[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘చీకటి చూపును నేను’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
కాలం కర్కశ పద ఘట్టనల మధ్య
నలిగిన మాపును నేను
రేపటి తీపిని తెంపుకుని
చెరిగిపోయిన రూపును నేను
గంటలు.. ఘడియలు.. రోజులు నెత్తినబడి
పాతాళ కుహరాలలోకి జారుకున్న మార్పు నేను
ఆశ అనే అవకాశాన్ని లేకుండా
చేసుకున్న చీకటి చూపును నేను
నేటిని నిన్నటి కన్నీటిలో కలిపేసుకుని
వలపుకే వగరైన వెరపును నేను
నా ఉనికి అజ్ఞాతవాసం
నా బతుకు నిశీధితో సహవాసం
అంధకార బంధురం నా జీవితం
ఏ కాలానికీ అందని విచిత్ర వైనం
పెద్దాడ సత్యప్రసాద్ విశాఖపట్నం జిల్లా వాస్తవ్యులు, కవిగా, రచయితగా దశాబ్దాల ప్రయాణం. వీరి కధలు, కవితలు వివిధ పత్రికలలో ప్రచురితమవడమే కాక, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ద్వారా కూడా ప్రసారం అయ్యాయి. ఇక, వృత్తిగతంగా పాత్రికేయులు. రెండున్నర దశాబ్దాలకు పైగా పాత్రికేయ వృత్తిలో అంకితభావంతో పనిచేస్తున్నారు. రాజకీయ విశ్లేషణలు వీరి ప్రత్యేకత. ప్రస్తుతం ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగంలో న్యూస్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.