[వేలూరి ప్రమీలా శర్మ గారు రచించిన ‘చెక్కని శిల్పం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
సూర్యాస్తమయం వేళకు ముందేవచ్చి బీచ్‌లో కూర్చుని ఎగసిపడుతున్న అలల ఉత్సాహాన్ని కవితల రూపంలో అక్షరాల్లో బంధిస్తూ చీకటిపడేవరకు అక్కడే కూర్చోవడం సాగర్‌కి అలవాటు. తనకు ఊహ తెలిసినప్పట్నుంచీ కెరటాలతో మౌనంగా ఊసులాడుతూనే ఉన్నాడు. అలల తుంపరలతో తడుపుతూ ముందుకి దుమికివచ్చే కెరటం ప్రేమగా తనను పలకరించి వెళుతుందన్న ఆలంబనతో వేదన నిండిన ఆతని మనస్సు ఊరట పొందేది.
చాలా సంవత్సరాలుగా రోజూ అలా బీచ్‌కి వచ్చి కూర్చుంటూనే ఉన్నాడు సాగర్. కానీ ఆ పున్నమినాటి వెన్నెల కాంతిలో అలలతో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సముద్రం అతని మనసులో కలిగిన అలజడికి సాంత్వన చేకూర్చలేకపోతోంది. పెళ్ళి చేసుకున్న కొద్దిరోజులకే ఇన్నాళ్లుగా తనది అనుకున్న ప్రపంచంలో చీకటి కమ్ముతున్నట్టయ్యింది. ప్రశాంతతకు దూరమయ్యాడు. రోజురోజుకీ తనపై అనుమానం పెంచుకుంటున్న తన భార్య స్పందన అన్న మాటలకు సాగర్ మనసు ఉక్రోషంతో బరువెక్కింది. కాగితంపై పెట్టిన అక్షరాలు కన్నీటితో తడిసి బరువెక్కుతున్నాయి. అందుక్కారణం ఆ ముందురాత్రి తన కవితల గురించి స్పందన మాట్లాడిన తీరు అతన్ని చాలా బాధపెట్టింది. ఆ కవితలలో ప్రాణం పోసుకున్న అనురాగమూర్తిపై ఆరా తీస్తూ అతని మనసును ఈటెల్లాంటి మాటలతో తూట్లు పొడిచింది స్పందన. నరం లేని నాలుక ఎటు తిప్పినా తిరుగుతుందని రుజువుచేసుకుంది.
ఆ క్షణం కోపంగా ఉన్న ఆమె.. తాను ఏం చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితిలో లేదని మౌనం వహించాడు. కానీ ఆ మౌనం ఇద్దరిమధ్యా ఆగాధాన్ని సృష్టిస్తుంటే తట్టుకోలేక గిలగిల్లాడిపోయాడు సాగర్.
***
యవ్వనంలోకి అడుగిడగానే పుత్తడిబొమ్మలా మెరిసిపోతున్న స్పందన అందానికి ఆకర్షించబడిన వందల కళ్ళు ఆమెను అనుసరించేవి. రాజసంతో కూడిన ఆమె నడక తూనీగల్లాంటి అబ్బాయిల మనసుల్ని కట్టిపడేసేది. ఆమె పలకరింపు కోసం కుర్రాళ్ళు పడిచచ్చేవారు. ఓసారి చూస్తే తిరిగి మళ్ళీ చూడాలనిపించే అందం ఆమెది.
“కలువ రేకుల్లాంటి నీ కనుల అందాన్ని కలలో సైతం ఎవరూ మర్చిపోలేరు. కోటేరు లాంటి నీ ముక్కూ, ఎర్రని సన్నని పెదవులూ, అప్పుడే విచ్చుకుంటున్న అందమైన గులాబీ రేకుల్లాంటి చెంపలు.. బంగారు వర్ణంలో శంఖువును పోలిన అందమైన నీ మెడ, సన్నని నడుమును దాటి ఒంపులపై నాట్యమాడే పొడవాటి ఒత్త్తెన నీ వాలుజడ, కలహంస వయ్యారాలను తలపించే సొగసైన నీ నడక.. మాటలు రాని మూగవాడి చేత సైతం కవిత్వం రాయిస్తాయి..” అంటూ కాలేజీలో చదువుకునే రోజుల్లో ఆమె వెంటపడి ఆరాధించిన కుర్రకారు చేసిన వ్యాఖ్యలు, తాను గొప్ప అందగత్తెను అన్న అహాన్ని పెంచాయి స్పందనకు.
“నిన్ను ఏరి కోరి పెళ్ళి చేసుకుంటానని మన దూరపు బంధువుల అబ్బాయి కబురుపెట్టాడు తల్లీ! ఒక్కసారి ఇద్దరూ కాసేపు కూచుని మాట్లాడుకుంటే ముహుర్తాలు పెట్టుకుందాం” అన్న తండ్రి మాటలకు సరేనంది స్పందన.
ఇద్దరి అభిప్రాయలూ కలవడంతో పెద్దవాళ్ళకీ ఏ అభ్యంతరమూ లేకపోయింది. తనను పెళ్లాడబోతున్న వ్యక్తి ఓ గొప్ప కవి అని తెలిసి మురిసిపోయింది స్పందన.
“ఇంకేముంది.. అతని కవితలకు ప్రాణం నీ అందమే అవుతుంది.. అద్భుతమైన ఎన్నో ప్రణయ కావ్యాలకు నీ అందం కవితా వస్తువుగా మారుతుంది” అంటూ స్నేహితురాళ్లు పొగడ్తలతో ముంచెత్తుతుంటే ముసిముసి నవ్వులు చిందిస్తూ మురిసిపోయింది. ఆ మాటలు ఆమెను పల్లకీనెక్కించాయి. తన స్నేహితురాళ్ళు అసూయపడేలా తమ జంట ఉండాలని ఎన్నో కలలు కన్నది స్పందన.
కానీ పెళ్లయిన నాటి నుంచీ ఏనాడూ సాగర్ ఆమె అందాన్ని ప్రత్యేకించి పొగిడింది లేదు. పైగా ఆమె అందానికి మించిన అద్భుతమైన వర్ణనలతో కూడిన తీరైన పదాల అల్లికతో సాగిన సాగర్ కవితలు చాలా బాగున్నాయంటూ స్నేహితురాళ్లు చెబుతుంటే అది విన్న స్పందనకు చాలా ఉక్రోషంగా ఉండేది. తన భర్త రాసిన కవితలను చాటుగా చదివి అందులో తన అందాల ప్రస్తావన లేకపోవడంతో నిరాశకు గురైంది. కానీ అద్భుతమైన వర్ణనలతో సాగిన ఆ కవితల్లో దాగున్న అందమైన ఆ రూపం ఎవరిదో తెలుసుకోవాలని రోజురోజుకీ ఆమెలో పంతం పెరగసాగింది.
వెన్నెల కురిసిన ఆ వసంత రాత్రి విరహ వేదనతో ఆమె రగులుతుంటే.. అటువైపు తిరిగి గాఢoగా నిద్రపోతున్న భర్తను చూసి ఆమెకు ఒళ్ళు మండింది. ప్రశాంతంగా నిద్రపోతున్నవాడిని భుజం పట్టి తనవైపు తిప్పుకుంటూ బలవంతంగా నిద్రలేపింది. ఆమె కళ్ళలోని ఎర్రటి జీరలు చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు సాగర్. తాను చేసిన తప్పేమిటో అర్థంకాక ఆమె కళ్ళల్లోకి అయోమయంగా చూశాడు. ఆమె మనసులో ఉన్న విషాన్ని మెల్లగా కక్కడం మొదలు పెట్టింది.
“మీ కవితలు అద్భుతంగా ఉన్నాయని అందరూ మెచ్చుకుంటుంటే నాకు ఏమాత్రం ఆనందం కలగడం లేదు. ఎందుకంటే ఆ కవితలలో నేను లేను. మిమ్మల్ని అంతగా కదిలించిన ఆ కవితల వెనక ఉన్న ‘ఆమె’ ఎవరో ఈ రోజు నాకు తెలియాలి. ఇంత అద్భుతంగా అలల నురుగులతో ఆటలాడుతూ వాటిని తాకి సేద తీరాలనుకుంటున్న ఆమె ఆంతర్యాన్ని ఆవిష్కరిస్తూ మీరు రాస్తున్న కవితలు నేనూ చదువుతున్నాను. ఇప్పటికైనా చెప్పండి.. ఆమె ఎవరు? అసలు రోజూ బీచ్‌కి వెళ్ళి ఎందుకు కూచుంటున్నారు? ఇన్నాళ్ళూ మిమ్మల్ని అడిగేవాళ్ళు లేకపోవచ్చు. కానీ ఇప్పుడు నాకు సమాధానం చెప్పి తీరాలి.” గట్టిగా నిలదీసింది స్పందన. కోపంతో ఆమె పైయ్యద ఎగిరెగిరిపడుతోంది. సన్నని పెదవులు కంపిస్తున్నాయి. ముక్కుపుటాలు అదురుతుండగా.. కను చివరలనుండి నీటి బిందువులు రాలిపడుతున్నాయి.
“నీతో ఎప్పుడైనా అబద్ధం చెప్పానా స్పందనా! ఏమిటిది? దేనికి నన్ను ఇలా అనుమానిస్తున్నావు? నువ్వన్నట్టు ఆ అలల మధ్యలో నాకు కనిపించే ఆ రూపమే నా కవితల్లో ప్రాణం పోసుకుంటోంది. నిజమే.. కాదనను. కానీ నాపై నీకున్న అభిప్రాయం.. నువ్వు పెంచుకున్న అనుమానం మాత్రం నిజం కాదు. నా మనసులోని భావాలు పక్కదారి పట్టడం లేదు. ఇన్నాళ్లూ నీ చుట్టూ ఉన్నదే ప్రపంచం అనుకుంటూ బతికావు. నిన్ను నువ్వు ప్రేమించినంతగా ఎదుటివారిని అంగీకరించలేకపోతున్నావు. ఒక్కసారి నీవైపు నుంచి కాక.. నా వైపునుంచి ఆలోచించి చూడు. మనసుపెట్టి ఆలోచిస్తే ఒక కవి హృదయాన్ని కుదిపేసిన సంఘటన ఏమిటన్నది నీకు బోధపడుతుంది. ప్రేమార్తితో తల్లడిల్లిపోతున్న నా మనసులోని సంఘర్షణ నీకు అర్థమవుతుంది. ఇవన్నీ ఇప్పుడు చెప్పినా అర్థం చేసుకునే స్థితిలో నువ్వు లేవు. బాగా పొద్దుపోయింది ఇక పడుకో.” అంటూ సున్నితంగానే మందలించాడు సాగర్.
అతని సమాధానంతో తృప్తిపడని స్పందన దూరంగా జరిగి పడుకుంది.
ఇద్దరిమధ్యా నిశ్శబ్దం.. క్షణాలు భారంగా గడిచాయి. చిన్నపాటి ఆ అలక చీకట్లు ముసిరే గాలి వానగా మారకుండా ఆ జంట సంయమనం పాటిస్తూ ఆ రాత్రి నిద్రకి దూరమై మంచానికి చెరొక వైపుకీ జరిగి పడుకున్నారు. ఇద్దరు పరాయివ్యక్తులు ఒకచోట కలిసి ఉండలేనట్లు మొహాలు పక్కకి తిప్పుకున్నారు. ఇన్నాళ్ళూ తాము మధురంగా గడిపిన జ్ఞాపకాలు వారిద్దరికీ తృప్తినివ్వలేదు.
***
రాత్రి తమ మధ్య జరిగిన సంభాషణ సాగర్‌ని బాగా కలచివేసింది. ఊరట కోసం మళ్లీ సముద్రం ఒడ్డుకి వచ్చి కూర్చున్నాడు. తన సాంగత్యంలో దొరకని ప్రశాంతత, సముద్రం దగ్గరకెళ్ళి కూచున్నప్పుడు ఎలా దొరుకుతోందో తెలుసుకోవాలన్న కుతూహలంతో తాను కూడా బీచ్ దగ్గరికి వెళ్ళింది స్పందన. నారింజ రంగు సూర్యకాంతిలో తివాచీ పరిచినట్టున్న ఇసుకపై కూచుని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు సాగర్. ఒంటరిగా శూన్యంలోకి చూస్తూ కూచున్న భర్తని చూసి ఆమెకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. మెల్లగా అతను కూర్చున్నవైపుకి అడుగులు వేసింది. అక్షరాలు కూడబలుక్కుంటూ.. “నేను కూడా మీతో పాటు కూచోవచ్చా?” అని అడిగింది.
తలెత్తి ఆమె వైపు చూసినా, మాట్లాడ్డం ఇష్టం లేనట్టు చూపు మరల్చి.. అలల మధ్యలో దూరంగా కనపడుతున్న రాయి వైపుకి చూస్తూ కూచున్నాడు సాగర్.
“ఏవండీ! నన్ను మన్నించండి. నా అందాన్ని ఆరాధించలేని మీ మనసును ఆకర్షించాలంటే ఏం చేయాలో తెలీక మిమ్మల్ని అనుమానించాను. ఇంకెప్పుడూ ఇలాంటి మాటలతో మిమ్మల్ని బాధ పెట్టను. అసలు నాకేమయ్యిందో నాకే తెలీట్లేదు. అందరూ.. మీ ఆయన రాసే కవితల్లో మచ్చుకైనా నీపట్ల ఆరాధన, నీ రూపం కనపడట్లేదు అంటుంటే నాకెందుకో చాలా ఉక్రోషంగా అనిపించింది. అందుకే అలా..” ఇసుకలో తన పక్కన కూర్చుంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంటున్న స్పందనను చూసి.. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు సాగర్.
“మా అమ్మ చాలా అందంగా ఉండేదిట స్పందనా! కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో ఎప్పుడూ బాధపడేదట. పిల్లల్ని కనేందుకు ఆమె గర్భసంచి అనువుగా లేకపోవడంతో ఎన్నో రకాల వైద్యాలు చేయించాక నేను కడుపున పడ్డానట. నవమాసాలూ మోసి, నాకు రక్త మాంసాలు పంచి ఇచ్చిన నా బంగారు తల్లి.. నేను భూమి మీద పడిన మరుక్షణం నన్ను చూడకుండానే కన్నుమూసిందట. ఎన్నో కష్టాలు అనుభవించి, ఎంతో బాధలను ఓర్చుకున్న ఆమె గురించి నాన్న చెబుతుంటే వినడమే కానీ.. అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలియదు. అందుకే ఈ బీచ్ ఒడ్డుకి వచ్చి కూర్చుని దూరంగా కనిపిస్తున్న చిన్నపాటి కొండరాయిని చూస్తూ.. దానిని ఢీకొడుతున్న అలల అల్లరిని గమనిస్తూ అందులోనే అమ్మ రూపాన్ని చూసుకుంటున్నాను. ఆ రాయి నా మనసులో రూపుదిద్దుకున్న అమ్మ రూపానికి సాక్ష్యంగా నిలిచిన చెక్కని శిల్పం. ఆటుపోటులతో ఎగసిపడే అలలు ఆ శిలను ఢీకొట్టినప్పుడల్లా అమ్మ పడిన కష్టాలు నాకు జ్ఞప్తికి వస్తాయి. అదే అలలు ఉప్పొంగి ఆ శిలను ముంచెత్తుతున్నప్పుడు.. వాటితో ఆటలాడుతూ సేదతీరుతున్న అమ్మ రూపం నా కళ్ళ ముందు నిలుస్తుంది. అద్భుతమైన ఆ రూపాన్ని వర్ణిస్తూనే ఎన్నో కవితలు రాశాను.. రాస్తున్నాను కూడా. ఈ విషయం నీకు తెలియాలి. లేదంటే అమ్మ ప్రేమకు నేను ఎలాగూ నోచుకోలేకపోయాను. ఇప్పుడు నీ ప్రేమకు కూడా ఎక్కడ దూరమైపోతానోనని భయంగా ఉంది. ఒక్కమాట అడుగుతాను.. సమాధానం చెప్పు!
అందం అంటే ఏంటి స్పందనా! నీ దృష్టిలో అందం అంటే పైపై మెరుగులేగా.. అద్దం ముందు నుంచుని మనం చూసుకునే ప్రతిబింబంలో అందం లేదు స్పందనా! మనల్ని చూసే ఎదుటివారి కళ్ళల్లో ఉంది. అంటే ఆరాధన అనేది మనసులోంచి పుట్టే అద్భుతమైన భావన. ఇది నీకు అర్థమైతే చాలు.” అంటూ చీకటి పడుతూ ఉండడంతో అక్కడినుంచి లేచాడు సాగర్.
చెమ్మగిల్లిన కళ్ళతో భర్త చెయ్యి పట్టుకుని అతని అడుగుల్లో అడుగు కలిపి ముందుకి నడిచింది స్పందన. ఆమె మనసులో కమ్ముకున్న మబ్బుతెరలు విడిపోయి.. తేలికపడిన మనసుతో నడుస్తున్న ఆమె.. వెనుదిరిగి సముద్రం వైపు చూసింది. ఎప్పటిలాగే అలలు ముంచెత్తుతున్న ఆ శిల, చెక్కని శిల్పమై ఇప్పుడు ఆమెకు మరింత అందంగా కనపడసాగింది. సాగర్ కవితలలోని అందమైన ఆ స్త్రీమూర్తి రూపం.. తమను దీవిస్తున్నట్టుగా అనిపించి, స్పందన పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి.
సమాప్తం