[బాలబాలికల కోసం చెట్ల పొడుపు కథలు అందిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్.]
1.
నేల దుప్పటి కింద మట్టిలో మొద్దునిద్ర
సూర్యుడొచ్చి లేపినా ముసుగు తీయలేదు
వానొచ్చి నెత్తిన నీళ్ళు కుమ్మరించగానే
ఒళ్ళు విరుచుకుంటూ తల బైట పెట్టింది.
2.
ఇది నేలలో మొలుస్తుంది
పేరులో జంతువు, వస్తువు
జంతువేమో విశ్వాసం కలది
వస్తువేమో వానకు తడవనివ్వదు
3.
ఆకారమేమో వెజిటేరియన్
తినేదేమో నాన్ వెజిటేరియన్
4.
కాయగా ఉండగా పుల్లని పులుపు
ఆంధ్రుల ఆవకాయగా పేరు మార్పు
పండితే మధురాతి మధురం
పండ్లకే రారాజుగా రూపాంతరం
5.
వేసవి కాలపు పువ్వులు
తెల్లని తెలుపు పువ్వులు
పూలజడలకు క్వీన్
ఎవరీ ఎవర్ గ్రీన్
6.
బురదలో పుట్టింది
లక్ష్మి దేవికి నెలవైంది
సూర్యకిరణాల తోనే
కళ్ళు విప్పుతుంది
7.
అమ్మ రంగేమో పచ్చని పసిమి
మరి పిల్లలేమో నల్లని మసి
8.
ఆకుపచ్చని పొలంలో
మొత్తని తెల్లని జున్ను
మధ్యలో నల్ల దిష్టి బొమ్మలు
వీరంతా ఎవరు పిల్లలూ!
9.
రంగేమో మేలిమి బంగారం
రుచేమో మధురాతి మధురం
విరగ కాసేదేమో వేసవి కాలం
10.
ఇది పువ్వే గానీ
ఆకుపచ్చగా ఉంటుంది
ఒళ్ళంతా ఘాటైన
సెంటు కొట్టు కుంటుంది.
11.
పువ్వులన్నీ సువాసన సిస్తాయి
కానీ ఈ పువ్వు బట్టలనిస్తుంది.
12.
కాశ్మీరీ సుమబాల
తల్లో పెట్టుకోలేము
తినటాటికి మాత్రమే
13.
నేను చాలా పొడువుగా ఉంటాను
నా ఆకులతో ఇళ్ళు కప్పుకుంటారు
నా పాలు త్రాగి మత్తుగా పడిపోతారు
నా పేరేంటో చెప్పరా చిన్నారులూ!
14.
పేదవాడి పేస్టు
ఉగాది చెట్టు
క్రిముల ఆటకట్టు
ఎవరో చెప్పు కిట్టూ
15.
నా కడుపు నిండా నీళ్ళుంటాయి
నన్ను దేవుడికి బలిస్తారు
నేలక్కొట్టి కొరుక్కుతింటారు
~
జవాబులు:
1. విత్తనం 2. కుక్కగొడుగు 3. కీటకాహరి మొక్క 4. మామిడికాయ 5. మల్లెపూవు 6. తామర 7. బొప్పాయి 8. సీతాఫలం 9. మామిడి 10. సంపెంగ 11. పత్తి పువ్వు 12. కుంకుమ పువ్వు 13. తాటి చెట్టు 14. వేప 15. కొబ్బరి కాయ
డా. కందేపి రాణీప్రసాద్ MA, MSc, PHD, బాల సాహితీ వేత్త, కవయిత్రి, అనువాదకులు, చిత్ర కళాకారిణి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట మహిళా పురస్కారం అందుకున్నారు. తెలుగు విశ్వ విద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్నారు. రాణీ ప్రసాద్ ఆర్ట్ పేరుతో హాస్పిటల్ వేస్ట్‌తో 4000 బొమ్మలను సృష్టించారు. బాల సాహిత్యంలో 48 పుస్తకాలు రచించారు. ‘తెలుగు బాల సాహిత్యంలో సైన్స్ రచనలు’ అనే అంశంపై నాగార్జున విశ్వవిద్యాలయంలో పరిశోధన చేశారు. తెలుగు విశ్వ విద్యాలయంలో బాల సాహిత్య కీర్తి పురస్కారాన్ని నెలకొల్పారు. మిల్కీ మ్యూజియం, స్వీటీ చిల్డ్రన్ లైబ్రరీ లను తమ ఆసుపత్రిలో పిల్లల కోసం నిర్వహిస్తున్నారు. తమ సొంత ఆసుపత్రిలో ప్రిస్క్రిప్షన్ పాడ్ మీద పిల్లల కోసం తెలుగు పాట, బొమ్మ పెట్టి ప్రింట్ చేస్తున్నారు. సైన్సు, యాత్రా సాహిత్యం విరివిగా రాస్తున్నారు. కళాభారతి, కవిత వాణి, చిత్ర కళారాణి అనే ఎన్నో బిరుదులను, 6 వరల్డ్ రికార్డ్స్నూ సొంతం చేసుకున్నారు.