[కస్తూరి మురళీకృష్ణ అందిస్తున్న ‘చరిత్ర విశ్లేషణ – అంబేద్కర్ దృక్కోణం’ అనే వ్యాసపరంపర.]


“..an historian ought to be exact, sincere and impartial; free from passion, unbiased by interest, fear, resentment or affection; and faithful to the truth, which is mother of history.”
‘Who were Shudras?’ అన్న పుస్తకానికి ముందుమాటలో డా. అంబేద్కర్ చరిత్ర రచయితకు, విశ్లేషకుడికి ఉండవవలసిన లక్షణాలను స్పష్టంగా చెప్పారు. చరిత్ర గురించి అధ్యయనం చేసేవారు, విశ్లేషించేవారు, ఉన్నది ఉన్నట్టుగా సరిగ్గా ప్రదర్శించాలి. నిజాయితీగా, నిష్పాక్షికంగా ఉండాలి. వారి ఇష్టాయిష్టాలతో పని లేదు. అపోహలు, దురూహలు ఉండకూడదు. భయం, క్రోధం, నిరసన వంటి వాటితో చరిత్ర విశ్లేషణకు పూనుకోకూడదు. నిజాన్ని నిక్కచ్చిగా చెప్పటమే కాదు, నిజాల ఆధారంగా చెప్పేది కూడా నిజానికి దగ్గరగా ఉండాలి.
అంబేద్కర్ దృక్కోణంలో చరిత్రని విశ్లేషిస్తామని చెప్పుకునేవారు తప్పనిసరిగా, అంబేద్కర్ సూచించిన లక్షణాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇటీవలి కాలంలో కొందరు రచయితలు అంబేద్కర్ దృక్కోణంలో చరిత్ర రాస్తున్నామంటూ తమ అపోహలు, భయాలు, ఇష్టాయిష్టాలను తమ చరిత్ర విశ్లేషణలో ప్రకటిస్తూ, తాము అలా ప్రకటిస్తున్నామని బహిరంగంగా ప్రకటిస్తున్నారు కూడా. అంబేద్కర్ అభిమానులమని చెప్పుకునేవారు కూడా ఇలాంటి అపోహల, వ్యక్తిగత ఇష్టాయిష్టాల, దురూహల రచనలను సమర్థిస్తూ, అదే సత్యం అన్నట్టు పూనకం వచ్చిన వారిలా ఊగిపోతూ వీరంగాలు వేయటం చూస్తే, గుడ్డివాడు కుష్టువ్యాధిగ్రస్తుడి సౌందర్యాన్ని పొగుడుతున్న ‘కథ’ గుర్తుకువస్తుంది.
ప్రస్తుతం మనం చరిత్ర రచన అంటే పాశ్చాత్య చరిత్ర రచన విధానం గానే భావిస్తున్నాం. ఎందుకంటే, ఒక పద్ధతి ప్రకారం భారతీయ చరిత్ర రచన పద్ధతిని ‘పనికిరానిది’గా పక్కకు నెట్టేశారు. దాంతో పాశ్చాత్య చరిత్ర రచన పద్ధతి ప్రకారం రచించినది మాత్రమే చరిత్రగా గుర్తింపు పొందుతోంది.
పాశ్చాత్య చరిత్ర రచనలో objectivity, ‘నిష్పాక్షికత’ అత్యంత ప్రాధాన్యం వహిస్తుంది. ఈ ‘నిష్పాక్షికత’ గురించి పాశ్చాత్య ప్రపంచంలో బోలెడన్ని చర్చలు, వాదోపవాదాలు జరిగాయి.
గతాన్ని గురించి సరిగ్గా తెలుసుకోవాలంటే, తెలిసిన విషయాన్ని, తెలుసుకుంటున్న వాటిని వేరు చేసి చూడాలన్నాడు హెరొటోడస్.
అంటే చారిత్రిక సత్యాన్ని విశ్లేషించేవారు నిష్పాక్షికంగా, నిర్మోహంగా ఉండాలన్న మాట.
“The assumptions on which is (the concept of objectivity) rests include a commitment to the reality of the past, and to truth as correspondence to that reality; a sharp separation between knower and known, between fact and value, and, above all, between history and fiction. Historical facts are seen as prior to and independent of interpretation: the value of an interpretation is judged by how well it accounts for the facts”.
(That Noble Dream: The Objectivity Question, by Peter Novick)
అంటే చరిత్రలో నిరూపితమైన సత్యాలు నిజం. ఆ సత్యాల ఆధారంగా ఎలాంటి విశ్లేషణలు చేసినా, అవి నిరూపితమైన సత్యానికి వ్యతిరేకంగా ఉండకూడదు. ఆ విశ్లేషణలు సత్యాన్ని ఎంతబాగా వివరిస్తాయన్నదానిమీద విశ్లేషణ విలువ ఆధారపడివుంటుంది.
అందుకే డా. అంబేద్కర్ తాను చేసిన ప్రతిపాదనలు సత్యానికి దగ్గరగా ఉన్నాయా లేదా?, అందుబాటులో ఉన్న సత్యం గురించి అవగాహన కలిగించి, కొత్త అర్థంలో సత్యాలను దర్శింపజేస్తున్నాయా లేదా? విశ్లేషించి విమర్శించమన్నారు.
ఇలా ఒక సత్యాన్ని అర్థం చేసుకుని విశ్లేషించాలంటే, నిష్పాక్షికమైన దృష్టి అత్యవసరం. అంటే, చరిత్ర రచనలు చేసేవారు న్యాయమూర్తుల్లా నిష్పాక్షికంగా, నిర్మోహంగా వ్యవహరించాలి. ఏదో ఒక భావం ప్రచారానికో, ఒక ఆలోచనను సమర్థించటానికో, చరిత్రను దిగజార్చకూడదు. న్యాయమూర్తి తీర్పులలాగా, చరిత్ర విశ్లేషణలు, సమతౌల్యంగా, న్యాయబద్ధంగా ఉండాలి. సాంఘిక ఒత్తిళ్ళు, రాజకీయ ఒత్తిళ్ళకు దూరంగా ఉండాలి. అంతేకాదు, అందుబాటులో ఉన్న సత్యాలను, వ్యక్తిగత స్వార్థం కోసం తమకు ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యానించకూడదు. “not having any investment in arriving at one conclusion rather than another.” (Peter Novick).
చరిత్ర రచనలో ‘నిష్పాక్షికత’ ఆధారంగా చరిత్ర రచయితలు రెండు వర్గాలుగా విడిపోయారు – పాజిటివిస్టులు, ఆబ్జెక్టివిస్టులు.
పాజిటివిస్టుల ప్రకారం చరిత్ర రచన కుడా ఒక విజ్ఞానశాస్త్రం లాంటిదే. ప్రతి సమాజం మూడు దశలలో అభివృద్ధి చెందుతుంది. మొదటిది ‘కాల్పనిక దశ’. బాల్య దశ లాంటిది ఇది. ప్రాకృతిక సంఘటనలను దైవంతో ముడిపెట్టి వివరిస్తారీ దశలో. రెండవ దశలో ప్రాకృతిక సంఘటనలను మంత్రతంత్రాలతో ముడిపెడతారు. మానవ మేధ పరిణతి చెందిన దశ పాజిటివ్ దశ. ఈ దశలో ప్రాకృతిక సూత్రాలను కనుగొంటారు. పరిశోధనలు, ఫలితాలు, విశ్లేషణల ఆధారంగా సత్యాలను ఆవిష్కరిస్తారు. అగస్ట్ కామ్టే ప్రతిపాదించిన ఈ సిద్ధాంతాలను ఆమోదించి అనుసరించేవారిని పాజిటివిస్టులంటారు.
జర్మనీకి చెందిన Niebuhr, Ranke ఇద్దరూ ఆబ్జెక్టివిస్ట్ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశారు. వీరి సిద్ధాంతం ప్రకారం చరిత్ర పరిశోధకుల పని సత్యాలను విశ్లేషించి, ఆవిష్కరించటం. దీనిలో ఊహలకు తావు లేదు. చారిత్రిక అధారాలు సత్యం చెప్తాయి. పరిశోధకుడు తన వ్యక్తిత్వాన్ని, వ్యక్తిగతాన్ని ఈ సత్యాలకు దూరంగా ఉంచి పరిశీలించాలి. ఇలా నిరూపితమైన ఆధారాల ప్రాతిపదికనే చరిత్ర నిర్మించాలి.
ఇ. హెచ్. కార్ ప్రకారం, “History consists of a corpus ascertained facts. The facts are available to the historian in documents, inscriptions and so on, like fish in the fishmonger’s slab. The historian collects them, takes them home, and cooks and serves them in whatever style appeals to him.”
అంటే చరిత్ర రచయిత పని అందుబాటులో ఉన్న ఆ సత్యాల ఆధారంగా చరిత్రను రూపొందించటం తప్ప ఊహలు, ఆలోచనలకు తావు లేదన్న మాట.
కానీ 20వ శతాబ్దంలో పలు రకాల అస్తిత్వ ఉద్యమాలు చారిత్రక సత్యాలను విశ్లేషించే ‘దృష్టి’లో మార్పు తీసుకువచ్చాయి. అంతవరకూ చరిత్ర రచయితల దృష్టి రాజకీయ చరిత్ర పైనే ఉండేది. 20వ శతాబ్దంలో సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక చరిత్రల పట్ల కూడా చరిత్ర రచయితలు దృష్టి సారించాల్సి వచ్చింది. దాంతో పలువురు చరిత్రకారులు, చరిత్రను ‘విజ్ఞానశాస్త్రం’ కన్నా ‘సాహిత్యం’గా భావించటం వైపు మొగ్గు చూపించటం ప్రారంభించారు. చరిత్రకారులు చెప్పే చరిత్ర, ‘నిజం’ కన్నా, ఆయా చరిత్రకారులు ఊహించిన చరిత్ర, ‘the historian’s accounts of the past does not refer to the real past, but to the world imagined by historians’ అనటం ఆరంభమయింది.
ఇది, చరిత్రకారుడు నిష్పాక్షికంగా ఉండాలన్న ఆలోచనను దెబ్బ తీసింది. “While the scientist was expected to the reality of the nature, the historian was involved in the process of constructing reality. Thus unlike the scientist, the historian could be not just an observer. It is there, impossible to achieve objectivity in history-writing”. శాస్త్రవేత్త తాను చేసే పరిశోధనలలో భాగం కాడు. కానీ చరిత్ర రచయిత తాను పరిశోధిస్తున్న, విశ్లేషిస్తున్న చరిత్రతో సంబంధం ఉన్నవాడు కాబట్టి , దానిలో భాగం కాబట్టి సంబంధం లేకుండా నిష్పాక్షికంగా ఉండటం కష్టం. కాబట్టి వీలయినంత నిష్పాక్షికంగా ఉండవచ్చు కానీ, సంపూర్ణంగా నిష్పాక్షికంగా ఉండటం వీలవదు అని చరిత్రకారులు అర్థం చేసుకున్నారు.
అందుకే R. G. Collingwood తన పుస్తకం ‘The Idea of History’ లో “Each historian writes his/her own history which may or may not have things in common with each other” అని తీర్మానించాడు.
ఒక కవి చరిత్ర రాస్తే, కవిత్వం దృష్టితో చరిత్ర రాస్తాడు. ఒక తత్త్వవేత్త చరిత్ర రాస్తే, తాత్త్విక దృష్టితో రాస్తాడు. యుద్ధం గెలిచినవాడు చరిత్ర రాస్తే గెల్చినవాడి దృష్టితో రాస్తాడు. యుద్ధం ఓడినవాడు చరిత్ర రాస్తే ఓడినవాడి దృష్టితో రాస్తాడు. కాబట్టి, “There is no point in asking which was the right point of view. Each was the only one possible for the man adopted it.”
దీనిని బట్టి చూస్తే, ఏ చరిత్ర రచయిత అయినా తానున్న సమాజం, కాలం, తానున్న సమాజంలోని అపోహలు, ఆవేశాలు, భయాలు, రాజకీయాలు, ఆలోచనలకు అతీతంగా చరిత్ర రాయటం కష్టం. కాబట్టి చరిత్ర రచయిత ఎంత నిష్పాక్షికంగా రాసినా, రచయిత వ్యక్తిత్వం, వ్యక్తిగతం అతడి చరిత్ర రచనలో కనిపిస్తుంది. అందుకే ఇ. హెచ్. కార్ – “No documents can tell us more than what the author of the document thought – what he thought had happened, what he thought ought to happen or would happen, or perhaps only what he wanted others to think he thought, or even only what he himself thought he thought.” అన్నాడు.
చరిత్ర పరిశోధన, పద్ధతుల పట్ల అవగాహన పెరుగుతూ, నూతన సత్యాలు వెలికివచ్చి పాత చరిత్రను మార్చాల్సిన పరిస్థితులు కల్పిస్తుండడం వల్ల ‘historical absolute truth’ అంటే, చరిత్రలో ‘సంపూర్ణ సత్యం’ అన్నది లేదని, నూతన సత్యావిష్కరణ జరిగే వరకూ ‘తాత్కాలిక సత్యం’ అమలులో ఉంటుందన్న ఆలోచన వ్రేళ్ళూనుకుంది. అందుకే Paul A Roth – it is important to rid ‘oneself of a notion of historical truth’ అని ప్రకటించాడు. ఇలాంటి పలు ఆలోచనల వల్ల చరిత్ర పరిశోధన, రచన అన్నది ఆత్మవిశ్వాస రాహిత్య స్థితికి చేరుకున్నది. దీనికి ప్రధాన కారణాలు జాక్వెస్ ఒరీడా ప్రతిపాదించిన Theory of Deconstruction, క్లిఫోర్డ్ గీర్జ్ సిద్ధాంతం Cultural Anthropology, న్యూ హిస్టారిసిజం సిద్ధాంతాలు. వీటి వల్ల చరిత్ర అన్నది ఒక శాస్త్రంలా ప్రమాదంలో పడింది.
ఇలాంటి ప్రమాదం రాకుండా ఉండాలంటే, చరిత్ర విశ్లేషకులు అందుబాటులో ఉన్న ఆమోదితమైన ఆధారాలను ప్రాతిపదికగా తీసుకుని చరిత్ర రచనను సాగించాల్సి ఉంటుంది. తాము చేసిన ప్రతిపాదనలు ఆమోదితమైన సత్యాల అర్థాలను వివరిస్తూ, వాటి పట్ల నూతన దృష్టిని కలిగించాల్సి ఉంటుంది. వ్యక్తిగత ఇష్టాయిష్టాలు, లాభనష్టాలు, ఒత్తిళ్ళను పరిగణనలోకి తీసుకోకుండా చరిత్రను రచించాల్సి ఉంటుంది.
అంటే ముందుగా, చరిత్ర రచయిత, ‘తను చెప్పిందే సత్యం, మరో సత్యం లేదు’ అనకూడదు. అందుబాటులో ఉన్న ఆధారాలను వ్యక్తిగత ఇష్టాయిష్టాల ప్రకారం వక్రీకరించకుండా విశ్లేషించాల్సి ఉంటుంది. తాను చేసిన ప్రతిపాదనలు నిజాన్ని మరింతగా వివరించేట్టుండాలి. ఏ తీర్మానం చేసినా అది ‘నిజం’ ఆధారంగానే జరగాలి. అంతేకానీ, ‘నాకు ఫలానా రాజు అంటే అసహ్యం కాబట్టి వాడు ధూర్తుడు, ఫలానా రాజు అంటే ఇష్టం కాబట్టి ఆ రాజు దౌష్ట్యంలో కూడా గొప్పతనం చూపిస్తాను’ అనకూడదు.
అందుకే డా. అంబేద్కర్ తన చరిత్ర ఆధారిత ప్రతిపాదనల పుస్తకాల ముందుమాటలలో చరిత్రను అర్థం చేసుకునేందుకు, విశ్లేషించేందుకు పలు విధానాలను, సూత్రాలను పొందుపరిచారు. ఎందుకంటే, ఆ కాలంలో, భారతదేశ చరిత్రను అంతవరకూ ఎవరూ చూడని కోణంలో విశ్లేషించారాయన. ఈ విశ్లేషణలు, అంబేద్కర్ దృష్టిని అర్థం చేసుకోవాలంటే, అంబేద్కర్ ఈ రచనలు చేసినప్పుడు నెలకొని ఉన్న పరిస్థితులు, వాటిని అర్థం చేసుకుని తన దృక్కోణాన్ని వివరించేందుకు అంబేద్కర్ పొందుపరిచిన మార్గదర్శక సూత్రాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే చరిత్ర విశ్లేషణలో అంబేద్కర్ దృష్టి అర్ధమవుతుంది.
(ఇది వచ్చే వారం)
