[రాజధాని నడిబొడ్డులో తాను పాతికేళ్ళు పనిచేసిన డెబ్భై ఏళ్ళ నాటి ఆర్టీసీ హైస్కూల్ మూతపడిన సందర్భంగా ఆవేదనతో శీలా సుభద్రాదేవి గారు రాసిన దీర్ఘ కవిత. ఇది 2వ, చివరి భాగం.]
~
అప్పట్లో
బడంతా ఒక పూలపందిరి.
పరిమళభరితమైన పూలతోట
తోటని కాపుగాచే తోటమాలులు నలభైకి పైనే
అన్ని మొక్కల్ని ఒకేలా పెంచకూడదు కదా?
రకరకాలా పూలమొక్కలకు
విభిన్న శుశ్రూషలు అవసరం
తోటమాలులలో విభేదాలు వుంటే వుండొచ్చు
తోట బాగుండటం అందరికీ ముఖ్యం కదా?
అందుకే పరిమళాల్ని ఎగరేస్తూనే వుండేది.
అందరిదీ ఒకే మాట కాకపోయినా
కొందరితో అందరూ కలవక తప్పదు
అందుకే
అర్థశతాబ్ది పుట్టినరోజు అలవోకగావెళ్ళింది
కాలచక్రం తిరుగుతూనే వుంది
రుతువులు మారుతూనే వున్నాయ్
వయోభారంతో ఒక్కొక్క తోటమాలీ
తోటని వదిలి పోతున్నారు
వాళ్ళని ఆపటం నా వశంలో లేదు.
పాతబడిన గోడలనుండి
నుసినుసిగా కన్నీళ్ళు రాల్చడం తప్ప
చేయగలిగేది ఏముంది?
కాలం నెమ్మదిగా నడుస్తూనేవుంది
చుట్టూ ఇళ్ళు శిథిలమౌతూనే వున్నాయ్
ఇళ్ళల్లోని జనాలు వలసపోయారు
జనాలు తిరగనిచోట్ల
జిల్లేళ్ళు తలలెత్తాయ్
రోజురోజుకూ చూస్తుండగానే
చుట్టూ పెరిగిపోతున్న అడవి
జిల్లేళ్ళ మాటున ముళ్ళు మొలిచిన
దొంగకళ్ళు విప్పారుతున్నాయ్
భయపడిన ఒయ్యారపు నెమిళ్ళూ,
జింకలూ ఒకటొకటే
ఆ పక్కకు రావటం మానేసేయి..
చుట్టూ విస్తరించిన అడవి మధ్య చిక్కుకున్న
వెలిసిపోతోన్న అందాల పూలతోట
ఎదిగిన కొమ్మలతోడి వృక్షాలైతేనేం
వృక్షాలనిండా బదనికలు అల్లుకున్నాయ్
జలవనరులు కరువై చిన్నబోయి
క్రమంగా వడలి పోసాగాయ్
ఆకులు కన్నీళ్ళతో నేలరాలుతున్నాయ్
భరోసా ఇచ్చిన పెద్దలు చూపిన మొండి చేయి
రెమ్మల్ని కకావికలం చేసింది
తోటమాలుల శ్రద్ధా కరిగిపోయింది
సమయం మించిపొయింది
ఒకరొకరే ఎగిరి పోతూనే వున్నారు
పచ్చని వృక్షాల్ని కూల్చి
అంతస్తులను లేపే ప్రయత్నాలు
చాపకింద నీటిలా పాకుతున్నాయ్
అట్టహాసంగా జరగాల్సిన అరవై ఏళ్ళపండుగ
నిశ్శబ్దంగా నిట్టూర్పులతో గడిచిపోయింది.
రోజురోజుకూ
ఏడాది ఏడాదికి
నా పై కూడా వయోభారం కృంగదీస్తుంది.
ఒక వర్షాకాలం
కుంభవృష్టి నన్ను నిలువునా ముంచెత్తింది
అంతటా చుట్టూ నీళ్ళే
కనుచూపు మేరంతా వరదగూడైంది
నీరు తోసుకు వచ్చి
మొలబంటినీటిలో మునిగిపోయాను.
అసలే వడలిన శరీరం
తడిసి తడిసి నాని పోయాను.
ఇంక తర్వాత చలికాలం
చెమ్మ నిండిన శరీరం వజ వజ వణికింది.
అంతే గుండె గుభేల్మని
పైనుండి ఓ గది నిండా వమనం చేసుకున్నాను
దాంతో పిల్లలంతా బెదిరిపోయి
మరింతమంది నిర్దాక్షిణ్యంగా
నా వడినుండి దూరమయ్యారు.
అంతలో
ప్రపంచాన్ని అంతటినీ తన కొనగోట తిప్పి
భయకంపితులను చేసిన మహమ్మారి వూళ్ళనీ, నగరాలనీ, పట్టణాలనే
నాలుగుగోడల మధ్య బంధీలను చేసింది.
ఇంక నేనెంత?
అసలే
కిలకిలలూ, గలగలలూ
గణగణలూ లేని చీకటి గుయ్యారం
తపోముద్రలోకి వెళ్ళిపోయాను.
రెండున్నర యేళ్ళలో
మరింత కృంగి కృశించి పోయాను.
“Be good, Do good” అంటూ
వేలాది పిట్టపిల్లలను కొమ్మల్లో పొదువుకొని ,
ఆటలు నేర్పి, పాటలు నేర్పి
బుద్ధులు నేర్పి, సుద్దులు నేర్పి
బడుగు బలహీన వర్గాల పిల్లలను
గుండెలకు హత్తుకుని విద్యనందించాను.
దరి చేరిన వారి కందరకూ
ఆప్తహస్తాన్నే అందించాను తప్ప
నిరాశ పరచలేదు.
నిరాదరణ చూపలేదు
విశాల విద్యావృక్షంగా విస్తరించిన
నాలోంచి నేను మాయమైపోతానేమో
ఒక్కొక్క కొమ్మా రెమ్మల్ని రాల్చుకుంటూ
మొండిబారిపోతున్నాయ్
అవయవాలన్నీ మోడు వారి
శిధిలావస్థకు చేరుతున్నాయ్
డెబ్భైఏళ్ళ యీ సుదీర్ఘ జీవితం
ఏనాడైనా కుప్పకూలిపోవచ్చని
పరీక్షించిన గృహవైద్యుల మాటలు వింటూ
గుండె నిండా గూడు కట్టిన దుఃఖపు చెమ్మ
గది గోడల నిండా మరకలు మరకలుగా
దిగులు ముద్రలేసాయి
మోడౌతోన్న విద్యావృక్షానికి
ఇప్పటికీ అంటి పెట్టుకొని వున్న
ఒకటిరెండు కొమ్మలు
ఒకటిరెండు రెమ్మలు
ఒకటి రెండు ఆకులూ
ఒకటి రెండు సీతాకోకచిలుకల్నీ,
చిట్టి చిలకమ్మల్నీ కూడా తరిమేస్తున్నారు.
మరో ఏ ప్రాణీ యీ ఆవరణ దరి రాకుండా
చుట్టూ ముళ్ళకంచెల్ని బిగించి
అష్టదిగ్బంధనం చేసేస్తున్నారు.
నా ఆక్రందన వినేవారు లేరు.
డెబ్భైయేళ్ళ ప్రయాణంలో
అలసిన ఆలోచన అందుకునే వారు లేరు.
నేనిప్పుడు నిస్సహాయ నిశ్శబ్ద ఒంటరిని.
ఇలాగే ఇలాగే
ఎప్పుడో నామరూపాలు లేక
భూగర్భంలో కలసిపోతాను.
నా కొమ్మల్లో కుహూగీతాల్ని నింపినవారూ
నా ఒడిలో అక్షరాలు దిద్దుకున్నవాళ్ళూ,
నా రెమ్మల్లో ఆటలు నేర్చినవారూ
నా ఆవరణలో స్వావలంబన సాధించినవారూ
ఏనాడైనా మీరు కలుసుకుంటే
నా కౌగిలిలో అందుకున్న ముద్దు ముచ్చట్లను కలరవాలతోనైనా
కన్నీళ్ళతోనైనా కలబోసుకుని
నన్ను తలచుకోవాలని కోరుకుంటూ
నా కథని ఇంతటితో ముగిస్తాను.