Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చెమట తవసాన-1

[కార్మికులపై శ్రీమతి శైలజామిత్ర రచించిన ‘చెమట తవసాన’ అనే దీర్ఘ కవితని అందిస్తున్నాము. ఇది మొదటి భాగం.]

నా మాట
~
ఈ కవిత నాకు రాలేదు
అది నేల మీద నిలబడిన చేతుల నుండి
చెమటగా ఊరిగి నా పత్రంపై పడింది.

‘చెమట తవసాన’
ఒక కవిత మాత్రమే కాదు.
ఇది ఒక శబ్దం వెనుక మౌనం,
ఒక నిర్మాణం వెనుక మానవుడు,
ఒక పిలుపు వెనుక వేదన.

ఈ కావ్యం పుట్టిన మాట –
ఒక శ్రామికుడి నిశ్శబ్ద దుఃఖాన్ని నేనెప్పుడో గమనించినప్పుడు.

అతడి అడుగులు రోడ్డుపై మిగిలిన జాడలు కాకపోయినా,
ఆ అడుగుల్లోనే ఈ దేశపు మార్గాలు వేయబడ్డాయి.
అతడి చెమట నిర్మాణాలపై భద్రత కప్పినప్పటికీ,
అతడి పేరు ఎక్కడా కనిపించదు.

ఈ కావ్యం శ్రామికుడికి పేరు ఇవ్వదలచుకున్నది కాదు –
కాని ఆయన పేరు మిగలకపోయినా,
ఆయన బతుకుతో పాటు పోయిన గొంతుకకి
ఒక ప్రతిధ్వని కావాలని తపించింది.

నేను ఈ కవితను
వేదనతో రాలిన కన్నీటి కింద రాయలేదు.
కోపంతో, ప్రేమతో, గౌరవంతో రాసాను.
తలవంచకుండా బతికినవారి గురించి
తలెత్తి చెప్పే ప్రయత్నం చేసాను.,

ఈ కావ్యంలో పలు భాగాలు
ఒక శ్రామికుని జీవితాన్ని –
తన పనిలోని వేదన, తండ్రితనంలోని నిశ్శబ్దం,
నగరపు అడ్డదారుల్లోని ఒంటరితనాన్ని,
భయాల మధ్య ఆశలు ఎలా నిలబడతాయో –
అన్నింటినీ వ్రతంగా అక్షరబద్ధం చేయాలన్న ప్రయత్నమే.

ఈ కవితను ఓ వేదిక మీద చదివే అవకాశం
ఎప్పుడూ వారికి ఉండకపోయినా,
వారి కోసం చదివే మనం –
వారికి నిలబడే ఒక్క గొంతుగా మారుదాం.

ఈ కవితను దేశాన్ని మోస్తున్న చేతులకు అంకితం చేస్తున్నాను.
వారు మట్టిలో కలిసి పోయినా,
వారి చెమట లోకాన్ని నిలిపింది.
ఈ రచనలో వాళ్ల శ్వాస ఉంది.
– శైలజామిత్ర

***

1.
పొద్దు పుట్టకముందే
వెలుగుల నుండే కాదు బాధ్యతల నుంచే మేల్కొంటాడు.
గడియారం మోగకపోయినా,
గుండె లోతుల్లో గడియం నిండిన మెలకువ మోగుతుంది.
తలపాకల మధ్య మెలికలు తిరిగిన కలలు
వెంటాడే అవసరాల మంటలో ఆవిరైపోతాయి.

చెక్క బల్లపై విరిసిన గొడుగు ఊహల్ని
వాకిట్లో కూర్చున్న భయాలు మింగేస్తాయి.
కళ్ళు మూయకుండానే నిద్రతీయడం నేర్చుకున్నవాడు
వీధి దీపం క్రింద లేత జ్ఞాపకాల చీకటిలో తిరుగుతాడు.

పొద్దు ఎగరే ముందు
తనలో ఏదో తలెత్తుతుంది
అది ఆశ కాదు
బతకాల్సిన కర్మ.

తలపాగా తడిసినా
తలపు తడవదు.
చెమట మింగిన భవంతులు ఎవరివి?

తను మోసిన గోడలు మెరిసిపోతున్నాయి
తన పేరు మాత్రం మట్టిలో కలిసిపోయింది.
వాడు మోసేది ఇటుకల బారం కాదు,
బతుకు బరువు.

పగలు తినక రాత్రి పనిచేయడం
ఆయనకు అవసరం కాదు
అది విధి.

చెక్కల మూటల్ని మోస్తూ,
నిర్మాణాల లోపల దాచిన తన నిశ్శబ్దాన్ని
నగరం వినదు.
పనిచేసే ప్రతి క్షణం
తనలో బంధించిన జీవ శబ్దాన్ని
ఇరుకుల్లోకి నెట్టేస్తుంది.

తల చుట్టూ తిరిగే ధూపపు పొగ
తన చెమటపైనే నిలబడుతుంది.
గొంతు తడవని నీటి కల
గుండె చివర్లో కరిగిపోతుంది.

గడియారం అరవకముందే
తన కాలి చప్పుళ్లు వెలుతురు తోడుకుంటాయి.
అతడు మొదలెట్టే రోజు
బతుకు చలవ లేకుండా తిరిగే చక్రంలా
తనను మింగేస్తుంది.

తన శరీరాన్ని ఒక పనిముట్టుగా మార్చుకొని
తన మనసును ఒక మూగ పాటగా మలుచుకున్నాడు.
వాడు ఒక దినసరి కూలీ కాదు
వాడు ఒక దేశపు అసలు రాసిపెట్టని చరిత్ర.

2.
పది అడుగుల గుడిసె –
ఒక తల్లి దాచిన కన్నీటి వాసన,
ఒక తండ్రి పిండిరచుకున్న కలల చీకటి మూల.
ముగ్గురు పిల్లల ఆకలి మినహాయించిన నిద్రతో నిండిన గది.

పొద్దున్నే లేవగానే
బిడ్డలు అన్నం అడిగేలోపు
అతడు తన పాదాలను మూట కట్టుకున్న వేదనలా మోస్తాడు.
అతడి నిద్రలో బతుకు లేదు,
బతుకులో నిద్ర లేదు.

కడుపు నిండితే బతుకు సులువవుతుందని వాళ్లు అనుకున్నారు,
కానీ అతడు జీవిస్తున్నది కడుపు కన్నా లోతైన బాధ్యత.
ఒక బిడ్డ బడి కోసం ఏడుస్తోంది,
ఒకరు స్కూల్ బ్యాగ్ కోసం మూలుగుతోంది,
ఒక చిన్నారి తల్లి ఒడిలో తలదాచుకుని,
రాత్రి తినని కడుపుతో నిద్ర పడుతోంది.

అతడు తినలేకున్నాడు కాదు-
తినకపోయినా పీక్కునవ్వగలిగే శ్రమ జీవి
కన్నీటి కప్పుతో పాలు తాగించగలిగే తండ్రి.
ఇంట్లో బియ్యం మిగిలిందా అన్న సందేహం
అతడి హృదయంలో గంటలా మోగుతోంది-
కానీ బయట మాత్రం కూలి లాంటి ధైర్యాన్ని వేసుకున్నాడు.
అతడి శరీరం బలంగా కనిపించినా,
అందులో బలహీనత.. ఒక తండ్రిగా మోసే బాధ్యత.

ఆకలి అన్నది బిడ్డలదే కాదు.
అతడిదీ.
అది తినడం కోసం కాదు-
తినిపించడమే అతడి ఆకలి.

(ఇంకా ఉంది)

Exit mobile version