Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చేసిన కర్మము చెడని పదార్థము!

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన సరస్వతి కరవది గారి ‘చేసిన కర్మము చెడని పదార్థము!’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

సాయం సంధ్య సమయం. సూర్యుడు పూర్తిగా పడమటి కొండల్లోకి జారిపోలేదు కానీ కిరణాల తీక్షణత తగ్గింది. పార్క్‌లో భర్తతో కలిసి నడకకు వచ్చిన సావిత్రి, నాలుగడుగులు ముందు నడుస్తోందల్లా ఆగింది. గమనించనేలేదు! కుమార్‌ని ఎవరో పలకరించినట్లున్నారు. ఆగి వాళ్ళతో మాట్లాడుతున్నాడు.

సావిత్రి, సూర్యకుమార్ ఆరుపదుల వయసును దాటిన దంపతులు. ఇద్దరూ మంచి ఉద్యోగాలు చేసి మూడేళ్ళ తేడాతో పదవీ విరమణ చేశారు. ఇద్దరూ ఉద్యోగంలో ఉండగానే మంచి కుర్రాడితో కూతురు పెళ్ళయ్యి పోయింది. కుమార్ పదవీ విరమణ చేయగానే సొంత గూడు ఏర్పరచుకోవటానికి తీసుకున్న లోన్ రిటైర్మెంట్ డబ్బులతో కట్టేసి, సావిత్రి పదవీ విరమణ చేయగానే వైద్యానికి, ఇతర అవసరాలకి కొంత మొత్తం అట్టిపెట్టుకుని, మిగిలిన డబ్బులు కొడుకుకిచ్చేసి ఊపిరి పీల్చుకున్నారు. సావిత్రి ఉద్యోగపర్వం కూడా ముగియటంతో, ఇతర బాధ్యతలేవీలేని వాళ్ళు ఓ నెలరోజుల క్రితమే సొంత గూటికి చేరుకున్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసే కొడుకూ కోడలూ వీళ్లతోనే ఉంటున్నారు. ఒక మనవడు. కలతలు లేని కుటుంబమనే చెప్పుకోవచ్చు.

మాటలు పూర్తి చేసుకుని భార్య దగ్గరకి వచ్చి, ఆమె చేతిలో ఉన్న నీళ్ళసీసాను అందుకున్నాడు కుమార్.

“ఎవరతను?” చేతిలో ఉన్న చిన్న తువ్వాలుతో మొహాన పట్టిన చెమటను అద్దుకుంటూ అడిగింది సావిత్రి.

“భీమాబాయి గురించి రోజూ గుర్తు చేసుకుంటున్నావుగా?” ప్రశ్నించాడు కుమార్. సావిత్రి కళ్ళు మెరిసాయి ఆమె గురించిన జ్ఞాపకాలతో.

“చేసుకోక? మనిద్దరం ఈ ఊళ్ళోనే ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఒకటా, రెండా? పదేళ్ళకు పైగా పనిచేసింది మనింట్లో. ఆమె చేరాకే కదా అత్తగారి అండా, అమ్మ అండా లేకపోయినా, పిల్లలతో ఇబ్బంది పడకుండా నేను మనశ్శాంతిగా ఉద్యోగానికి వెళ్లగలిగింది”

“ఔను, ఎప్పుడూ అంటూనే ఉంటావు ఆ మాట. నాకు ప్రమోషన్ వచ్చేందుకు ఓ వారం ముందే కదా ఆమె తన భర్తకి ఆక్సిడెంట్ అయ్యి, మంచాన పడ్డాడని పనికి రావటం మానేసింది?”

“ఔను, మీకు హఠాత్తుగా ప్రమోషన్ రావటంతో, నేనూ సెలవు పెట్టి బదిలీకి ఆర్జీ ఇచ్చి మీతో వచ్చేయ్యటంతో ఊరొదిలి వెళ్లేముందు చెప్పనన్నా చెప్పలేకపోయాము ఆమె కనిపించక. కానీ నాకెంతో అవసరమైన ఆ సమయంలో భీమాబాయి దొరకటం మటుకు నా అదృష్టం.”

టైం చూసుకుని ఇద్దరూ ఇంటివైపు నడక సాగించారు.

“ఇంతకీ భీమాబాయి ఎందుకు గుర్తొచ్చింది ఇప్పుడు?” అంది సావిత్రి.

“నీలానే నేనూ ఆమె సేవలను మరచిపోలేదు.పైగా నువ్వు గుర్తు చేస్తూనే ఉన్నావుగా, ఆరోజుల్లో పిల్లలిద్దరితో ఉద్యోగం చేసి కూడా నెగ్గుకు వచ్చావంటే అది భీమాబాయి చలవే అని!”.

నవ్వింది సావిత్రి. “అందులో లేశమైనా అతిశయోక్తి లేదు. ఆమె పొద్దున్న ఎనిమిదింటికి పని కొచ్చిందంటే, మళ్ళీ మనిద్దరం ఇంటికి తిరిగొచ్చేవరకు వెళ్ళేదే కాదు సమయం ఆరవనీ, ఏడవనీ. వంటచేసి పెట్టటమే కాక, మనకి ఆలస్యమైతే పిల్లలకు తినిపించేది కూడా. మా కొలీగ్స్ అందరూ కుళ్ళుకునేవారు మనకంత మంచి పనమ్మాయి దొరికినందుకు. ఇప్పుడు గానీ భీమాబాయి మనింట్లో పనిచేస్తుంటేనా.. ఈ మోకాళ్ళ నొప్పులతో ఇన్ని తిప్పలు పడుతూ ఇంటిపని చెయ్యాల్సిన అవసరమే ఉండేదికాదు నాకు.”

నవ్వాడు కుమార్. “ఏం తెలివండీ సావిత్రి గారూ! భీమాబాయికి ఇప్పుడెంత వయసుంటుందో ఆలోచించారా? ఆమెదే ఒకరి చేత చేయించుకోవాల్సిన పరిస్థితి!”

తనూ నవ్వింది సావిత్రి. “నిజమే, ఓ కొడుకూ, కూతురూ కదా! కూతురు పెళ్లి అయ్యిఉంటుంది. హాయిగా కొడుకు, కోడలు దగ్గర బాగానే ఉండి ఉంటుందేమోలేండి. ఏవండీ, ఒక్కసారి భీమాబాయిని చూడగలిగితే ఎంత బాగుండును! నాకంత అండగా నిలిచినందుకు కృతజ్ఞతలన్నా చెప్పుకోలేదు అప్పుడు! ఈ వూరొచ్చినా దగ్గరనించీ మరీ గుర్తొస్తోంది. ఎవరూ ఆమె గురించి ఏమీ చెప్పలేకపోతున్నారు.”

కొంచెం ఆగి, తప్పదన్నట్లు చెప్పాడు కుమార్, “ఇందాక పార్కులో నాతో మాట్లాడినతను మన భీమాబాయి కొడుకు భాస్కర్ స్నేహితుడు వంశీ. నన్ను గుర్తుపట్టి పలకరించాడు.. ఇప్పుడు ముంబైలో ఉంటున్నాడుట”

వంశీ తొందరగానే గుర్తొచ్చాడు సావిత్రికి. “ఓ.. ఆ పిల్లాడా! భీమాబాయి గురించి ఏమన్నా చెప్పాడా?” ఆత్రంగా అడిగింది.

“చెప్పాడు. కానీ పెద్ద ఆనందకరమైన వార్తేమీ కాదు”

“అంటే?”

“మనం వెళ్ళిపోయాక భీమాబాయి భర్త చనిపోయాడట. ఎన్నాళ్ళు పనులు చేసి దాచుకున్న డబ్బుల్లో సగం పైన అతని వైద్యానికే సరిపోయాయిట. మిగిలిన డబ్బులు పిల్ల పేరుమీద వేసి, ఆ పనీ ఈ పనీ చేస్తూ భాస్కర్‌ను చదివించుకుందట. అన్ని పిచ్చి అలవాట్లూ చేసుకున్న వాడు తరచూ భీమాబాయిని వ్యాపారానికని డబ్బుల కోసం వేధిస్తుంటే, వాడిమీద నమ్మకం లేని భీమాబాయి అవి పిల్ల పెళ్లి కోసం ఉంచానని ఇచ్చేది కాదట. ఆ డబ్బెలాగైనా కొట్టేయాలని వాడి ఆలోచన.”

సావిత్రి కళ్ళు పెద్దవి చేసుకుని వింటోంది.

“పిల్ల పెళ్లి కుదిరింది. భీమాబాయి పెళ్లికని బ్యాంకులో దాచిన డబ్బు ఇంటికి తెచ్చి పెట్టిందట. ఆ త్రాష్టుడు, వాడిమీద నమ్మకం లేని భీమాబాయి ఇంట్లోంచి ఉడాయించాడట. పరువు నిలుపుకోవటం కోసం తనకున్న ఒక్క ఆధారమైన ఇంటిని వచ్చిన ధరకి తెగనమ్మి పిల్ల పెళ్లి జరిపించేసిందట భీమాబాయి. ఈమె కొడుకు నిర్వాకం తెలిసిన కూతురి అత్తింటివారు, తమ కోడల్ని తల్లిని మళ్ళీ చూడను కూడా చూడకుండా కట్టడి చేశారట. కొడుకట్లా.. కూతురిట్లా! దిక్కులేనిదైపోయిన భీమాబాయి ఒంట్లో ఓపికున్నన్నినాళ్ళు కాయకష్టంతో బతికిందట. ఊరి చివర పోరంబోకు స్థలంలో ఓ పాక వేసుకుని ఉండేదట.”

సావిత్రి వినలేనట్లు అడ్డంగా తల ఆడించింది. “తరవాత?” బలహీనంగా ప్రశ్నించింది.

“కొడుకు ఫలానా ఊళ్ళో ఉన్నాడని ఎవరన్నా చెప్తే చాలు వెతుక్కుంటూ వెళ్ళి వచ్చేదట. కానీ ఆమె ఆశ ప్రతిసారీ నిరాశే అయ్యింది. ఇదంతా చూస్తూ వంశీ చాలా బాధపడేవాడట. కొన్నాళ్ళయ్యాక ఉద్యోగం వచ్చి ముంబై వెళ్లిన వంశీకి, అక్కడ దర్జాగా బతుకుతున్న భాస్కర్ కనిపించాడట. వాడికి వాళ్ళమ్మ గురించి చెప్పి ఆవిడని తనతో పాటు ఉంచుకోమని నచ్చ చెప్పి ఊర్కికి పంపాడట. ఆ వెధవ ఊరికి వచ్చి తల్లిని నానాతిట్లూ తిట్టాడట. తనకి వ్యాపారం పెట్టుకునేందుకు డబ్బులు కావాలని అడిగితే అవసరానికి ఇవ్వలేదు కనుక ఆమెను చూసుకోవలసిన అవసరం తనకు లేదనీ, ఆమె మొహం కూడా చూడనని తెగేసి చెప్పి వెళ్ళిపోయాడట. కొడుకు మీద ప్రేమతో, ఎప్పటికన్నా కొడుకు దగ్గరకు చేరవచ్చన్న ఆశతో బ్రతుకుతోంది భీమాబాయి. ఆమెకు కావలసింది అతని ఆదరణ. కానీ కొడుకు బంధాన్ని తెంచుకుని వెళ్లిపోవటంతో భీమాబాయి గుండెలు బద్దలైపోయాయి.

సావిత్రి నడవలేనట్లు దోవపక్కన ఉన్న ఓ చెట్టుని ఆనుకుని నిలబడిపోయింది. దుఃఖాన్ని ఆపుకునేందుకు కొంగు నోట్లో కుక్కుకుంది. “ఆ తరవాత?” అంది వణికే గొంతుతో.

“రాను రాను మతి చలించి, వీధులెంబడి తిరుగుతూ ఉండేదట. ఉన్నపూట తింటూ, లేనినాడు పస్తుంటూ, ఎండనకా వాననకా దీనంగా బతికేదట. మూడేళ్ళక్రితం ఆఖరిసారి ఇతని కంటబడినప్పుడు చాలా దీనావస్థలో ఉందట. ఓ చెట్టుకింద కూర్చుని తనలో తను మాట్లాడుకుంటూ, కొడుకు పేరే కలవరిస్తోందట. వంశీ పలకరించబోతే గుర్తు పట్టనేలేదట. ఆ దగ్గరలో ఉన్న టీ బడ్డీ అబ్బాయికి ఓ ఐదువేల రూపాయలిచ్చి ఆమెకు రోజూ బన్ను, టీ ఇవ్వమని చెప్పి వచ్చాడట వంశీ. మళ్ళీ ఇదే రావటం. అక్కడ భీమాబాయి లేదు, అడుగుదామంటే ఆ టీ బడ్డీ కూడా లేదుట.”

“అయ్యో.. భీమాబాయి! మనకంత సాయం చేసిన భీమాబాయి, నా తల్లి లాంటి భీమాబాయి! ఇంత నికృష్ట స్థితిలో ఉందా? మనకు తెలియనే లేదు. జీవితంలో ఇన్నేళ్లు ముందుకొచ్చాక, ఆమె జ్ఞాపకాలు కొంత మసకబారాయే కానీ, మరపుకు రాలేదు. ఇప్పుడు బాగా పెద్దదైపోయి ఉంటుంది. మీరు చెప్పిన మాటలు వింటుంటే అనుమానంగా ఉంది, అసలు ఉందో లేదో!” సావిత్రి కళ్ళు కన్నీటి చెలమలయ్యాయి. కుమార్ మనసు కూడా కలచివేసినట్లయ్యింది.

“మనిషికి ఎంత శుభ్రం! ఎప్పుడూ ఉతికిన బట్టలు కట్టుకుని, చక్కని చిరునవ్వుతో, మొహాన కాసంతబొట్టుతో ఎంత శుచిగా, శుభ్రంగా ఉండేది! మన ఇంటినీ, పిల్లల్నీ ఎంత చక్కగా ఉంచేది! ఆ భీమాబాయి మట్టిలో, చెట్టుకింద ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ మురికిగొట్టుకుపోయి ఎలా ఉందో! నేను కుటుంబం కోసం కష్టపడి ఉద్యోగం చేసే ఆరోజుల్లో నాకు తల్లిలా అండగా నిలిచిన భీమాబాయి అసలు బ్రతికి ఉందో లేదో!” సావిత్రి తల్లడిల్లిపోతోసాగింది. కలతబారిన మనసుతోకుమార్ సాయంతో అతికష్టంమీద ఇల్లు చేరిందామె.

“రేపు భీమాబాయి ఆచూకీ కోసం ప్రయత్నిద్దామండీ. వెతికి ఎలాగైనా పట్టుకుందాం. ఆమెని ఒకసారి చూస్తే కానీ నాకు అన్నం కూడా ఎక్కదు. ఇన్నాళ్లు ఎక్కడో బాగానే ఉందనుకున్నాను. ఇప్పుడు ఈ విషయాలు విన్నాక ఆమె ఎలావుందో తెలిస్తే కానీ నా మనసు స్థిమిత పడదు.” ప్రాధేయపూర్వకంగా అంది సావిత్రి. అంగీకార సూచకంగా ఆవిడ చెయ్యి నొక్కాడు కుమార్.

రోజు సాయంత్రం మనవడు బడి నుంచి వచ్చాక వాడి సేవలు మురిపెంగా చేస్తుంది సావిత్రి. వాడు ఆడుకుని వచ్చి, బామ్మ పెట్టినదేదో కాస్త బొజ్జలో వేసుకుని, స్కూల్ వాళ్ళు ఇచ్చిన హోంవర్క్‌తో కుస్తీ పట్టటం మొదలు పెట్టే వేళ్టికి కొడుకు రాజేష్, కోడలు వనిత ఇల్లు చేరతారు. వాళ్లకి కాఫీ కలిపి ఇచ్చి, తినటానికి చిరు ఫలహారమిచ్చి, మనవణ్ణి అప్పచెప్పి భర్తతో కలిసి నడకకు బయలుదేరుతుంది సావిత్రి. భార్యాభర్తలు కబుర్లు చెప్పుకుంటూ దగ్గర్లో ఉన్న కాలనీ పార్కుకు వెళ్లి కాసేపు నడిచి, నడక పూర్తి అయ్యాక ఇంటికి బయల్దేరుతారు. మర్నాటికి ఏదో కూరో నారో కొనుక్కుని ఇల్లు చేరతారు. వీళ్ళు స్నానాలు పూర్తి చేసే వేళకి వనిత వంట కూడా పూర్తి అవుతుంది.

అలా కాకుండా వీళ్ళు ఇంటికి వెళ్ళేవేళ్టికి కోడలు పడకగదిలోనే పడుకుని బయటకు రాలేదంటే ఓపిక లేదని, ఆపూట వంట సావిత్రే చెయ్యాలని అర్థం. చేస్తుంది. రాత్రిపూట నలుగురు కలిసి భోజనాలు పూర్తి చేసాక, పెద్ద జంట వాకిట్లో ఉన్న స్థలంలో మొక్కల మధ్యలో వేసి ఉన్న కుర్చీలలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే, చిన్న జంట టీవీ చూడటమో, లేదా ఎవరి ఫోన్లు వాళ్ళు పట్టుకు కూర్చోవటమో చేస్తారు. అప్పటికి వియాన్ నిద్రపోతుంటాడు.

మనసు చెదిరి ఇల్లుచేరిన సావిత్రి లోపలకు వెళ్తూనే కోడలి గదిలో వెలుగుతున్న లైట్ ను చూసి ఒక్క నిట్టూర్పు విడుస్తూ వంటింట్లోకి నడిచింది. కుమార్ అర్థం చేసుకుని కాళ్ళు కడుక్కుని వంటింటికేసి నడిచాడు భార్యకు సాయం చెయ్యటానికి. భోజనాల సమయంలో సావిత్రి మొహాన్ని చూసి “ఏంటమ్మా? అదోలా ఉన్నావు!” అన్నాడు కొడుకు రమేష్.

“ఒరేయ్ రమేష్ ఇవాళ పార్కులో మన భీమాబాయ్ కొడుకు భాస్కర్ లేడూ? వాడి ఫ్రెండ్ వంశీ కనపడ్డాడురా”

“ఏ భీమాబాయి? మనింట్లో చాలా ఏళ్ళుచేసిందీ.. ఆ పనమ్మాయా?” గుర్తు చేసుకుంటూ అడిగాడు వంశీ చాలా మామూలుగా. సావిత్రి మొహం చిన్నబోయింది.

“అవునురా.. ఆవిడే! ఇప్పుడు పనమ్మాయా అని ఇంత తేలికగా అనేస్తున్నావు గానీ, నీ చిన్నప్పుడు ఎప్పుడు ఆవిడ చంకనెక్కి ఉండేవాడివి. ‘అమ్మమ్మా.. అమ్మమ్మా’ అంటూ, యూనివర్సిటీ హాస్టల్ లో చేరేవరకూ అన్నీ అడిగి చేయించుకు తినేవాడివి. నేను చేసిన వంట నీకు నచ్చేదే కాదు. నిన్ను ఆవిడ చూసుకున్నంత ప్రేమగా బహుశా నేను కూడా చూసుకుని ఉండను.”

“అప్పుడేమీ తెలియని వయసు,” అన్నాడు రమేష్ అదోలా. అదేమీ పట్టించుకోకుండా అంది సావిత్రి తన ధోరణిలో చెప్పుకు పోయింది. “ఒకసారి నీకు తడపర వస్తే కూడా నాకు ఆఫీస్‌లో సెలవు ఇవ్వలేదు ఇన్‌స్పెక్షన్ జరుగుతోందని. అప్పుడు భీమాబాయి రాత్రి, పగలు కూడా మనింట్లోనే ఉండి నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంది. నాకెంతో ధైర్యం ఇచ్చింది.” సావిత్రి ఎమోషనల్ అయ్యింది.

ఇంతలోకి పెరుగు తేవటానికి ఫ్రిట్జ్ దగ్గరకు వెళ్లిన వనిత తిరిగి వచ్చింది. “ఎవరండీ ఆమె.. అత్తయ్య అంతలా చెప్తున్నారు?”

“ఆఁ, మా ఇంట్లో పనిచేసిన పెద్దావిడలే. చాలా నమ్మకస్థురాలు. అప్పటికే ఓ యాభై ఏళ్ళుంటాయేమో.. ఇప్పుడు ఎనభై దగ్గర పడి ఉండొచ్చు.”

“ఔనమ్మా.. నడివయసులో మనింట్లో చేరి పదేళ్ళకు పైగా సేవ లందించింది. నా పిల్లలిద్దరికీ అన్నం పెట్టిన అన్నపూర్ణమ్మా. చాలా బాగా చూసుకునేది. ఇంటిని కూడా ఎంతో బాగా నడిపేది. ఏ వస్తువు లేదని హడావిడి పెట్టటం కానీ, ఎక్కువ తెప్పించి పారబోయించటం కానీ చేయించేది కాడు.” మెప్పుదలగా చెప్పింది సావిత్రి.

“మంచి ఆర్గనైజర్ అన్నమాట!” వనిత నవ్వుతూ అంది.

“మరే! మనం అరుదుగా చూస్తాం అలాంటి వాళ్ళని. వీళ్ళు యజమానులు, వీళ్ళ సాదకబాధకాలతో మనకు పనేంటీ అన్నట్లు ఉండేది కాదు. తన సొంత ఇంటి మంచి చెడులను ఎలా చూసుకుంటుందో అలాగే మన ఇంటినీ చూసుకునేది. పెరట్లో కూరగాయలు పెంచటం, ఇంట్లోనే పచ్చళ్ళు, పొడులు తయారు చేసి ఉంచటం, పిల్లలకు బలమైన ఆహారం ఇవ్వటం, ఆటలాడించటం, అంతో ఇంతో చదువుకునేలా చూడటం.. ఇవన్నీ చేసేది. తనకు ఏం అవసరం చెప్పు?”

“గొప్ప మనిషన్న మాట!” మెచ్చుకుంది వనిత.

“మా వాళ్ళూ గొప్పవాళ్ళే! అందరూ ఇచ్చే దానికి ఇంచుమించు రెట్టింపు జీతం ఇచ్చేవారులే..” తేలిగ్గా అన్నాడు రమేష్.

“ఇస్తే మటుకు? అందరూ అలా చేస్తారనుకోకురా. ఏదో డ్యూటీలా చెయ్యటం వేరు, ఆపేక్షగా చేయటం వేరు. పెద్ద చదువులు చదివాక నీ మనసు చిన్నదైపోయిందా ఏవిట్రా?” కోపంగా అంది సావిత్రి.

“ఇంకో నాలుగు డబ్బులు పడేస్తే రాత్రిళ్ళు కూడా మనింట్లోనే ఉండేది. ‘ధనమూలం ఇదం జగత్’ అన్నారు.” భోజనం ముగించి కోపంగా లేచి వెళ్ళి పోయాడు రమేష్. వనిత తిన్న కంచాలను తీసి గిన్నెలను సర్దటానికి వంటింట్లోకి వెళ్ళింది.

“వీడేంటండీ, భీమాబాయిని అంత తేలిగ్గా తీసేసాడు?” బాధతో కూడిన ఆశ్చర్యంతో అంది సావిత్రి.

“ఇప్పటి మనుషులకి అర్థమయ్యే భాష ఒక్క డబ్బు భాషే. కృతజ్ఞత అనే పదమొకటి ఉందని వాళ్లకి తెలియను కూడా తెలియదు, స్వార్థం రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో వాళ్లకి పరోపకారుల గురించి చెప్పినా ఎలా అర్థమౌతుంది?” భారంగా అన్నాడు కుమార్.

ఆ రాత్రి సావిత్రి, కుమార్ ల మనసులు ఆలోచనలతోఅల్లకల్లోలమయ్యాయి. ముఖ్యంగా సావిత్రి మనసు తుఫానులో సముద్రంలా ఉంది. భీమాబాయి ఎక్కడ ఉండి ఉంటుంది? చేసిన పనికి ఒక వంద రూపాయలు ఎక్కువ ఇవ్వబోయినా, “ఎందుకమ్మా? ఒక్క గంట పసిపిల్లల్ని ఎక్కువ చూసుకున్నందుకా? నా పిల్లలనైతే చూసుకోనా?” అని నవ్వుతూ తిరస్కరించే మనిషి ఆమె. పరాయి పిల్లల్నికూడా తన పిల్లల్లా పెంచిన ఆమెకు ఇలాంటి స్థితి రావటం న్యాయమేనా? కన్నెపిల్లలు కూడా ఆదరించని దయనీయ పరిస్థితిలో ఆమె జీవితం వెళ్ళబారాల్సిందేనా?

***

సెలవలు కలిసొచ్చాయని మరో రెండు రోజులు సెలవు పెట్టుకుని భార్యాపిల్లలతో అరకులోయకు వెళ్ళివచ్చాడు రమేష్. అలసటతో ఆదమరచి పడుకున్నవాడల్లా ఒక్కసారి ఏదో ఆర్తనాదంలా వినపడి ఉలిక్కిపడి లేచాడు. అదేం శబ్దమా అని ఆలోచించేలోగా మరోసారి అదే కేక వినిపించింది. ఈసారి వనిత కూడా లేచింది. ఒక్క ఉదుటున గది తలుపు తీసుకుని హాల్ లోకి వచ్చేసరికి కంటబడ్డ దృశ్యం వాళ్ళని నిశ్చేష్టుల్ని చేసింది. సావిత్రి ఒక ముసలామెను పట్టుకుని వాళ్ళ గదిలోకి తీసుకు వెళ్ళాలని ప్రయత్నిస్తోంది. ఆమె ప్రతిఘటిస్తోంది. రమేష్ ఆమెను పరిశీలనగా చూసాడు. ఒక్కసారిగా అతని కళ్ళు పెద్దవయ్యాయి. ఆమె భీమాబాయి. వనిత నివ్వెరబోయి చూస్తోంది ఏం జరుగుతోందో అర్థం కాక.

“కొడకా, నన్నొదిలేసిపోతే నేనేమై పోవాలిరా? ఈ ముసలిదాన్ని చచ్చేముందైనా చూట్టానికి రావటే?” అరుస్తూ హృదయవిదారకంగా ఏడుస్తోంది ఆమె. కుమార్ డాక్టరుగారికి ఫోన్ చేసాడు.

“నమస్తే డాక్టరుగారూ, నేను కుమార్‌ని. మా భీమాబాయికి మీరు చెప్పిన మందులు వేస్తూనే ఉన్నామండీ. ఈ మూడురోజులు బాగానే ఉంది. కానీ ఇవాళే నిద్రలో పిచ్చికేకలు పెడుతోంది. మీ దగ్గరకు తెద్దామని. ఏంటీ? అక్కరలేదా? ఆ.. సరేనండి. నిద్రమాత్ర మరోటి వేస్తాను. అలాగే, పొద్దున్నే తెస్తాను.”

సంభాషణ అర్థమైన సావిత్రి, అప్రయత్నంగా ముందుకు వచ్చిన వనిత సహాయంతో భీమాబాయిని లోపలకు తీసుకు వెళ్ళింది. వాళ్ళ ననుసరించి లోపలకు వెళ్లారు కుమార్, రమేష్. ఆ గదిలో ఏర్పాటు చూసి విస్తుబోయాడు రమేష్. ఓ పక్కకి దివాన్, దాని పక్కనే చిన్న టేబుల్ మీద మందులు, వగైరాలు! భీమాబాయి కోసం అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాయి. రమేష్ మొహం కోపంతో పొంగింది. ఇదంతా ఎప్పుడు జరిగింది? అతనికి తెలియకుండానే స్వరం హెచ్చింది.

“ఏమిటి నాన్నా ఇదీ? ఈమెనెప్పుడు తెచ్చారు?”

“ష్..” నోటిమీద వేలు వేసుకుని బయటకు నడిచాడు కుమార్. ఆయనని అనుసరించారు అందరూ.

“ఇంట్లో పేషెంట్ ఉన్నప్పుడు గట్టిగట్టిగా అరవకూడదురా. అదీ రాత్రివేళ. “

“ఆవిడ మాత్రం అరవచ్చా ఎవరో పీక కోస్తున్నట్లు అర్ధరాత్రి?” కోపంగా అన్నాడు రమేష్.

 శాంతంగా నవ్వాడు కుమార్, “ఆమెకు మతి స్థిమితం లేదురా..”

“తెలుస్తోంది నాన్నా. అసలు ఆవిడని మీరు ఎందుకు ఇంటికి తెచ్చారో చెప్తారా?”

“ఆవిడ ఒకప్పుడు మనకు సేవ చేసింది. జీవితం దుర్లభం కాకుండా సహాయం చేసింది. ఇప్పుడు మనం ఆవిడ ఋణం తీర్చుకోవటానికి సహాయం చెయ్యటంలో తప్పేముంది?”

“ఇంతకూ ముందూ చెప్పాను, ఇప్పుడూ చెప్తున్నాను. భీమాబాయి మనింట్లో పనిమనిషి. అది చేసిన పనులకు జీతం పడేశాం!”

“ముందా పెద్దావిడని అదీ అనటం మానేసెయ్యి. ఇంత కుసంస్కారం నీకెక్కడిది? చిన్నప్పుడే ఆవిడని అమ్మమ్మా అనేవాడివి. నీ వయసు పెరిగివుండొచ్చు కానీ ఆవిడ వయసు తగ్గలేదు!” ఉగ్రంగా అన్నాడు కుమార్. ఆయన కోపానికి కొంచెం జంకాడు రమేష్.

“రుణాలు, తీర్చుకోవటాలు ప్రసక్తి వస్తే ఆవిడ పిల్లలకి తల్లి ఋణం తీర్చుకునే బాధ్యత లేదా?”

“కాదనను. కానీ వాళ్ళు వదిలేశారే! వాళ్ళకే పట్టనిది మీకెందుకూ అని?”

“మేము మనుషులం కనుక. మాకు కృతజ్ఞత అన్నది తెలుసు కనుక,” గంభీరంగా అన్నాడు కుమార్.

వెంటనే జవాబు చెప్పలేకపోయాడు రమేష్.

“ఈ రోజుల్లో మనిషికి మనిషి ఎంత భారం!! మీకు కావాలంటే ఓ పది, ఇరవై వేలు ఇచ్చి ఆమెను పంపెయ్యండి.”

“ఎక్కడికి?” బాణంలాగా వచ్చింది కుమార్ ప్రశ్న. ఉబ్బితబ్బిబ్బయ్యాడు రమేష్.

“ఏ నీడా లేకనే మతిలేని పరిస్థితిలో రోడ్డు మీద దీనంగా బతుకుతున్న ఆమెను వెతికి వెతికి పట్టుకుని, ఇంటికి తెచ్చాము మేము. నువ్వు అనుకుంటూ ఉండవచ్చు. ఏ ఆశ్రమంలోనే చేర్చేస్తే పోదా అని. కానీ ఆమెకు కావలసింది ఆదరణ.”

“అయితే ఇప్పుడేమంటారు?” అసహనంగా అన్నాడు రమేష్ .

 “కట్టుకున్న భర్త పోయి, కన్నబిడ్డలు దూరమై పోయి, పలకరించే దిక్కులేకుండా మతి పోగొట్టుకున్న ఆమెను మామూలు మనిషిని చెయ్యాలంటే ఆమె పట్ల ఆదరణ చూపిస్తూ ప్రేమగా చూసుకునే వారు కావాలని డాక్టర్ చెప్పారు. ఒకప్పుడు ఆమె మీ అమ్మ, నేను ఉద్యోగాలకి పోతే, ఆమె నిన్నూ, నీ అక్కనూ ఎంతో ఆదరణతో పెంచింది. ఆప్యాయత చూపింది. దాని మూల్యం మేము తిరిగి అదేరూపంలో చెల్లించదలచుకున్నాము.”

“అంటే?”

“సరిగ్గా విను. విని సరిగ్గా అర్థం చేసుకో. ఇప్పుడు వియాన్‌ని మేమెంత ప్రేమతో చూస్తున్నామో, ఏ రక్త సంబంధమూ లేకుండానే మిమ్మల్ని భీమాబాయి అంత ప్రేమగానూ చూసింది. నువ్వామెను పనిమనిషిగానే గుర్తించి, ఈసడించటం సరైన పధ్ధతి కాదు. మా ఇద్దరికీ కలిపి వచ్చే పింఛను మా ముగ్గురికీ సరిపోతుంది. ఈ ఇల్లు నా కష్టార్జితంతో కట్టుకున్న సొంతిల్లె కనుక అద్దె భారం ఉండదు. అందువలన ఆదరణ లేక పిచ్చిదైపోయిన ఆ ముసలి తల్లికి ఇంత ముద్ద పెట్టి, గూడు నిచ్చి, తోడుగా నిలవాలని మీ అమ్మా, నేను నిశ్చయించుకున్నాం. ఈ అవకాశం అందరికీ ఉండకపోవచ్చు. మాకు ఉంది కనుక చేస్తున్నాం.”

“అమ్మకే వంట్లో బాగుండట్లేదు. పనులు చేసుకోలేకపోతోంది..” ఏదో చెప్పబోయాడు రమేష్.

“కానీ చెయ్యకుండా కుదురుతోందా? సూటిగా ప్రశ్నించాడు కుమార్. వనిత కూడా తల దించుకుంది కుమార్‍తో పాటు.

“కానీ..” ఇంకా ఏదో అనబోయాడు రమేష్.

“ఇంతమందికి చేసే మనిషికి, తనకిష్టమైన మాతృసమానమైన మనిషికి చేసే పని ఎక్కువవుతుందా? మీ అమ్మ ఆవిడకు ఎలాగైనా సేవ చేయాలని తపిస్తోంది. ఆవిడ చెయ్యలేనినాడు మరో ఏర్పాటు చూసుకుందాం. ఆవిడని ప్రేమగా చూసుకుని, సమయం వచ్చినప్పుడు గౌరవంగా వీడ్కోలు చెప్పి ఈలోకం నుంచి సాగనంపుదాం. జీవితంలో అన్ని బంధాలను డబ్బులతో తూచలేము. మానవత్వం అలాంటి కొలతలకు అందనిది. అది మాలో పుష్కలంగా ఉంది. మేము కన్నకొడుకుగా నువ్వూ అది అందిపుచ్చుకుంటే బాగుంటుంది. సాటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవటం మానవ ధర్మం. ఆదుకోలేని మనిషి పశుతుల్యం. దయ మనిషికి ప్రథమ లక్షణం. మేము నిన్ను మనిషిలా పెంచాం. నువ్వెలా తయారయ్యావో తేల్చుకో.”

రమేష్ తల దించుకున్నాడు. అతని మనసులో సంఘర్షణ మొదలైంది. భార్యవంక చూసాడు. ఆమె మొహంలో మామగారి మాటల పట్ల మన్నన కనిపిస్తోంది.

“ఇది మా నిర్ణయం. నువ్వు ఏకీభవిస్తే సరే.. లేకపోతే నీ దారి నువ్వు చూసుకోవచ్చు. మా నిర్ణయం మటుకు మారదు,” స్థిరంగా చెప్పాడు కుమార్.

మారిన మనసుతో తనను చిన్ననాడు ఎత్తుకుని పెంచిన భీమాబాయి వైపు నడిచి, ఆమె చేతులను మృదువుగా నిమిరాడు రమేష్. చటుక్కున అతని చేతులను పట్టుకుని, గట్టిగా గుండెలకు హత్తుకుంటూ, “వచ్చావా కొడకా! ఇంక నన్ను వదిలిపోవుగా!” గొణిగింది భీమాబాయి కళ్ళవెంట కారుతున్న నీళ్లతో అంత మత్తులోనూ.

Exit mobile version