[శ్రీ సముద్రాల హరికృష్ణ గారి ‘చదువరులు కావలెను!!’ అనే రచనని అందిస్తున్నాము.]
తేరగ దొరుకుతారేంటి చదువరులు
తీరికే లేని సా.మా.ల వీర శ్రామికులు
బరబర రాయమంటే రాసే వ్రాతగాళ్ళు
పరుల రాతల చదువని శాస్త్రీయులు!
***
‘ఏంటబ్బా ఈ ఆదివారం నాడు ఇంత రష్షూ, యుగయుగాల నుంచీ ఖాళీగా కనబడిన ఊరవతలి మైదానంలో?!’, అనుకున్నాను మొదటి సారి చూసి!
సోమవారం మధ్యాహ్నం ఆఫీసులో కొలీగ్ ఒకతను అడిగాడు, “నీకు తెల్సా ఈ వింత, మన పాత మైదానంలో ప్రతాదివారం, చదువరులకు సన్మానాలు చేసి డబ్బులిస్తున్నారట?!”
“మదుపరులకు వడ్డీ ఇచ్చినట్టు, చదువరులకు డబ్బులేవిఁటీ, సన్మానాలేవిఁటీ, వివరంగా చెప్పవయ్యా బాబూ”, అని నేను!
“ఏమో తెలియదు, చూట్టానికే ఈ ఆదివారం వెళ్తున్నాను, వస్తావేంటి సరదాగా?!” అన్నాడతను.
“ఏం నేనేం తక్కువ రకం సాహిత్యాభిమాని ననుకుంటున్నావా, నేనూ వస్తాను. ఈ వింతేమిటో కళ్ళారా చూడాల్సిందే” అని నొక్కి మరీ చెప్పాను నేను.
***
ఆదివారం గిర్రున తిరిగొచ్చింది. ఇద్దరం స్కూటర్లు మీద పదకొండు కల్లా చేరుకున్నాం, పాతమైదానానికి. మైదానమంతా ఆరేడు పెద్ద టెంట్లు వేసి ఉన్నాయి. అందులో ఒక్కొక్కదాంట్లో ఓ పాతిక ముఫ్ఫై కుర్చీలు.
దానిలోనే ఒక పక్కగా ఒక చిన్న సైజు సింహాసనం, కాస్త ఎత్తైన చదరపు బల్ల మీద.
అక్కడ ఓ బ్యానర్ కట్టి ఉంది, ‘పాఠకసన్మానపీఠము’ అని!
ఇదేంటిదీ, కంచికామకోటిపీఠం, శృంగేరి పీఠం లాగా సన్మానపీఠమా!? ఇదేదో కొత్తగా ఉందేఁ, అనుకున్నాం!
ఫ్రీయే కాబట్టి దర్జాగా ముందు వరుసలోకి వెళ్ళి కూర్చున్నాం, నేనూ మా కొలీగ్, సోమసుందర్!
***
పది నిముషాలకి ఒకతను మా దగ్గర కొచ్చి “సార్ మీరు రిజిస్టర్ చేసుకున్నారా” అన్నాడు!
“రిజస్టరా అది దేనికీ”, అని ఇద్దరం ఒకేసారి అడిగాం.
“చదువరిగా సార్, చదివి సన్మానం పుచ్చుకోవడానికి” అన్నాడు, ‘ఓరి అమాయక పక్షుల్లారా’, అంటున్న లాంటి ముఖం పెట్టి!
“లేదేఁ, మాకు తెలియదు కూడా అట్లాంటి దొకటుందని! ఊరికే ఏవిఁటా ఇక్కడ హడావిఁడి, చూద్దామని వచ్చాం” అన్నాం ఇద్దరమూ!
“అయితే మీరు రెండు వరుసలు వదిలి ఆ వెనకాల కూర్చోండి సార్, ఏమీ అనుకోవద్దు, ఇవన్నీ పాఠకోత్తములకీ, చదువరి మహాశయులకీ కేటాయింపబడిన సీట్లు” అన్నాడు, కాస్త వినయంగా, ఎక్కువ డిస్మిస్సివ్ గా!
“ఓ, దానికేం, పర్వాలేదు”, అంటూ లేని శాంతం నటిస్తూ మూడో వరుసలో కూచోబోయి, ఎందుకైనా మంచిదని అదీ వదిలేసి, నాలుగో వరుస అనగా చివరి వరుసలో సెటిల్ అయ్యాం!
***
అయిదు నిముషాల్లో కార్యక్రమం మొదలైంది. మొదట నవలా పఠనం.
అక్కడే ఉన్న ఆ నవలా రచయితా, రచయిత్రీ పాఠకులను అతి గౌరవంగా స్టేజీ మీదకు తెచ్చి పుస్తకాలు అందించారు.
ఇద్దరు యువతులు వచ్చి, చెరి ఒక పేజీ రెండు నవలలోవి చదివారు.
నాయికా నాయకుల పేర్లు తప్పులు చదివారు వారు. పక్కనే నుంచున్న రచయితలు సవరించారు..
కామాల దగ్గర విరామాలూ, విరామాల దగ్గర ప్రశ్నార్థకాలూ పెట్టి, ఎవ్వరికీ ఏమీ అర్థం కాకుండా, వారి వారి పేజీలను లంకా దహనం చేసి వదిలారు.
అయినా లోపల నుంచి తన్నుకొస్తున్న దుఃఖాన్ని ఆ ధీరులైన రచయితలు బైటికి రానీయలేదు.
చదివిన తరువాత జాగ్రత్తగా వారి సీట్ల వరకు ఆ చదివినవారిని తీసుకొచ్చారు మర్యాదపూర్వకంగా.
తరువాత వచనకవితల పఠనం జరిగింది.
లాల్చీ పైజామా లలో ఉన్న ఇరువురు నడివయసు వారు వచ్చి కవితలు వ్రాసి ఉన్న కాగితాలు ఆ రిజిస్టర్ చేసుకున్న పాఠకోత్తములకు సగౌరవంగా ఇచ్చారు.
బహుశా వారు ఆ కవితా రత్నాల సృష్టికర్తలై ఉంటారు అని అందరూ ఊహించారు వారి జాలి చూపులను బట్టి.
ఆ ఉత్తమ పాఠకులు ఆ కవితలను ఒత్తులు లేని చోట ఉంచీ, మహా ప్రాణాలకు మంగళహారతులిచ్ఛీ, నిర్విఘ్నంగా అక్షర సంహారం చేసి, ప్రపంచ విజేతల మొహాలు పెట్టి, తమ సీట్లోకి వచ్చి కూచున్నారు.
అందులో ఉన్న పదచిత్రాలూ వగైరా అర్థం అయిన వారు ఆ టెంట్ మొత్తంలో ఒక్కరు ఉన్నట్టు కనబడలేదు.
అయినా అందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు.
చప్పట్ల బ్యాచ్ ఎటూ ఉండనే ఉంది వాల్యూమ్ పెంచటానికి!
అవును మీరు చదివింది నిజమే!
రచయితలే కనీసం ఓ నలుగురిని, లేదా యథాశక్తి అంతకు మించీ చప్పట్ల సభ్యులను తెచ్చుకుంటారట – సభ మరీ నీరసంగా ఉంటే, దీపావళి టపాకాయల్లాగా చప్పట్లు మోగించటానికి!
ఆ రోజుకి చివరి ఘట్టం, అంటే అంత్య క్రియ- పద్య కవితా పఠనం.
ఇద్దరు నవీనయుగపు వృధ్ధకవుల కావ్య ద్వయ పఠనం, పదేసి నిముషాల పాటు.
చదివే పాఠకులు ఇద్దరూ, వారి శిష్యులే, పైగా పీ.హెచ్‌ఢీఢీలు!
ఇద్దరు హెచ్‌ఢీలూ నట్లు నట్లుగా, బోల్టు బోల్టుగా కిందపడి మీదపడీ అవి చదివామనిపించారు. చదువుతున్నంత సేపూ వారిద్దరూ సదరు వృధ్ధ కవుల మొహాలు చూస్తే ఒట్టు!
కారణం – వారు చేస్తున్న భాషావిషయిక మారణకాండ వారికీ తెలిసి ఉండటం. అయినా వారేం చేస్తారు నిస్సహాయులు.
వారి సంకల్పం మంచిదే, సరస్వతి అంతకంటే వారిని కటాక్షించలేదు, ఏం చేస్తాం?!
మన ప్రాప్తమూ అంతే, సరిపెట్టుకోవాల్సిందే!
రాసుకున్న వాడికి రాసుకున్నంత మహాదేవ, అన్నారుగా
***
పఠన సభ ముగిసింది.!
చేటంత మొహాలు చేసుకుని రచయితలు ఒక్కొక్కరే మైకు తీసుకుని తమ స్పందనలు తెలియచేశారు.
చదివిన చదువరులందరూ అద్భుతంగా చదివారనీ, తెలుగు రచనా ప్రపంచానికి వీరి లాంటి వారే కాసె బిగించిన వీర సైనికులనీ, పొగిడారు.
ఇది రచయితలందరూ కలిసి తమసర్వసభ్య సమావేశంలో తీసుకున్న నిర్ణయమట!
ఏవఁనీ?!
ఎవరు తమ రచనలను ఎంత భ్రష్టు పట్టేంచేటట్లు చదివినా చివర్లో మటుకు ఆ చదువరులను మెచ్చుకోవాలి అని!.
అట్లా చేయకపోతే, ఆ అతి తక్కువ సంఖ్యలో వున్న పాఠక వంశం అంతరించి పోతుందని వారి భయమే కాదు, గట్టి నమ్మకం కూడా నట!
***
ఇంతటితో సభ అయిపోయిందనుకుంటే పొరబాటే! తదుపరి ఘట్టం, పాఠక సన్మాన ఘట్టం!
ఆ పక్కనే ఉన్న సింహాసనం మీద కూర్చోపెట్టి ఆ ‘దినం’ తాలూకు ప్రతి పాఠకుడికీ, కాదు కాదు పాఠకోత్తముడికీ సన్మానం చేశారు.
“ఎవరూ?!”, అనే అనుమానమే రాకూడదు న్యాయంగా!
అయినా విడమరిచి చెప్పేస్తేనే మంచిది –
సన్మానం చేసింది ఆ నవలాకర్తలే, ఆ కవితాస్రష్టలే, ఆ కావ్యబ్రహ్మలే!
అంతా వారి వారి స్వంత ఖర్చేనట, పాపం!
వాళ్ళూ వీళ్ళూ చెప్పుకుంటేనూ, ఆ రచయితల కుటుంబసభ్యులు పక్కనే నుంచుని బాధపడుతుంటేనూ, మేము కుశాగ్రబుధ్ధతో గ్రహించినవే సుమా ఈ విషయాలన్నీ!
మాకెవ్వరూ వచ్చి ఇంటి గుట్టు విప్పలేదు చెవిలో!
పుణ్యాత్ములు!!
***
బయటకు వచ్చి స్కూటర్ స్టార్ట్ చేస్తూ, సోమ సుందరం అడిగాడు, సందేహం గుండెలో గుబగుబలాడి వీడక పోతే-
“అసలు ఒరే భానుచంద్రం, ఇదంతా ఎందుకంటావ్ ఆ రచయితలందరూ చేస్తున్నదీ?!” అని!
భాను చంద్రం – (అనగా నేనేనండీ) ఇట్లా చెప్పాడు: వారికి ఏదో వ్రాసి లోకానికి చెప్పాలని ఆరాటంరా నాయనా. వ్రాసింది ఎవరైనా చదవాలిగా, అప్పుడేగా దానికి సార్థకత! ఇప్పుడేమో అందరూ సామా లలో పడి బొత్తిగా చదవటం మానేశారు. ఎంత సేపూ వాట్సాప్పూ, యూట్యూబూ వగైరాలేగా! పుస్తకాలకు పుస్తకాలు గూళ్ళలో దుమ్ము కొట్టుకు పోతున్నాయట! అరలకు బూజులు కాదుట, అక్షరాల నీడలు వేలాడు తున్నాయట, దీనవదనాలతో, వాటి మొహాలను చూసే వారెవరూ లేకపోవడంతో! ఎట్లాగైనా జనం చేత చదివించాలని ఆ రచయితల్లోనే కొంతమంది నడుం కట్టి, తమ సొంత ఖర్చులతో ఇట్లాంటి సభలు నిర్వహించి పాఠకులను బతికిస్తున్నారట, ఏదీ.. సన్మానాలు సైతం చేసి. అదీ సంగతి! పద పోదాం, చూశాంగా తెలుగు సరస్వతి ఈ నాటి వైభవం!
***
సోమసుందరాన్ని పోతూ పోతూ అడిగా, “రాబోయే కార్యక్రమాలకు కూడా వస్తావా”, అని!
“ఇంటి దగ్గరే కూర్చుని ఒక్క పేజీ అయినా చదివే ప్రయత్నం చేస్తాను దీని బదులు” అన్నాడు, ఏదో నిర్ణయం తీసుకున్న మనిషి లాగా!
‘అవును, కనీసం రెండు పేజీలు చదవాలి’ అనుకుంటూ, స్కూటర్ స్టార్ట్ చేశాను నేను కూడా!