[వివిధ జంతువుల ప్రత్యేకతలను చిన్న వ్యాసాలుగా బాలబాలికలకు అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.]
పిల్లలూ!
వాల్రస్లు ధృవప్రాంతాలలో సముద్రాలలో నివసిస్తాయి. ఇక్కడ నివసించడానికి వీలుగా వీటి శరీరం నిర్మితమై ఉంటుంది. వీటికి చిన్నగా, గుండ్రంగా వుండే తల, చిన్ని మెడ, చిన్నిచిన్ని కళ్ళు వుంటాయి. వెలుపలి చెవి వుండదు. ముట్టె వెడల్పుగా వుంటుంది. దాని మీద గుబురుగా పెరిగిన వెంట్రుకలు సర్పాంగాలుగా ఉపయోగపడతాయి.
వీటికి ప్రత్యేకించి కాళ్ళు, చేతులు వుండవు. చేప రెక్కల వలె తెడ్లలాంటి భాగాలుంటాయి. వీటిని ఉయోగించి అటు ఇటు జరుగుతాయి.
మగ వాల్రస్లు ఆడవాటి కంటే కొంచెం బరువుగా, పొడవుగా ఉంటాయి. వాల్రస్లకి రెండు దంతాలుంటాయి. మగ వాల్రస్ దంతాలు ఆడ వాల్రస్ దంతాల కంటే పొడవుగా వుంటాయి.
వివిధ ఖండాలలో వివిధ దేశాలలో ప్రజల అవయవ నిర్మాణం వైవిధ్యభరితంగా వుంటుంది. అలాగే వివిధ మహాసముద్రాలలో నివసించే వాల్రస్ల అవయవ నిర్మాణంలో కూడా వైవిధ్యం వుంటుంది.
పసిపిక్ మహాసముద్రంలో నివసించే వాల్రస్ల దంతాలు పొడవుగా, కోసుగా ఉంటాయి. అట్లాంటిక్ మహాసముద్రాలలో నివసించే వాల్రస్ల దంతాలు పొట్టిగా, గుండ్రటి కొసలతో వుంటాయి. ఈ దంతాలు వాల్రస్ల ఆత్మరక్షణకు, ఆహారాన్ని సేకరించడానికి సహాయపడతాయి.
ఇవి దంతాల సహాయంతో మంచుగడ్డని పగలకొట్టి, సముద్రపు నాచును తింటాయి. ముత్యపుచిప్పలను వెతికి తీసుకుని తింటాయి. విచిత్రంగా తల మీద నిలబడి శీర్షాసనం వేసినప్పుడు చేపలని వేటాడతాయి.
ఆడ వాల్రస్ ఒకసారి ఒక పిల్లకి మాత్రమే జన్మనిస్తుంది. చిన్నారి వాల్రస్లు తల్లి కడుపులో 11 నెలలుగాని, 12 నెలలుగాని వుండి తరువాత బయటకు వస్తాయి.
ఎస్కిమోలు వీటిని కొవ్వు, మాంసం, ఎముకలు దంతాల కోసం వేటాడుతారు. ఏనుగు దంతాలకున్న విలువ ప్రస్తుతం వాల్రస్ల దంతాలకు ఉంది. మానవులు దంతాల కోసం ఈ జాతిని నాశనం చేస్తున్నారు. ఇలా నాశనం చేస్తే ప్రపంచంలో కొన్ని జాతుల పశుపక్ష్యాదుల మాదిరిగా ఈ జాతి కూడా నాశనమయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. ఇప్పటికీ కొన్ని జాతుల పక్షులు, మృగాలు, అంతరించి పోతున్నాయి. వాటిని కాపాడుకోవలసిన బాధ్యత మనందరిదీ.
