[శ్రీ కొడాలి సీతారామా రావు రచించిన ‘ఛాటింగ్ మాయ’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
తను దిగాల్సిన స్టేషన్ స్పీకర్‌లో వినపడటంతో మొబైల్ చూసుకుంటూ లేచి డోర్ దగ్గిర నిలబడింది మెట్రోలో.
ఆగగానే మొబైల్‌లో మెసేజ్ టైప్ చేసుకుంటూ ఎస్కలేటర్ మీదుగా బయటికి వచ్చి పార్కింగ్‌లో ఉన్న తన స్కూటీ ఎక్కి మొబైల్ హెల్మెట్‌లో పక్కన పెట్టి స్నేహితురాలితో మాట్లాడుకుంటూ ఇంటి వేపు బయలుదేరింది.
నందనకి చిన్నప్పటి నుంచీ స్నేహితులు ఎక్కువే. ఎక్కువగా వాళ్ళ ఇళ్ళల్లోనే వుండేది పగలంతా. ఈ మొబైల్ వచ్చాక ఇక సీరియస్‌గా ఆఫీసు పని చేసుకునేటప్పుడు తప్ప ఎప్పుడూ ఫోన్లో మాట్లాడటమే.
ప్రయాణాలు చేసేటప్పుడు కూడా రాత్రంతా ఎవరో ఒకరితో అలా కబుర్లు చెప్తూ వుంటుంది. వంట చేసేటప్పుడూ తినేటప్పుడు, పిల్లకి పాలు పట్టేటప్పుడు, ఆఖరికి పిల్లదానికి స్నానం చేయించేటప్పుడు కూడా.
వంటలు కూడా యూట్యూబ్లో చూసి వెరైటీలు చేస్తుంది. రుచిగానే వుంటాయి. అత్తగారు కూడా మెచ్చుకుంటుంది.
కోడలు వచ్చిన అలికిడి విని తలుపు తీసిన హేమలతకి పోర్టికోలో స్కూటీ పెడుతున్న నందన కనపడింది.
కోడలి వెనక తల్లి, పసిపిల్ల కనపడకపోయేసరికి ఆశ్ఛర్యపోయింది. ఉదయం కోడలితో పాటే వెళ్ళిన వాళ్ళు తనతో రాకపోయేసరికి అనుమానం వచ్చింది. ఆఫీసు దగ్గిరనే వున్న నందన పిన్నిగారి ఇంటిలో దింపి, సాయంత్రం వచ్చేటప్పుడు తీసుకువస్తానంది. ఇప్పుడు తనతో లేరు. అక్కడే వుండిపోయారనుకుంది.
ఇంట్లోకి వస్తూ కూడా ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ వస్తోంది.
అయినా ఎదురు వెళ్ళి “పిల్లా, అమ్మా ఏరే?!” అడిగింది.
ఆ మాటతో ఉలిక్కిపడి ఒక్కసారి తన చేతివంక చూసుకుంది. ఫోనే వుంది. రెండో భుజాన హేండ్ బేగ్ వుంది. కంగారు మొదలయ్యింది.
“అయ్యో, అత్తయ్యా ఈ ఫోన్ చూసుకునే హడావిడిలో వాళ్ళని ట్రైన్ లోనే మర్చిపోయాను.” అంటూ గబగబ బయటికి వచ్చి స్కూటీ తీయబోయింది.
ఇంతలో గేటు దగ్గర ఆటో ఆగింది. అందులోంచి తల్లి, పిల్లతో దిగుతూ కనిపించింది.
ఇద్దరి మనసు కుదుట పడింది.