Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘చెట్లతో చెలిమి’ పుస్తకావిష్కరణ సభ – నివేదిక

రసం (నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం) ఆధ్వర్యంలో డా. కందేపి రాణీప్రసాద్ రచించిన బాలల సైన్స్ వ్యాసాల సంపుటి ‘చెట్లతో చెలిమి’ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని స్థానిక యం.సి.ఏ(MCA) భవన్, దేవుడు చెరువు రోడ్డు నందు ఆదివారం ఉదయం పది గంటలకు.. నరసం రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు తేళ్ల అరుణ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.

డ్వామా జిల్లా విజిలెన్స్ అధికారిణి శ్రీమతి పాకల ఝూన్సీరాణి చేతులు మీదుగా ఈపుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజలకు మేలు చేసే చెట్లు గురించి చక్కని విజ్ఞానదాయకమైన, బాలలకు ఉపయోగపడేలా వ్యాసాలను రాసి పుస్తక రూపంలో తీసుకురావడం చాలా సంతోషంగా ఉందని రచయిత్రిని అభినందించారు.

ముఖ్య అతిథిగా పాల్గొన్న నాగభైరవ సాహిత్య పీఠం అధ్యక్షులు డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ మాట్లాడుతూ మానవ మనుగడకు, జీవవైవిధ్యానికి ప్రధాన కారణమైన చెట్ల గురించి రాణీ ప్రసాద్ రాసిన వ్యాసాలు అందరికీ ఎంతో విలువైన సమాచారాన్ని అందిస్తాయని తెలిపారు.

నరసం గౌరవాధ్యక్షురాలు శ్రీమతి తేళ్ళ అరుణ  మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణానికి చెట్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, ప్రకృతి ఉత్పత్తులలో ఔషధాలుగా ఉపయోగించే అనేక రకాల చెట్లు గురించి రాణీ ప్రసాద్ మనకు వ్యాస సంపుటి రూపంలో అందుబాటులోకి తీసుకురావడం చాలా గొప్ప విషయం అని పేర్కొన్నారు.

పుస్తక రచయిత్రి రాణీ ప్రసాద్ మాట్లాడుతూ ఈ పుస్తకం తన 50వ రచనని, తన తండ్రి సుందరాచారి చీరాల ప్రాంతంలో గొప్ప కవియని, ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న తాను అరుదైన చెట్లు గురించి రాశానని, అలా రాసిన వ్యాసాలనే ఈ పుస్తకంగా తీసుకుని రావడం జరిగింది అని తెలిపారు.

ప్రరవే జాతీయ కమిటీ సభ్యురాలు శ్రీమతి పి.రాజ్యలక్ష్మి పుస్తకం గురించి,అందులో ఉన్న వ్యాసాల గురించి సంక్షిప్తంగా చక్కటి సమీక్షనందించారు. విశిష్ట అతిథులుగా పాల్గొన్న కళామిత్రమండలి (తెలుగు లోగిలి) సంస్థ జాతీయ అధ్యక్షులు డా నూనె అంకమ్మరావు, శ్రీకృష్ణదేవరాయ సాహిత్య సాంస్కృతిక సేవా సమితి అధ్యక్షులు కుర్రా ప్రసాద్ బాబు ఎక్స్ ఎంపీపీ నాళం నరసమ్మలు రచయిత్రిని ఈ సందర్భంగా అభినందించారు.

అనంతరం ఆహ్వాన ‘కవి సమ్మేళనం’ జరిగింది.తర్వాత అతిథులను, కవులను ఘనంగా సత్కరించారు.ఈ సభలో పిన్ని వెంకటేశ్వర్లు బీరం అరుణ, గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్, ప్రజానాట్యమండలి షరీఫ్ యం.సూర్యకుమారి, తన్నీరు బాలాజీ, మిడసల మల్లికార్జునరావు, పరాంకుశం కృష్ణవేణి, శ్రీరామచంద్రుని లక్ష్మీ, డి.వి.యస్.రామాచార్యులు, గుంటూరు సత్యనారాయణ, నూకతోటి శరత్ బాబు, చుండూరి శ్రీనివాసరావు, ఓరుగంటి ప్రసాద్, యన్.లక్ష్మీ నాంచారమ్మ, బండారు సునీత, పి.భాస్కర్, కందుల మధు, నిమ్మల వెంకయ్య, పాలూరి శివ ప్రసాద్, మొగిలి దేవప్రసాద్, చల్లా నాగేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.

ఈ సభలో ఇటీవలే ప్రమాదవశాత్తు మరణించిన రచయిత్రి శాంత లక్ష్మికి నరసం తరఫున నివాళులర్పించారు. సభకు బీరం అరుణ వందన సమర్పణ చేశారు.

Exit mobile version