Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చరిత్ర రచనా చక్రవర్తి పండిత గొర్రెపాటి వెంకట సుబ్బయ్య

[డా. జి వి పూర్ణచందు గారు రచించిన ‘చరిత్ర రచనా చక్రవర్తి పండిత గొర్రెపాటి వెంకట సుబ్బయ్య’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]

“ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం” అని ప్రశ్నించటంలో నిరాశావాదం కూడా ఉంది. నా దేశచరిత్రలో ‘ఇదీ గర్వకారణం’ అని సగర్వంగా ప్రకటించటంలో జాతీయతా భావం వుంది. అసలైన అభ్యుదయతత్త్వం వుంది. నిజమైన దేశభక్తి ఉంది.

దేశ చరిత్రల రచన కత్తిమీది సాము. దాన్ని సుసాధ్యం చేసిన ‘చరిత్ర రచనా చక్రవర్తి’ పండిత గొర్రెపాటి వెంకట సుబ్బయ్య దేశచరిత్ర రచనలకు కొత్త ఒరవడి దిద్దారు. దేశీయులు చేయెత్తి జైకొట్టేలా వారిలో దేశభక్తిని నింపగలిగారు. గతమెంతో ఘనకీర్తిని చాటిచెప్పగలిగారు.

1898 జూలై 1న రత్నమాంబ, వెంకన్నలకు ఘంటసాలలోనే జన్మించిన పండిత వెంకట సుబ్బయ్య జీవిత చరిత్రల బహుగ్రంథ కర్తగా తెలుగు పాఠకలోకానికి సుపరిచితుడు. జాతీయవాది. ఉప్పు సత్యాగ్రహకాలంలో 9 నెలల కారాగారవాస శిక్ష అనుభవించారు. జాతీయోద్యమ కార్యకర్తగా ఖద్దరు ప్రచారం చేశారు. 1933లో కృష్ణాజిల్లా బోర్డు సభ్యులుగా జమీందారీ రద్దుకు పాటుపడ్డారు. ‘గ్రంథాలయ సర్వస్వము’ పత్రికా సంపాదకవర్గంలో ఒకరుగా గ్రంథాలయోద్యమానికి పాటుపడ్డారు. జీవిత చరిత్రల రచనకు కొత్త ఒరవడి తెచ్చారు. జీవిత చరిత్రలు వ్రాస్తే వెంకట సుబ్బయ్య గారే వ్రాయాలి అన్నంత ప్రసిద్ధిని పొందారు.

తతిమ్మా కృష్ణాజిల్లా గ్రామాలతో పోలిస్తే ఘంటసాల గ్రామంలో ప్రజల ఆలోచనా తీరులోకొంత భిన్నత్వం కనిపిస్తుంది. అది, అలనాటి ప్రాచీన నౌకా కేంద్రం కావటంతో యోధులూ, సాహసికులు, ఙ్ఞానసంపన్నులైన నావికుల వారసత్వం ఈనాటికీ ఘంటసాల స్థానికులలో తొణికిసలాడుతూనే ఉంటుంది.

గొర్రెపాటి వారు, గొట్టిపాటి వారూ, వేమూరి వారూ ఘంటసాలకు వన్నెతెచ్చిన ప్రసిద్ధ వంశీకులు. అక్కడపుట్టిన చివురు కొమ్మైనా చేవ.. అన్నట్టు అస్పృశ్యతా నివారణకు కృషి చేసిన  అగ్రహారికుడు ఘంటసాల సీతారామయ్య లాంటి అభ్యుదయవాదులు పుట్టిన నేల.

ఘంటసాలలో రైతుపెద్ద, స్వాతంత్ర్య సమరయోధుడూ మరో గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారు ఉన్నారు. అందుకని, ఆయనను కిసాన్ వెంకట సుబ్బయ్య అనీ, వీరిని పండిత వెంకట సుబ్బయ్య అనీ జన వ్యవహారం. పండిత వెంకట సుబ్బయ్య గారు ఎర్రగా దానిమ్మ పండు రంగులో వుండేవారు. అందుకని ‘తెల్ల వెంకట సుబ్బయ్య’ అనికూడా అనేవారు. ‘గొ వెం సు’ ఆయన పొట్టిపేరు.

ఎందరి జీవితాలనో చరిత్రగా మలచిన వెంకట సుబ్బయ్యగారు స్వీయచరిత్ర కూడా వ్రాసుకున్నారు. కానీ, అందులో తన చుట్టూ ఉన్న లోకం గురించి తప్ప, తన గురించి చెప్పుకున్నది తక్కువ. “స్వీయచరిత్రలో కుటుంబ విషయాలు తగ్గించి, సమకాలీన విషయాలను పేర్కొంటూ, దేశాభివృద్ధికి బలియయిన వారు ఘనకార్యాలు చేసినవారు వ్రాసుకుంటే లోకం హర్షిస్తుంది” అంటారాయన. అందుకే, అడపాదడపా ఆయన ప్రస్తావించిన విషయాల్లోంచే ఆయన వ్యక్తిగత వివరాలు ఏరుకోవాలి.

“మొదటి నుండి నేను నోరులేని వాడినే! క్రియా రహితుడను, ఉపేక్షా శీలిని, ముప్ఫై యేళ్ళు వచ్చాక కూడా సన్యసించాలని అనుకునే వాడిని”,

“నేను నిరీశ్వరవాదిని గాను, ఈశ్వరభక్తునీ గాను! దేవుడు ఈ నరక కూపంలో పడేశాడని ఆయన్ని స్మరించితే గానీ, ముక్తి లేదని నేను నమ్మలేను” అని రాసుకున్నారొకచోట.

‘నా సాహిత్య కృషి’ పుస్తకంలో ఆయన కౌతా శ్రీరామశాస్త్రి ఆయన కుమారులు రామమోహనశాస్త్రి, ఆనందమోహన శాస్త్రి, చెరుకువాడ వేంకట నరసింహం, ఇలా ఎందరో ప్రముఖుల సాహిత్య కృషినీ వివరిస్తారు జీవిత చరిత్రలను చిత్రించటం అంటే ఆయనకు ప్రాణం. బహుశా ఆ విద్యలో ఎవరైనా వెంకట సుబ్బయ్య గారి తరువాతే!

“అయిదుగురు ఆడపిల్లల తర్వాత రాళ్లకు రప్పలకు, చెట్లకు, పుట్టలకు మొక్కి నిన్ను కన్నాను. నిన్ను విడిచి ఉండలేను. నీవు బందరు చదువుకోసం వెళ్ళవద్దని మా అమ్మ రత్తమ్మ కంటతడి పెడుతూ కూర్చుంది. తల్లి తరువాత తల్లి వంటిది మా పెద్దక్క సీతమ్మ. ఘంటసాలపాలెంలో వున్న ఆమె వద్దకు వెళ్ళి నా చదువు గొడవ చెప్పాను. ఆమె దయామయి. భక్తురాలు. వివేకవతి కూడా!  ఆ అక్క ఇంటివద్ద కొంతకాలం పెరిగాను. ఆమెకు పిల్లలు పుట్టి పోయారు. ఆమెకు నాయందు అమిత ప్రేమ. ‘ఇంటి గోడమీద 25 రూపాయలు పెట్టి కుండ బోర్లించానని చెప్పి ఆ మూట ఇచ్చి, ‘నాయనా! నువ్వన్నా చదువుకుని బాగు పడు’మని దీవించింది”. అలా చదువు మొదలెట్టారు.

బందరు నోబుల్ కళాశాల హైస్కూల్ శాఖలో గొట్టిపాటి బ్రహ్మయ్యగారు, గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారూ ఒకే గదిలో వుంటూ చదువుకున్నారు. ఆయన ఫోర్తు ఫారం, వెంకట సుబ్బయ్య గారు థర్డ్ ఫారం. ఫోర్త్ ఫారంలో ఉండగా వందేమాతరం ఉద్యమ ప్రభావంతో, బెంగాలీ నేర్చుకోవాలనిపించిందాయనకు. బందరులోశ్రీ కౌతా శ్రీరామశాస్త్రిగారిని ఆశ్రయించి బెంగాలీ నేర్చుకున్నారు. బెంగాలీ రావటం వలన శరత్సాహిత్యాన్ని మూలభాషలో చదివే అవకాశం కలిగింది. స్కూల్ ఫైనల్ చదివేందుకు కలకత్తా వెళ్ళారు. కానీ, సీటు దొరకలేదు. ఇంటర్మీడియట్ చదవాలని, నాగపూర్ వెళ్ళారు. కానీ, ఆరోగ్యం దెబ్బతినటంతో తిరిగివచ్చి, ఇంట్లోనే అధ్యయనం ప్రారంభించారు.

“ఆదికవి వాల్మీకి శోకంతో రామాయణరచన ప్రారంభమైనట్టు,1915లో పెద్దక్క సీతమ్మ స్వర్గస్థురాలైన దుఃఖంలో ‘సీతాచరితం’ పేరుతో ఆమె చరిత్ర వ్రాశాను..” అని చెప్పుకున్నారు. ఆయన రచనలన్నీ ఇంచుమించుగా జీవిత చరిత్రలే! రాజారామ్మోహనరాయ్, కేశవ చంద్రసేన్, ఇలా చాలామంది జీవితాలమీద వ్యాసాలు వ్రాశారు.

“నా వృత్తి వ్యవసాయము. నేను వృత్తిగా రచన ప్రారంభించలేదు. నా ప్రవృత్తి నన్ను రచయితగా చేసింది”, “నాలో రేగిన ఆలోచనలే నన్ను రచయితగా చేశాయి” అంటారాయన. తెలుగుభాషాసమితి పురస్కారం, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ పురస్కారం లాంటివి ఆయనను వరించినా వెంకట సుబ్బయ్యగారు ఏనాడూ పదవులు, పురస్కారాల జోలికి పోయిన వారు కాదు. తన రచనల వలన మాత్రమే తనకు గౌరవం రావాలని కోరుకున్నారాయన.

“శరత్ చెప్పినట్టు, ‘యౌవనదశలో కవిత్వం వ్రాయి, వృద్ధాప్యంలో విమర్శ వ్రాయి’ అనేది నాకు బాగా నచ్చింది.” అంటారాయన. తొలి రచనల్లో పద్య కవిత్వం ఉన్నప్పటికీ ఆయన సాహితీ వ్యాసంగం అంతా పరిశోధనాత్మక వచనంగానే సాగింది.

1922లో గాంధీమహాత్ముని నిర్భంధం,1936లో గీతాభూమిక, 1940లో “భట్టుమూర్తి రామరాజ భూషణుడా?” పుస్తకాలు ప్రచురించారు. 1942లో పిల్లల పుస్తకం “నవ్వులు-పువ్వులు” పేరుతో పాతపాటలు, కొత్తపాటలు అనే రెండు విభాగాలు వ్రాసి, తెలుగు బిడ్డలకు అంకితం ఇచ్చారు.1961లో ‘ప్రహ్లాద చరిత్రము’ వ్రాశారు. 1944లో ‘మన జమీందారీలు’, 1946లో ‘ప్రజానాయకుడు ప్రకాశం’, “హంపీ పిలుపు” గ్రంథాలు వ్రాశారు. 1947ఘంటశాల చరిత్ర వ్రాసి, 1966లో పెంపు చేసి మళ్ళీ వ్రాశారు.

1946లో ‘ప్రజానాయకుడు ప్రకాశం’, 1948లో ఆచార్య రంగా (జీవిత చరిత్ర)నీ, ‘మన రైతుపెద్ద’ పేరుతో గొట్టిపాటీ బ్రహ్మయ్య గారి జీవిత చరిత్రనీ వ్రాశారు. పిల్లల పుస్తకం “గాంధీ తాత” కూడా అదే సంవత్సరంలో వ్రాశారు. 1949లో బాల సాహిత్య బహుమతి పొందిన “సరోజినీ దేవి” గ్రంథం. 1951లో వల్లబాయి పటేల్ జీవిత చరిత్ర, 1967లో “పంజాబు కేసరి లాలాలజపతిరాయి”, 1969లో “కాశీనాథుని నాగేశ్వర రావు పంతులు గారి జీవితము-సాహిత్యము”, 1971లో “కిసాన్ వెంకట సుబ్బయ్య” పుస్తకాలు వ్రాసి ప్రచురించారు.

1952లో అక్షరాభిషేకం, “శరత్ జీవితం” గ్రంథాలు వెలువరించారు. శరత్ జీవితం గ్రంథాన్ని గదర్ వీరుడు దరిశి చెంచయ్య గారికి అంకితం ఇచ్చారు.1955లో ‘శరత్ జీవితం’, ‘శరత్ సాహిత్యమూ’ కలిపి శరద్దర్శనం పేరుతో పెద్ద పుస్తకంగా తెచ్చారు. వెంకట సుబ్బయ్య గారి కుమార్తె శకుంతల, అల్లుడు శివరామకృష్ణలు నెలకొల్పిన ‘దేశి కవితామండలి’ సంస్థ శరత్ సంపూర్ణ సాహిత్యాన్ని ప్రచురించింది. ‘దేశి కవితామండలి’ అంటే శరత్ సాహిత్యం, శరత్ సాహిత్య మంటే దేశికవితా మండలి అనే నానుడి పుట్టింది.. – అని ఆ సంస్థ పట్ల వెంకట సుబ్బయ్య గారు తన సంతృప్తిని వ్రాసుకున్నారు.

“1958లో ‘చలం జీవితం-సాహిత్యం’ గ్రంథాన్ని చలం జీవితంలో అనేక మార్పులకు కారణమైన చింతా దీక్షితులకు అంకితమిచ్చాను. “చలం గొప్ప శిల్పి ఆయన జీవితానికీ రచనలకు సంబంధమున్నట్టే, ఆయన కళలకు, జీవితానికీ సంబంధమున్నది. There is no such thing as a moral or an immoral book, Books are well written or badly written. That`s all” అనే ఆస్కార్ వైల్డ్ మాటలు చలం రచనలకు వర్తిస్తాయి” అంటారాయన. చలం పుస్తకాన్ని ప్రచురించినప్పుడు. “శరత్‌ని వ్రాసిన చేత్తో చలాన్ని వ్రాస్తారా..?” అన్న వారు కూడా లేకపోలేదని వ్రాసుకున్నారు.

1959లో రెండో అమ్మాయి సుగుణ పోయినప్పుడు ‘వేదన’ అనే కావ్యం వ్రాసిన తరువాత తనకు హృదయ భారం తగ్గిందని వ్రాసుకున్నారాయన. ఆ సంవత్సరమే “మాట-మన్నన” పుస్తకాన్ని తెచ్చారు. “మాటంటే మనసు, మనసంటే మాట, మనసులు కలిసేటట్టు నేర్పు గలిగి మాట్లాడాలి” అంటారాయన. సంజీవదేవ్ గారికి ఈ పుస్తకాన్ని అంకితం చేశారు.

1962లో ‘మధురజీవనం’ ఆరోగ్య శాస్త్ర గ్రంథం, ఆరోగ్యపరంగా వ్యక్తి జీవనం, గృహజీవనం, సాంఘిక జీవనం, ఆధ్యాత్మిక జీవనాల గురించి విశ్లేషణ చేశారు. 1963లో “తెలుగు సాహిత్యం తీరుతెన్నులూ” విమర్శనా వ్యాసగ్రంథం తెచ్చారు. నార్ల, అడవిబాపిరాజు, యన్. జి. రంగా, ఆచార్య, వేటూరి ప్రభాకరశాస్త్రి, బసవరాజు అప్పారావు, సురవరం ప్రతాపరెడ్డి ప్రభృతుల గురించి వ్రాసిన వ్యాసాలు ఇందులో ఉన్నాయి.

1965లో “కవిరాజ జీవితము, సాహిత్యము” పుస్తకం వ్రాశారు. “ఏవో కొన్ని ప్రాచీన వ్రాతప్రతుల్లో ఉన్నంత మాత్రాన అది నిజం అని నమ్మకండి. సంప్రదాయంగా వస్తున్నవన్నీ వాస్తవం అనుకోకండి. దేశాచారం అయినంత మాత్రాన యథార్థం అని నమ్మకండి. పెద్దలు మిమ్మల్ని ఇలా నమ్మిస్తున్నారని గ్రహించండి. సంపూర్ణంగా విమర్శించుకుని అది లోకోపకారకం అనిపించాకే నమ్మండి..” అనే బుద్ధుడి వాక్యాలను ఉదహరిస్తూ త్రిపురనేని వారి  జీవిత చరిత్రను వ్రాశారాయన. కవిరాజు వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించటానికి ఇంతకన్నావివరణ అనవసరం. అది వెంకట సుబ్బయ్యగారి శైలి.

“ఇతరుల దోషాలను విస్మరించి మంచిని గ్రహించండి. మానవుడంటే శ్రమ గుణాలు గలవాడు. నీవు మంచిగా వుండి మంచి గ్రహించు” అనే నమ్మకంతో తన మిత్రుల సామాజిక కృషిని విశ్లేషిస్తూ 1970లో ‘మిత్రులూ-నేనూ” గ్రంథాన్ని వ్రాశారు.

సి. ఆర్. రెడ్డి సాహిత్య జీవితం గురించి వ్రాస్తూ ఇలా వ్రాశారు: “రెడ్డి ఒక పర్యాయం ఇట్లా అంటాడు – ఆంధ్ర దేశంలో ముగ్గురు ప్రతిభావంతులున్నారు.. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ప్రథమ శ్రేణి ప్రతిభావంతుడు. కాని, ఆయన జీవితంలో తృతీయ శ్రేణిలో విజయం పొందాడు. నేను ద్వితీయ శ్రేణి పండితుణ్ణి, అందువల్ల నా జీవితము సగము జయము-సగము అపజయము. రాధాకృష్ణన్ తృతీయ శ్రేణి ప్రతిభావంతుడు, అందువల్లనే ఆయన జీవితంలో ప్రథమ శ్రేణిలో విజయం గావించాడు..” అని!.

“ముసి ముసి నవ్వులు నవ్వుతూ ఆయన సాహిత్యాన్ని గురించి విశదీకరించి చెబుతూ వుంటే ఎంత సేపైనా వినాలనిపిస్తుంది..” అని ఆచార్య యన్. జి. రంగా అన్నారు.

శరత్‌బాబు, చలం, కవిరాజు (త్రిపురనేని రామస్వామి చౌదరి) ఈ ముగ్గురినీ ఆయన ‘ఆధునిక కవిత్రయం’ అంటారు. “నాకు తెలిసినంతవరకూ మన తెలుగులో మొట్టమొదటి స్వీయ చరిత్రను వ్రాసుకున్నది ఏలూరు వాస్తవ్యులు ప్రథమ ఆంధ్ర చరిత్రకారుడు కావలి బుర్రయ్య. అనంతరం ఇంగ్లీషు పద్ధతిలో తెలుగులో స్వీయచరిత్రను 1910లో చక్కగా వ్రాసుకున్నది వీరేశలింగం. ముదిగొండ జగ్గన్నశాస్త్రి వ్రాసిన ‘వీర సావర్కరు’ ఒక గొప్ప కావ్యము. దాని ప్రభావము పెక్కురు పైన బడినది. కోమాండూరు శఠగోపాలాచార్యులు వ్రాసిన జీవిత చరిత్రలలో తాతాచార్య చరిత్రము గొప్పది. రమణారెడ్డి గారి కవికోకిల చరిత్ర ఒక కావ్యముగా వెలసినది..” ఇలాంటి సమాచారం నూతన పరిశోధకులకు గొప్ప సహాయకారి.

ముట్నూరి కృష్ణారావు గారిగురించి వెంకట సుబ్బయ్యగారు చేసిన వర్ణన ముమ్మూర్తులా ఆయన్ని సాక్షాత్కరిస్తుంది: “కృష్ణరాయనిది గుండ్రని ముఖం, విశాలమయిన కాటుక కండ్లు, కోటేరు వంటి ముక్కు, విశాలమయిన వక్షస్థలం, దీర్ఘ బాహువులు, పండువంటి శరీర ఛ్ఛాయ.. ఆ దివ్య సుందర విగ్రహానికి తగిన తెల్లని పారాడే పంచెకట్టు, చీలమండల వరకూ వ్యాపించిన బారు లాల్చీ, రాజఠీవిని ధిక్కరిస్తూ కోణాలు తీరిన ధవళ శిరో వేష్టనమూ, నల్లని ఆకు చెప్పులు, చేతికర్రను ధరించిన ఆ నిండైన విగ్రహాన్ని చూచి, ఆయనను ‘ఎవరు ఈ మహానుభావుడు’ అనుకునేవారు. ఆయన ఈ లోకపు మనిషి కాడు. దివ్య లోకమునుండి అవతరించిన మహానుభావుడు” ఇలా సాగుతుందా వర్ణన.

యన్.జి. రంగా జీవిత చరిత్ర చదువుతుంటే ఆయన గురించి మాత్రమే కాదు, ఆయన సమకాలికులతో పాటు, జమీందారీ ఉద్యమాన్ని, విద్యార్ధి ఉద్యమాన్నీ స్వాతంత్ర్యోద్యమాల గురించి తెలుస్తుంది. అలాగే ఆయన దేశోద్ధారక నాగేశ్వరరావు పంతులు చరిత్ర చదువుతుంటే, ఆంధ్రదేశపు చరిత్ర, ఆంధ్రోద్యమం, స్వాతంత్రోద్యమం తొలినాళ్ళ సంగతులెన్నో గ్రహిస్తాం. “మిత్రులూ-నేనూ” గ్రంథంలోసాహితీ సామాజిక మిత్రుల్ని వరుసగా పరిచయం చేస్తూ, తన భార్యను కూడా మిత్రుల జాబితాలో ఒకరుగా పరిచయం చేస్తారు.

“మా ఆవిడ పేరు కుటుంబమ్మ. ఈమె పుట్టిల్లు మా గ్రామానికి నాలుగు మైళ్లలో వున్న లంకపల్లి. ఈమెకు ఒక సోదరుడు లక్ష్మీనారాయణ, సోదరి కాశీ అన్నపూర్ణ. వీరి తండ్రి గ్రామ మునసబు వీరమాచనేని భూషయ్య గారు, తల్లి పున్నమ్మగారు. మా వివాహం నా 19వ యేట 10-06-1917న జరిగింది. ఆమె వయసు 14సంవత్సరాలు. 1918లో కాపురానికి వచ్చింది.”

“ఇంక మా దాంపత్యం సంగతి, ‘పూర్వం మీ గొడవలో మీ చదువులో మీరుండేవారు. మీరు పలకరించడం లేదని బాధ పడేదానను కాను. ఒకప్పుడు పలకరించకపోతే బాధ. ఎప్పుడూ ఒక మాదిరిగా వుంటే ఏమీ ఉండదు. ఇప్పుడు మీరు తరచూ పలకరిస్తుంటే వయసు మళ్లిన తరువాత పవిత్రమైన ప్రేమ కలుగుతుంది కాబోలునని అనుకుంటున్నా!”

“నిజం చెప్పు! వయసులో నిన్నేమైనా అన్నానా?” అన్నాను ఒకసారి. “అసలు మన ఇంట్లో ఒకరి నొకరు చెడుగా అనుకోవడమనేది లేనే లేదు.. నేనెప్పుడు పడితే అప్పుడు పుట్టింటికి వెళ్ళేదాన్ని. ఏమి చేసైనా మీరేమీ అనేవారు కారు.”

“ఇది వరకు నా రచనలన్నీ మా అల్లుడే అచ్చు వేసుకునేవాడు. అతను లేడు యిప్పుడు. ‘ఘంటశాల చరిత్ర’ రెండవ ముద్రణ అచ్చు వేయడం సమస్య అయ్యింది. ఈ సంగతి కనిపెట్టిన నా సతి, “ఆలోచిస్తారెందుకు? వారిని వీరిని అడుగుతారా? ఒక యకరం అమ్మి అచ్చు వేయించండి.. అంది.”

పండిత వెంకట సుబ్బయ్య గారి చరమ ఘడియల్లో విషాద సంఘటనలెన్నో చోటు చేసుకున్నాయి. తుమ్మల కృష్ణాబాయిగారు ఆయనను నాన్నగారూ అని పిలిచేవారు. ఆనాటి పరిస్థితిని ఆమె ఇలా వ్రాశారు: “చదువుతూ చదువుతూ సుగుణ పోయింది. ఎంతో కృషితో పైకి వస్తున్న అల్లుడు శివరామకృష్ణ అనుకోకుండా నడివయసులో కన్ను మూశారు. తనకు పక్షవాతం వచ్చింది. అయినా కన్నీరు వత్తుకుంటూ సహధర్మచారిణిని ఓదార్చారు. ‘మిత్రదర్శన’ రచనా వ్యాసంగం ఎప్పటిలాగానే.. రాను రానూ మాట గొణుగుపడినా నవ్వు చెరగలేదు. అవయవాలు అశక్తత ప్రకటించినా తపన తీరలేదు. పురమాయింపులు ఆగలేదు. ..”,

“అనారోగ్యం బాగా క్రుంగదీస్తున్నప్పుడు ‘ఇంక విశ్రాంతి తీసుకోవచ్చుగదా అంటే, రాయగలిగినంత వరకూ రాయనీయమ్మా.. నాకు అదే తృప్తి..’ అన్నారు.”

కష్టాలొచ్చినప్పుడు కూడా తొణకని స్థితప్రఙ్ఞతతో ఎనబై నాలుగేళ్ళపాటు వెలిగిన ఆ సాహితీ జ్యోతి 1982 జూలై 1న ఆరిపోయింది.

Exit mobile version