Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చంద్రునికో నూలుపోగు

[ఆగస్టు 25వ తేది ఆర్టిస్ట్ చంద్ర గారి జయంతి సందర్ఙంగా వారిని స్మరించుకుంటూ ఈ రచనని అందిస్తున్నారు శ్రీమతి ఏ. అన్నపూర్ణ].

కొందరు మనకు పరిచయం లేనివారు వుంటారు. వారిని ఎప్పుడూ కలుసుకోకపోవచ్చు. కానీ వారి ప్రభావం మనకు తెలియకుండా మనమీద ఉంటుంది. అనుకోకుండా గుర్తుకువస్తారు. వారే ఒకతరం వారికి తెలిసిన చిత్రకారుడు ‘చంద్ర’.

1993 లో కాకినాడనుంచి విజయవాడ వచ్చాను. పత్రికలూ కొని చదవడం అలవాటు కనుక రాగానే పత్రికలూ అమ్మే షాపు ఎక్కడవుందో తెలుసుకున్నా. అక్కడ కనబడింది. హైదరాబాదు నుంచి సాయి గారు నడిపే ‘రచన’ మాసపత్రిక. ముఖచిత్రం ఆకర్షణీయంగా వుంది.

అందులో అనవసర ఆర్భాటం లేదు. రచనలు చేసినవారు అందరూ ప్రముఖులు. కొందరు అమెరికా వాళ్ళు వున్నారు. కథలు చదివి సాయి గారికి ఉత్తరం రాసేదాన్ని. అలా కొంతకాలం తర్వాత కథలు నేనే రాస్తేనో.. అని ఆలోచన వచ్చింది. హైదరాబాదు వచ్చాక జీవిత చందా కట్టి, కథలు రాయడం మొదలుపెట్టేను. పత్రికలో ‘సాహితీ వైద్యం’ చేస్తున్న రచయిత ‘వసుంధర’ కొన్ని సూచనలు చేయడంతో మెళకువలు తెలుసుకుని మొదటి కథ ‘సెలయేరులో అల’ రాసి పంపేను.

ఆ కథ ప్రచురించారు . ఆ కథకు వేసిన చిత్రం నన్ను ఆకట్టుకుంది. అలా చూస్తూ ఉండిపోయాను . కథ వచ్చింది అనే ఆనందం కంటే ఆ చిత్రం ఎంతో బాగా వేసారో ‘చంద్ర’ అనే ఆర్టిస్టు అనుకున్నాను. వెంటనే నా మనసులో మాటను ఉత్తరం రాసాను సాయి గారికి .

అప్పుడు నాకు అంతగా చంద్ర గారి గురించి తెలియదు. రచనలో భాగస్థులు అనుకున్నాను. అంతే ఎప్పుడు రచనకు కథ పంపినా బొమ్మలు చంద్రగారివే. కొత్తలో చంద్రగారు వేసిన చిత్రాలు ‘బాపు’ చిత్రాలకు దగ్గిరగా ఉంటాయి అనేవారు. కానీ నాకు చంద్రగారివి సహజంగా తోచేవి. బాపు గారివి ఊహాజనితాలు. ఇద్దరికీ మధ్య వై విధ్యం ఇదే అని నాకు తోచేది.

నా అభిప్రాయాలు చదివిన సాయి గారు, నేను చంద్ర తో చెబుతాను అనుకోండి. మీరే ఫోను చేసి వారికి చెబితే బాగుంటుంది కదా అనేవారు. కానీ నాకు మొహమాటమెక్కువ. అందులో పెద్దవారు అన్నివిధాలా అని మరీ మొహమాటం. ఆ తర్వాత అమెరికాలో స్థిరపడిపోయాను.

రచన పత్రిక ప్రచురణ ఆగి పోవడం వలన నాకు చంద్రగారు కోవిద్ బారిన పడినట్టు ఆలస్యంగా తెలిసింది.

ఈ ఆగస్టు 25వ తేది చంద్ర గారి జయంతి అని తెలియడం – 2016 ఆగష్టులో 70 ఏళ్ల పుట్టినరోజు పురస్కరించుకుని హేమాహేమీలైన చంద్ర గారి అభిమానులు – స్నేహితులు రాసిన పరిచయాలతో అచ్చువేసిన ‘ఒక చంద్రవంక’ అనే 120 పేజీల పుస్తకం ఒకటి ఒక ఫ్రెండ్ పంపించడం కాకతాళీయంగా జరిగింది.

వారి గురించి ఈ జ్ఞాపకం పాఠకులతో పంచుకోవాలని మీ ముందుకు వచ్చాను.

ప్రతివారికి ఇలా ఏదో ఒక అనుభవం తప్పకుండా ఉంటుంది. నలుగురితో పంచుకోడం ఒక సంతోషం కదూ!

Exit mobile version