[కస్తూరి మురళీకృష్ణ అందిస్తున్న ‘చరిత్ర విశ్లేషణ – అంబేద్కర్ దృక్కోణం’ అనే వ్యాసపరంపర.]
నాందీ ప్రస్తావన:
“I am not so vain as to claim any finality for my thesis.. my critics [should] consider whether this thesis is not a workable and therefore, for the time being, a valid hypothesis if the test of a valid hypothesis is that it should fit in with all surrounding facts, explain them and give them a meaning which in its absence they do not appear to have. I do not want anything more from my critics than a fair and unbiased appraisal.”
1948 ప్రచురితమైన ‘The Untouchables’ అన్న పుస్తకానికి ముందుమాటలో పుస్తక రచయిత బి. ఆర్. అంబేద్కర్, పై ఆలోచనను ప్రకటించారు.
వైజ్ఞానిక దృక్పథం ఇది!
ఆలోచనలున్న ప్రతి ఒక్క వ్యక్తి అర్థం చేసుకుని ఆలోచించి ఆచరించాల్సిన పద్ధతి ఇది!
ముఖ్యంగా తాము అంబేద్కర్ దృక్కోణాన్ని అనుసరిస్తున్నామని బహిరంగంగా ప్రకటించుకుంటూ, తమ వ్యక్తిగత ఇష్టాయిష్టాలను, భావాలను, ఊహలను, ఆలోచనలను ‘చరిత్ర రచన’ (Remaking of History) పేరిట కొత్త చరిత్రను, ఇష్టం వచ్చినట్టు రాసేస్తూ, అంబేద్కర్ సూచనలను పూర్తిగా విస్మరిస్తున్నవారు, ఆయన పేరు చెప్పుకుంటున్నందుకు, ప్రతి రోజు ప్రొద్దున్నే లేచి ఓ వందసార్లు చదివి అర్థం చేసుకోవాల్సిన సూచన ఇది. చరిత్ర విశ్లేషణలో అంబేద్కర్ దృక్కోణాన్ని అర్థం చేసుకునేందుకు మొదటి, అత్యంత ప్రధానమైన సూత్రం ఇది.
చరిత్ర పరిశోధన వేరు, ఆ పరిశోధనలను ఆధారంగా చేసుకుని విశ్లేషించి, చరిత్రను రచించటం వేరు.
చరిత్ర పరిశోధకులు primary source material ను పరిశోధించి సాధిస్తారు.
Primary sources provide first hand testimony or direct evidence concerning a topic under investigation.
ప్రాథమిక ఆధారం అంటే, పరిశోధిస్తున్న అంశానికి సంబంధించిన సాక్ష్యం, ఆధారం. ఇది సంఘటన సంభవిస్తున్నప్పటిది కావచ్చు. ఏదైనా రచన కావచ్చు. జ్ఞాపకాలు కావచ్చు, ఉత్తరాలు, శిలలు, శిల్పాలు, స్తంభాలు, కట్టడాలు, శాసనాలు.. ఇలా ఎన్నెన్నో రకాల సాక్ష్యాలు, ఆధారాలు ఒక్కో సంఘటనకు సంబంధించి ఉంటాయి. వీటిని శోధించి, బయటకు తెచ్చి, పరిష్కరించి, ఆయా సత్యాలను ఆవిష్కరిస్తారు పరిశోధకులు.
చరిత్ర రచయితలు, అధ్యయనపరులు ఈ సత్యాలను విశ్లేషిస్తారు. వీరు స్వయంగా పరిశోధించరు. అంతకు ముందు పరిశోధించి, ఆవిష్కరించిన సత్యాల ఆధారంగా విశ్లేషణ సాగిస్తారు. ఆ విశ్లేషణల ఆధారంగా ఆవిష్కృతమైన సత్యాల స్వరూపాలను సమర్థించటమో, వాటిల్లో నూతన కోణాలను చూపటమో, లేక అసత్యాలను ఖండించటమో, తప్పు నిరూపించటమో చేస్తారు. వీరి వాదన ఏదైనా అందుబాటులో వున్న సత్యాలను అనుసరించి వుండాలి. అందుకే, తన ప్రతిపాదన should fit in with all surrounding facts, explain them and give them a meaning అన్నారు అంబేద్కర్.
మరి కొందరు, ఇలా ఆవిష్కృతమైన సత్యాలను ఒక దారంలా గుదిగ్రుచ్చి, సంఘటనల నడుమ సంబంధాలను విశ్లేషించి, వివరించి, సరళమైన రీతిలో సామన్యులకు చరిత్రను చేరువ చేస్తారు.
అంబేద్కర్ చరిత్ర పరిశోధకుడు కాడు. ఆయన ఆర్థికశాస్త్ర నిపుణుడు. కానీ సాంఘిక రాజకీయ అంశాలలో చురుకుగా పాల్గొనటం వల్ల ఆయన దృష్టి చరిత్ర వైపు మళ్ళింది. అందువల్ల ఆయన రచనలు ఇతర అంశాల కన్నా చరిత్ర అధ్యయనం, విశ్లేశణ, సత్యాల ప్రతిపాదనలు ప్రధానంగా సాగాయి.
విల్ డ్యూరాంట్ అన్న చరిత్ర రచయిత, “know the historian before you know his history” అంటాడు.
అయితే, అంబేద్కర్ తన గురించి తాను తెలుసుకున్న చరిత్ర రచయిత. స్పష్టమైన అవగాహన, విస్పష్టమైన ఆలోచన, సూక్ష్మమైన పరిశీలనలతో ఆయన తనని తాను అర్థం చేసుకున్నారు. తన శక్తులను, బలహీనతలను అవగాహన చేసుకున్నట్టే, తానున్న సమాజం శక్తినీ, బలహీనతలను కూడా అర్థం చేసుకున్నారు. వీటన్నిటి ఆధారంగా ఆయన చరిత్ర పరిశోధన, విశ్లేషణల సూత్రాలను ఏర్పాటు చేశారు. తన ప్రతిపాదనలకు, తాను ఆవిష్కరించిన సత్యాలకు కూడా వాటిని వర్తింపజేశారు.
అందుకే ముందుమాటలో “నేను ప్రతిపాదించిన ప్రతి అంశం తిరుగులేని సత్యం అని ఖచ్చితంగా భావించే అహంకారం నాకు లేదు” అని స్పష్టంగా చెప్పారు. తన విమర్శకులు తాను చెప్పిన ప్రతిదాన్నీ ఆమోదించాలని లేదు, వారికి నచ్చిన రీతిలో వారు విశ్లేషించి, ఇవి సత్యశోధనలో సరైన దారిలో ప్రయాణిస్తున్నాయో లేదో తేల్చి, ఆమోదితమైన సత్యాలను అనుసరించి వున్నాయా అని విశ్లేషించి, తన ప్రతిపాదనల వల్ల నిరూపితమైన సత్యాలు అర్ధమవుతున్నాయో లేదో పరిశీలించి, ఇంకా ఇతర పరిశీలనలకు గురిచేసి నిగ్గు తేల్చమని అడుగుతున్నారు. తనను గుడ్డిగా విమర్శించే బదులు, నిర్మొహమాటంగా, నిజాయితీగా, న్యాయంగా తన ప్రతిపాదనలను పరిశీలించమంటున్నారు.
తాను చెప్పిందే సత్యం, తనను కాదన్నవాడికి తెలివి లేదు, జ్ఞానం లేదు, తాను సంపూర్ణ జ్ఞాని, ఇక తాను నేర్పటమే తప్ప, నేర్చుకోవాల్సిందేమీ లేదు అనటం అహంకారం, అజ్ఞానం, మూర్ఖత్వం. తాను ప్రతిపాదించిన ప్రతి అంశము తనకు సత్యమైనా ఇతరులకు సత్యమవ్వాలని లేదు. కాబట్టి, తాను ప్రతిపాదించిన అంశాలను వైజ్ఞానిక సూత్రాల ఆధారంగా విశ్లేషించి, వివరించి, సమర్థించటమో, ఖండించటమో చేయమని అంటున్నారు. ఇది చరిత్ర రచనలో అంబేద్కర్ రచనలు ప్రదర్శించే ప్రథమ సూత్రం.
ఇంద్రియాల జ్ఞానం అసంపూర్ణం. దోష భూయిష్టం.
ప్రతి వ్యక్తికి తనదైన దృక్కోణం, పరిశీలన, శక్తులు, బలహీనతలు, అపోహలు ఉంటాయి. వీటిని దాటి ఎదిగి నిర్మోహంగా, నిష్పాక్షికంగా, నిజాయితీగా అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలించి విశ్లేషించాలి. తాను నిజమని గ్రహించిన ప్రతిపాదనలను సమర్పించాలి. ఆ పై ఆ ప్రతిపాదనలపై ఇతరుల విమర్శలు, అభిప్రాయాలు, ప్రతికూల వాదనలు అన్నిటినీ స్వీకరించి, సమాధానాలు ఇచ్చి, ప్రతికూల వాదనలను పూర్వపక్షం చేసి, తన ప్రతిపాదనలు అన్ని విమర్శలను, ప్రతివాదనలను తట్టుకుని నిలబడగలవని నిరూపించాలి. అప్పుడే అది అధికుల ఆమోదం పొందిన సత్యం అవుతుంది.
ఇందుకు భిన్నంగా ‘నేను చెప్పిందే సత్యం, ఇక ఎవ్వరూ ఎమీ చెప్పనవసరం లేదు’, ‘నేను సత్యం చెప్పాను, అర్థం చేసుకోకపోతే, అది నీ తెలివిలేని తనం, నన్ను కాదంటే నువ్వు నాకు వ్యతిరేకం, మూర్ఖుడివి, నన్ను కాదంటే అభివృద్ధి నిరోధకుడివి, నీతో వాదన లేదు, ఫో, చెప్పేది చెప్పాను, జైకొడితే నీకు బుర్ర ఉంది, లేకపోతే నీ ఛావు నువ్వు చావు’ అనటం వైజ్ఞానిక దృక్పథం ఎలాగో కాదు, పైగా వారు ఏ అంబేద్కర్ దృక్కోణాన్ని అనుసరించి తాము చరిత్ర రచన చేస్తున్నామని చెప్పుకుంటున్నారో, ఆ అంబేద్కర్ ప్రదర్శించిన వైజ్ఞానిక దృక్పథానికి పూర్తిగా వ్యతిరేకం. అంటే అంబేద్కర్ పేరును రక్షణ కవచంలా వాడుకుంటున్నారు తప్ప ఆయన సూచనలను పాటించటం లేదు. సూత్రాలను అనుసరించటం లేదు. ఆయన దృక్కోణాన్ని ఆచరించటం లేదు. ఒకవేళ ఆయన దృక్కోణాన్ని గ్రహించి, అవగాహన చేసుకోకుండా ఇలా ప్రవర్తిస్తే, వారి అజ్జానానికి జాలిపడవచ్చు. కానీ ఇది అంబేద్కర్‌ను అవగాహన చేసుకుని కూడా, కావాలని ఆయన సూచించిన సూత్రాలను, ఆచరించిన విలువలను విస్మరిస్తున్నారంటే, ఇది చరిత్రకు, జాతికే కాదు, తాము దైవంలా పూజిస్తామని చెప్పుకుంటున్న డా. బి. ఆర్. అంబేద్కర్‌కు కూడా ద్రోహం చేస్తున్నట్టు, అన్యాయం చేస్తున్నట్టు. అవమానం చేస్తున్నట్టు.
ఇలాంటి వారిని చూస్తే, ఆనంద్ బక్షీ రాసిన పాట పల్లవి గుర్తుకు వస్తుంది.
“దేఖో ఓ దీవానో తుమ్ యే కామ్ న కరో
‘రామ్’ కా నామ్ బద్నామ్ న కరో..”
రాముడి పేరు స్థానంలో ‘అంబేద్కర్’ అన్న పేరు ఉంచితే, ప్రస్తుతం అంబేద్కర్ దృక్కోణంలో చరిత్రను నిర్మిస్తున్నామని (Remaking of History) చెప్పుకుంటున్నవారి ప్రవర్తనకు సరిగ్గా సరిపోతుంది.
అంబేద్కర్ రచనలలో, ఆయన పాటించిన విలువలు, పొందుపరిచిన చరిత్ర విశ్లేషణలను ఆవిష్కరించే ఈ వ్యాస పరంపరకు ఇది నాందీ ప్రస్తావన. ఈ వ్యాస పరంపర వారం వారం చరిత్ర రచనలో అంబేద్కర్ ప్రదర్శించిన సూత్రాల వివరణతో, భవిష్యత్తులో అంబేద్కర్ దృక్కోణంలో చరిత్రను రచించాలనుకునే వారికి మార్గదర్శక సూత్రాలు తెలియచేస్తూ సాగుతుంది.
(ఇంకా ఉంది)