Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చరిత్ర విశ్లేషణ – అంబేద్కర్ దృక్కోణం-8

[కస్తూరి మురళీకృష్ణ అందిస్తున్న ‘చరిత్ర విశ్లేషణ – అంబేద్కర్ దృక్కోణం’ అనే వ్యాసపరంపర.]

“If any non-Brahmin were to make such an attempt the Brahmin scholars would engage in a conspiracy of silence, take no notice of him, condemn him outright on some flimsy grounds or dub his work useless. As a writer engaged in the exposition of the Brahmanic literature I have been a victim of such mean tricks.”

‘The Untouchables’ పుస్తకానికి ముందుమాటలో డా. అంబేద్కర్, తన పరిశోధనల పట్ల అగ్రవర్ణాల వారి స్పందనను విమర్శించారు.

చరిత్ర విశ్లేషణలో అంబేద్కర్‍కు ఏ రాజు ఎంత కాలం పాలించాడు? ఏ రాజు ఏమేం కట్టించాడు? ఎన్ని రాజ్యాలు గెలిచాడు? వంటి విషయాలు ప్రాధాన్యం కాదు. అంబేద్కర్ దృష్టి రాజకీయంపై లేదు. ఆయన దృష్టి చరిత్రలో సాంఘిక జీవనంపైనే, అదీ ప్రధానంగా అంటరానిజాతుల జీవనం పైనే.

‘అంటరానితనం’ గురించిన పరిశోధనలో అంబేద్కర్ సమాజంలో అగ్రవర్ణాల వారి నుంచి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కున్నారు. కానీ అంబేద్కర్ తన లక్ష్యం వైపు సాగిపోయారు. చరిత్ర విశ్లేషణలో అంబేద్కర్ అవలంబించిన సూత్రాలలో ఇది ఒకటి. తన పరిశోధన ఫలితాలను ప్రకటించిన తరువాత వాటిపై విశ్లేషణలను, విమర్శలను ఆహ్వానించటమే కాదు, ఆ విమర్శ, విశ్లేషణలను కూడా పరిశీలించాలి. వాటికి సమాధానాలివ్వాలి. ఎప్పుడయితే, ఎదుటివారి విమర్శలో జిజ్ఞాస కన్నా హేళన ఎక్కువ ఉన్నదని గ్రహిస్తారో, కించపరచాలన్న ఉద్దేశం ఉందని తెలుస్తుందో అప్పుడు ఆ విమర్శలను పట్టించుకోవద్దు.

అంబేద్కర్ ప్రతిపాదనలకు ఆ కాలంలో వ్యతిరేకత రావటం మాత్రమే కాదు, ఒక పద్ధతి ప్రకారం ఆయన ప్రతిపాదనల పట్ల ‘మౌనం’ వహించారు పండితులు. ఆ ప్రతిపాదలన్నవే లేనట్టు, అవి పనికి రానివన్నట్టు ప్రవర్తించారు. విమర్శిస్తే, అందరి దృష్టి ఆ వైపు ఆకర్షితమవుతుంది. కాబట్టి, అసలు అలాంటి ప్రతిపాదనలే లేనట్టు విస్మరిస్తే వాటంతట అవే విస్మృతిలో పడతాయి. కానీ తన శక్తివంతమైన వాదనల ద్వారా తరతరాల మనస్సాక్షిని స్పందింప చేశారు అంబేద్కర్.

భారత సమాజంలో వర్ణవ్యవస్థ గురించి విస్తృతంగా పరిశోధించి, నిర్మొహమాటంగా ఫలితాలను ప్రకటించారు. ఎట్టి పరిస్థితులలోనూ ఆయన తన లక్ష్యం నుంచి పక్కదారి పట్టలేదు. కాబట్టి, ఎవరైనా అంబేద్కర్ దృక్కోణంలో చరిత్రను విశ్లేషిస్తున్నామని ప్రకటిస్తే, వారి పరిశోధన, వారి విశ్లేషణ, వారి ప్రతిపాదనలు సర్వం ‘సామాజిక జీవనం’పైనే ఉండాలి. సామాజిక జీవనంలో కూడా వారి దృష్టి ‘చారిత్రాత్మకంగా అణగారిన వర్గాలవారి’ పైనే ఉండాలి.

ఇందుకు భిన్నంగా చరిత్రలో రాజులు, రాజ్యాలు, శాసనాలు, ప్రబంధాలు, కావ్యాలకు పరిమితం కావటం అంబేద్కర్ దృక్కోణం కాదు. అంబేద్కర్ వ్యాఖ్యలు, విశ్లేషణలు, తాను ఎంచుకున్న అంటరానివారి మానసిక, సామాజిక, ఆర్థిక అంశాలకు మాత్రమే ఆయన పరిమితం చేసుకున్నారు.  ఆయన ప్రతి అక్షరం ఈ అంశాలకు సంబంధించిన ఎంతో లోతైన విశ్లేషణ, పరిశోధన, ప్రతిపాదనల గురించి మాత్రమే. ఆయన ఎంత లోతుగా పరిశోధించారంటే రెండు కులాలకు నడుమ విభేదాలు వస్తే, వ్యక్తి రెండు కోణాలలో ఆలోచిస్తాడని తీర్మానించారు.

“Whether he is caste conscious or class conscious depends upon the caste with which he comes in conflict. If the caste with which he comes in conflict is a caste within the class to which he belongs he is caste conscious. If the caste is outside the class to which he belongs he is class conscious.”

(Dr. Babasaheb Ambedkar: Writings and Speeches, Vol 5, Page 164)

ఈ విశ్లేషణ ఆధారంగా కులాల నడుమ ద్వేష భావనల చరిత్రను ఆవిష్కరించారు అంబేద్కర్.

అంతే కాదు, మత రాజకీయాల వెనుక కూడా కులం, సామాజిక స్థాయి వంటి అంశాలు ఉన్నాయని ఆయన ప్రతిపాదించారు.

“Those Hindus and Musalmans who are now fighting have the same policy in Indian politics. They want to establish their classes from them as the governing body. The masses whether of the Hindus or of the Musalmans are merely used for establishing the ascendency of the classes.”

(Dr. Babasaheb Ambedkar: Writings and Speeches, Vol 5, Page 128)

అయితే చరిత్ర విశ్లేషణలో అంబేద్కర్ దృక్కోణం, 1980 ప్రాంతాలలో – subaltern studies కు ప్రాధాన్యం లభించినప్పటి నుంచీ, అత్యంత ప్రాచుర్యం పొందటం ఆరంభించింది. Subaltern చరిత్ర రచనలో జాతీయ భావనలకు గాని, వామపక్ష వాదాలకు కానీ తావు లేదు. ఇదొక స్వతంత్రమైన చారిత్రక పరిశోధనా పద్ధతి.

“Subaltern consciousness evolves out of the experiences of subordination – out of the struggle, despite the daily routine of servitude, exploitation and deprivation. The subaltern consciousness causes be found in archives material conveniently used by historians since it prepared and preserved by dominant groups.”

(Introductory to Subaltern Studies, Vol 1, by Ranjit Guha)

చరిత్ర విశ్లేషణ్ పై అంబేద్కర్ దృక్కోణం ఫలితం అంటే subaltern studies. కాబట్టి, ఎవరైనా అంబేద్కర్ దృక్కోణంలో చరిత్రను విశ్లేషిస్తున్నామంటే అది subaltern studies పంథాలో ఒదగాలి. అలా జరగకుండా ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే, అది చరిత్ర రచన అవుతుంది తప్ప, అంబేద్కర్ దృక్కోణంలో చరిత్ర రచన కాదు. అది వారి దృక్కోణానికి అంబేద్కర్‍ను అడ్డు పెట్టుకుని ప్రామాణికత సాధించాలన్న ప్రయత్నం తప్ప మరొకటి కాదు. పాఠకులు ఇది గ్రహించాలి. వారి ముసుగులు తొలగించి అసలు రూపును దర్శించాలి.

(సమాప్తం)

Exit mobile version