ఎప్పుడైనా యుద్ధం ఒక ఉన్మాదం
అది దేశాల అహంకార విస్ఫోటనం
నియంతల స్వార్థపూరిత ప్రకోపం
ముష్కర పాలకుల వికటాట్టహాసం
చెలరేగే రాక్షసగణాల విన్యాసం
మనుషులను మట్టుపెట్టే మృగత్వం
క్రూరత్వపు పడగల విష ప్రవాహం
ప్రాణాల్నిగాల్లో ఎగరేసే అమానుషత్వం
ప్రశాంతి ఒప్పందాలు ఎగిరిపోయే పత్రాలే
దండయాత్రల్తో నమ్మకాలు శకలాలే
సౌభ్రాత్రవాదాలు ఉత్తుత్తి భావనలే
అవి పునాదుల్తో కుప్పకూలే భవనాలే
ప్రపంచ శాంతి సంస్థల శుష్కహాసాలు
భద్రతనివ్వలేని మండలి మౌనముద్రలు
లాభనష్టాలెంచి స్పందించే తోటిరాజ్యాలు
ఆయుధాలమ్ముకునే కొన్నికిరాతకాలు
నిరంకుశుల పోరు బాట ఆధిపత్యం
టెక్నాలజీ చెక్కిన విధ్వంసకర విన్యాసం
భూఆక్రమణలో మంట కలిసిన మానవత్వం
తన నేలమట్టిలో తానే కలిసే మూర్ఖత్వం
మానవ అజ్ఞానం భస్మాసుర హస్తం
ఇది చరిత్ర చక్రంపై లిఖించబడుతుంది
యుద్ధమూల్యం మళ్ళీ మళ్ళీ చెల్లిస్తూ
ఆ పాఠాలతో కొత్తతరం సాగిపోతుంది

అల్లూరి గౌరీలక్ష్మి కథా, నవలా రచయిత్రిగా చక్కని పేరు సంపాదించారు. ఈమె మంచి కవయిత్రి, ఫెయిర్ కాలమిస్ట్ కూడా. నాలుగు కథా సంపుటాలూ, 4 నవలలూ, 3 కవిత్వ సంకలనాలూ, ఒక కాలమ్స్ బుక్ వెలువరించారు.
APIIC Ltd. లో General Manager గా పనిచేసి పదవీ విరమణ పొందారు.
5 Comments
Dr C.BHAVANI DEVI
గౌరీలక్ష్మి కవిత చాలా బాగుంది.వర్తమానచరిత్ర
Venu Madhav
మీ ఆవేశం మీ ఆవేదన… అక్షరాల్లో చూపించారు… సూపర్
అందరికి ఆలోచన రావాలి.. మార్పు రావాలి….యుద్ధ భావనలు విడిచి పెట్టాలి..శాంతి ని కోరుకోవాలి..
పుట్టి. నాగలక్ష్మి
ప్రపంచ శాంతి సంస్థలలోని శాంతి నేతిబీరకాయలోని నేతి వంటిదే.. సమకాలిక పరిస్థితికి అద్దం పట్టిన కవిత..


usha
ఆస్తినస్టం ప్రాణ నష్టం తప్ప ఒరిగేది ఏమి లేదు యుద్ధాల వల్ల . మార్పు రావాలి మీ ప్రతీ అక్షరం లోనూ ఆవేదన అర్ధం అవుతోంది గౌరీ లక్ష్మి గారూ
G. S. Lakshmi
వాస్తవ పరిస్థితికి అద్దం పట్టిన కవిత. చాలా బాగుంది గౌరీలక్ష్మిగారూ.