[జి. వి. శ్రీనివాస్ గారి ‘చరిత్ర చెప్పిన కథలు’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు శ్రీ ఎన్.కె. బాబు.]
చరిత్ర ఎందుకు అవసరం అనే ఆలోచన కలిగితే వచ్చిన సమాధానం ‘భవిష్యత్తు కోసం’.
నిజమే, గత కాలంలో ఏమయ్యిందో తెలియకుండా భవిష్యత్తును నిర్మించుకోలేము. చరిత్ర అంటే ఒక బోర్ కొట్టె విషయం. ఆ తారీఖులు, సంవత్సరాలు, చాంతాడు రాచరికాల జాబితా.. బాబోయ్ అనే భావనే ఎక్కువమందిలో కలిగేది. ఎందుకంటే బడిలో, కళాశాలల్లో మనం చరిత్ర పట్ల నేర్చుకోనే విషయాలు మనల్ను అంతగా ఆకర్షించవు.
అందులోనూ ఎందుకో తెలియదుగాని మన చరిత్ర పట్ల మనకు చిన్న చూపు. ఒకవేళ చరిత్ర చదువుదాము అనుకున్ననూ ఒక అక్బర్, ఒక అశోకుడు, ఒక మొఘల్ సామ్రాజ్యం, దక్షిణాదికి వస్తే శ్రీకృష్ణదేవరాయులు, కాకతీయ సామ్రాజ్యం, అంతకుముందు శాతకర్ణి వంశాలు గుర్తుకు వస్తాయి.
కానీ మనం నడిచే ప్రతీ నేలపై ఒక కథ ఉంటుంది. మనసు పెట్టి వినాలే గాని ఆ నేల క్రింద ఒక చరిత్ర ఉంటుంది. మా నేలకు, మాకు ఒక ఘనమైన చరిత్ర ఉంది అంటూ జి.వి.శ్రీనివాస్ తమ ప్రాంత స్థానిక చరిత్రలను శోధన చేసి, ఆ చరిత్రకు తన కల్పనా శక్తితో అద్భుతమైన కథలు కల్పించి రాసిన కథల సంపుటి ‘చరిత్ర చెప్పిన కథలు’.
చాల సరళమైన ఉత్తరాంధ్ర భాష ఈ కథలకు సొగసైన పరిమళం అద్దింది. ఆ కాలంనాటి సాంఘిక పరిస్థితులు, ఆచారాలు, అలవాట్లు, జీవన విధానం అన్నీ కనిపిస్తాయి.
రాజ్య కాంక్ష, కుట్రలు, పదవి కోసం స్వంత వారినే బలి పశువును చేసే నీచం, పరాయి దొరతనానికి జైజైలు కొట్టడం, ఒకటేమిటి ఆనాటి జీవనమే కళ్ళ ముందు సాక్షాత్కరిస్తోంది.
యుద్ధం అంటే అమాయకులు బలికావడమే అనే మాటకు, యుద్ధం అంటే ప్రాణ త్యాగాలు, భవిష్యత్తును మంటల్లో మసి చేయ్యడమే అనే దానికి సాక్షీ భూతమే ‘బొబ్బిలి యుద్ధం రోజున’ కథ. కథ ముగిసే సరికి గుండె అంతా ఏదో తెలియని బాధతో నిండిపోతుంది. ఎంకన్న, లచ్చమ్మలు చాలా కాలం మనల్ని వెంటాడుతారు.
సగం భారతదేశాన్ని తన ఏలుబడి లోనికి తెచ్చుకున్న ఆశోకుడు తమ నేలపైకి దండయాత్రకు వస్తే, వెన్ను చూపక, రొమ్ము ఎత్తి, కత్తి పట్టిన పల్లె సీమ కథే ‘దీర్ఘాశి’. కేవలం పల్లె జనుల సంభాషణలలోనే చరిత్ర కథ తీరు పాఠకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
మాడుగుల అంటే గుర్తుకు వచ్చె తియ్యని హల్వా మాదిరి మత్స్య రాజుల అడుగులు, తలవంచని పౌరుషం గురించి ‘మాడుగుల’ కథ చెప్తుంది.
ఒకప్పుడు కళింగాంధ్రకే విదేశీ నౌక వ్యాపారానికి, ఎగుమతులు దిగుమతులకు ప్రసిద్ధి గాంచిన దివ్వెల ఈనాడు ఒక చిన్న గ్రామమై నిలిచిన గాథను ‘దిమిలి’ చెప్తుంది.
బారువా తీరములో జరిగిన ఒక నౌకా ప్రమాదం రచయితతో ఒక కథనే (బారువా 1917) రాయించింది. అది కూడా వలసల నేపథ్యంలో, స్వంత్రంత పోరాట యవనికపై ఆవిష్కరించిన తీరు మనల్ని ఆకట్టుకుంటుంది. బహుశా బారువా నౌకా ప్రమాదంపై వచ్చిన తొలి కథ ఇదే కావొచ్చు.
రాజుల విజయ కాంక్ష, రాజకీయ ఎత్తులకు మొదట బలయ్యేది ఆ రాణివాసపు స్త్రీలే. శత్రువుతో సంధికో, తమ రాజ్యాన్ని కాపాడుకోవాలి అనే కోరికతో తమ ఇంటి ఆడపిల్లలను శత్రు రాజుకిచ్చి వివాహం జరిపించడం ఆ రోజుల్లో సాధారణ విషయమే. అయితే ఆతర్వాత ఆమె స్థితి..? ‘పొట్నూరు’ కథ చివర్లో ఈ విషయం మనల్ని ఆలోచింప జేస్తుంది.
రచయిత ఆధునిక కాలం కథలు కూడ చివర్లో చేర్చారు. శ్రీకాకుళం జిల్లా రైతాంగ పోరాటాలలో ఒక ప్రముఖ తిరుగుబాటు ‘వీర గున్నమ్మ పురం’ కథగా మనల్ని ఆనాటి ఉద్వేగానికి గురి చేస్తూ, గున్నమ్మ త్యాగానికి జోహారు అర్పించేలా చేస్తుంది.
ఈనాటికీ చర్చల్లో ఉండే విశాఖ ఉక్కు గురించి, ‘విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు’ నినాదం ఇచ్చిన పోరాట స్పూర్తి, అప్పటి రాజకీయ పావులాటలు, చివరకు ఎలా విశాఖ ఉక్కు పరిశ్రమ మొదలయ్యిందో మనకు ‘విశాఖ 1996 నవంబర్ ఒకటి’ కథ చూపిస్తుంది,
మొత్తం ఇరవై కథల ఈ సంపుటి మనల్ని ఆ కాలంలోనికి తీసుకోని వెళ్తుంది అనడంలో సందేహమే లేదు. పాత్రలన్ని కళ్లముందు కదలాడుతూ, మా గోడు వినరా అంటూ ప్రశ్నిస్తూ ఉంటాయి. బహుముఖ ప్రజ్ఞాశాలి దీర్ఘాశి విజయ భాస్కర్ గారి విలువైన ముందుమాటతో పుస్తకం ప్రారంభం అవుతుంది.
ఈ ఇరవై కథలు విశాఖా సంస్కృతి మాస పత్రికలో ‘చరిత్ర చెప్పిన కథలు’ అనే శీర్షికన ప్రచురితం అయినవే.
ఇటీవల కాలంలో ఒక మంచి ప్రయత్నం ఈ ‘చరిత్ర చెప్పిన కథలు’. కళింగాంధ్రపై చక్కటి అవగాహన కల్పిస్తుంది.
కథలతో పాటు ఆయా సంస్థానాల, ఆయా ప్రదేశాల చిత్రాలు కూడ జత చేసి ఉంటే, మరింతగా పాఠకులను ఆకట్టుకోనేది.
***
రచన: జి. వి. శ్రీనివాస్
పేజీలు: 199
వెల: 150
ప్రతులకు:
జి.వి.శ్రీనివాస్,
8-18/1-1/3, శివాజీ కాలని, ప్రదీప్ నగర్,
విజయనగరం 535004,
ఫోన్: 7702455559
~
ఎన్.కె. బాబు, ఫోన్: 8977732619