చెప్పాలని వుంది మనసులోని మాట
నీ పాటలతో మురిపించావు మరో లోకానికి తీసుకెళ్ళావు
నీ గొంతులో వుంది ఏదో అయస్కాంతం
నీ పాటతో నటించిన హీరోని మేము అభిమానించేలా చేసావు
కళ్ళు మూసుకుని నీ పాటను వింటే మా అంతర్ నేత్రాలకు
కనిపిస్తారు ముగ్గురు పాట ఆలపించిన నువ్వు పాత్రలో ఉన్న హీరో పాట రాసిన వారు
అందరిలోనూ అగ్ర స్థానం మాత్రం నీదే!
ఆనందంలో ఓలలాడించి నీ గానంతో మైమరపించి
అకస్మాత్తుగా మమ్ములను వదిలి ఎందుకు వెళ్ళావు?
బాలుగారి మరణంతో కృంగిపోయిన మేము
నీ పాటతో కాస్తంత ఊరట పొందుతుంటే
విధి ఎంతో భవిష్యత్తు ఉన్న నిన్ను
ఎందుకు తీసుకెళ్ళిందో తెలియక అల్లాడి పోయాము
ఏదో కారణం సర్ది చెప్పుకుంటున్నాము
స్వర్గంలో దేవతలను అలరించడానికేమో అని
అయినా మాకు తగిలిన గాయం ఎప్పటికీ మాసిపోదు
కొత్తవారు వస్తారు కానీ పోయినవారి లోటు తీరదు
ఇక నిన్ను చూడలేము అనేమాట తలుచుకోడానికి ధైర్యం చాలదు
నీవు పాడిన పాటలు తీసుకున్న పాతవీడియోలు ఫొటోలే శరణ్యం
నీ పాట మాకు వినిపిస్తూనే ఉంటుంది పాత జ్ఞాపకాలు గుర్తు వస్తాయి
కేకే అనే కెరటం నిస్సబ్దంగా కడలి వొడిలో వొదిగిపోయింది
చెప్పాలనివుంది మనసు విప్పాలనివుంది
ఆ తపనే ఇలా కవితై జాలువారింది.
నాది కాకినాడ. బులుసు వెంకటేశ్వర్లు గారి అమ్మాయిని. వారు వృత్తి రీత్యా పిఠాపురం రాజావారి కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్. కానీ తెలుగులో శతాధిక గ్రంథకర్త. వారు రాసిన ‘మహర్షుల చరిత్ర’ టీటీడీ దేవస్థానం ప్రచురణ హక్కు తీసుకుంది. నాన్నగారి స్వంత లైబ్రెరీ నాలుగు బీరువాలు ఆయనకు ఆస్తి. నాకు ఆసక్తి పెరిగి ఒకొక్కటే చదవడం మొదలుపెట్టేను. అందులో నాకు బాగా నచ్చినవి విశ్వనాథ వారి ‘ఏకవీర’, శరత్ బాబు, ప్రేమ్చంద్, తిలక్, భారతి మాసపత్రిక, నాన్నగారు రాసిన వ్యాసాలు ప్రింట్ అయిన తెలుగు-ఇంగ్లీషు వార్తా పత్రికలూ. ఇంటి ఎదురుగా వున్న ‘ఈశ్వర పుస్తక బాండాగారం లైబ్రెరీ’ కి వచ్చే పిల్లల పత్రికలూ, వార మాస పత్రికలూ వదలకుండా చదవడం అలవాటైంది. పెళ్ళయ్యాక కూడా అందుకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. చదివిన తర్వాత నా అభిప్రాయం ఉత్తరాలు రాసేదాన్ని. కుటుంబ బాధ్యతలు తీరి ఖాళీ లభించిన తర్వాత రచనలు చేయాలని ఆలోచన వచ్చింది. రచన, చతుర-విపులతో మొదలై అన్ని పత్రికలూ ప్రోత్సాహం ఇచ్చాయి. హైదరాబాద్ వచ్చాక జయప్రకాష్ నారాయణ్ గారి ఉద్యమ సంస్థలో చేరాను. వారి మాసపత్రికలో వ్యాసాలూ రాసాను. అలా కొనసాగుతూ పిల్లలు అమెరికాలో స్థిరపడితే వెళ్ళి వస్తూ వున్నప్పుడు కొత్త సబ్జెక్ట్ లభించేది. అక్కడి వెబ్ పత్రికలూ సిరిమల్లె, కౌముది, శాక్రిమెంటో తెలుగు-వెలుగు పత్రికల్లోనూ నా కథలు, కవితలు వచ్చాయి. ఇప్పటికి రాస్తూనే వున్నాను. చదువుతూ కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉండాలనే ఆసక్తి వుంది. అవి అన్ని సబ్జెక్టులలో కూడా. ఈ వ్యాపకాలు జీవితకాలం తోడు ఉంటాయి. ఈ సంతృప్తి చాలు.