకు ఆ క్షణాన ఉపశమనం అవసరమైంది..

ఆమె పలకరింపు కోసం ఎదురుచూస్తున్న సురభికి ఆ మాటలు ఆనందాన్నిచ్చినయ్!

“నాకు ఈ పేరు పెట్టింది వాల్మీకి తాతగారేనట.. మీకు తెలుసా సురభి అంటే అర్ధం ఏంటో?” ఉత్సాహంగా అడిగింది సురభి.

జానకి నవ్వి ఊర్కొంది.

“మీకు తెలుసు. కదూ?” అడిగింది సురభి.

“నువ్వు చెప్పు సురభీ. నీ నోట వింటేనే బాగుంటుంది.”

“సురభి అనే గోవు వరుణదేవుని వద్ద ఉంటుందట. ఆ గోవు పాలనుండే క్షీరసాగరం కూడా ఏర్పడిందట! ఆ గోవు పేరే నాకు పెట్టారట!” ఒక క్రొత్త విషయం చెప్పేటప్పటి ఉత్సాహం సురభి గొంతులో.

“నీ నిర్మల వ్యక్తిత్వం, నీ అభిమానంకి తగిన పేరే అది. మీ తాతగారు నీ గురించి ఊహించే నిన్ను సార్ధకనామ ధేయురాలిని చేశారు”, ప్రశంసాపూర్వకంగా అంది జానకి.

“అదంతా నాకు తెలియదమ్మా. గోవులంటే మాత్రం ఎందుకో నాకు చాలా ఇష్టం!” కళ్ళు పెద్దవి చేసి చెప్పింది సురభి.

“అదంతా నాకు తెలియదమ్మా.. సురభి అంటే ఎందుకో తాతగారికి చాలా ఇష్టం” సురభిని అనుకరిస్తూ లేచివచ్చి, సురభిని లేపి హృదయానికి హత్తుకుంది జానకి. ఆమెకు సురభిని దగ్గరకు తీసుకోగానే అనిర్వచనమైన ఊరటనిచ్చే అనుభూతి కలిగింది. ఆ క్షణంలో సురభి అత్యంత ఆప్తురాలుగా అన్పించింది. సొంత బిడ్డను ముద్దాడినట్లు సురభిని ముద్దాడింది. సురభి నిశ్చేష్టురాలైంది అనుకోని ఆ పరిణామానికి. జానకి కన్నులు జలధి తరంగాలైనయి. సురభి భుజం, వీపుభాగం తడిసిపోతోంది. జానకి వెక్కిళ్ళు పెడుతోంది. సురభి ఆమె వీపుమీద నిమురుతోంది. జగన్మాతకే ఓదార్పు అవసరమైన సమయం అది. సురభి కళ్ళు చెమర్చినయ్! జానకి హృదయవేదన, ఘోష, సురభి మనసును తాకుతూ, తెలుస్తున్నాయ్.

తల్లి దురదృష్టాన్ని చేష్టలుడిగి చూస్తున్న బిడ్డ అయింది సురభి. తల్లి ఒడిని వీడదల్చుకోని బిడ్డలా హత్తుకు పోయింది జానకి సురభిని. సురభి బిడ్డని ఊరడించే తల్లి అయింది. జగన్మాత చిన్నపిల్లయి పోయింది. సురభి జగన్మాతకే మాత అయి ఊరడించిన క్షణం! ఆమెను పొదివి పట్టుకున్నయ్ సురభి చేతులు. కొద్దిసేపటికి జానకి గుండెభారం తగ్గింది. సురభి భుజాలమీద చేతులుంచి, అశ్రుధారలైన కళ్ళతో సూటిగా సురభి కళ్ళలోకి చూస్తూ చిరునవ్వు నవ్వింది. నీళ్ళు నిలిచిన కళ్ళతో సురభి ఆమెనే చూస్తోంది. జానకి నవ్వు చెక్కిళ్ళ దాకా సాగింది. సురభి ముఖంలోనూ నవ్వు పూసింది. ఇద్దరూ ఒకరిని చూసుకొని ఒకరు మైమరచి పోయారు. ఇద్దరి మనసులూ తేలిక పడినయ్. వారి మధ్య కొద్దిసేపటికే అనుబంధం పెనవేసుకు పోయింది. వదలబోతూ మరోసారి హత్తుకుంది జానకి సురభిని. అప్పుడు ఆమె జగన్మాత, ఆమె ఆలింగనంలో ఓ నిర్మల, నిస్వార్ధ ప్రాణి, గంగిగోవు లాంటి సురభి!

“మిమ్మల్ని చిన్నమ్మగారూ అని పిలవచ్చాండీ!” కౌగిలి సడలుతుంటే అడిగింది సురభి.

“పిలవచ్చు.. కానీ, గారూ అవసరం లేదు. అది మన మధ్య దూరం పెంచుతుంది. మనమంతా ఒక పరివారం! మీరే నా కుటుంబం. కాబట్టి – చిన్నమ్మా – అనే పిలువు.. ఆప్యాయంగా ఉంటుంది” చెప్పింది జానకి.

“అలాగే చిన్నమ్మా” చెప్పింది సురభి.

ఆ ఘటన వారిద్దరినీ చాలా దగ్గర చేసింది. సురభికి క్రొత్తగా వచ్చిన అతిథి జానకివద్ద బెరుకు పోయి, సొంత మనిషిలా అన్పించసాగింది జానకి చూపించే ఆప్యాయతకు.

***

ఆశ్రమానికి వచ్చిన వారం రోజుల్లోనే అక్కడి దినచర్యలకు అలవాటు పడింది జానకి. మనసును అయోధ్య మీద నుండీ, శ్రీరాముని మీద నుండీ మరల్చుకోవడానికి మునిపత్నులతో కూడి, పఠన పాఠనములలో ఎక్కువ సమయం గడపసాగింది.

జానకి సౌందర్యం, సౌశీల్యతా సురభిని ఎంతో ఆకట్టుకుంది. సురభి తనలో తాను అనుకుంది ఆశ్చర్యంతో -”తాతగారు రామాయణ కావ్యంలో సీతమ్మ గురించి వ్రాసిన గుణగణాలన్నీ ఈ సాధ్విలో కన్పిస్తున్నయ్ . ఈమే తాతగారి ఆలోచనల రూపం అన్పిస్తుంది. ఎంత యాదృచ్చికం!”

జానకి మనసు వ్యాకులతకు గురౌతున్నప్పుడు గుర్తించి సురభి ఆమెను ఆహ్లాదపరుస్తోంది. అందులో భాగంగా జానకికి ఆశ్రమ ప్రదేశాలూ, అందులోని అనేక పూలమొక్కలతో నిండిన సుమవనం; మరువం, మంచిగంధం, అగరు, హరిచందన, పున్నాగ, దేవదారు వృక్షములతో, సంపెంగ, మొగలి పొదలతో కూడిన సుగంధవనం; పక్షులూ, కుందేళ్ళూ, లేళ్ళూ, నెమళ్ళూ, సెలయేళ్ళూ, పద్మ, కమలములతో నిండిన తటాకాలు, ఊయలలు ఉన్న ఉద్యానవనం, అన్నింటినీ పరిచయం చేసింది సురభి. మెల్లమెల్లగా జానకి ఆ ఆశ్రమవాసులతో, పరిసరాలతో మమేక మవసాగింది. అందులో సురభి పాత్ర ప్రశంశనీయం!

జానకి దినచర్యలన్నింటికీ సురభి సహకారం అవసరమౌతోంది. దానిక్కారణం జానకికి గర్భవతిగా నెలలు నిండుతూండడం! కొద్దినాళ్ళకే సురభి, జానకి కుడిభుజమయింది! జానకి సురభిపై చూపించే ప్రేమానురాగాలూ, వాత్సల్యం ఆశ్రమ వాసులకు హర్షాతిశయాలను కలిగించసాగాయి!

***

నెలలు గడిచి, జానకి ప్రసవించే సమయం దగ్గర కొచ్చింది. వాల్మీకి మునిపత్నులను అప్రమత్తం చేశాడు. ఆమెకు సుఖప్రసవం జరిగేందుకు వారిని అన్ని జాగ్రత్తలూ తీసుకోమన్నాడు.

సురభిని పిలిచి “లోకపావని కనబోయేది ఒక్కరిని కాదు, ఇద్దరు మగబిడ్డలని” అని తెలిపాడు. ఇద్దరు పసిబిడ్డలకు కావలసిన వసతులు సిద్ధం చేయించాడు. సురభి, జానకి ఆరోగ్యాన్ని అనుక్షణం గమనిస్తూ, మునిపత్నులకు తెలియ చేస్తూన్నది.

ఒక శుభసమయాన జానకి ఇద్దరు మగపిల్లలకు జన్మనిచ్చింది. వాల్మీకి ఆ పిల్లలిద్దరికీ రక్షరేఖలు కట్టించి. పెద్దవాడి పేరు కుశుడు, చిన్నవాడి పేరు లవుడుగా ప్రకటించాడు. ప్రసవానంతరం, సురభి తన తల్లి గోమతీ ఇతర మునిపత్నుల సహాయంతో, దర్శకత్వంలో తల్లీ పిల్లలకు కావలసిన సదుపాయాలను సమయపాలనతో నిర్వహిస్తోంది. జానకికి పుట్టింటి, మెట్టింటి వారు లేని లోటు కన్పించనీయలేదు ఆశ్రమ స్త్రీలు.

ఒకరోజు సురభితో జానకి అన్నది “నేను నీకు భారీగా ఋణపడి పోతున్నాను, సురభీ! ఏ తల్లీ తన బాలింత కూతురుకు చేయలేనంత, బిడ్డ కాని బిడ్డవు నువ్వు నాకు చేస్తున్నావు. కార్యేషు దాసివై, భోజ్యేషు మాతవై నన్ను చూసుకుంటున్నావు సురభీ! నాదెంతటి అదృష్టమో, ఈ ఆశ్రమం నాకు పుట్టింటి లోటును తీరుస్తోంది.”

“ఆ అదృష్టం మాది చిన్నమ్మా! మీరు మా ఆశ్రమ అతిథిగా రావడం మమ్మల్ని అందర్నీ పావనం చేసింది. నేను చేస్తున్నదంతా మానవ సహజమైన సేవాధర్మం మాత్రమే!” చెప్పింది సురభి.

***

దినదిన ప్రవర్ధమానమౌతున్న కుశలవులు మునికుమారుల ఆహార్యంతో చూడముచ్చటగా ఉన్నారు. వారిరువురూ సురభికి చెరొక చేయి పట్టుకొని ఆశ్రమమంతా సంచరింస్తుంటే ఆశ్రమ వాసులందరికీ సంబరంగా, కన్నుల పండువగా ఉంటోంది. కుశలవులిద్దరూ తమ ప్రవర్తనతో ఆశ్రమవాసుల అభిమానాన్ని చూరగొన్నారు. సురభిని తోబుట్టుగానే భావిస్తున్నారు. తల్లి తర్వాత ఆ కవలలు ఎక్కువగా ఇష్టపడేది సురభినే. సురభి సంరక్షణలో సాన్నిహిత్యంలో వారికి ఎటువంటి లోపం, చింతా కలగదని జానకి విశ్వసించింది. సురభికి ఆటపాటలన్నీ వారితోనే, వారిని అలరించడం కోసమే.

ఒక వసంత కాలపు సాయంత్రం సురభి తల్లి గోమతి మెత్తగా నూరిన గోరింట ఆకును తెచ్చి ఇచ్చి వెళ్ళింది.

“చిన్నమ్మా.. మీకూ, తమ్ముళ్ళకు నేను పెడతాను చేతిలో” అంటున్న సురభితో, “నువ్వు పెడితే నీ చేయి అంతా అంటుకు పోతుంది. నేను పెడతాను మీ ముగ్గురికీ” అని కుశలవులకిద్దరికీ ఒక అరచేతిలో ఎక్కుపెట్టిన ధనుస్సు, మరో అరచేతిలో బాణాలతో నిండిన అంబులపొది అలంకరించింది గోరింటాకుతో జానకి.

అది చూసి “చిన్నమ్మా ఇదేంటి ధనుస్సా?” అడిగింది శబరి.

“అవును! శివధనుస్సు!”

“ఎంత బాగా వచ్చిందో! మీరు చూశారా శివధనుస్సు ఎప్పడైనా?”అడిగింది సురభి.

“చూశాను, చిన్నప్పుడు. ఏదీ నీ చేయివ్వూ,”అంటూ సురభి మరో మాట శివధనుస్సు మీద పెంచకుండా చేయి తీసుకుని గోరింటాకు పెట్టసాగింది జానకి. ఆమె గతం గురించి అడగనని తాతగారి కిచ్చిన మాట జ్ఞప్తికి వచ్చిన సురభి మరి ఆ సంభాషణను పొడిగించలేదు!

కొద్దిసేపటికి సురభికి ఒక అరచేతిలో పూలతలు వ్రేళ్ళ చివరి వరకూ ప్రాకుతూ, మరో అరచేతిలో వికసించిన మందార పువ్వూ తీరినయ్! చేతులు చూసుకొని మురిసిపోతున్న సురభితో, “ఈ గోరింట రేపటికి నీ అరచేతిలో మందారంలా పూస్తుంది. దానర్ధమేంటో తెల్సా?” అని అడిగింది జానకి.

సురభి చెక్కిళ్ళు ఎర్రబడ్డాయి, మంచి మొగుడొస్తాడన్న నానుడి స్ఫురించడంతో! సిగ్గుల మొగ్గైన సురభిని హృదయానికి హత్తుకుంది జానకి.

***

చూస్తుండగానే కుశలవులు విద్యాభ్యాసానికి అర్హులయ్యారు. వారికి ఒక శుభముహూర్తాన వాల్మీకి అక్షరాభ్యాసం చేయించి, విద్యాభ్యాసానికీ, విలువిద్య నేర్పడానికీ ఇద్దరు యోగ్యులైన గురువులను నియమించారు.

కవలలైన వారి రూపలావణ్యం, కౌశలం అందర్నీ ముగ్ధుల్ని చేసేవి. కుశలవులను అత్యంత శ్రద్ధాశక్తులతో బుద్ధిమంతులుగా తీర్చిదిద్ధడంలో జానకికి సురభి చేదోడు వాదోడుగా ఉండేది. వారి కురులను తీర్చి, ముడివేసి మునికుమారుల ఆహార్యంలో తీర్చిదిద్దేది సురభి. ఆశ్రమవాసుల అందరి వివరాలూ పేర్లతో, కుటీర వివరాలతో సహా స్ఫురద్రూపులైన కుశలవులు అవగతం చేసుకున్నారు. వయసుకుమించిన వారి ప్రజ్ఞ చూసి వాల్మీకి మహర్షి, తను రచించిన రామాయణాన్ని వారిచేత గానం చేయించాలని నిర్ణయించుకున్నాడు. కుశలవులు రామాయణ కావ్యాన్ని వాల్మీకి దార్శనికతలో రాగ భావయుక్తంగా, అర్ధవంతంగా పలకడం, వల్లె వేయడం చేయసాగారు. ఆ సాధనను సురభి సంబరంగా చూసేది.

***

పెరగటమే తప్ప తరగటం లేని వయసు, సురభిని పెళ్ళీడుకు దగ్గర చేసింది. ఆ మాటే వాల్మీకితో సురభి తల్లిదండ్రులు ప్రస్తావించడంతో ఆయన సురభికి పెళ్ళి ప్రయత్నాలకు సమ్మతించాడు. అనుకున్న కొద్దికాలంలోనే సురభికి మంచి సంబంధం వచ్చింది. వరుడి వివరాలు తెలుసుకున్న వాల్మీకి, అతనితో వివాహబంధం సురభికి మంచి జీవితాన్నిస్తుందని గ్రహించి, ఆమోదించాడు.

సురభి తల్లిదండ్రులు జానకికి సురభి పెళ్ళి విషయం తెలియజేశారు.

“మమ్మల్ని వదలి వెళ్ళిపోతున్నావంటే నమ్మబుద్ధి అవడం లేదు సురభీ! నా భర్త తర్వాత నాకు అత్యంత స్నేహశీలిగా అన్పించింది, సంచరించిందీ నీవే! ఈ వివాహం నీకు అన్నివిధాలా శుభాన్ని కల్గిస్తుంది. నీ వినయం, వినమ్రతా నీ అత్తమామలను సుఖపెడుతుంది. నీ స్నేహం నీ భర్తకు ఆనందదాయకమౌతుంది. నీ ప్రేమానురాగాలు, వాత్సల్యగుణం, జ్ఞానం నీ సంతానానికి పెన్నిధి అవుతాయి”అని దీవించి,” వరుడిది ఏ దేశం?” అడిగింది జానకి సురభిని.

“మిథిల! చిన్నమ్మా.. ఎప్పడైనా సీతామ్మవారు అక్కడకు వస్తే చూసే భాగ్యం కలగచ్చు!” కళ్ళలో ఆనందం కనిపించింది చెబుతున్నప్పుడు.

జానకి అవాక్కైంది. తను పుట్టిన దేశం తనకు ప్రీతిపాత్రమైన సురభికి మెట్టిన దేశమౌతోంది! ఆ ఆలోచన ఆమెను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది! అంతలోనే తేరుకొని “నీకు శుభం కలుగుగాక! నీవు అదృష్టవంతురాలివి! నీకు అంతా మంచే జరుగుతుంది” అని పలికింది.

“కుశలవులకు దూరమై ఉండలేనన్పిస్తోంది చిన్నమ్మా!”

“వివాహబంధం పెనవేసుకుపోతుంటే ఆడపిల్ల, తల్లిదండ్రులనే మర్చిపోతుంది. ఇంక తోబుట్టువులు, స్నేహితులు ఎంత? ఆపై సంతానం కలిగాక భర్త ధ్యాస కూడా తగ్గిపోతుంది. సురభీ.. నేను నీకొక ఋణం తీర్చుకోవాలి. ఆ అవకాశం నాకిస్తావా.”

“ఏమిటది చిన్నమ్మా?”

“నీ తొలికాన్పు నా చేతుల మీదగా జరగాలి” సురభి భుజంమీద చేతులు వేస్తూ చెప్పింది జానకి.

“తప్పక చిన్నమ్మా! నేనెంతటి అదృష్టవంతురాలిని!” చెమర్చిన కళ్ళు, ఎరుపెక్కిన బుగ్గలు, పులకించిన హృదయంతో సురభి పలికింది.

తను ఆశ్రమవాసానికి వస్తున్నప్పుడు తెచ్చిన ఆభరణాలను, మేలిమి వస్త్రాలనూ సురభి ముందుంచి, “ఇవి అన్నీ నీకే సురభి. నీ సంసార జీవితానికి ఉపకరిస్తాయి. నా బిడ్డలాంటి దానవు, చిన్నమ్మ కానుక ఇవి నీకు. కాదనక గ్రహించు” చెప్పింది జానకి.

అశ్రుపూరితమైన నయనాలతో జానకిని హత్తుకుంటూ, “చిన్నమ్మా! మీ హృదయంలో నా కిచ్చిన స్థానం ముందు ఇవేవీ సరితూగవు. అదే నాకు గొప్ప సంపద. అది అలానే పదిలంగా ఉంటే చాలని కోరుకుంటున్నానమ్మా!”.

“ఇప్పుడు నా జీవితంలో నాకు ఆప్తులు కుశలవులూ, నీవేనమ్మా! వేరెవరూ లేరు. నేను జీవించి ఉన్నంతకాలం ఇందులో మార్పు ఉండదు!” సురభిని అనునయిస్తూ చెప్పింది జానకి.

మళ్ళీ ఆమే “వివాహితవు కాబోతున్నావు, నీకు ఒక మాట చెప్పాలి.”

“చెప్పండి చిన్నమ్మా”

“నీ భర్త నుండి నిన్ను వేరుచేసే, దూరంచేసే ఎటువంటి కోరికనైనా, తెలిసి అయినా తెలియక అయినా కోరుకోకు. అంత దుర్భరమైన కోరిక సతికి ఏ సుఖాన్నీ ఇవ్వదు! భర్త ఇష్టంగా తీర్చినా, అయిష్టంగా తీర్చినా అది ఆ భార్యకు కష్టాన్నే తెస్తుంది!” గద్గదిక కంఠంతో తన అనుభవాన్ని సూటిగా మనసులో నాటుకు పోయేలా చెప్పింది జానకి.

***

మరో నెల రోజులకే సురభి వివాహం జరిగి మిథిలలోని అత్తవారింటికి వెళ్ళింది. కాలాలూ, ఋతువులూ, సంవత్సరాలూ మారుతున్నయ్. పరుగు పెట్టినట్టుగా ఆరు వసంతాలు గడిచిపోయినయ్. సురభికి సంతాన భాగ్యం కలగలేదు.

వాల్మీకి ఆశ్రమంలో కుశలవులు వాల్మీకి విరచిత రామాయణ కావ్యాన్ని సుస్పష్టంగా, శ్రావ్యంగా, శ్రుతి శుద్ధంగా ఆలపిస్తున్నారు. విన్నవారు రామాయణాన్ని ప్రత్యక్షంగా వీక్షించినంతగా అనుభవించసాగారు.

వాల్మీకి సలహాపై, సంతాన సాఫల్యం కోసం పూజలు నిర్వర్తించుకోడానికి సురభి, ఆశ్రమానికి వచ్చింది. అక్కడ కుశలవుల రామాయణ గాన ప్రదర్శన చూసి ముగ్ధురాలైంది. ప్రక్కనే ఉన్న జానకితో “నాకూ కుశలవుల వంటి సంతానమే కలిగేలా దీవించు చిన్నమ్మా. కవలలే కావాలి.” అన్నది సురభి.

జానకి సంతోషంతో “నీ కోర్కె నెరవేరాలని నేనూ కోరుకుంటాను” చెప్పింది. పూజల అనంతరం సురభి తిరిగి మెట్టినింటికి వెళ్ళింది.

***

రెండు నెలల తర్వాత ఒక రోజు సూర్యాస్తమయ వేళ..

“సురభీ .. విను! అమ్మా.. నాన్నా.. మీరూ వినండి. ఈరోజు మిథిలా నగరంలో ఏ నోట విన్నా ఈ మాటే! శ్రీరామచంద్రుని భార్య సీతాదేవి నిన్న భూమాతలో ఐక్యమైపోయిందట” వడివడిగా నడుచుకు వచ్చిన సురభి భర్త చెప్పాడు.

“అయ్యో!!” ఆశ్చర్యంతో అంది సురభి అత్తగారు.

“ఇంకా చాలా చెబుతున్నారు నాన్నగారు! సీతమ్మ ఎవరో కాదు, ఇన్నాళ్ళూ వాల్మీకి తాతగారి దగ్గర ఉన్న చిన్నమ్మేనట, కుశలవులు.. ఆ సీతారాముల సంతానమట!” ఏకధాటిగా విన్నది చెప్పాడు సురభి భర్త.

అతని చివరి మాటలను విన్న సురభి ఒక్కసారిగా కాళ్ళ క్రింది భూమి కృంగిపోయినట్లు నేల మీదకు ఒరిగిపోయింది. వైద్యసేవల అనంతరం ఆమె స్పృహలోకి వచ్చింది. “సురభి ఆరోగ్యం జాగ్రత్త. ఆమె తల్లి కాబోతోంది” వెళ్తూ చెప్పాడు వైద్యుడు.

పొంగుకొస్తున్న దుఃఖంతో మదిలో రేగుతున్న భిన్న ఆలోచనలు సురభిని కల్లోలం చేస్తుంటే భర్తతో అన్నది —

“ఆ భగవంతుడు నాకెంతటి అదృష్టాన్ని ప్రసాదించాడు!! సాక్షాత్తూ శ్రీమహాలక్ష్మికి సేవలందించే భాగ్యం!! కానీ నా అదృష్టాన్ని తెలిసి అనుభవించలేని పరిస్థితి కల్పించాడే!! నేనెంతటి దురదృష్టవంతురాలిని!!

సీతా మహాసాధ్వికి అత్యంత చేరువలో, శ్రీరాముడూ ఆ కుశలవుల తర్వాత, అంతటి భాగ్యాన్ని పొందిన దానిని నేనే! అదంతా ఓ గతంగా నన్ను వేధిస్తుంది – వర్తమానంగా, తెలిసి పొందనిదీ!

ఆ లోకపావని తల్లిగా రూపుదిద్దుకుంటున్న సమయంలో ఆమె సహచరిని! రామరాజ్య వారసులను లాలించి, జోలపాడి నిదురింప చేసిన దానిని. ఆ బిడ్డల తండ్రి శ్రీరాముడు కూడా నోచుకోని, కుశలవుల బాల్య వినోద చేష్టలు కళ్ళారా చూసినదాన్ని! కోరినా దొరకని వరాన్ని చెయ్యారా అనుభవించినదాన్ని! అమృతతుల్యమైన ఆ రోజులు నాకు, – సేవించినది మహాప్రసాదమని, సేవించిన పిదప తెలుస్తున్న మాదిరివి! తెలిసి సేవించ లేకుండడం శాపమా? దురదృష్టమా?

వాల్మీకి తాతగారు నాపై ఎంతటి కరుణను కురిపించారు!! వారి ఋణం ఏ జన్మకూ తీర్చుకోలేనిది! అయినా వెళ్ళి అడగాలని ఉంది – ఆ లోకపావనే సీతాదేవి అని తెలిసి నాకెందుకు చెప్పలేదు? – అని!

నా మనస్సెందుకు ఇంత బరువెక్కుతోంది? ఇంత వేదనకు గురౌతోంది. అయ్యో! ఆమెను సీతాదేవి అని తెలిసిన పిదప సేవించుకోలేక పోతున్నానే! కనీసం చూడలేక పోతున్నానే!

ఆమె ఔన్నత్యానికి పాత్రురాలినయ్యాను. ఆమెతో సహజీవనంలో నాపై చూపిన ప్రేమలో ఎంత అందమైన ప్రపంచం దొరికింది!” సురభి కన్నీరు మున్నీరవుతో అన్నది.

“సురభీ! నీ వేదన నేను అర్థం చేసుకోగలను. కానీ నీ ఆరోగ్యం దృష్ట్యా ఆ విషయం ఎక్కువ ఆలోచించకు” చెప్పాడు ఆమె భర్త.

“సురభీ.. ఊరడిల్లు. ఇప్పుడు నీ ఆరోగ్యం ముఖ్యం.. నీకే కాదు! నీలో ఊపిరి పోసుకుంటున్న బిడ్డకు కూడా!” చెప్పింది అత్తగారు.

సురభీ, నీ తొలి కాన్పు నా చేతుల మీదగా జరగాలి!! – గతంలో పరమ పావని అన్న మాటలు జ్ఞప్తికి వచ్చి “చిన్నమ్మా! నేనూ, నాకిచ్చిన మాట ఎందుకు గుర్తురాలేదు నీకు “పుడమి వైపే తదేకంగా చూస్తూ పలికింది సురభి! భర్త ఆమెను అనునయించగా తేరుకుని, చేతిని తన ఉదరం ఉంచుకొని, భర్తతో అన్నది సురభి “మనకు ఆడపిల్లే పుట్టాలండీ”.

“అదే కోరుకుందాం” చెప్పాడు భర్త.

సురభీ, ఆమె భర్తా ఒకేసారి అన్నారు “ఆ బిడ్డ పేరు – చిన్నమ్మ!”

(సమాప్తం)

Exit mobile version