[శ్రీమతి షేక్ కాశింబి గారు రచించిన ‘కెమెరా’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
అడుగడుగునా ఎదురయ్యే అనుభవాల
ఆనంద చందనపు సుగంధాన్ని
మాధుర్యం నిండిన శుభ సందర్భాల సంపదని
చెక్కు చెదరక పదిలంగా దాస్తుంది!
అయినవారు వెంట ఉన్నా.. లేకున్నా
కన్నెత్తి చూసినప్పుడెల్లా
వారున్న అనుభూతినే కలిగించి
తీపి జ్ఞాపకాల ఛాయా చిత్రాలతో అలరిస్తుంది!
పసివాళ్ళ నించి ముసలోళ్ళదాకా
అందరికీ అందుబాటులో కొచ్చి
అన్ని అవసరాలను తీరుస్తుంది..
ఆధునిక ‘సెల్‌ఫోన్’ తో చేరి!
ధనాన్ని సమయాన్ని శ్రమని మిగిల్చి
విద్యార్థుల చేదోడై నిలవడమే గాక
‘వీడియో’, ‘ఫిల్మ్ మేకింగు’ల్ని
కొత్త పుంతలు తొక్కిస్తుంది!
వ్యక్తిగత గోప్యతకి భంగం కలిగించక
సఖ్యతా పొరలకి తూట్లు పొడవక
రహస్యాల్నించి లబ్ది పొందాలని ఆశించక
నియంత్రణ పాటిస్తే.. దీని ప్రయోజనాలకు ఆకాశమే హద్దు!
మంచి చెడుల విచక్షణని మనిషి కొదిలేసిన
రెండు వైపులా పదునున్న ఈ కత్తి
అపరాధ పరిశోధనలో అద్భుతాలు
సాధించి ‘వహ్వా’ అనిపిస్తుంది!
నిత్య పరిశోధనల్లో.. పరివర్తన చెందుతూ
తన పరిధిని విస్తృత పరుచుకుంటూ
మానవ మేధను నివ్వెరపరుస్తూ.. భవిష్యత్తులో
మరెన్ని చిత్ర వి’చిత్రాలు’ చెయ్యనుందో.. అలనాటి ‘కెమెరా!’
