[రాజధాని నడిబొడ్డులో తాను పాతికేళ్ళు పనిచేసిన డెబ్భై ఏళ్ళ నాటి ఆర్టీసీ హైస్కూల్ మూతపడిన సందర్భంగా ఆవేదనతో శీలా సుభద్రాదేవి గారు రాసిన దీర్ఘ కవిత. ఇది మొదటి భాగం.]
~
తెలుగు మాధ్యమం బడిని
చదువుల నెలవుని
మీకెవరికైనా తెలుసా
తెలుగువారికి ఓ రాష్టం కోసం
భాషోద్యమం జరిగిందని
వాడవాడలా సమావేశాలూ
గ్రంథాలయోద్యమాలూ
ఆంధ్రోద్యమానికి కోరస్ పాడిన కవికోకిలలూ
ఆకాశమంతటా వీచిన కవితాగానాలూ
పొట్టిశ్రీరాములుగారి ఆత్మత్యాగం
ఎట్టకేలకు ఎలా అయితేనేం
ఆంధ్రరాష్ట్రమైతే ఏర్పడింది
సరిగ్గా అప్పుడే
అసలు నేను కన్ను విప్పాల్సింది
అనేకానేక అనూహ్య రాజకీయసందర్భాలు
హైదరాబాద్ సంస్థానంలో అనేకసంచలనాలు
విద్రోహమో విమోచనమో ఏదైతేనేం గానీ
అఖండ భారతంలో
దక్కనీ సంస్థానం విలీనమైంది
ఆంధ్రప్రదేశ్ గా కొత్త నామకరణం
విశాలాంధ్రానికి భాగ్యనగరం శిరస్సైంది
తట్టాబుట్టలు సర్దుకుని
ఉద్యోగులందరూ వలసపక్షులై
రాయలసీమ నుండి ఎగిరొచ్చి
దక్కను పీఠభూమిపై వాలారు.
హైదరాబాద్ నగరం ఇప్పుడు
తెలుగుల కొలువుల నెలవు
పాం పాయ్ అంటూ
రాష్ట్రమంతటా తిరగే
ఏపీఎస్ ఆర్టీసీ తనకోసం
తనకొక ఆవరణం కోసం వెతుకులాటలో
అరవై ఏళ్ళకాలపరిమితికి
భాగ్యనగరం నడిబొడ్డున స్థలంలో
లీజుతో వెలిసిందొక కాలనీ
అదే ఆర్టీసి కాలనీ
ఎర్రజండాల క్వార్టర్స్ లోని
ఓ వామపక్ష భావజాల నాయుడమ్మ
ఆ కాలనీ రోడ్ల మీద
ఆవారాలై తిరుగుతున్న పిల్లలకోసం
కాలనీ పిల్లల చేతిలో
అక్షర జండాలెగరాలనే
ఆమె తపన కార్యరూపం దాల్చింది
ఎర్రజెండా మోసుకు తిరగడం తెలిసిన
నాయుడమ్మగారి చేతులమీదుగా
పురుడు పోసుకుని
అంకితభావం గల కమలమ్మగారి వళ్ళో
డెబ్భై ఏళ్ళ క్రితం కళ్ళు విప్పి
తెలుగులోనే గర్వంగా కేర్ మన్నాను
నాయుడమ్మ అంతటితో ఆగిపోలేదు
కాలనీ అంతటిని గాలించి
ఔత్సాహికులు ఐన ఇల్లాళ్ళను కూడగట్టి
గురువులుగా కమ్మని ఆశీర్వదించి
ప్రోత్సాహాన్ని అందించి
బేసిక్ ట్రైనింగ్ చేయించి
వాళ్ళ చేతుల్లో ముద్దులబిడ్డనిచేసారు
నాటి నుండి
రెండు చిన్న క్వార్టర్లలోనే
ఊహలవుయ్యాలలో కేరింతలు కొట్టాను
ఆ చిన్ని రెండాకులమధ్య
కళ్ళిప్పిన నేను
బుడిబుడి నడకలు
తొలి అడుగుల ముద్రలు
మురిపాల చిలకపలుకులు
అన్నీ ఆ రెండాకులలోనే
బస్సులు నడపడం తెలిసిన
ఎర్రజండా నాయకులు
నన్నుకూడా నడిపిస్తామని
ఉన్నత శిఖరాలకు చేర్చుతామని కంకణబధ్ధులయ్యారు.
ఆరుగురమ్మల ముద్దులషణ్ముఖుడినై
రెండు గదుల్లో విరిసిన పూలనవ్వుల్నీ
గంతులు వేసే పిల్లల కిలకిలల్నీ
రంగుల సీతాకోకచిలుకల్నీ
గోడలనిండా అలంకరించుకుని మురిసాను.
బుజ్జి బుజ్జి పిల్లల గీసిన గీతల్లో
గోడలన్నీ అపూర్వ కళావేదికలయ్యాయ్
చిట్టి చేతుల చిత్రకళా విన్యాసం
అబ్బురపరిచే కళా నైపుణ్యం
ఆ చిన్నిగదులని వెలిగించాయ్
రోజురోజుకూ
ఎదుగుతున్న నాఆజానుబాహుత్వం
చూసుకుని యింకా యింకా
నేనే ఎదగాలనే తలంపు
చూస్తూ చూస్తుండగానే
ఒక్కొక్క క్లాసు మెట్లెక్కాను
అంతకంతకూ ముద్దొస్తున్న
నన్ను చూసి ముచ్చటపడి
పెంచి పోషిస్తామని ఒకవైపు రవాణాశాఖ,
మరోవైపు రాష్ట్రప్రభుత్వమూ
పోటీపడి పోటీపడి
ఆఖరుకు ఏకాభిప్రాయానికి వచ్చారు.
ఒకరు గార్డయనుగా నా బాగోగులూ,
మరొకరు నన్ను పెంచేవారి బాగోగులు
చూసుకోవటానికి ఒడంబడిక
అప్పటినుండి నాకు ఇద్దరు నాన్నలు
ఇంకేముంది?
రెండాకుల మొక్క
అయిదు రెమ్మలేసింది
రెమ్మరెమ్మకీ పెరిగిన నా అడుగులు
అయిదు గదులై రంగవల్లికలై
ముచ్చట ముద్రలువేసాయ్
అంతటితో నేనూ ఆగలేదు
అన్ని కొమ్మలతరగతుల్నీ,
ఎక్కుతూ దూకే పిల్లల్నీ
సముదాయించటానికి
ఆరుగురు తోటమాలులు
ఏం సరిపోతారు
కొత్త కొత్త కేర్ టేకర్లు
నా అందం చూసి ముచ్చటపడి
నన్ను వదలలేక నాదగ్గరే ఒదిగిపోయారు
ఆ విద్యావృక్షం నిండా గూళ్ళే
గూళ్ళ నిండా కువకువలాడే కూనలే
అయిదు తరగతులు దాటినా
పదేళ్ళ వయసు మీరినా
నన్ను వదిలి వెళ్ళటానికి
మనసురాని పిల్లలను జాలిగా చూసి
నా పెంపుడు తండ్రుల్ని
దీనంగా అర్థించేసరికి కరిగి నీరైపోయి
నా ఒళ్ళంతా ఆప్యాయంగా తడిమి ఆజానుబాహుశరీరానికి
సరిపడా పెద్ద బిల్డింగూ
ఆడుకోడానికి పచ్చనిమైదానం వెలిసింది
నాతో జత కూడిన పిట్టపిల్లలకు
పధ్నాలుగు ఏళ్ళు వచ్చే వరకూ
వాళ్ళని తీర్చి దిద్దే బాధ్యత ఇకపై నాదేగా
యిష్టం వచ్చినన్నాళ్ళు
ఆయురారోగ్యాలతో వుండమని
మా సహకారం వుంటుందని
భరోసా యిచ్చి దీవించి వెళ్ళారు.
అన్నట్లు
నేనూ అంతటితోనూ ఆగిపోలేదు.
అ-అమ్మ, ఇ- ఇల్లుతో బాటూ
A-ఏపిల్,B-బాల్ తో పిల్లలను
మమ్మీ,డాడీలకు అందించమన్నాను
ఇంక అప్పటినుండి చిట్టీచిలకమ్మలతో
బాబా బ్లాక్ షీపులు కూడా జతచేరాయ్
ఆవరణంతా తిరిగి గంతులేస్తుండగా
నాతో ఆడుకోవటానికి
సరదా పడుతూ
వస్తోన్న చిట్టి బుడతల్ని
అక్షరాలతో ఆటలాడించి,
అంకెలతో ఆరంగేట్రం చేయించి
రెండు చేతులా నడిపించుకొంటూ
ఉత్తర,దక్షిణ గదుల్లోనికి
శాఖలుగా విస్తరిస్తూ విస్తరిస్తూ
అయిదు కొమ్మలే
పదిఅడుగులకు ఎదిగాయ్
ప్రతి కొమ్మా రెండు రెమ్మల్నీ తొడుక్కున్నాయ్
కొమ్మ కొమ్మకూ రెమ్మరెమ్మకూ
నవ్వులు పువ్వులై విరిసాయి
ఆటలు ఆకుల పందిళ్ళై
పాటలు పచ్చతోరణాలై
విద్యావృక్షం విస్తరిస్తూనే వుంది
వాటితోపాటూ
ఫ్రాకులు పరికిణీ జాకెట్లుగా
తర్వాత ఒయ్యారపు ఒంపులుగా
ముసిముసి నవ్వుల్నీ,
నును సిగ్గుల మొగ్గల్నీ ఓణీలలో
మూటగట్టుకున్న ఒప్పులకుప్పలు
ముచ్చటగా వరండాలనిండా
రంగవల్లికలు పరుస్తూ
తరగతికొమ్మల్ని కలయతిరుగుతుంటే
హృదయావరణమంతా
పూలతోటలై పరిమళించేవి.
పొట్టి నిక్కర్లలోంచి
పొడుగు ఫేంటులలోకి జారుతూ
సన్నకంఠాల్లోంచి
గరుకు మాటలుగావిరిగిపోతూ
నూనూగు మీసాల మొలకలు
పైపెదవిపై తెచ్చిన కొత్తందనాలు
పక్క బెంచీలలోని రెండుజడలపైనో
గాలికి కదిలే ఓణీ రెపరెపల్నో దొంగచాటుగా
కొసరి కొసరి పరికించే చూపులకొసల్ని
ఎన్నిసార్లు పట్టుకుని
తరగతి రెమ్మల్లో బంధించవలసి వచ్చిందో?
పైథాగరస్ సిధ్ధాంతాలూ
న్యూటన్ సూత్రాలూ
ఏకకణబీజాలూ
దక్కను పీఠభూమి మీదుగా
ధ్వని తరంగాలు తరంగాలుగా
ఆకుల రెపరెపలతో
తరగతి కొమ్మలన్నీ ప్రతిధ్వనించినా
మూడు భాషల గుబాళింపు
రెమ్మల మధ్య నుండి వీస్తున్నా
ఏ చిన్న అవకాశాన్నో ఒడిసి పట్టుకుని
వినిపించే తొలి యవ్వనపు కిచకిచలూ
విని ఎన్నిసార్లు మురిసిపోయానో
(ఇంకా ఉంది)