[కార్మికులపై శ్రీమతి శైలజామిత్ర రచించిన ‘చెమట తవసాన’ అనే దీర్ఘ కవితని అందిస్తున్నాము. ఇది 6వ భాగం.]
19.
ఆయన జీవితం రేపటికి సిద్ధమయ్యే శ్రమ
పునర్జన్మ కాదు,
పునః పనివేళ.
స్నానం కన్నా ముందే చెమట శిరా ప్రవాహం,
అలసట కంటే ముందే లేచే బాధ్యత పిలుపు.
తన చేతుల్లో మట్టి –
రెండు చేతుల్లో రెండు కవిత్వాల్లా దిద్దబడుతుంది.
ఒక చేతి ఆకుపచ్చ కలం,
మరోచేతి నలుపు శిల్పం.
ఆవేదనలోంచే ఆకృతి కల్పన,
ఆకలిలోంచే అక్షర గంభీరత.
తన శరీరం ఒరిగిపోతున్నా,
తన గుండె నాట్యం ఆగదు
ఒక శ్రామికుడి గుండె
ఒక శిలాలోతుల ప్రళయరాగం.
ప్రతి ఉదయం
అతడు కూలిన రాత్రిని మళ్ళీ నిర్మించేవాడు,
తన కళ్ళకింద నల్లటి వలయాలు
నిద్రలో లేని ఘనతకి గుర్తులు.
తన అడుగుల్లో శబ్దం లేదు,
కాని గుండె లోపల
ప్రతి చెమటబిందువూ
ఒక శిల్పి చప్పుడవుతుంది.
ప్రతి రోజు మళ్లీ ప్రారంభించగల శక్తి –
ఇతడి అసలైన శ్రామిక పునాదులు.
అది జీతంతో ముడిపడిన బతుకు కాదు,
జ్ఞాపకాలతో నిండి, బాధలతో మెరచే ఒక బతుకు శిల్పం.
తన జ్ఞానం పుస్తకాలలో ఉండకపోయినా,
తన అనుభవం అనుభవించని వారికి ఒక గ్రంథాలయమే.
వాడు చెప్పే మాటలకంటే
వాడు మౌనంగా చేసే పని –
ఈ ప్రపంచాన్ని నిలబెట్టే శాసనం.
20 .
శరీరం శ్రమించి మిగిలిన చివరి ఘడియ –
పొట్ట నిండకపోయినా
గర్వం నిండిన నిశ్శబ్దం.
తన చేతులు వణికినా –
ఆ వణుకు లోపల ఒక పాడరాని గీత.
తన చెమటతో తడిపిన నేల –
ఒక రోజు పూలతోట అవకపోవచ్చు;
కానీ ఆ చెమట –
ఇంత ప్రజాసమాజానికి మూలధనం.
దాని లోపలే దాగుంది
పిల్లల నవ్వు, పట్టణం వెలుగు, దేశం కదలిక.
ఒక రోజు ఎక్కడో ఒక చోట
తన బతుకుపై ఒక కవిత రాస్తారు,
తన నోరు మూసుకున్న చోటే
ఒక గొంతు పుట్టిస్తుంది.
ఆ గొంతు శబ్దంగా మారదు,
శ్రద్ధగా మారుతుంది.
చెమట బిందువు –
ఇక శిల్పంగా నిలిచి ఉంటుంది.
ఒక శబ్దం లేకుండా
అతడి పేరు గాలిలో తరమవుతుంది –
కానీ తలవంచని అతడి శరీరం
మరువబడదు.
ఇంతే చెమట తవసాన.
తనకు ఇచ్చిన చివరి బహుమతి –
తలవంచకుండా బతికిన
తన అంతిమ క్షణం.
21.
పని ముగిసింది,
కాని చెమట ఆగలేదు.
మాటలు మిగిలిపోవచ్చు,
కాని మౌనం అంతగా నిండిపోయింది.
గోడలకూ రాళ్లకూ మధ్య
ఒక గుండె తళతళ మెరిసింది..
ఆ గుండె పేరు చెప్పకపోయినా,
దాని దాహం ప్రపంచాన్ని చలించించింది.
ఎక్కడో ఒక మూలలో
ఒక కన్నీటి చుక్క
వెలుగు చూసి వడలిపోతుందిు
ఆ వెలుగు పేరు ‘శ్రమ’.
తనకు వేదిక రాలేదు,
తనకు జెండా ఊపేది ఎవరూ లేరు,
కానీ తన దారి వెంబడి
పుటలు పుటలుగా వినిపిస్తోంది
బతుకు తెరలేదని.
ఈ కవిత ఇక్కడ ముగిసినా
ఆ బతుకు మాత్రం ఇంకా నడుస్తూనే ఉంది
తన చేతుల్లో మరో ఇటుక,
తన గుండె కూలో మరో ఆశ.
ఇంతే`
ఒక గొంతు మౌనంగా నిలిచింది,
కాని ఆ మౌనం
పల్చని శబ్థ గాలి కంటే బలంగా చెబుతోంది:
“నేను ఉన్నాను..”
(సమాప్తం)
శైలజా మిత్ర 1966, జనవరి 15 వ తారీఖున చిన్నగొట్టిగల్లు గ్రామం, చిత్తూరు జిల్లాలో జన్మించారు. వీరు ఎం.ఏ. తెలుగు (ఉస్మానియా విశ్వవిద్యాలయం), ఆంగ్లంలో ఎం.ఏ. (వెంకటేశ్వర విశ్వవిద్యాలయం) తిరుపతిలో, జర్నలిజం (రచన జర్నలిజం కాలేజీ, హైదరాబాద్‌లో పీజీ డిప్లొమా చేసారు. నేటినిజం అనే డైలీ పత్రికలో స్టాఫ్ రిపోర్టర్ గా దాదాపు 10 సంవత్సరాలు; అల్ ఇండియా రేడియో, ఎఫ్.ఎం.లో డీఈవోగా 3 సంవత్సరాలు, వెలుగు పత్రికలో అడ్మినిస్ట్రేటర్‌గా ఐదు సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం విమల సాహితి వెబ్ పత్రిక ప్రధాన సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు.
వీరి సాహితీ జీవితం 1995లో ప్రారంభమైంది. ఇప్పటివరకు 11 కవితా సంపుటాలు, 4 కథా సంపుటాలు, 4 నవలలు, 12 అనువాదాలు రచించారు. 775 పుస్తక సమీక్షలు, 29 భక్తి–సామాజిక వ్యాసాలు, 11 ఇంటర్వ్యూలు, భావతరంగిణిలో 26 సాహితీ లేఖలు ప్రచురించారు. సాహిత్య ప్రస్థానంలో దాదాపు యాభైకి పైగా అవార్డులు అందుకున్న శైలజా మిత్రగారికి ఇటీవల పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ రచయితగా ‘కీర్తి పురస్కారం’ ప్రదానం చేసింది. ఉత్తమ విమర్శకురాలుగా అమృతలత గారి ‘అపురూప పురస్కారం’ పొందారు. వీరు రచించిన ‘రాతిచిగుళ్ళు’ కవితాసంపుటికి ‘ఉమ్మడిశెట్టి’ మరియు ‘శ్రీశ్రీ’ ఉత్తమగ్రంథ పురస్కారాలు లభించాయి. ఆల్ ఇండియా లాంగ్వేజ్ అండ్ లిటరరీ కాన్ఫరెన్స్ వారు ప్రతిష్ఠాత్మక ‘సాహిత్యశ్రీ’ బిరుదు ప్రదానం చేశారు.
