[శ్రీధర గారి ‘చందమామ మసకేసిపోయే’ అనే కథాసంపుటిని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
శ్రీధర పేరిట రచనలు చేసే శ్రీధర మూర్తి గారు ప్రసిద్ధ రచయిత. సీనియర్ కథ, నవలా రచయిత. శ్రీధర గారు 1993-2023/24 మధ్య కాలంలో ప్రచురితమైన కథలతో ‘చందమామ మసకేసిపోయే’ అనే సంపుటిని వెలువరించారు. ఈ సంపుటిలో 25 కథలున్నాయి. కొన్ని కథలు వివిధ పోటీలలో బహుమతులు పొందాయి. సామాజికాంశాలను, మనుషుల స్వభావాలను, ఆయా కాలాలలోని కొన్ని ప్రధాన ఘటనల ఆధారంగా కథావస్తువులను ఎంచుకున్నారు రచయిత.
సీనియర్ రైటర్ అయినా, సమకాలీన కథకులకు ఏ మాత్రం తీసిపోరు శ్రీధర. ఆధునిక కాలపు కథల్లో ఉండే కొసమెరుపు, అనూహ్య మలుపులు, జయాలు, అపజయాలు, ప్రేమలు, వియోగాలూ, ఒంటరి మనుషులు, ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాలు.. తదితర అంశాలతో కథలల్లారు శ్రీధర.
కథలు చెప్పడంలో శ్రీధర గారిది ఓ విలక్షణమైన శైలి. వస్తువు ఏదైనా, ఆపకుండా చదివించే గుణం ఉంటుంది వీరి కథలకి. ఏ పాత్రా ప్రయోజనం లేకుండా ఉండదు, సంభాషణలు నేల విడిచి సాము చెయ్యవు. కథలో సందర్భాన్ని బట్టి ఏదైనా చెప్పాల్సి వచ్చినప్పుడు ఆయా పాత్రలే చెప్తాయి తప్ప, రచయిత కథలోకి చొచ్చుకొచ్చి చెప్తునట్టు ఉండదు.
ఈ కథల్లో మంచివాళ్ళుంటారు, చెడ్డవారూ ఉంటారు. తోటివారికి సాయం చేసేవారున్నటే, పక్కవారిని తొక్కేసి, తాము ఎదిగిపోవాలనుకునే వారుంటారు. భర్తని అతిగా నమ్మే భార్యలుంటారు, తేనెపూసిన కత్తిలా భార్యలను మోసం చేసే మొగుళ్ళుంటారు. చిన్న చిన్న సమస్యలకే క్రుంగిపోయేవారుంటారు, మిన్ను విరిగి మీద పడ్డా చలించక, తామెంచుకున్న మార్గంలో పయనించే వారుంటారు. సమాజం పట్ల కసి పెంచుకున్నవారు కొందరైతే, సమాజాన్ని అర్థం చేసుకుని ప్రేమించేవారు మరికొందరు. వెరసి కథలు చదివే పాఠకులకు ఇవి తమ కథలనిపిస్తాయి. వెన్నెలలా హాయిని కురిపించి, ఆహ్లాదాన్ని కలిగించి, ఆలోచనల్ని రేకెత్తిస్తాయి.
చాలా కథల్లో – పాత్ర మానసిక స్థితినో, లేదా సౌందర్యాన్నో ప్రస్తావించినప్పుడు – గంభీరమైన గ్రాంథిక భాషలో వర్ణనలుంటాయి. అలా అని అవేవి మింగుడుపడనివి కావు.. ఉన్నట్టుండి ఏ ప్రబంధమో చదువుతున్నామా అనిపిస్తాయి. కొన్ని సార్లు సందర్భోచితంగా పాత సినిమా పాటలను ఉపయోగిస్తారు.
ఉదాహరణకు, ‘మనసు పరిమళించెనే’ కథలో “అది ప్రేయసీ ప్రియులు ఏరి కోరి సృష్టించుకున్న నీరవ నిశీధి చంద్రిక సన్నిధి కావచ్చు”; “కూరిమి కౌగిలింతల వేళ, నవసమాగమ వేళ, ఏకాంతంతో అయినా ఏకాంతం అభిలషయమే గానీ” లాంటి వాక్యాలు! అలా అని ఇది రొమాంటిక్ కథ కాదు! చక్కటి సామాజిక కథ. లభించిన అవకాశాన్ని అందిపుచ్చుకుని అమెరికా వెళ్ళిపోవలసినవాడు – ఇతరులంతా తమకి సంబంధం లేని విషయం అని వదిలేసిన విషయంలో జోక్యం చేసుకుని, తమ అమెరికా ట్రిప్నీ ఉద్యోగాన్ని కూడా పొగొట్టుకుంటాడు. కానీ మంచి పని చేశానన్న తృప్తితో, జరిగిన వాస్తవాన్ని కంపెనీ వాళ్ళకి వివరిస్తే, పెద్ద హోదా పదవిలోకి అమెరికాకి ఆహ్వానిస్తారు! అలాగే, ‘కలలు – సంకెలలు’ కథలోనూ, ‘ద గేమ్’ కథలోనూ ప్రేమలో ఉండగా (ప్రేమిస్తున్నానంటూ), ఓ మహిళతో ఓ మగాడు చెప్పే సంభాషణలు ఆకట్టుకుంటాయి,
కథల్లో సందర్భోచితంగా హాస్యం బాగా పండుతుంది. ‘కౌటిల్యుడి కజిన్ సిస్టర్’ కథంతా నవ్విస్తూ సాగుతుంది. ఆఖరి వాక్యం రచయితకు పదాలపై ఉన్న పట్టుని నిరూపిస్తుంది. అలాగే, ‘ఒక దీపం వెలిగింది’ కథలో “ఆయన స్పీచ్ అలాగే ఉంటుంది. బంగాళాఖాతంలో తుఫానులాగా, తూర్పు గోదావరి వైపు రాబోయి, ఒరిస్సా వైపు మళ్ళి, పశ్చిమ బెంగాల్ చేరుతుంది” అనే వాక్యాలు చదువుతూంటేనే నవ్వొస్తుంది.
అన్ని కథలు చదివాకా, పాఠకులకు – రచయితలోని చిలిపితనం స్ఫురిస్తుంది. చాలా కథల్లో సంభాషణల మధ్య ఉన్నట్టుండి ఓ సరదా వాక్యమో/చిలిపితనం రంగరించిన పదాలో కనబడతాయి. చిన్న చిరునవ్వు పెదాలపై మొలుస్తుంది.
కొన్ని కథలకి పెట్టిన శీర్షికలు బావున్నాయి. ఉదాహరణకి, ‘మాట వరసకెపుడైనా అన్నానా’, ‘కోరికల శారికలు’, ‘చరణం అందని పల్లవి’, ‘వయసే వయసును’.
అన్ని కథలూ హాయిగా చదివిస్తాయి. నవ్విస్తాయి. కవ్విస్తాయి, ఆలోచింపజేస్తాయి, కొన్ని పాత్రలకెదురైన సంఘటనలు నిత్యజీవితంలో మనకి ఎదురైతే, ఆయా పాత్రలు చేసిన తప్పుల్ని మనల్ని చేయద్దంటాయి. ఇంతకంటే ఏ ప్రయోజనం కావాలి?
వర్త్ రీడింగ్! పైసా వసూల్ పుస్తకం!
***
రచన: శ్రీధర
ప్రచురణ: వేద ప్రచురణలు
పేజీలు: 208, వెల: ₹ 300/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
వేద ప్రచురణలు
13-8-53, గౌతమ్‌నగర్ కాలనీ,
పి అండ్ టి కాలనీ రోడ్, దిల్‌షుఖ్‌నగర్,
హైదరాబాద్ 500060
రచయిత: 9959556876
~
శ్రీధర గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mr-sridhara/
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.