Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

బుడతలు నడయాడే ఇళ్ళు

[శ్రీ ఐలేని గిరి రచించిన ‘బుడతలు నడయాడే ఇళ్ళు’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము. సంచిక సాహితి ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 శ్రీ విశ్వావసు ఉగాది కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత.]

వాడు మూరెడు లేడు
ఎన్ని బుద్ధులో ఎన్ని సుద్దులో
ఎన్ని ఛాయలో ఎన్ని మాయలో

వాని కళ్ళ చక్రాల చుట్టూ
ఇంటిని తిప్పుకుంటాడు
వాని పెదాల నవ్వుపై
అయస్కాంతం పులుముకుంటాడు

వాడు లేచినప్పుడే
వెలుగు ఇంట్లోకి వచ్చేది
వాడు నడిచినపుడే
నేల స్పృహలోకి వచ్చేది

వాడి అరచేతులతో
గోడలు పిడకలాట ఆడతాయి
వాడి కిళుక్కు నవ్వుతో గాలి
పిల్లన గ్రోవి మీటుతుంది

వాడు చేతులు చాస్తే
పట్టుకోవాలని దిక్కులకు ఆరాటం
వాడు చూస్తే కరిగి పోవాలని
మనసు మంచుకు ఉబలాటం

***

బుడతలు నడయాడే ఇళ్ళు
పరుగులు తీసే గడియారపు ముళ్ళు

Exit mobile version