[శ్రీ ఎం.ఆర్.వి. సత్యనారాయణ మూర్తి రచించిన ‘చేజారిన రత్నం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
“నా మాట మన్నించి నన్ను భీమిలి అంతా తిప్పారు. థాంక్స్ అండి” భర్త రెండు చేతులూ పట్టుకుని అంది
రాజమణి. ఆమె మాటలకు చిన్నగా నవ్వాడు రాఘవ. ఇద్దరూ భీమిలి బీచ్ ఒడ్డున ఉన్న రెస్టారెంట్‌లో ఉన్నారు. ఇంతలో భోజనాలు వచ్చాయి. ఇద్దరూ తినడం మొదలుపెట్టారు. ఆదివారం అవడం వలన రెస్టారెంట్ చాలా రష్‌గా ఉంది. రాఘవ పిల్లలు స్నేహలత, సూర్యమణి ఇంజనీరింగ్ చదువుతున్నారు. భీమిలిలో తాము చూసిన డచ్ గవర్నర్ గాలి మేడ, బౌద్ధారామాలు, సెయింట్ పీటర్సు చర్చి, దేవాలయాలు అన్ని ఫోటోలు పిల్లలకు పంపింది రాజమణి.
స్నేహలత ఫోన్ చేసింది. “అమ్మా, ఫోటోలు చాలా బాగున్నాయి. మమ్మల్ని కూడా ఒకసారి భీమిలి తీసుకెళ్ళాలి” అంది తల్లితో. “అలాగే, తప్పకుండా నిన్నూ, చెల్లాయిని తీసుకెళతాం. నాకు బాగా నచ్చింది ఈ ఊరు” అంది రాజమణి. భోజనం చేస్తూ కూతురితో మాట్లాడుతోంది. రాఘవ భోజనం ముగించి చేతులు కడుక్కోవడానికి వాష్ బేసిన్ దగ్గరకు వెళ్ళాడు.
అప్పుడే చేతులు కడుక్కుని, నాప్‌కిన్‌తో తుడుచుకుంటూ పక్కనున్న ఆవిడతో మాట్లాడుతూ వెళ్తున్న కనకాంబరం రంగు పట్టుచీర ఆవిడని చూసి ఖంగుతిన్నాడు రాఘవ. ఆవిడ రాఘవని గమనించలేదు. రాఘవ గుండె వేగంగా కొట్టుకోసాగింది. వెనుదిరిగి మరోసారి ఆమెని చూసాడు. అవును. ఆమే. సందేహం లేదు అని నిర్ధారించుకున్నాడు. చేతులు కడుక్కుని భారంగా వస్తూండగా, పట్టుచీర ఆవిడ, ఇంకో ఆవిడతో కలిసి రెస్టారెంట్ బయటకు వెళ్ళడం చూసాడు.
ఈలోగా రాజమణి వచ్చింది. “మీకంతా కంగారు. అమ్మాయి అడిగింది నాన్నకి ఫోన్ ఇవ్వమని. మీరు పక్కన లేరు అని చెప్పాను. ఒక రెండు నిముషాలు ఆగవచ్చు కదా” అని విసుక్కుని వాష్ బేసిన్ దగ్గరకు వెళ్లి చేతులు కడుక్కుని వచ్చింది. మౌనంగా ఉన్నాడు రాఘవ. భార్యకి ఎదురు చెబితే జరిగే పరిణామం అతనికి బాగా అనుభవం.
ఇద్దరూ బయటకు వచ్చేసరికి రాఘవ ఫ్రెండ్ గోపాల్ ఫోన్ చేసాడు. “సారీరా రాఘవ. అర్జెంటుగా వైజాగ్ వెళ్ళవలిసి వచ్చి నీకు కంపనీ ఇవ్వలేకపోయాను. ఇప్పుడే నేను ఇంటికి వచ్చాను. ఆటో మీద మా ఇంటికిరా. మాట్లాడుకుందాము” అన్నాడు గోపాల్. అతను అక్కడ తహసీల్దారుగా పనిచేస్తున్నాడు.
“అలాగే” అని ఫోన్ కట్ చేసి, ఆటో మీద గోపాల్ ఇంటికి వెళ్ళాడు రాఘవ భార్యతో కలిసి. గోపాల్ ఎంతో ఆదరంగా ఆహ్వానించాడు దంపతులు ఇద్దరినీ.
“సారీ చెల్లెమ్మా. మా కొలీగ్ కూతురు పెళ్లి. అందుకని వైజాగ్ వెళ్ళవలిసివచ్చింది” అన్నాడు గోపాల్, రాజమణితో. “అయ్యో భలేవారే. మేము ఏమీ అనుకోవడంలేదు. మీది ముఖ్యమైన పని కదా”అంది రాజమణి.
గోపాల్ భార్య రాధిక కూడా వచ్చి “సారీ అండి” అంది. తర్వాత నలుగురూ కొద్దిసేపు కబుర్లు చెప్పుకున్నారు.
“మీరు కొద్దిసేపు విశ్రాంతి తీసుకోండి. సాయంత్రం చిన్న మీటింగ్ ఉంది. దానికి వెళ్దాం. తర్వాత మిమ్మల్ని నా కారులో వైజాగ్ పంపిస్తాను” అని వాళ్లకి గెస్ట్ రూమ్ చూపించాడు గోపాల్. ఎ.సి. ఆన్ చేయగానే వెంటనే నిద్రపోయింది రాజమణి. రాఘవ పట్టుచీర ఆవిడ గురించే ఆలోచిస్తున్నాడు.
కొన్ని సంవత్సరాల క్రితం చూసిన మణి ఇక్కడ కనిపించడం అతన్ని చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. గతం ఒక్కసారి కళ్ళ ముందు తిరిగింది.
***
పెళ్లిచూపులకి వెళ్లి వచ్చి గడప తగిలి పడబోయి తమాయించుకున్నాడు రాఘవ. “అదేమిటిరా?” అని అడిగిన తండ్రికి “ఏదో ఆలోచిస్తూ నడిచాను అంతే” అని సమాధానం ఇచ్చాడు రాఘవ. పెళ్లి కూతురు మణి, అతనికి బాగా నచ్చింది. అందం, వినయం కాకుండా, మణి చక్కని పాటలు కూడా పాడటం రాఘవ కుటుంబ సభ్యులు అందరినీ ఆకట్టుకుంది. ‘కట్నం’ విషయంలో బెట్టు చేయవద్దని తండ్రికి ముందే చెప్పాడు రాఘవ.
మండల పరిషత్తు ఆఫీసులో గుమాస్తాగా పనిచేస్తున్న రాఘవ పెళ్లి పేరుతో, రెండు లక్షల కట్నం వరకూ రాబట్టాలని ఆశించిన, శేషగిరి చాలా నిరుత్సాహ పడ్డాడు. ‘ఏభైవేల కట్నం, నాలుగు తులాల బంగారం మాత్రమే ఇవ్వగలమ’ని మణి తండ్రి జగన్నాధం చెప్పారు. దానికే అంగీకరించాడు శేషగిరి. ఇరువర్గాలు తాంబూలాలు మార్చుకున్నారు. మాఘమాసంలో పెళ్ళికి ముహూర్తం కూడా ఖాయం చేసుకున్నారు.
ఆరోజు సాయంత్రం పార్కుకి వెళ్లి ఇంటికి తిరిగివస్తున్న శేషగిరిని లైట్ లేని ఆటో గుద్దేసింది. కుడి చెయ్యి విరిగిపోయింది. హాస్పిటల్‌కి వెళ్లి కట్టు కట్టించుకుని ఇంటికి వచ్చిన శేషగిరి కొడుకు మీద ఎగిరి పడ్డాడు. “ఒరేయ్ ఆ పిల్ల సంబంధం మనకు వద్దురా. మొదటిసారి నువ్వు ఇంటిలో పడబోయావు, రెండవసారి నాకు చెయ్యే విరిగింది. ఎందుకో ఆమె ‘నష్ట జాతకురాలు’ అనిపిస్తోంది. పెళ్లి అయ్యాకా ఆ పిల్ల మన ఇంటికి వస్తే ఏమి జరుగుతుందో అని నాకు బెంగగా ఉంది” అన్నాడు. రాఘవ తల్లి వసుంధర కూడా భర్తకి వత్తాసు పలికింది. ఎందుకంటే, తర్వాత జరగబోయే ‘అనర్థం’ తనకే అని ఆమెకి భయం వేసింది. రాఘవకి చాలా బాధ కలిగింది. అందాలరాశి, చక్కని గాయని తనకు భార్య అవుతోందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. రెండు రోజులు గడిచినా తల్లీ, తండ్రీ అదే విధంగా పోరుతూ ఉంటే, బలవంతంగా వారి నిర్ణయానికి కట్టుబడవలసి వచ్చింది. మధ్యవర్తి ద్వారా పెళ్లి సంబంధం కేన్సిల్ చేసుకుంటున్నామని కబురు చేసాడు శేషగిరి. మణి కుటుంబ సభ్యులు చాలా బాధపడ్డారు..
ఆ మరుసటి నెలలో రాఘవకి తణుకు బదిలీ అవడంతో అందరూ తణుకు వెళ్ళిపోయారు. మాఘమాసంలోనే రాజమణితో రాఘవ పెళ్లి జరిగింది, రెండు లక్షల కట్నంతో. శేషగిరి ఆనందపడ్డాడు, రాఘవ ‘రాజీ’ పడ్డాడు. ఎందుకంటే రాజమణి అందం, గొంతు కూడా అంతంత మాత్రమే. పైగా ‘కట్నం’ దండిగా తెచ్చానని రాజమణి, అందరిపై ‘అథారిటీ’ చెలాయిస్తుంది.
***
సాయంత్రం నాలుగు గంటలకు గోపాల్‌తో కలిసి మీటింగ్‌కి వెళ్ళారు రాఘవ, రాజమణి. ఒక సాహిత్య సంస్థ వారు కథల పోటీ పెట్టి, విజేతలకు బహుమతులు ఇస్తున్నారు. గోపాల్ ముఖ్య అతిథి.
సంస్థ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ “ముందుగా ప్రథమ విజేత రత్నమణి గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం” అని అన్నాడు. రాఘవకి కనిపించిన పట్టుచీర ఆవిడ వేదిక మీదకు వచ్చి కుర్చీలో కూర్చుంది. రాఘవ ఆశ్చర్యంగా అలాచూస్తూ ఉండిపోయాడు.
“రత్నమణి గారు రాసినవి అరవై కథలే అయినా, వాటిలో ముప్ఫై కథలకు బహుమతులు రావడం విశేషం. వారి మొదటి కథలసంపుటి ‘పడిలేచిన కెరటం’కి రెండు అవార్డులు వచ్చాయి. ఆమె కథలన్నీ స్త్రీ విజయాలకు సంబంధించినవే కావడం గమనార్హం. ఈ పోటీలో గెలుపొందిన వారి కథ ‘ఆమే ఒక సైన్యం’ కూడా ఆ కోవకు చెందినదే.
తహసీల్దారుగా పనిచేస్తూ ఎంతో బిజీగా ఉండే ఆమె ఎన్నో అద్భుతమైన కథలు రాయడం చాలా గొప్ప విషయం. ఇంకో విషయం, ఆవిడ గొప్ప గాయని కూడా. మన తహసీల్దారు శ్రీ గోపాల్ గారిని, రత్నమణి గారికి బహుమతి అందజేయవలసినదిగా కోరుతున్నాము” అన్నాడు రామకృష్ణ.
గోపాల్, రత్నమణిని పట్టుశాలువాతో సత్కరించి, మెమెంటో, బహుమతి పాతికవేల రూపాయల చెక్కుని అందజేశాడు. “మేడం రత్నమణి గారు ఉత్తమ తహసీల్దారుగా మూడు సార్లు కలెక్టర్ గారి నుండి అవార్డులు అందుకున్నారు. వారు మా అందరికీ స్ఫూర్తి. తన జీతంలో సగం సామాజిక సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. గోదావరి జిల్లా నుండి ఇక్కడికి వచ్చి ఈ బహుమతి అందుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం. వారిని సత్కరించే భాగ్యం నాకు కలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది” అన్నాడు గోపాల్.
రత్నమణి మైకు చేతిలోకి తీసుకుని ముందుగా అన్నమాచార్య కీర్తన పాడింది. “అందరికీ నమస్కారం. ఈ భీమిలి నాకు బాగా నచ్చింది. చక్కని వాతావరణం. ఎంతో ఆదరం చూపిస్తున్న ఇక్కడి ప్రజలు నాకు ఎంతో నచ్చారు.
నా గురించి రామకృష్ణ గారు, గోపాల్ గారు ఎక్కువ చెప్పారేమో అనిపిస్తోంది. నేను ఒక సామాన్య స్త్రీని. నేను జీవితంలో ఎదుర్కున్న సమస్యలు, క్లిష్టమైన పరిస్తితులు నన్ను ఒక రచయిత్రిగా తీర్చిదిద్దాయి. మనిషి జీవితంలో జరిగే చిన్న సంఘటనకు కూడా, స్త్రీనే బాధ్యురాలిగా చేయడం నన్ను కలిచివేసింది. నా కథానాయికలు అందరూ, కష్టాల తుఫానులని ఎదుర్కుని ధైర్యంగా నిలిచిన ‘ధీరోదాత్తలు’. నిరాశా నిస్పృహలకు లోను గాకుండా స్వయం వ్యక్తిత్వంతో ఎదిగిన సాహస వనితలు. అక్షరం మనిషిని ఆలోచింపచేస్తుంది, ఉన్నత వ్యక్తిగా తీర్చిదిద్దుతుందని నా ప్రగాఢ విశ్వాసం.
నా కథకు బహుమతి ఇచ్చిన సంస్థ వారికి, నన్ను సత్కరించిన మిత్రులు గోపాల్ గారికి కృతజ్ఞతలు. నా బహుమతి మొత్తం ఇక్కడి వృద్ధుల ఆశ్రమంకి ఇవ్వవలసినదిగా గోపాల్ గారిని కోరుతున్నాను” అని చెక్కుని గోపాల్‌కి అందజేసింది రత్నమణి.
మిగతా విజేతలకు కూడా బహుమతులు ఇచ్చాకా సభ ముగిసింది. రత్నమణి బయటకు వచ్చి తన కారులో వెళ్ళిపోయింది. తను జీవితంలో ఎంత తప్పు చేసాడో తెలుసుకుని క్రుంగిపోయాడు రాఘవ. తండ్రి దుర్భోధలకు లొంగి అనర్ఘ రత్నాన్ని చేజార్చుకున్నందుకు తనని తానే నిందించుకున్నాడు.