Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చదువుకి పునాదులు వేసిన వీధిబడి గురువులు

[‘నన్ను ప్రభావితం చేసిన నా గురువు’ అనే శీర్షిక కోసం తమ వీధిబడి గురువుల గారి గురించి వివరిస్తున్నారు శ్రీమతి దాసరి శివకుమారి.]

న వ్యక్తిత్వాలు వికసించటానికి మన చదువుసంధ్యలు ఆలంబనగా నిలుస్తాయి. అలాంటి చదువు సంధ్యలకు పునాది వేసేది మన పసిప్రాయంలోని మన గురువర్యులు. అలాంటి గురువులు మనస్సులోకి వచ్చినప్పుడల్లా ఒక పూజ్యభావం రేకెత్తి పిల్ల తెమ్మెర లాగా మనలను సేద తీర్చుతుంది. ఆ పూజనీయులు వీధిబడిలోని వారు కావచ్చు, ప్రాథమిక పాఠశాలలలోని వారు కావచ్చు. నా అక్షరజ్ఞానం వీధిబడి లోనే పురుడు పోసుకున్నది.

మా నాన్నగారి ఉద్యోగరీత్యా నా చిన్నప్పుడు మేం చెఱకుపల్లి దగ్గకున్న గూడవల్లి గ్రామంలో వుండేవాళ్లం. నా నాలుగో యేట ఆ ఊరిలోని రాజు పంతులు గారి దగ్గర ఓనమాలు, వర్ణమాల నేర్చుకున్నాను. ఆ పంతులుగారు ఆ ఊరిలోని సూర్యనారాయణ గారి ఇంటి అరుగు మీద పిల్లలకు చదువు చెప్పేవారు. అలా నా తొలి గురువు రాజు పంతులు గారయ్యారు.

ఆ తర్వాత మేం మా ఊరైన కూచిపూడి గ్రామం వచ్చేశాం. మా ఊరు తెనాలికి సమీపంలో వున్నది. మా ఊరిలో ఒక హైస్కూల్, ఎలిమెంటరీ పాఠశాల వున్నవి. వాటికి తోడు ఊరిలో అక్కడక్కడా కొన్ని వీధిబడులు కూడా వుండేవి. మా ఇంటికి దగ్గరలోనే ఒక వీధిబడి వున్నది. దాంట్లోనే నేను, మా తమ్ముడూ, మేనమామ, మా పెద్దమ్మ కొడుకూ అందరం చదువుకున్నాం. ఆ వీధిబడిని ఇద్దరు అన్నదమ్ములు నడిపేవారు. పెద్ద పంతులు గారి పేరు కొండవీటి గురులింగం గారు, చిన్న పంతులు గారు కొండవీటి విశ్వనాధం గారు. ఆ బడి శివాలయం వెనుకనున్న మట్టి రోడ్డులో ఉండేది. ఆ అన్నదమ్ములిద్దరూ శివాలయం లోని అర్చకులు కూడా.

మట్టి రోడ్డు కాబట్టి వర్షమొస్తే అంతా బురదమయం. దాంతో నన్ను మా తాతయ్య తన భుజాన కూర్చుండబెట్టుకుని తీసుకొచ్చి బడిలో దింపి వెళ్లేవాడు. పెద్ద పంతులు గారైన గురులింగం గారితోనూ, వారి భార్య పెద్ద పంతులమ్మ గారైన వరలక్ష్మమ్మ గారితోనూ నాకు బాగా అనుబంధం ఏర్పడింది. ఒకటో తరగతి నుండి ఐదో తరగతి వరకూ తరగతులు జరిగేవి. ప్రొద్దుటి పూట సరస్వతీ ప్రార్థనతో చదువు ప్రారంభమయ్యేది. నా చదువు ఒకటో తరగతి పుస్తకంలోని తెలుగు పదాలతో ప్రారంభమైంది. వాటితో పాటు అంకెలు నేర్చుకోవటం అయిపోయి, చిన్నచిన్న లెక్కల్లో పడ్డాం. రోజులు గడుస్తున్నాయి. మా చదువులూ సాగుతున్నాయి. ఎవరి గోనె పట్టా వాళ్లం నేలపై పరుచుకుని కూర్చునేవాళ్లం. సాయంకాలం రోజూ ఎక్కాలు చెప్పించేవాళ్లు. ఎవరు కూర్చున్న పట్టా వాళ్ళు మడిచి ఒక వారగా గుట్ట పెట్టి వచ్చే వాళ్లం.

పంతులు గారి అమ్మగారు లలితాంబగారు. తెల్లని మల్లు పంచె గోచీ పోసుకుని కట్టుకునేవారు. ఆ పంచె కొంగునే తన బోడి గుండుకు బిగించి కట్టుకునేవారు. పనుల మీద ఇంటికి, బయటకు మా మధ్య నుంచే తిరుగుతూ వుండేవారు. “రాఘవయ్య గారింటికి వెళ్లి మజ్జిగ పోయించుకు రా” అని ఆడపిల్లలకు చెప్పేవారు. అలా వెళ్లి మజ్జిగ పోయించుకు రావటం, అందునా సత్తు తపాలా లోని మజ్జిగ తొణక్కుండా జాగ్రత్తగా తీసుకు వచ్చి ఇవ్వటం నాకు బాగా ఇష్టంగా వుండేది. పంతులు గారికి ఎవరైనా జున్ను పాలు పంపితే లలితాంబ గారు గడ్డ జున్ను వండి అక్కడున్న 30-40 మంది పిల్లలందరి చేతుల్లో తలా కందిబద్దంత జున్ను పెట్టేవారు.

అప్పట్లో అణా టీ పొడి పొట్లాలు పసుపు పచ్చని రంగులోవి, దుకాణాల్లో అమ్ముతుండేవారు. ఆ టీ పొడి కొనుక్కురమ్మని పంతులు గారు డబ్బులిచ్చి మగపిల్లల్ని పంపేవాళ్లు. వాళ్లు పోటీపడి వెళ్ళొచ్చేవాళ్ళు. సాయంకాలాలు బెత్తం పక్కన పెట్టుకుని ఎక్కువగా, పెద్ద పంతులు గారు వాకిలి గడప ఎక్కి కూర్చునేవారు. ఒంటిన చొక్కా వుండేది కాదు. బక్క పలుచని మనిషి. చామన ఛాయ. చేతిలో టీ గ్లాసు. ఆ టీని చప్పరిస్తూ ఎక్కాలు చెప్తూ మధ్యలో ఎవరైనా ఆపితే వాళ్లకు బెత్తంతో రెండు వడ్డిస్తూ వుండే గురులింగం పంతులు గారి రూపం నాకెప్పుడూ గుర్తుకొస్తూ వుంటుంది. ఆ సంవత్సరం అట్లతద్దె పండుగ వచ్చింది. పండుగ మర్నాడు, సోమవారం నాడు. ఆ ముందు రోజు ఆదివారం కాబట్టి మాకు సెలవు. నేను మా అమ్మమ్మ గారింటికి బయదేరాను. ఆ ఇల్లు కూడా దగ్గరే. బడి సందు మొగదలే నాకు గురులింగం పంతులు గారు కనపడ్డారు.

“శివకుమారీ! ముందు దొడ్లో ఉన్న గోరింటాకు చెట్ల మీద పడి అందరూ కోసుకుంటున్నారు, నువ్వు కూడా త్వరగా పోయి కోసుకో, పో” అనగానే నేను ఒక్క పరుగు మీద పంతులు గారి గోరింటాకు చెట్ల దగ్గరకు వెళ్ళాను, అప్పటికే ముగ్గురు, నలుగురు కోస్తున్నారు. కొమ్మలు పైకున్నాయి. పక్క వాళ్లది చిన్న ప్రహరీ గోడ. అదెక్కి నిలుచుని కోసుకున్నాం. ఇంతలో లలితాంబగారు వచ్చారు. “చాలా ఆకు కోసారు, ఇక రండి” అన్నా నేను వినకుండా ఒడి నిండా కోసుకుని మరీ వచ్చాను. మర్నాడు బాగా పండిన కాళ్లు చేతులూ పంతులు గారికీ, పంతులమ్మ గారికీ సంబర పడుతూ చూపించాను,

నేను రెండవ తరగతి పూర్తి చేసి మూడవ తరగతి కొచ్చాను. రెండు నెలలు గడిచాయి. దసరా పండుగ దగ్గర పడింది. ఒక వారం పాటు మా పిల్లలెవ్వరికీ చదువుసంధ్యల్లేవు. దసరా పద్యాలు నేర్పసాగారు. ‘ధర సింహాసనమై నభంబు గొడుగై’ లాంటివి. చివరగా ‘అయ్యవారికి చాలు ఐదు వరహాలు, పిల్లవాళ్లకు చాలు పప్పుబెల్లాలు’ అంటూ ముగించే వాళ్లం. ఉన్నంతల ఇంట్లో కొత్త బట్టలు సిద్ధం చేశారు. మగపిల్లలకు వెదురుబాణాలు, విల్లంబులు. వీటికి రంగురంగులు కాగితాలు, పూలు అంటించి వుండేవి. ఆడపిల్లలకు పలుచని చెక్కతో చేసిన కోతిబొమ్మలు, వాటికి ఆకర్షణీయమైన రంగులు వేసి కోతిని ఆడించటానికి ఓ తాడు కట్టి వుండేది. మగపిల్లలు బాణాలు వేస్తుంటే, ఆడపిల్లలం కోతిని తాడుతో పైకీ కిందకూ ఆడిస్తూ మురిసిపోయే వాళ్ళం. ఆ బడిలో చదివే పిల్లల ఇళ్లకు వారం రోజుల పాటు వెళ్లి పద్యాలు పాడేవాళ్లం. ఇద్దరు పంతులు గార్లు మా ముందూ వెనకా ఉండి మమ్మల్ని తీసుకెళ్ళే వారు. ఆ రోజు ఎవరింటికెళ్తామో ముందే చెప్పేవారు కనుక మా అమ్మలు రెండు బేసిన్ల వేయించిన శనగవచ్చు, సన్నగా తరిగిన బెల్లం, మరమరాలు ఇవన్నీ కలిపి సిద్ధం చేసేవాళ్ళు. పద్యాలు పాడటం అయిపోయాక పిల్లల చేతుల్లో వాటిని పోసేవారు. కొందరు తెలివిగా జేబుగుడ్డలు తెచ్చుకుని వాటిలో పోయించుకునేవాళ్లు. అయ్యవారికి తోచినంత దసరా కానుకగా డబ్బులిచ్చేవాళ్లు.

మరో నెల గడిచింది. వరలక్ష్మమ్మ పంతులమ్మగారు మడి కట్టుకుని వంట చేస్తున్నా వాళ్ల ఇంట్లోకి వెళ్లిపోయి కబుర్లు చెప్పేదాన్ని. అంతేనా, అక్కడితో ఆగకుండా వాళ్ల పెరటి గోడ దగ్గరకెళ్ళి పక్కింట్లోని రావు తాతయ్యి గారి భార్యతోనూ, కూతురులోనూ కబుర్లు చెప్పేదాన్ని. వాళ్లు నన్ను ‘కుమారీ’ అని పిలిచేవాళ్లు. రావు తాతయ్యకు కూడా నేనంటే చాలా ప్రీతి. చదువు సంధ్యలలో పాటు, చీకూ చింతా లేని బాల్యం అది. పంతులు గారు చేతిలోని బెత్తంతో అల్లరి చేసిన వాళ్లను, ఎక్కాలు తప్పు చెప్పిన వాళ్లను దండిస్తూ వుండేవాళ్లు. మరీ అల్లరి చేస్తే మగపిల్లలకు గోడ కుర్చీ, గుంజీళ్లు తీసే శిక్షలు వుండేవి. ఆడపిల్లలకు నించోటం, వంగోటం లాంటి శిక్షలు పడేవి.

కాని పంతులు గారి మీద ఏ మాత్రం కోపం వుండేది గాదు. పంతులు గారి ఇంటి దక్షిణపు సందుకు, చిల్లకంపతో దడి కట్టించారు. అది ఎప్పుడూ పచ్చగా, గుబురుగా వుండేది. ఆ స్థలమే మా ఆడపిల్లలకు మూత్రశాల. దాని పక్కనే కాపురమున్న వృద్ధ జంట కూడా ఎప్పుడూ పిల్లల గోల అని కానీ దుర్వాసన అని గానీ విసుక్కోవటం వుండేది గారు. ఆ మామ్మ వంట చేస్తుంటే, కట్టెలు సరిచేస్తూ, పొయ్యి దగ్గరకు అన్నీ చేరవేసే తాతగార్ని చూడటం మా ఆడపిల్లలకు సరదాగా వుండేది.

నా మూడవ తరగతి చదువు మూడొంతులు అంటుంది. ఒకరోజు మా గురులింగం పంతులు గారు “శివకుమారీ! నువ్వు రేపట్నించీ ఐదవ తరగతిలో కూర్చో. నువ్వు తెలివిగలదానివి, చదువుతావు” అనేశారు. నాకు సంబరమనిపించింది. మా స్నేహితురాలు ఒక గడుగ్గాయి. తనన్నది – “మా అక్కను కూడా ఇలాగే చేశారు. ఐదో తరగతికి జీతమెక్కువ గదా అందుకని ఇలా చేస్తారు శివా” అని.

మా ఇంట్లో కూడా దీన్ని గురించి పట్టించుకోలేదు. నేను ఐదవ తరగతిలో కూర్చోవటం, ఆ పుస్తకాలు చదవటం మొదలయింది. ఎలాగో ఐదవ తరగతి పూర్తయింది. హైస్కూల్ కెళ్లి ఆరవ తరగతి చదవాలంటే ప్రవేశ పరీక్ష రాసి పాసైతేనే చేర్చుకుంటారు. అలా పరీక్షకు కూర్చోవటానికి పుట్టిన తేదీ వెయ్యాలి. వయస్సు 10 సంవత్సరాల ఆరు నెల్లు పూర్తి కావాలి. నాకు మూడేళ్లు తక్కువుంది. పంతులు గారు నిరభ్యంతరంగా మూడేళ్ల వయస్సు ఎక్కువేసి అప్లికేషన్ పూర్తిచేశారు. అలా నా వయస్సు మూడేళ్లు ఎక్కువ కావటంలో మూడేళ్ల ముందే పదవీ విరమణ చేశాను. అలా అయినా మా పంతులు గారి మీద నాకెప్పుడూ ఏ కోపం రాలేదు, వారి ఆప్యాయత, ఆదరణలే గుర్తుకొస్తాయి.

నా ఐదవ తరగతి చదువులో పంతులు గారికి బాగా పరిచయమున్న మా వీధిలోని వెంకటరత్నం మామయ్య వచ్చి ఎప్పుడన్నా లెక్కలు చెప్పేవాడు. ఆ మామయ్యది మా వీధే. ఆ బడిలోని పరిచయంతో ఆ మామయ్య కూడా నేనంటే బాగా అభిమానంగా వుండేవాడు. వాళ్ల చావిడి దొడ్లోని మామిడి చెట్టు నుంచి నాకిష్టమైన పచ్చి మామిడికాయలు తెంపి అప్పుడప్పుడూ ఇచ్చేవాడు. ఆనాటి బాల్యమిత్రులు ఎప్పుడైనా మా ఊరు వెళ్లినప్పుడు కనిపిస్తూ ఉంటారు. అసూయా ద్వేషాలు కానీ, కల్మషం గానీ ఎరుగని రోజులవి. ఆ బాల్య స్మృతులే ఈనాటికీ గుండెల్లో గూడు కట్టుకుని వున్నాయి. మా గురులింగం పంతులు గారు ఇప్పుడు లేకపోయినా వాళ్ల కుటుంబం అదే చోట కొత్త ఇల్లు కట్టుకుని వుంటున్నారు. వాళ్లందరితోనూ నాకు మంచి పరిచయాలే వున్నవి. ఇలా నా ఐదు తరగతులు ఆ వీధిబడిలో పూర్తయినాయి.

(హైస్కూలు గురువుల గురించి మరోసారి)

Exit mobile version