Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చరిత్ర విశ్లేషణ – అంబేద్కర్ దృక్కోణం-4

[కస్తూరి మురళీకృష్ణ అందిస్తున్న ‘చరిత్ర విశ్లేషణ – అంబేద్కర్ దృక్కోణం’ అనే వ్యాసపరంపర.]

“Firstly I claim that in my research I have been guided by the best tradition of the historian who treats all literature as vulgar. I am using the word in its original sense of belonging to the people to be examined and tested by accepted rules of evidence without recognizing any distinction between the sacred and the profane and with the sole object of finding the truth.”

(From the preface of ‘Who were the Shudras?’)

18-19వ శతాబ్దాలలో భారతీయ చరిత్ర గురించి బ్రిటీష్ పాలకులు పరిశోధనలు ప్రారంభించినప్పుడు బ్రిటీష్ వారు చరిత్ర పట్ల వారి దృక్పథాన్ని భారతదేశ చరిత్ర పరిశోధనలలోనూ ఉపయోగించారు. ఆ కాలంలో బ్రిటీష్ రచయితలు అధికంగా romanticism, classicism దృక్కోణంలో గతాన్ని విశ్లేషించేవారు. గతంలొ వీరోచితమైన పోరాటాలు, అందమైన ప్రేమ గాథలు, త్యాగాలు, సాహసాలు దర్శించాలని తహతహలాడేవారు. విలియమ్ జోన్స్, కోల్‍బ్రూక్ వంటి వారు భారతదేశ గతాన్ని దర్శించి, విశ్లేషించేందుకు దారులు ఏర్పరిచారు. భాష, న్యాయసూత్రాలు, సంస్థలు, గ్రంథాలు వంటి వాటి ద్వారా గతాన్ని అర్థం చేసుకుని అందించాలని ప్రయత్నించారు. బ్రిటీష్ వారు భారత్‍లో అడుగుపెట్టేసరికి భారతీయులు దిగజారేరు. పతనం చెందారు. వారి గొప్పతనం అంతా గతంలోదే. భారతదేశం మళ్ళీ గతవైభవాన్ని అందుకోవాలంటే, సాహిత్యాన్ని అనుసరించి, అర్థం చేసుకోవాలి. గతించిన కవిత్వ వైభవాన్ని తిరిగి అందిపుచ్చుకోవాలి అన్న ఆలోచనతో భారతదేశ చరిత్రను రచించారు.

“The Orientalists saw themselves as the mediators who would define this relationship between the past and the present. As codifiers and translators they would be the ones to discover the ancient texts and ascribe to them their true meanings.”

(by William Dray in Theories of History, Edited by Patrick Gardiner)

19వ శతాబ్దాని కల్లా చరిత్ర రచన రంగంలోకి ‘లిబరలిస్టులు’ ప్రవేశించారు. వీరు ప్రాచీన కాలం గొప్పతనాన్ని పొగడటం, దాన్ని గొప్పగా భావించటాన్ని విమర్శించారు. తిరస్కరించారు. వీరు ఆధునికానికి పెద్ద పీట  వేశారు. వీరి దృష్టిలో గొప్పతనమంతా పాశ్చాత్య దేశాలదే. వీరు వ్యక్తిగతానికి, స్వేచ్ఛకు, ప్రజాస్వామ్యానికి ప్రాధాన్యం ఇచ్చారు. వ్యక్తి ప్రాధాన్యం దృష్టిలో చరిత్రను విశ్లేషించారు. వీరి దృష్టిలో ‘కొత్త వింత – పాత రోత’.

“‘While orientalists discovered in India’s past a succession of Golden Ages, liberals like James Mill and Thomas Macaulay could see only shades of darkness.”

– Neeladri Bhattacharya, Seminar on Rethinking History

పాశ్చాత్య ప్రపంచంలో మధ్యయుగం అంధయుగం. అంధయుగం నుంచి పునరుజ్జీవ యుగం ఉత్పన్నమయింది. వైజ్ఞానిక ప్రగతికి దారి తీసింది. కానీ భారత్‍తో సహా ఇతర దేశాలలో ఇంకా చీకటి యుగం సమాప్తమవలేదు. వీరు చీకటి నుంచి వెలుగులోకి ప్రయాణం ఆరంభించలేదు. ముఖ్యంగా భారతదేశం కులం, జాతి, అంధ విశ్వాసం వంటి పలు బురదలలో కూరుకుపోయి ఉంది.

ఈ ఆలోచనలతో భారతదేశ చరిత్రను, వీరు, ఆనాటి పాలకులకు అనువుగా నిర్మించారు. భారతదేశం ఎన్నడూ ఒక్క దేశం కాదు. ‘జాతీయత’, ‘జాతీయభావం’, ఐక్యత’ అన్నవి భారతదేశ చరిత్ర విషయంలో అర్థం లేనివి. జాతీయభావం అన్నది అగ్రకులస్తులు తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవటం కోసం, ప్రజలలో భావావేశాలు రెచ్చగొట్టి, వారిని తమ గుప్పిట్లో ఉంచుకునేందుకు వాడే ఆయుధం.

ఇలా భారతదేశ పాలకులు రాసిన చరిత్ర, చరిత్ర రచయితలు భారతీయ సంప్రదాయంగా చూపించినవన్నీ వారి సృష్టి. భారతదేశ చరిత్రను యూరోప్ చరిత్ర దృష్టితో చూసి, ఆ చరిత్ర ప్రామాణికాలతో ఏర్పాటు చేశారు. వీరు చరిత్రను యుగాలుగా విభజించారు. ప్రాచీన, మధ్య, ఆధునిక యుగాలుగా చరిత్రను తమకి అనుగుణంగా నిర్మించారు.

పాలకులు రచించిన చరిత్రను కాదని, జాతీయవాదులు తమ దృష్టితో చరిత్రను రచించినా, వారు ప్రధానంగా భారతదేశం గతం ఎంతో గొప్పదనీ, రానురానూ దేశం దిగజారిందన్న ప్రాతిపదిక ఆధారంగానే చరిత్రను రచించారు. వీరు ప్రాచీన చరిత్రను ‘హిందూ మహాయుగం’ అనీ, మధ్య యుగాన్ని ‘మహమ్మదీయ మహాయుగం’ అనీ, ఆధునిక చరిత్రను ‘బ్రిటీష్ పాలనా యుగం’ అనీ విభజించారు. అంటే చరిత్ర రచనలో ‘మతం’ ప్రాధాన్యం వహించిందన్న మాట. దాంతో హిందూ మహాయుగం తరువాత మతపరంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా బాహ్య శక్తుల ఆధిక్యం దేశంలో చలామణీ అయిందన్న భావనతో చరిత్ర రచించారు.

మార్క్సిస్టు దృక్పథం రంగప్రవేశం చేయటంతో పీడితులు, పీడకుల భావన చరిత్ర రచనలో ప్రవేశించింది. వీరి దృష్టిలో భారతదేశ చరిత్ర వర్గ చరిత్ర. వర్గ పోరాటం చరిత్రగా మారిపోయింది. 1857 సిపాయి తిరుగుబాటు, ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం కాక, అధికారం కోల్పోయిన పెత్తందార్లు, భూస్వాములు చేసిన అధికారం తిరిగి పొందటం  కోసం చేసిన  పోరాటంగా రూపాంతరం చెందింది. తరువాత జరిగిన స్వతంత్ర్య పోరాటం కూడా భూస్వాములు, పెట్టుబడీదార్లు తమ ప్రయోజనాలకు భంగ కలిగిస్తున్న బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా జరిపిన పోరాటం తప్ప స్వతంత్ర్య  పోరాటం కాదు వీరి దృష్టిలో.

ఈ రకంగా, మూడు భిన్నమైన పాయులుగా ప్రవహిస్తున్న భారతీయ చరిత్ర రచన నదిలో అంతర్వాహినిగా ఆరంభమై, ప్రత్యేక ‘నది’గా ఎదిగింది, చరిత్ర విశ్లేషణలో అంబేద్కర్ దృక్పథం. భారతదేశ చరిత్ర రచనలో రాజులు, రాజ్యాలు గెలవటం, దానాలివ్వటం, శాసనాలు వేయించటం, కట్టడాలు కట్టించటం వంటి విషయాలు కాక, చరిత్ర రచన అంటే సామాజిక చరిత్ర, ముఖ్యంగా అణచివేతకు గురయి, సమాజం అంచులలో అతి దయనీయమైన పరిస్థితులలో జీవిస్తున్న వారి చరిత్ర అన్న నమ్మకంతో భారతదేశ చరిత్రను విశ్లేషించటం ప్రారంభించారు అంబేద్కర్.

ఇది అంత వరకు ఎవరూ నడవని మార్గం. ఈ మార్గంలో దారి దివ్వెలు లేవు. మార్గ సూచక చిహ్నాలు లేవు. సగటు మనుషులు అందరు నడిచే దారిలో నడుస్తారు. ప్రతిభావంతులు తమదైన ప్రత్యేక దారిని ఏర్పాటు చేసుకుంటారు. కొండల్లోంచి, గుట్టల్లోంచి, అడవుల్లోంచి, ముళ్లల్లోంచి వారు దారిని ఏర్పాటు చేస్తారు. అలా దారిని ఏర్పాటు చేసేప్పుడు అనేక కష్ట నష్టాలను భరించాల్సి ఉంటుంది. ఎగతాళులు, హేళనలను సహించాల్సి ఉంటుంది. నిరాశా, నిస్పృహలను దాటి ముందుకు నడవాల్సి ఉంటుంది. అన్నిటినీ దాటుకుని వారు  దారిని ఏర్పాటు చేస్తారు. కొన్నాళ్లకు అదే రహదారి అవుతుంది.

1946 లో భారతదేశ చరిత్రను, తాత్త్వికతను నూతన దృష్టితో చూస్తూ విశ్లేషిస్తున్న తరుణంలో అంబేద్కర్‌కు తాను ఎదుర్కోవాల్సిన కష్టనష్టాల గురించి సంపూర్ణ అవగాహన ఉండటమే కాక, తాను ఎలాంటి ప్రతికూలమైన శక్తులను ఎదుర్కోవాల్సి ఉంటుందో కూడా స్పష్టంగా తెలుసు.

చరిత్ర పరంగా, ఆధారాలుగా భావించేవి ఏవీ, అంబేద్కర్ అనుసరిస్తున్న దృక్కోణంలో చరిత్ర రచనకు ఆధారాలు కావు. ఫలానా రాజు ఫలానా దేశాన్ని ఫలానా సంవత్సరంలో జయించాడు. ఫలానా దానాలిచ్చాడు. ఫలానా కోట కట్టాడు. ఫలానా రాజకుమారిని వివాహమాడేడు. శాసనాలు, కట్టడాలు, అవశేషాలు ఏవీ సాంఘిక చరిత్రను అట్టడుగు వర్గాల దృష్టిలో ప్రదర్శించవు. వారి స్థితిగతులను బహిర్గతపరచవు.

“శాసనములలో పర్వాలు, దానాలు, తూకములు, భూమికొలతలు, పొలిమేరలు, ఆలయములు మున్నగునవి మాత్రమే తెలియును. స్థానిక చరిత్రలో చాల భాగము కల్పితములతో, అతిశయోక్తులతో, పుక్కిటి పురాణాలతో నిండి యుండును. విదేశియాత్రికులు, వ్యాపారులు, రాయబారులు, కాకతీయ విజయ ​నగర కాలాలలోని ఆంధ్రులను గూర్చి కొన్ని వ్రాసిరి. అవి చాలా సహాయము చేయును. కాని అందు వ్రాసిన వ్రాత లన్నియు నిజమని నమ్మరాదు.”

ఆంధ్రుల సాంఘిక చరిత్ర వ్రాయటం లోని సాధకబాధకాలను వివరిస్తూ,పుస్తకానికి ముందుమాటలో సురవరం ప్రతాపరెడ్డి  సాంఘిక చరిత్ర రచన ఎంత కష్టమో స్పష్టం చేశారు. ఆంధ్రుల సాంఘిక చరిత్ర వ్రాయటంలోనే ఇన్ని కష్టాలుంటే, ఎలాంటి ఆధారాలు లేని, తమ చరిత్రను తామే రచించే అవకాశం లేని, వినిపించే స్వరం లేని అణగారిన వర్గాల వారి చరిత్రను పరిశోధించి, గ్రహించి, విశ్లేషించి, వ్రాయటం మామూలు పని కాదు. దివిజ గంగను భువికి దింపటం ఇంతకన్నా సులభం అనిపిస్తుంది. గడ్డివాములో  సూదిని వెతకటం ‘హాయి’ అనిపిస్తుంది.

డాక్టర్ అంబేద్కర్ ఎంచుకున్న మార్గం ఇది. తనది కంటకాకీర్ణ మార్గం అని ఆయనకు తెలుసు. ఎందుకంటే ప్రత్యక్ష ప్రమాణాలు లభ్యం కావు. ఉన్న ప్రమాణాల లోంచి, ఆధారాల లోంచి, లేని దాన్ని ఊహించి నిర్మించాల్సి ఉంటుంది.

అందుకే చరిత్ర ఇలా రాయాలి, అలా రాయాలి అని సూత్రాలను వివరించే వారందరినీ ఆక్షేపించారు అంబేద్కర్. ‘గెథే’ చరిత్ర రచన గురించి చెప్పినదాన్ని ఆమోదిస్తూ విభేదించారు.

“But Goethe does not tell what the historian is to do when he comes across a missing link, when no direct evidence of connected relations between important events is available. I mention this because in the course of my investigations it’s the Origin of Untouchability and other inter-connected problems. I have been confronted with many missing links.”

బ్రాహ్మణులకు దానాలు ఇచ్చిన వివరాలు లభిస్తాయి. వారికి జరిగిన సన్మానాలు, తొడిగిన గండపెండేరాల వివరాలు లభిస్తాయి. సైన్యాధిపతుల వీరగాథల వివరాలు లభిస్తాయి. వ్యాపారుల వ్యాపార వ్యవహారాలు తెలస్తాయి. వేశ్యల స్థితిగతులు గ్రహించవచ్చు. కవులు కళాకారుల గురించి తెలుసుకోవచ్చు.  కానీ సమాజం అంచులలో నివసించే వారి జీవన విధానం గురించి తెలిసేది ఎలా? ఇలాంటప్పుడు, చరిత్ర విశ్లేషణను సమాజంలో ఒక స్థాయి వారికి మాత్రమే పరిమితం చేయాలా? ఆధారాలు లభించటం లేదని, లభించే అవకాశం లేదని అన్వేషణను ఆపేయాలా? అంబేద్కర్ కూడా ఇలాంటి ప్రశ్నలే వేసుకున్నారు. వాటికి సమాధానం కూడా చెప్పారు.

“I believe that in such cases it is permissible for him to use his imagination and intuition to bridge the gaps left in the chain of facts by links not yet discovered and to propose a working hypothesis suggesting how facts which cannot be connected by known facts might have been inter-connected.”

రెండు సంఘటనలను కలిలే అంశానికి సంబంధించి ఆధారం లభించకపోతే, ఆ సంబంధాన్ని చరిత్ర రచయిత ఊహించవచ్చు. ‘ఇలా జరిగి ఉండవచ్చ’ని ఊహాత్మకమైన ప్రతిపాదనలు చేయవచ్చు. ఆ ప్రతిపాదనలు  కనుక ఆ సంఘటనల నడుమ సంబంధాన్ని తార్కికంగా వివరిస్తే, సంతృప్తికరంగా విశ్లేషిస్తే, దాన్ని ఇలా జరిగి ఉండవచ్చని తాత్కాలికంగా అనుకోవటంలో తప్పులేదు. భవిష్యత్తులో ఆధారాలు లభిస్తే ఇది ‘నిజం’ అని నిరూపితమవుతుంది. వ్యతిరేకమైన ఆధారాలు లభిస్తే, ఈ ‘ఊహ’ అవసరం తీరుతుంది. ఎవరైనా ఇంతకన్నా బాగా వివరించే ప్రతిపాదన చేస్తే, చర్చ ద్వారా ఏది నిజమై ఉంటుందో తేల్చవచ్చు. అంతేకానీ పరిశోధనలను, అన్వేషణలను ఆపేయాల్సిన అవసరం లేదు.

చరిత్ర రచన కేవలం ఆధారాలపై ఆధారపడదు! ఆధారాల ద్వారా సత్యాన్ని ఊహించాల్సి ఉంటుంది. ఆధారాలు చెస్తున్న సత్యం వైపు కాక, చెప్పకుండా దాచిన సత్యాన్ని ఊహించటం ద్వారా సత్యం వెలుగుల నీడలో పైకి కనబడకుండా చీకటిలో దాగిన నిజాన్ని ఊహించి, గ్రహించే వీలుంటుంది. అందుకే చరిత్ర ఒక విజ్ఞాన శాస్త్రం మాత్రమే కాదు, చరిత్ర రచన ఒక ‘కళ’ కూడా అంటారు. అంబేద్కర్ ఈ పద్ధతిని అవలంబించారు.

“I must admit that rather than wind up the work, I have preferred to resort to this means to get over the difficulty created by the missing links which have come in my way.”

ఆధారాల కోసం అంబేద్కర్ ప్రాచీన గ్రంథాలు, శాస్త్రాలు, మతపరమైన రచనలను కుడా విశ్లేషించారు. వాటిని పవిత్రమైన గ్రంథాలుగా, భగవద్వాక్యంలా కాక, చరిత్ర రచనకు ‘ఆధారాలు’ అందిచే ఒక ‘సాధనం’లా మాత్రమే చూశారు. అందుకే సాహిత్యాన్ని పరిశోధించి, పరిశీలించి, ఆధారాలను వెతికే ఒక ‘పనిముట్టు’లానే భావించారు తప్ప ‘పవిత్రమైన రచనలు’గా భావించలేదు.

ఇది చరిత్ర విశ్లేషణలో అంబేద్కర్ ఏర్పరిచిన మరో సూత్రం. రెండు సంఘటనల నడుమ సంబంధాన్ని తెలిపే ఆధారాన్ని ఊహించవచ్చు. అందుకోసం అవసరమైతే, శాస్త్రాలను, ప్రాచీన సాహిత్యాన్ని, దైవగ్రంథాలను కూడా ఆధారంలా విశ్లేషించవచ్చు. “Without recognising any distinction between the sacred and the profane and with the sole object of finding the truth”. సత్యావిష్కరణ కోసం పవిత్రం లేదు, అపవిత్రం లేదు. ఉన్నది ఆధారం. దాన్ని నిర్మొహమాటంగా, తార్కికంగా విశ్లేషించాల్సిందే. సత్యాన్ని ఆవిష్కరించాల్సిందే, అది ఎంత అప్రియమైనదైనా!!

(ఇంకా ఉంది)

Exit mobile version