Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చారల నక్కలు

వాళ మనం చారల నక్కల గురించి మాట్లాడుకుందాం…

ఆగండాగండి… టీవీలో ఏ నేషనల్ జియోగ్రాఫిక్ ఛానెలో, యానెమల్ ప్లానెట్ ఛానెలో చూడాలనుకోకండి, లేదా అర్జెంటుగా గూగుల్ చేసి ఈ చారల నక్కల గురించి వెతక్కండి…

నేను చెప్పేది పులులను చూచి చారల కోసం వాతలు పెట్టుకునే నక్కల గురించి…. అంటే అనుకరణ బాబులు/మాతల గురించి!

మన సమాజంలో చాలామంది తమ కోసం తాము కాకుండా ఇతరుల కోసం బతుకుతారు. నలుగురు ఏమనుకుంటారో అన్న చింతే ఎక్కువ. ఈ ప్రయత్నంలో వేరేవరిదో బ్రతుకును జీవిస్తుంటారు.

వ్యక్తుల ఆశలు, లక్ష్యాలు, ఆశయాలు, ప్రవర్తన, కోరికలు… ఇలా ఎన్నో అంశాలలో ఇతరులలా ఉండాలని ప్రయత్నిస్తారు. ఒకప్పుడు ఈ అనుకరణ అనేది చాలా తక్కువ స్థాయిలో ఉండేది.

మేము ఇంటర్మీడియట్‌లో ఉన్నప్పుడు ‘డెమాన్‌స్ట్రేషన్ ఎఫెక్ట్’ అని ఎకనామిక్స్‌లో ఒక టాపిక్ ఉండేది. వ్యక్తులు లేదా కుటుంబాలు తమ పొరుగువారి వినియోగపు స్థాయిలను అనుకరించి వాళ్ళలా ఖర్చు చేయడం అని దాని అర్థం అని గుర్తు. ఎప్పుడో పాతికేళ్ళ క్రితం మార్కుల కోసం చదివి వదిలేసిన ఆ కాన్సెప్ట్ ఇప్పుడు కళ్ళ ముందు చాలా స్పష్టంగా కనబడుతోంది.

ఏ రంగంలో చూసినా అనుకరణే. చదువులో అనుకరణ, ఆటల్లో అనుకరణ, పాటల్లో అనుకరణ, అలంకరణల్లో అనుకరణ, పెళ్ళిళ్ళలో అనుకరణ, జీవనశైలిలో అనుకరణ…. ఎవరూ తమ జీవితాన్ని తాము జీవిస్తున్నట్టు ఉండట్లేదు.

ఫలితంగా ఖర్చులు పెరిగి వ్యక్తులు, కుటుంబాలపై మోయలేని ఆర్థిక భారం పడుతోంది. తాహతుకి మించి ఖర్చు చేసి కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయి.

ఒక సినిమా విభిన్నంగా ఉండి కాస్త పేరు తెచ్చుకుంటే – ఇక అన్నీ అలాంటి కాన్సెప్ట్‌తో పది ఇరవై సినిమాలు వచ్చేస్తాయి… వేరే భారతీయ భాషలలో లేదా హాలీవుడ్‌లో ఏదైనా ఏదైనా కొత్తగా ఆకట్టుకునే సన్నివేశాలున్న సినిమా వస్తే…. అదే ఇతివృత్తంతో తీసేస్తారు, లేదా అక్కడి ఆడపాత్రలని ఇక్కడ మగపాత్రలుగా… అక్కడి మగ పాత్రలని ఇక్కడ ఆడపాత్రలుగా మార్చేసి వండి వడ్డించేస్తారు. ఇటీవల ఇంటర్నెట్‌లో దేశీయ/విదేశీ భాషల సినిమాల వివరాలు చాలా అందుబాటులోకి రావడంతో… సన్నివేశాలని బట్టి వాటికి మూలం ఏ సినిమాలోదో ప్రేక్షకులు ఇట్టే తెలుసుకోగలుగుతున్నారు. ఇక సినిమాల పేర్లని టీవీ సీరియల్స్ పేర్లుగా వాడుకోడం కూడా అనుకరణలో భాగమే!

ఒక కొత్త ఐడియాతో ఒక రచన వస్తే… ఆ కాన్సెప్ట్‌నే అటూ ఇటూ తిప్పి బోలెడు కథలల్లేస్తారు. గ్రేట్ మైండ్స్ థింక్ ఎలైక్ అన్నది చాలా అరుదుగా సంభవిస్తుంది!

ఒక స్కూల్ ఏదైనా ఇంటర్నేషనల్ సంస్థతో జట్టు కడితే… సందుల్లోని ఇంగ్లీషు మీడియం స్కూల్స్ అన్నీ ఇంటర్నేషనల్ స్కూల్స్ అయిపోతాయి….

మనీష్ మల్హోత్రా అనే డిజైనర్ వెడ్డింగ్ డ్రెస్‌లకి పెట్టింది పేరు. పలు సినీ హీరోయిన్‌లకు, నటులకు, వారి శరీరాకృతిని బట్టి వారికి సరిగ్గా నప్పేలా దుస్తులను డిజైన్ చేయడంలో నిపుణుడు. అద్భుతమైన దుస్తులను రూపొందిస్తాడు. కానీ, సామాన్యులకి, మధ్యతరగతి వారికి అందనంత దూరంలో ఉంటాయి వాటి ధరలు. అతని డిజైన్లకు నకలు చేసి కుట్టించుకుని ఆనందిస్తుంటారు చాలామంది.

‘జాలీ ఎల్ఎల్‌బి 2’ అనే హిందీ సినిమాలో మనీష్ మల్హోత్రా గురించి కొన్ని డైలాగులు ఉంటాయి. ఓ కేసుకి సంబంధించిన వాదనలు జరుగుతుండగా, జడ్జిగారికి తన కూతురు నుంచి ఫోన్ వస్తుంది. కాసేపు వాదనలు ఆపి, కూతురితో మాట్లాడాతాడాయన.

“ఏమ్మా, డ్రెస్ బావుందా?”

ఆ అమ్మాయి ఏదో సమాధానం చెబుతుంది.

“ఓ, కమాన్… మళ్ళీ మనీష్ మల్హోత్రానేనా? ఇతనూ చక్కగానే చేశాడుగా… ఇతను హరీష్ మల్హోత్రా.”

“….”

“మనీష్ ఇండియాలో ఫేమస్ అయితే, హరీష్ లక్నోలో ఫేమస్. హరీష్ లక్నోలో టాప్ డిజైనర్. మనకి కావల్సినట్టుగా కుట్టించుకోవచ్చు.”

“…”

“హలో.. హలో..”

కూతురు ఫోన్ పెట్టేస్తుంది.

జడ్జి గారు ఎదురుగా ఉన్న వారిని ఉద్దేశించి, “మీలో ఎవరికైనా మనీష్ మల్హోత్రా తెలుసా?” అని అడుగుతారు.

మాధుర్ అనే న్యాయవాదిని, “మనీష్ మల్హోత్రా డ్రెస్ ఎంత ధర ఉంటుందని మీరు అనుకుంటున్నారు?” అని అడుగుతారు.

“చాలా చవక సార్, అయిదు నుంచి ఆరు లక్షల రూపాయలుంటుంది…” అంటాడా లాయర్.

“మై గాడ్.. అది మొత్తం పెళ్ళి ఖర్చుకి సమానం…” అంటూనే, “అంత ఖరీదైన డ్రెస్ కొనాలంటే, నేను వచ్చే జన్మలో  మీలా లాయర్‌గా పుట్టాలి…” అంటాడాయన.

సినిమాలో ఈ సన్నివేశం కాస్త నవ్వు తెప్పించినా ఇందులో వాస్తవాలు ఉన్నాయి. మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన దుస్తులు బాగా ఖరీదైనవి, మధ్యతరగతి వారు కూడా కొనలేనంత ఖరీదైనవి…. అతని డిజైన్‌లను పోలి ఉండే డిజైన్‌లను అనామక డిజైనర్లు సృష్టిస్తున్నారు…

సినిమాలో చూపించినదంతా నిజం కాకపోవచ్చు అనుకున్నా… నాకు స్వయంగా తెలిసిన ఓ లోయర్ మిడిల్ క్లాస్ అమ్మాయి… తన స్నేహితురాలు ఆమె పెళ్ళికి కుట్టించుకున్న డిజైనర్ బ్లవుజ్ కోసం పట్టుపట్టి అలాంటి బ్లవుజ్‌నే పదిహేను వేల రూపాయలకు కుట్టించుకుని తన పెళ్ళికి ధరించింది. ఈ సంగతి తెలిసి విస్తుపోయాం మేమంతా!

అలాగే, నాని ‘పిల్ల జమీందార్’ సినిమాలో ఒక సన్నివేశం ఉంటుంది. హీరో మరదలు వేసుకున్న టీషర్ట్ లాంటిదే, లోకల్ మార్కెట్‍లో అమ్మకానికి వస్తుంది. సంతలో టీషర్ట్‌లు అమ్మే అతను ఒరిజినల్ టీషర్ట్‌ని ఎంతకి కొందో కనుక్కుని, ‘మోసపోయారు సార్, మన దగ్గర వందకి మూడు వస్తాయ్’ అంటాడు. బ్రాండెడ్ వస్తువులని ఇమిటేట్ చేసి అమ్మేసే ధోరణిని ఈ సన్నివేశం ప్రతిబింబిస్తుంది. ఖరీదైన దుస్తుల్లాంటి వాటినే తాము చవకగా కొనుక్కుని ధరించామన్న భావన ప్రజలలో కలిగిస్తారు.

ఇక స్మార్ట్‌ఫోన్స్‌లో ఇమిటేషన్ ఫోన్స్… ఎన్ని ఉంటాయో… చాలా వరకూ చైనా ఫోన్‌లంటారు… డిజైన్, ఫీచర్స్‌లలో చాలా వరకు అసలు కంపెనీల ఫోన్‌లను పోలి ఉంటాయి. ఖరీదైన ఫోన్‌లను కొనలేని వారంతా ఈ ఫోన్‌లను కొని తృప్తి పడతారు, చార్జింగ్ చేస్తుంటే అవి పేలిపోయో లేదా మాట్లాడుతుంటే చెవులు వేడిక్కిపోయో… ఇబ్బందుల్లో పడతారు. ఒకప్పుడు బాగా పేరుమోసిన బ్లాక్ బెర్రీ ఫోన్‌కి ఎన్నో ఫేక్ ఫోన్‌లు వచ్చాయని అంటారు…

అలాగే తాజాగా ఐఫోన్‌కి అంత క్రేజ్ ఉంది. ఐఫోన్ కొనడానికి ఎంతకైనా తెగిస్తున్నారు కొందరు. ఐ ఫోన్ కోసం జియావో వాంగ్ అనే చైనా మధ్యతరగతి యువకుడు తన కిడ్నీని ఓ ఆస్పత్రికి 3,200 డాలర్లకు అమ్మేసి, ఐ ఫోన్ కొనుక్కుని కొన్నాళ్ళు ఎంజాయ్ చేశాడనీ, తర్వాత ఆ ఒక్క కిడ్నీకి ఇన్‌ఫెక్షన్ సోకి తీవ్ర అనారోగ్యానికి గురై, అప్పుల పాలయ్యాడని వార్తల్లో చదివాను. ఇదే దేశంలో ఓ అమ్మాయి ఐఫోన్ కోసం తన కన్యత్వాన్ని సోషల్ మీడియాలో వేలానికి పెట్టిందని, అది చూసిన మరో మహిళ యుక్తిగా ఆ అమ్మాయికి బుద్ధి చెప్పిందని పత్రికల్లో చదివాను.

మామూలు బంగారు నగలు అందరికీ అందుబాటులో ఉండడం లేదని ఇమిటేషన్ గోల్డ్/వన్ గ్రామ్ గోల్డ్ పేరిట చవక రకం నగలు మార్కెట్‌లోకి వచ్చేసాయి. వ్యాపారులే స్వయంగా ఇమిటేషన్ గోల్డ్ అని చెప్పుకుంటూ అమ్ముతుంటే… ‘డైలీ వేర్’కి బావుంటాయనీ, చవకనీ, ఇంకా ఏవేవో కారణాలలో మహిళలు వీటిని ఎక్కువగానే కొంటున్నారు. ప్రస్తుతం వీటికి డిమాండ్ బాగా ఉందని తెలుస్తోంది. ఇక పట్టుచీరలకీ, ఇమిటేషన్ చీరలు వచ్చేసాయి… ఆన్‌లైన్‍లో కూడా ఇమిటేషన్ చీరలు లభ్యమవుతున్నాయి.

తండ్రి తనకి స్పోర్ట్ బైక్ కొనివ్వలేదని ఓ కుర్రాడు సెకండ్ హ్యాండ్ బైక్ కొని, దాన్ని ఓ మెకానిక్‌కి ఇచ్చి, కొన్న ధర కన్నా మరింత ఎక్కువ ధరకి స్పోర్ట్స్‌ బైక్‍లా మార్పించుకుని మా కాలనీ వీధుల్లో తిరుగుతుండేవాడు. ఈ మధ్యే వేరే ఊరికి ట్రాన్స్‌ఫర్ అయ్యింది ఆయనకి.

ఇలా తమ తాహతుకు మించిన వినిమయ వస్తువులను సొంతం చేసుకోడానికి డెమాన్‍స్ట్రేషన్ ఎఫెక్ట్‌తో పాటు మార్కెట్ మాయాజాలం కూడా దోహదం చేస్తుంది.

ఓ పిల్లాడికి పాడడం బాగా వచ్చి, ఏదో టీవీ ప్రోగ్రాంలో సెలెక్ట్ అయి బహుమతి గెల్చుకున్నాడనీ… తమ పిల్లల్నీ కూడా పాటలు కాకపోతే, ఇతర రంగాలలో ప్రావీణ్యం కోసం సతాయించి, ఏడిపించి, తాము లైమ్‌లైట్‍లోకి రావాలనుకునే తల్లిదండ్రులు మనకి సమాజంలో ఎందరో కనబడతారు. ఒత్తిడి చేసి బాల్యంలోని సంతోషాన్ని హరిస్తున్నామని వారి గ్రహించరు. పేరు ప్రఖ్యాతుల విషయంలో అనుకరణకే ప్రాధాన్యతనివ్వడం జరుగుతోంది.

మళ్ళీ పులి, నక్క దగ్గరికి వద్దాం. చారలు పెట్టుకున్నా నక్క ఎన్నటికీ పులి కాలేదని పులికీ తెలుసూ, నక్కకీ తెలుసు. చారలు పెట్టుకున్నా, నక్క తమ జాతిదేననీ తోటి నక్కలకీ తెలుసు… ఆ మాటకొస్తే నక్కకీ తెలుసు… నక్క నక్కే అని అందరికీ తెలిసినప్పుడు ఇంకా పులిలా ఎవరిని భ్రమింపజేస్తున్నట్టు? చారలు పెట్టుకున్న నక్కని చూసి పులి, తోటి నక్కలు నవ్వుకుంటాయోమో. మనుషుల విషయానికొస్తే సభ్యత కోసం పైకి నవ్వకపోయినా… చాటుగా నవ్వుకోడం మాత్రం తథ్యం.

గుడ్డి అనుకరణ అనేది అందమైన కళ్ళ జోడు కోసం కంటి చూపుని పాడు చేసుకోడం లాంటిది. “Wanting to be someone else is a waste of who you are” అని అంటారు Kurt Cobain. “Be yourself – not your idea of what you think somebody else’s idea of yourself should be.” అంటారు Henry David Thoreau. నిజం కదా!

మనం మనలాగే ఉందాం… మన జీవితాన్నే జీవిద్దాం!!

తాజా కలం:

rare striped fox అంటూ VKL పేరుతో ఒకతను Flickr లో చారల నక్క ఫోటోలు పెట్టాడు. 🙂

Exit mobile version