[అశ్వని పెమ్మరాజు గారు రచించిన ‘చేయూత’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
“అబ్బే ఈ పెద్ద పెద్ద గుళ్లలో పంతుళ్ళకి అసలు బుద్ది ఉండదు అండి, ఆ మాటకి వస్తే అసలు ఈ అయ్యోరులు అందరూ ఇంతే. ఏదో ఒక పేరు చెప్పి మాటల గారడి చేస్తారు” గుడిలో నుండి బయటకు వస్తూ అన్నాడు బుచ్చిబాబు.
ఆ మాటలు విన్న గోపాలంకి కాస్త ఇబ్బందిగా అనిపించింది. “వాళ్ళు నిన్ను ఏమి చేశారు బాబు” అన్నాడు ఆశ్చర్యంతో.
“పెద్ద గుడి లోకి వెళ్తే ప్రతి సారి ఆ కారణం ఈ కారణం చెప్పి డబ్బులు అడుగుతారు, మళ్ళీ మాట్లాడితే వాళ్ళ కష్టాలు చెప్తారు, మనకి అయేవో దోషాలు ఉన్నాయి, పూజ చేయించుకో. హోమం చేయించు అని చెప్పేసి భయపెట్టి చంపేస్తారు.”
“ఓహో ఆదా నీ బాధ! గుడిలో అర్చకులు కూడా మనలాంటి మనుషులే. వాళ్ళకి చాలా వరకు జీతభత్యాలు కూడా ఉండవు, నీకు ఒక రెండు నెలల జీతం రాకపోతే ఎలా ఉంటుంది నీ పరిస్థితి” అని ఆపి బుచ్చిబాబు కేసి చూసాడు.
“అమ్మో చాలా కష్టం అయిపోతాది. అదేంటి అలా అడిగావు” అన్నాడు బుచ్చిబాబు అయోమయంగా.
“నీకు రెండు నెలలు జీతం రాదు అనే ఊహ భయం వేస్తే చిన్నప్పటి నుండి వేదాలు, మంత్రాలు నేర్చుకుని మన అందరికి మంచి జరగాలి అని ఆశీర్వదించే వాళ్ళను, అదే జీవనోపాధిగా బ్రతుకుతున్న వారిని కనీస జీతం ఉండదు, రేపటి రోజున ఈ గుడిలో పని దొరుకుతుందా అనే నమ్మకం ఉండదు. ఎందుకంటే వీరిలో చాలామంది దేవాదాయ శాఖ పరిధి లోకి రారు, గుడిలో అజమాయిషీ మొత్తం ఒక ట్రస్ట్ నడుపుతుంది, వారు చేసే వృత్తికి మర్యాద ఇవ్వకుండా రోజు మనం వేసే చిల్లర కోసం అర్రులు చాచే పరిస్థితి తీసుకురావడం మన ప్రభుత్వాల తప్పు. అలాగే ప్రతి పౌరోహిత్యం చేసే వారిని తూలనాడడం మన తప్పు. మన ఇంట్లో మంచి, చెడు జరిగినప్పుడు ఏమి చెయ్యాలి, ఎలా నడుచుకుంటే దాని ప్రభావం ఎలా ఉంటుందో కేవలం నీ నక్షత్రం చూసి గ్రహబలం లెక్క వేసి చెప్పేది – నువ్వు ఇచ్చే పప్పు బియ్యం చిల్లర కోసం కాదు, నీ ఇంటి బాగు కోసం.. అలాగే ఏదైనా దేవాలయంలో నీకై నువ్వు వెళ్లి సమస్య చెప్తే తగిన పరిష్కారం చెప్తారు..
మన పరిస్థితి ఎలా తయారయ్యింది అంటే పెద్ద క్షేత్రాలలో వాళ్ళ పాటికి వాళ్ళు తీర్థ ప్రసాదాలు ఇచ్చి పంపిచేస్తే కనీసం స్థల పురాణం చెప్పలేదు అని అంటాం, పోనీ అని అన్ని చెప్పి ఇక్కడ ఇలాంటి కోరిక కోసం ఇలా చెయ్యండి అని సలహా ఇస్తే చీదరించుకుంటాం..
వాళ్ళకి కనీస మర్యాద ఇవ్వము, ఇష్టం వచ్చినట్లు హేళన చేస్తాం. ఇంకొందరు ప్రబుద్దులు ఈ పూజ గంటలో అయిపోవాలి, మాకు తలకు మించిన పనులు ఉన్నాయి అని వాళ్ళకి టైం చెప్తారు. లక్షలు తగలేసి అలంకరణ, బట్టలు, తిండి కోసం ఖర్చుపెట్టి గుడిలో అర్చకుడి పళ్లెంలో పది రూపాయలు వేసి దానికి మళ్ళీ వాళ్లనే చిల్లర అడుగుతారు. చాలా ఆలయాల్లో ఇలా పళ్లెంలో వేసిన చిల్లరే వాళ్ళ ఇంట్లో తిండిగింజలు అవుతాయి. ఇదివరకు ప్రతి పండగకి అందరూ వెళ్లి స్వయంపాకం ఇచ్చేవారు. అది పుచ్చుకుని ఆయన మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తే ఇల్లు ఎత్తరిల్లుతుంది అని నమ్మకం. ఇప్పుడు మనం గుడికి వెళ్ళడమే అరుదు, అదేదో గుడికి దేవుడి మెప్పుకోసం వెళ్లినట్టు పండగకి పబ్బానికి వెళతాం. పట్టుమని పది నిముషాలు కూర్చోము, అక్కడకి వెళ్లి ఫోన్ లోనే ఉంటాం అదేదో దేశం మన మీద ఆధారపడి నడుస్తున్నట్టు” అని బుచ్చిబాబు కేసి చూసాడు.
“అంటే నువ్వు అనేది రోజు గుడికి వెళ్లి, పురోహితుల పళ్లెంలో చిల్లర వేసి రావాలా.. ఇంకా నయం జీతంలో వాటా ఇవ్వాలని అనలేదు” అన్నాడు బుచ్చిబాబు హేళనగా.
“నిన్ను రోజు గుడికి వెళ్ళమని నేను అనలేదు కానీ వెళ్ళినప్పుడు దైవం మీద భక్తితో వెళ్ళాలి. అక్కడ నీ గొప్పలు చెప్పక్కర్లేదు. దేవుడికి తెలియదా మన బ్రతుకు ఏంటో, అర్చకుడికి నీ జీతంలో వాటా ఇవ్వక్కర్లేదు కానీ కూరగాయల సంతలో బేరం ఆడినట్టు ఆయన దగ్గర చిల్లర వ్యవహారం చెయ్యకుండా ఉంటే అదే చాలు.. నీ కుటుంబం చల్లగా ఉండాలని కోరుకునే వ్యక్తి ఇంట్లో కనీసం పొయ్యిలో పిల్లి లేస్తోందా, పిల్లలు వృద్ధి లోకి వస్తున్నారా కనుక్కునే కనీస ధర్మం మనకి ఉండాలి కదా.
నీకో సినిమా నచ్చితే పది మందికి చెప్తావు, ఒక వస్తువు కొంటే సోషల్ మీడియాలో ఎలుగెత్తి అరుస్తావు. మరి ఒక అయ్యవారు చెప్పిన పూజ చేస్తే దాని ద్వారా మంచి జరిగితే నలుగురికి ఎందుకు చెప్పవు? ఆయనకి నాలుగు కుటుంబాలను ఎందుకు పరిచయం చెయ్యవు? నీకు తెలిసిన చోట వారి పిల్లలకు పని ఎందుకు ఇప్పించకూడదు.. చాలా వరకు బ్రాహ్మణ కుటుంబాల వారు ఈ బాధలు పడలేక పౌరోహిత్యం వదిలేసి చిన్నదో చితకదో ఉద్యోగం చేసుకుందాం అని ఆ వృత్తినే వదిలేస్తున్నారు. ఇలాగే జరిగితే రేపు మన పిల్లల్ని నూరేళ్లు చల్లగా బ్రతకండి అని వేదం చదివి ఆశీర్వదించేవారు కరవు అవుతారు. ఎదుటి వాడికి సాయం చెయ్యాలంటే ఖర్చు కాదనను కానీ మాట సాయంకి ఖర్చు ఉండదుగా.. కానీ నువ్వు చేసే ఆ ఒక్క మాట సాయం వాళ్ళ కుటుంబం నిలబడొచ్చు.. ఇది నీ గురించి నేను చెప్పట్లేదు. మన అందరం చేస్తున్న పొరపాటు ఇది” అన్నాడు గోపాలం.
“నువ్వు అన్నది నిజమే గోపాలం. నీ ఆలోచన చాలా బావుంది. నేను కూడా ఆచరణ మొదలు పెడతా. నిజమే పాపం వాళ్ళ ఇబ్బంది ఎవరితో చెప్తారు? మన లాగా ఆఫీస్‌లు ఉండవు, యూనియన్‌ల ఊసే ఉండదు. ఈ రోజు ఈ గుడి, రేపు మరెక్కడో. ఆ ఊహే ఎంత కష్టం కదా.. వాళ్ళ కష్టాన్ని నాకు తెలియజెప్పావు, అవకాశం ఉన్నంత వరకు ఇక మీదట ఇష్టంగా సాయం చేస్తా..” అన్నాడు బుచ్చిబాబు.
పెమ్మరాజు అశ్విని, వృత్తి రీత్యా అకౌంటెంట్. ప్రవృత్తి రచనలు చెయ్యడం. చుట్టూ వున్న సమాజంలో జరిగే ఏదైనా ఒక అంశం మనుషుల మీద దాని ప్రభావం గురించి విశ్లేషించడం, ఆ పాత్రల ద్వారా తోచిన పరిష్కారం చెప్పించే ప్రయత్నం చేస్తుంటారు.