[హిందీ నవలల పరిచయం శీర్షికలో భాగంగా ‘చౌదహ్ ఫేరే’ అనే నవలని పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి.]
‘చౌదహ్ ఫేరే’ శివాని గారి మొదటి నవల. ఇది ముందుగా ‘ధర్మయుగ్’ అనే పత్రికలో సీరియల్‌గా వచ్చింది. ఇది సీరియల్‌గా వచ్చినన్ని రోజులు పాఠకులు తరవాత అహల్య జీవితం ఎలా మలుపు తిరుగుతుందీ అని అడుగుతూ రచయిత్రికి ఉత్తరాలు రాసేవారట. ఈ సీరియల్ ఆ పత్రిక సర్కులేషన్‌ను రెండింతలు చేసింది. శివాని కథలను, ధారావాహికలను మహిళా ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడేవారు. మేధావి వర్గం వీరి నవలలను స్త్రీలకు సంబంధించిన ప్రేమ కథాంశాలుగా కొట్టిపడేసినా ఆమెకు ఉత్తర భారతంలో విశేషమైన ప్రజాదరణ ఉన్న మాట కూడా నిజం. ఆమె సృష్టించిన స్త్రీ పాత్రలు విశిష్టమైన వ్యక్తిత్వంతో కనిపిస్తాయి. గొప్ప ఆత్మాభిమానంతో జీవితంలో నిర్ణయాలు తీసుకుంటాయి. ఇది ఆనాటి మధ్యతరగతి స్త్రీలను విశేషంగా ఆకర్షించిన అంశం. ‘చౌదహ్ ఫేరే’లో అహ్యల పాత్రను మలచిన తీరు గమనిస్తే అప్పటి ఉత్తర భారత గృహిణులు శివానిని ఎందుకు ఇష్టపడేవారో అర్థం చేసుకోవచ్చు.
ధనికుడైన ఓ జడ్జ్‌కు శివదత్ ఒక్కడే కొడుకు. కొడుకుని తనలాగే విదేశాలకు పంపించి లాయర్ కోర్సు చదివించాలనుకుంటారు జడ్జి గారు. కాని అతనికి స్నేహితుడు అయిన కమిషనర్ శివదత్త్ వ్యాపారంలో రాణిస్తాడని, తన స్నేహితుడైన విల్సన్ అనే ఇంగ్లీషు దొర దగ్గరకు పంపితే అతను వ్యాపార మెళుకువలు నేర్పిస్తాడని జడ్జ్‌కి చెప్తాడు. ఇప్పుడు వ్యాపారస్థులదే రాజ్యం అని, శివదత్‌లో ఆ లక్షణాలన్నీ ఉన్నాయి అని నమ్మకంగా చెబుతాడు. శివదత్ అజానుబాహుడు, అందగాడు కూడా. విల్సన్ శివదత్‌ని ఎంతో ఇష్టపడతాడు. తన కుటుంబంలోని సభ్యుడిగా అదరించి తన దగ్గరే ఉంచుకుని వ్యాపార మెళుకువలను నేర్పిస్తాడు.
కొన్నాళ్లకు భారతదేశానికి స్వతంత్రం తప్పదని గ్రహించి తన దేశం అయిన ఇంగ్లండ్ వెళ్లిపోవాలని నిశ్చయించుకుంటాడు విల్సన్. వెళుతూ తనతో శివదత్‌ను కూడా తీసుకెళతాడు. అలా విదేశాలకు వెళ్లిన శివదత్ ఎన్నో దేశాలు తిరుగుతాడు. అతన్ని అందరూ ప్రేమగా కల్నల్ అని పిలవడం మొదలెడతారు. విల్సన్ చనిపోయిన తరువాత కల్నల్ కలకత్తా తిరిగి వస్తాడు. ఇక్కడ విల్సన్ వదిలి వెళ్లిన వ్యాపారాలను అభివృద్ధి చేస్తూ కలకత్తాలో ధనికులలో ఒకడిగా పేరు సంపాదిస్తాడు.
కొడుకుకు తన ప్రాంతపు అమ్మాయినే ఇచ్చి పెళ్లి చేయాలన్నది జడ్జ్ గారి కోరిక. అలాగే పర్వత ప్రాంతాలకు చెందిన ఓ అమ్మాయితో పెళ్ళి నిర్ణయించి కొడుకుని రప్పించి వివాహం జరిపిస్తాడు. పెళ్లి అయిన తరువాత వధువు, భర్తతో కలకత్తా వెళ్లదు. అది వారి సంప్రదాయం కాదు. అత్త మామలకు సేవ చేయడం ఆమె ప్రధాన కర్తవ్యం కాబట్టి అత్తింట్లో పెద్దవారికి సేవ చేస్తూ ఉండిపోతుంది ఆ యింటికి కోడలుగా వచ్చిన నంది. కల్నల్ సంవత్సరానికి ఓ సారి మాత్రమే తల్లి తండ్రుల దగ్గరకు వస్తూ ఉంటాడు. అలా వచ్చినప్పుడు కూడా భార్య దగ్గర అధికారం ప్రదర్శించడం మాత్రమే చేస్తాడు. అతనికి భార్యలో ఏ ఆకర్షణా కనిపించదు. అత్త మామలు, మామగారి తండ్రిగారి సేవలతో ఆమె నిత్యం నలిగిపోతూ ఉంటుంది. భర్త ఉన్నప్పుడు కూడా ఆమె ఈ పనుల ఒత్తిడిలోనే రోజంతా గడుపుతుంది. దానితో ఆమె అంటేనే కల్నల్‌కు రోత పుడుతుంది. భార్యాభర్తల మద్య దూరం పెరిగిపోతుంది. కల్నల్ క్రమంగా ఇంటికి రావడం కూడా మానేస్తాడు. తనకో కూతురు పుట్టినట్లు అతనికి ఉత్తరం రాస్తారు తల్లి తండ్రులు. ఆమె నామకరణానికి కూడా కల్నల్ ఇంటికి రాడు. ఒక్కొక్కరుగా ఆ ఇంట్లో పెద్దవారు దాటిపోతారు. వారి అంతక్రియలకు వస్తాడు కల్నల్. కార్యక్రమలన్నీ పద్ధతిగా జరిపిస్తాడు.
అందరూ పోయాక నంది అక్కడ ఒంటరిదవుతుంది. ఇకనైనా భర్త దగ్గర ఉండాలని కలలు కంటుంది. అతనితో కలకత్తా వెళ్లాలని తయరవుతుంది. కాని తాను ఎప్పుడూ ఇంట్లో ఉండనని అందువల్ల ఆమెను కలకత్తా తీసుకెళ్ళడం సాధ్యపడదని ఆమెను పుట్టింటికి వెళ్ళమని చెప్పి తాను ఒక్కడే తిరుగు ప్రయాణమవుతాడు కల్నల్.
పుట్టింట్లో కొన్నాళ్లు నందిని వదిన బాగానే చూసుకుంటుంది. కాని కల్నల్ నందిని, కూతురు అహల్యను కూడా పట్టించుకోకపోవడం చూసి నంది పట్ల అమె ప్రవర్తన మారిపోతుంది. ఆమె అన్నకు నంది అంటే ఎంతో ప్రేమ. పైగా వికలాంగులైన తన కొడుకుల మధ్య బొమ్మలా మెరిసిపోయే మేనకోడలు అహల్య అంటే అతనికి ఎంతో ఇష్టం. కాని భార్య మాటకు ఎదురు చెప్పలేక ఆ ఇంట్లో నందికి ఎటువంటి తోడ్పాటును ఇవ్వలేకపోతాడు. నంది హీనాతిహీనంగా జీవిస్తూ ఉంటుంది. తనదనే ఇల్లు లేక, గౌరవం ప్రేమ దొరకక ఆమె భారంగా రోజులు గడుపుతూ ఉంటుంది. ఒకానొక సందర్భంలో ఇక ఆ ఇంట్లో ఉండలేని స్థితి వచ్చేసరికి నంది తెగించి భర్త ఇంటికి బిడ్డతో ప్రయాణం అవుతుంది. తోడు వచ్చిన అన్నను రేల్వే స్టేషన్ నుంచే తిప్పి పంపించి తాను ఒంటరిగా భర్త ఇంటికి వస్తుంది.
కల్నల్ గొప్ప భవనంలో అతి వైభవంగా జీవిస్తూ ఉంటాడు. భర్త వైభోగం చూసి నంది కోపంతోనూ అసహాయతతోనూ రగిలిపోతుంది. కల్నల్ ఆమెను చూసి ఆశ్చర్యపోతాడు. సరే వస్తే వచ్చావు కాని నేను చెప్పినట్లుగా నడుచుకోక తప్పదు అని హుకుం జారి చేసి ఆ బంగళాలో ఓ గదిలో ఆమెను ఉండమని ఆజ్ఞాపిస్తాడు. ఇంటి నౌకర్లు ఆమెను యజమానురాలిగా గుర్తించి గౌరవంగా చూడాలనుకున్నా కల్నల్ ప్రవర్తన మాత్రం దానికి విరుద్ధంగా ఉంటుంది. అహల్య కూడా అప్పటిదాకా తిండికి మొహం వాచి పల్లెటూరిలో ఏ సంరక్షణా లేకుండా పెరగడం వల్ల కల్నల్ కంటికి అనాగరికమైన జంతువుగా కనిపిస్తుంది.
ఇంట్లో జరిగే పార్టీలలో నందిని అలంకరించుకోమని చెప్పి ఆమెను అతిథుల ముందు ఓ సోఫాలో కూర్చోపెట్టి తానూ గృహస్థుడినని అందరికీ తెలియపరచడం తప్ప ఆమెతో కల్నల్ ప్రేమగా ఓ మాట కూడా మాట్లాడడు. ఆ పార్టీలోనే భర్తకు మల్లిక అనే ఓ స్త్రీతో సంబంధం ఉందని ఆ ఇంట్లో ఆమె అధికారమే నడుస్తుందని నందికి తెలుస్తుంది. నంది చూస్తూ ఉండగానే మల్లిక కల్నల్‌తో అతి చనువుగా మసలడం, కల్నల్ మల్లిక ముందే నందిని హీనంగా చూడడంతో నంది తట్టుకోలేకపోతుంది. ఆ యింట్లో తన స్థానం ఏంటో ఆమెకు అర్థం కాకుండా పోతుంది.
ఓ రోజు అహల్య బైట వీధిలో ఏదో కొనుక్కుంటూ కల్నల్‌కు కనిపిస్తుంది. మట్టి కొట్టుకుపోయిన బట్టలతో ఉన్న తన కూతురిని చూసిన కల్నల్ కోపంతో రగిలిపోతాడు. అప్పుడే హుటాహుటిన బజారుకెళ్లి కూతురికి మంచి బట్టలు కొనుక్కొని వచ్చి మద్రాసు కాన్వెంటులో చేర్పించి వస్తాడు. కూతురు కోసం ఎదురు చూసే నందితో తన కూతురు పల్లెటూరి బైతులా పెరగడం తనకు ఇష్టం లేదని అందుకే దేశంలోనే అత్యుత్తమ స్కూలులో ఆమెను చేర్పించానని, ఇక అహల్య కొన్నేళ్లకు కాని ఇంటికి రాదని చెప్తాడు. తన ఒంటరి జీవితంలో కూతురే ఆధారం అయితే ఆ ఆధారాన్ని భర్త తనకు కాకుండా చేస్తే విరక్తితో నంది మాట్లాడడం మర్చిపోతుంది. ఆ గదిలో ఓ మూలగా రామాయణ భాగవతాలు చదువుతూ కాలం గడుపుతుంది. ఆ ఊరిలోకి వచ్చిన ఓ సన్యాసికి శిష్యురాలిగా చేరుతుంది. క్రమంగా అన్నిటికీ దూరం అవుతూ ఆమె కూడా ఓ రోజు ఇల్లు వదిలి హిమాలయాలలోకి సన్యాసినిగా మారి వెళ్లిపోతుంది.
నంది వెళ్లిపోవడం ఎవరినీ బాధించదు. కల్నల్‌కు ఓ రకంగా వివాహ బంధం నుండి శాశ్వతమైన విముక్తి లభిస్తుంది. మల్లిక ఆ ఇంటికి పూర్తి స్థాయిలో యజమానురాలిగా మారుతుంది. ఆమె భర్త కల్నల్ దగ్గర మేనేజర్‌గా చేస్తూ ఉండేవాడు. అతనికి ఆరోగ్యం పాడయి మంచానికి పరిమితం అవుతాడు. అతని ఉద్యోగ భాద్యతలను మల్లిక నిర్వహిస్తూ కల్నల్‌కు దగ్గరవుతుంది. వారిద్దరి బంధం ఊరందరికి తెలుసు కాని ధనవంతుల ఇళ్లలో విషయాల పట్ల ఎవరికీ ఏ అభ్యంతరమూ ఉండదు. మల్లిక ఆ యింటికి కల్నల్ జీవితానికి కూడా యజమానురాలిగా మారిపోతుంది.
అహల్య చదువులో, ఆ యింటి ఆడంబరపు జీవితంలో పడి తల్లిని మర్చిపోతుంది. సెలవులకు ఇంటికి వచ్చిన ఆమెను మల్లిక ఆదరిస్తుంది. మల్లిక పర్యవేక్షణలో అహల్య ఓ హై క్లాస్ సొసైటీ స్త్రీగా మారిపోతుంది. ఆమె వేషభాషలు, జీవించే పద్ధతి అడుగడుగునా సేవకు సిద్ధమయ్యే నౌకర్లు వీటన్నిటి మధ్య ఆమె అపురూపంగా పెరుగుతుంది. అహల్య అందం గురించి ఊరంతా చెప్పుకుంటూ ఉంటారు. కల్నల్‌కు తన కూతురుని చూస్తే ఎంతో గర్వం ఆనందం. ఆమెను తీర్చిదిద్దడంలో మల్లిక విశేషమైన శ్రద్ధ చూపిందని, మల్లిక ప్రేమ ఆప్యాయతల మధ్య అహల్య తన తల్లిని కూడా మర్చిపోయిందని కల్నల్‌కు మల్లికపై ఎంతో ప్రేమ.
కలకత్తాలోని హై సొసైటీలో అహల్య ఆనందంగా జీవిస్తూఉంటుంది. ఆమె ఏది కోరినా కల్నల్ అది నిముషాల మీద తీసుకొచ్చి ఇస్తూ ఉంటాడు. ఆమె చుట్టూ ఆమెను ప్రేమించే ఎందరో యువకులు, ఆమె స్థాయికి చేరాలని కోరుకునే అమ్మాయిలు. తనను చూసి మోహించే వారిని కవ్వించడం అహల్యకు చాలా ఇష్టం. ఆమెలో కొంత అతిశయం, గర్వం కూడా అప్పుడప్పుడు తొంగి చూస్తూ ఉంటాయి. అందుకే తనపై ఇష్టం ఉందని తెలిసి కూడా, ఆ ఇష్టపడే మగ స్నేహితులకు అందకుండా వారికి కాదని చెప్పకుండా రోజులు గడిపేస్తూ ఉంటుంది అహల్య. ఎవరి ప్రేమను అంగీకరించక, ఎవరికీ దగ్గరకాలేక ఆమె అసహనంతో రోజులు గడుపుతూ ఉంటుంది.
కల్నల్ అహల్యకు పెళ్లి చేయాలనుకుంటాడు. పెళ్లి విషయం వచ్చేసరికి తన కూతురిని తాను పుట్టి పెరిగిన పరిసరాల మధ్య వరుడిని చూసి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు. అప్పుడే తనకు సోదరుని వరుస అయిన వ్యక్తి నుండి కూతురి పెళ్లి వేడుకకు రమ్మనే అహ్వానం కల్నల్‌కు అందుతుంది. ఈ మిషతో అహల్యను మొదటిసారి తన పూర్వీకుల ఇంటికి తీసుకుని వెళతాడు. ఎప్పుడు సెలవులకు ఎక్కడికి వెళ్లవలసి వచ్చినా మల్లికతో పాటు తండ్రీ కూతుర్లు కలిసి వెళ్ళడం అలవాటు. కాని తన పూర్వీకుల ఇంట పెళ్ళికి మల్లికను తీసుకువెళ్ళడం కల్నల్ కు ఇష్టం ఉండదు.
మల్లిక తన తరపు చుట్టాలలో ఒకబ్బాయికి అహల్యను ఇచ్చి వివాహం జరిపించాలని కోరుకుంటుంది. ఆ అబ్బాయిని ఇంటికి రప్పిస్తుంది కూడా. ఇది కూడా కల్నల్ ఇష్టపడడు. అతనికి తన పాత జీవితం పదే పదే గుర్తుకు వస్తూ ఉంటుంది. కలకత్తాలో ఆడంబరంగా జీవిస్తున్నా కూడా ఏదో తక్కువయినట్లు అతనికి నిత్యం అనిపిస్తూ ఉంటుంది. తన మూలాలు దూరం అయ్యాయి అని, తనవారి మధ్య, తనను ఎరిగిన వారి మధ్య తాను గొప్పగా కనిపించాలనే కోరిక అతనిలో పెరుగుతుంది. అందుకే అహల్య వివాహం తన పూర్వీకుల ఊరిలో జరిపించాలని అతను అనుకుంటాడు. ఈ పెళ్లి సాకుగా పెట్టుకుని అహల్యతో తన పాత ఊరికి వెళతాడు.
మొదటిసారి పర్వత ప్రాంతంలోని పల్లెటూరిని అహల్య చూస్తుంది. అక్కడి వారి ఆదరణ, ఆప్యాయత, కోపాలు ద్వేషాలు అన్నీ ఆమెకు కొత్తగా ఉంటాయి. పిన్ని కుటుంబానికి మల్లిక విషయం తెలుసని ఆమెకు అర్థం అవుతుంది. ఆ ఇంట్లో తనకు అర్థం కాని వింత పద్ధతుల మధ్య ఊపిరి ఆడనట్లున్న అహల్యకు అక్క బసంతి ప్రేమ ఉత్సాహానిస్తుంది. ఆ పల్లెటూరి వివాహ వేడుకలో పాలు పంచుకుంటున్న రాజు అనే వ్యక్తి ఆమెను ఆకర్షిస్తాడు. అతను మిలటరీలో పని చేస్తున్నాడని, తల్లి తండ్రులు మరణిస్తే అతని నానమ్మ అతన్ని పెంచిందని, తనకు అన్న వరుస అవుతాడని బసంతి అహల్యకు చెబుతుంది. రాజు అహల్య అప్పటిదాకా చూసిన పట్నం కుర్రాళ్లకు భిన్నంగా చాలా సహజమైన మానవ అనుభూతులతో అమెకు మరో ప్రపంచం నుండి వచ్చిన వ్యక్తిలా కనిపిస్తాడు. అతనిలోని నిజాయితీ, తాను నిత్యం సంచరించే రంగు రంగుల ప్రపంచానికి విరుద్ధంగా ఉండి ఆమెను ఆకర్షిస్తుంది.
బసంతి పెళ్లి తరువాత ఆమె భర్త ధరనీధర్‌తోనూ మంచి స్నేహం ఏర్పడుతుంది అహల్యకు. రాజుతో కలిసి వీరంతా అతని నాన్నమ్మ ఇంటికి వెళతారు. మతి స్థిమితం లేని ఆమె అహల్యను రాజు భార్యగా అనుకుంటుంది. ఇది అహల్యను మొదట ఇబ్బంది పెట్టినా ఆమెకు ఆనందం కూడా కలుగుతుంది. అక్కడే తన తల్లి ఒక మఠంలో ఉందని తెలిసి ఆమెను కలవాలని వెళుతుంది అహల్య. కూతురిని చూసి కూడా నిర్వికారంగా ఏదో ప్రపంచంలో ఉండిపోయిన నందిని చూసి అహల్య కలవరపడుతుంది. మొదటిసారి తన జీవితంలోని మోసం, అసహజత్వం ఆమెకు అర్థం అవుతాయి. తల్లి నిర్వికార స్థితి ఆమె ఆలోచనలపై చెరగని ముద్ర వేస్తుంది.
కల్నల్ ఆ ఊరిలో ఓ పెద్ద రాజకీయ నాయకుడి కొడుకు సర్వేశ్వర్‌తో అహల్య పెళ్లి నిశ్చయించాలనుకుంటాడు. అహల్య ఇది ఇష్టపడదు. దానితో వారిద్దరూ కలకత్తా తిరిగి వచ్చేస్తారు. అహల్య చుట్టూ తిరిగిన అమె స్నేహితులు తమ స్నేహ బృందలోని వేరే అమ్మాయిలను ఎంచుకుని వివాహం చేసుకుంటారు. దీంతో అందరి జీవితాలలోనూ మార్పు వస్తుంది. సంసారాలలో మునిగిపోయిన పాత స్నేహితుల మధ్య అహల్య ఒంటరిదవుతుంది. ఆమెకు ఊరి నుండి వచ్చినప్పటి నుండి కలకత్తా పట్ల ఆకర్షణ తగ్గిపోతుంది.
మల్లిక భర్త చనిపోయాడని ఆమె ఊరి విడిచి వెళ్లిపోయిందని అహల్యకు తెలుస్తుంది. దాంతో అహల్య అక్కడ ఉండలేకపోతుంది. రాజు ఆమెకు గుర్తుకు వస్తూ ఉంటాడు. అతను చైనా యుద్దంలో పాల్గొంటున్నాడని ఆమెకు తెలుస్తుంది. మరో పక్క యుద్దం కారణంగా ఎందరో వ్యాపారస్థులు దివాలా తీస్తుండడంతో కల్నల్‌కి తన పరిస్థితి పట్ల భయం మొదలవుతుంది.
అహల్య అక్కడ ఉండలేక తాను చదివిన స్కూల్‌లో టీచర్‌గా ఉద్యోగం సంపాదించి తండ్రి వద్దంటున్నా వినకుండా కలకత్తా వదిలి మద్రాసు చేరుతుంది. ఆమె పెళ్లిని సర్వేశ్వర్‌తో నిర్ణయించి అదే తన తుది నిర్ణయం అని ప్రకటించి ఆమెను కలకత్తా రప్పిస్తాడు కల్నల్. ఆ సమయంలోనే డిల్లీలో ఓ బ్రోతల్ నడుపుతున్న మల్లికను చూస్తుంది అహల్య. డబ్బు కోసం మల్లిక ఎంత నీచానికి దిగిందో చూసి తట్టుకోలేకపోతుంది అహల్య. మల్లికపై అప్పటిదాకా తాను పెంచుకున్న ప్రేమ వెనుక మల్లిక పన్నిన మాయాజాలం ఉందని, ఆమె స్వార్ధాన్ని తాను ప్రేమగా పరిగణించి మోసపోయానని, డబ్బు కోసం మల్లిక ఎంత నీచానికైనా దిగజారగల స్త్రీ అని అహల్యకు అర్థం అవుతుంది. దీంతో ఆమెకు తన జీవితం పట్లే విరక్తి కలుగుతుంది.
రాజు చైనా యుద్దంలో కనిపించకుండా పోయాడని, అతనికి అంతక్రియలు కూడా ఊరిలో చేసారని తెలిసిన అహల్యకు తన భవిష్యత్తు చీకటిగా కనిపిస్తుంది. దానితో తండ్రి నిర్ణయంచిన పెళ్లికి అడ్డు చెప్పలేకపోతుంది. సర్వేశ్వర్ స్వార్థపరుడని, అతనికి తన డబ్బుపై ఆశ అని, కల్నల్‌కు ఈ పెళ్లి ద్వారా పాత జీవితాన్ని పొందాలనే కోరిక, సర్వేశ్వర్ తండ్రి రాజకీయ పరపతితో వ్యాపార అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచన ఉందని ఆమెకు అర్థం అవుతుంది.
కాని వివాహం జరిగే సమయానికి రాజు బతికే ఉన్నాడని తెలియడంతో తన పిన్ని సహాయంతో అహల్య ఇల్లు దాటి మళ్ళీ ఆ పల్లెటూరికి వెళ్లిపోతుంది. అక్కడ బసంతి ఆమె భర్త సహకారంతో రాజుని వివాహం చేసుకుంటుంది.
అహల్య రాజు మరణం తరువాత ఒక ఊరి నుండి మరో ఊరికి చేసే ప్రయాణంలో ఎందరో కొత్త వ్యక్తులను పరిచయం చేసుకుంటుంది. అహల్య ఇంటిని వదిలి రాజు దగ్గరకు చేరడం దాకా ఒక యాత్రాకథనంగా కథను నడిపిస్తారు రచయిత్రి. ధనవంతురాలిగా ఆనందంగా జీవిస్తున్న అహల్యలో మొదటి నుంచి ఆ జీవితం పట్ల ఆమెకే తెలియని అసహనం కనిపిస్తూ ఉంటుంది. అన్ని సుఖాల మధ్య కూడా ఆమెలో అసంతృప్తి ఉంటుంది. తన పూర్వీకుల ఊరికి ఆ పర్వతాల మధ్యకు వెళ్లిన తరువాత తల్లిని చూడడానికి వెళ్లినప్పుడు తల్లి తన పట్ల నిర్వికారంగా ఉండడం, అన్ని బంధాలను అతీతంగా ఆమె మిగిలిపోవడం, మల్లికలోని ధన కాంక్ష నైతికపతనం ఇవన్నీ ఆమెను అలజడికి గురి చెస్తాయి. తాను తనది కాని జీవితాన్ని గడుపుతున్నానని ఆ జీవితం తనకు ఆనందాన్ని ఇవ్వదని ఆమెకు అర్థం అయి ఓ టీచర్‌గా చిన్న ఉద్యోగం చేస్తూ కొన్నాళ్లు ఆ జీవితానికి దూరంగా ఉండాలని వెళ్లిపోతుంది. చివరకు అన్ని అడంబరాలకు దూరంగా రాజు అనే ఓ సామాన్య సైనికుని సాహచర్యం తన జీవితానికి ఓదార్పు అని ఆమెకు అర్థం అయి చివరకు తండ్రిని అతని అహాన్ని, ధనాన్ని, అది ఇచ్చిన అధికారాన్ని వదిలి ఓ సామాన్యురాలిగా మిగిలిపోవడానికి సిద్దపడుతుంది.
‘చౌదహ్ ఫేరే’ నవల కథ అంతా అహల్య తనను తాను తెలుసుకోవాలని చేసే ప్రయాణం. మనకు తెలియకుండానే మన మనసుపై కొన్ని ముద్రలు పడతాయి. అవి కొన్ని సార్లు మరుగున పడిపోయి మనం సమాజంలోని హంగుల మధ్య సంచరిస్తూ ఉంటాం. కాని ఆ జీవితం మనకు తృప్తిని ఇవ్వదు. అప్పుడే మనిషి తనలోకి తాను తొంగి చూసుకుని తనను తాను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అహల్య తండ్రి ధనిక ప్రపంచంలో తనకే తెలియకుండా ప్రవేశిస్తుంది. ఆమె అందులోనే కొంత కాలం గడిపేస్తుంది. కాని అది ఆమె జీవితం కాదు. ఆమె చుట్టూ ఉన్న బంధాలన్నీ సౌకర్యవంతంగా ఉన్నా కూడా వాటి మధ్య ఆమెకు నిజమైన ఆనందం లేదు. ఎందుకంటే ఆ బంధాల పునాది స్వార్థం, అహంకారం. నిజాయితీతో నిండిన జీవితాలను తమ అహానికి గాయపడిన తల్లిలోని నిర్వికారాన్ని అనుభవించిన తరువాతే అహల్యను తన అసంతృప్తికి కారణం అర్థం అవుతుంది. అందుకే తన పాత జీవితంలోని సాధారణతను కోరి ఆమె వరిస్తుంది.
కథలో రాజు పాత్ర నిడివి చాలా తక్కువ. ఎక్కడ కూడా రాజు అహల్యను ప్రేమిస్తున్నట్లుగా చెప్పడు. అహల్య చదివే నవలలో ఆమె స్నేహితుడు ఆమెకు బహుకరించిన ఆమె చిత్రాన్ని దానితో పాటున్న ప్రేమ సందేశాన్ని చూసిన తరువాత రాజు ఆమెను దూరంగానే ఉంచుతాడు. ఆమెతో చనువుగా కూడా ఉండడు. కాని అతన్ని అహల్య కోరుకుంటుంది. తన బావ రాజుతో ఆమె వివాహం జరగడం సరయినదనే అభిప్రాయం బైట పెట్టిన తరువాతే ఆమె ఇంటి నుండి బైటకి వెళ్లిపోతుంది. అంటె నవల మొత్తం అహల్య దృష్టితోనే రాసారు. ఇందులో ఎక్కడా అహల్య రాజుల మధ్య ప్రేమ సంభాషణలు ఉండవు. అందువల్ల ఇది రొమాంటిక్ నవల అనలేం. అహల్య తన జీవితంలో తనను తాను తెలుసుకోవడానికి చేసిన ప్రయాణంగానే రచయిత్రి ఈ నవలను రాసారు. ఒక స్త్రీ అంత స్వతంత్రంగా వ్యవ్యహరిచడం అప్పట్లో పాఠకులకు ఓ కొత్త అనుభవమే. అదే ఈ ‘చౌదహ్ ఫేరే’ నవలను ఇప్పటికీ పాఠకులు ఆదరించడం వెనుక ముఖ్య కారణం. ‘చౌదహ్ ఫేరే’ అంటే పద్నాలుగు అడుగులు, రెండు సప్తపదులు అనే అర్థం కూడా వస్తుంది. రాజు నాన్నమ్మ వారిని మొదటి సారి తన ఇంట చూసినప్పుడు భార్యాభర్తలనే అనుకుంటుంది. అదే నమ్ముతుంది. మళ్ళీ ఆమె ముందే వారిద్దరూ భార్యాభర్తలయినప్పుడు వారి నడిచిన ఆ ఏడడుగులు ఆమెకు మరో ఏడడుగులులా అనిపిస్తాయి. రాజుని చూసి ఇష్టపడి ఆమె నానమ్మ అనుమతి పొందినప్పుడే అహల్య జీవితం రాజుతో ముడిపడిపోయింది. ఇప్పుడు జరగే ఆ వివాహ తంతు మరో సప్తపది అని చెప్పడం రచయిత్రి ఉద్దేశం.
‘చౌదహ్ ఫేరే’ అరవైలలో సీరియల్‌గా వచ్చి విశేషమైన ప్రజాదరణ పొందింది. ఇప్పటికి ఇది పద్నాలుగు పునర్ముద్రణలను చూసింది.
***
రచన: శివాని
ప్రచురణ: రాధాక్రిషన్ ప్రకాశన్
పేజీలు: 239
వెల: ₹250
ప్రతులకు:
ఆన్‍లైన్‌లో
https://www.amazon.in/Chaudah-Phere-Shivani/dp/8183610331