Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చీకటి ముంపు

[శ్రీ చందలూరి నారాయణరావు రచించిన ‘చీకటి ముంపు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

రాత్రి పూట
భూమిపై ఒక్కడినే కూర్చుని
ఆకాశాన్ని చదివాను

గాలి అర్థం వినపడలేదు
నీరు జాడ తెలియలేదు
చీకటి నీడ కనపడలేదు

ఐనా మనసును
దిక్కుల్లో ముంచి
మట్టి బట్టలు కట్టించి

అడివితో మాట్లాడించి
సముద్రంతో కలిపాను
పర్వతాలను తిప్పి
మైదానాల్లో వదిలేసాను

ఒక్క నిజాన్ని
ప్రేమించలేని మనిషిని చూసి
బెంగతో

భూమి మంచం పట్టి
తూర్పు దిక్కును
ముడుచుకు పడుకుంది.

చీకటి ముంపుకు
నేల ముఖం మునిగి
మనిషి కొట్టుకుపోయాడు.

Exit mobile version