[డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతి రావు గారు రచించిన ‘బ్రతుకు పుస్తకం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
జీవితాన్ని అధ్యయనం చేయడం నాకు అలవాటు. ఇష్టం కూడా. అధ్యయనం చేస్తానంటే అర్థం పుస్తకాల్లో చదువుతానని కాదు, జీవితాలనే చదివేస్తాను.. అందుకు పదునైన నా చూపులను – చురుకైన చెవులనూ వాడతాను. భలే ఆసక్తిగా ఉంటుంది ఆ పని.
కొన్ని జీవితాలను చదవటం ఈజీ. మరికొన్ని కొంచెం హార్డ్! అయినా అన్నింటినీ ఇట్టే పట్టేయగలను. చదివాక నాలో నేనే వ్యాఖ్యానించుకోవటం – విమర్శించుకోవటం చేస్తే ‘ఈ మనుషుల జీవితాల్లో ఎంత వైవిధ్యం?, మనసుల్లో ఎంతటి విచిత్ర విభిన్నత్వం’ అని అనిపిస్తూ వుంటుంది.
ఆ రోజు మా బాబాయి సత్యమూర్తిగారి ఇంటికి సతీసమేతంగా లంచ్‌కి వెళ్ళాను. విజయవాడలో ఉంటారు వాళ్ళు. “బెజవాడ కనక దుర్గమ్మను దర్శించుకుందామని వచ్చాం బాబాయ్ – మళ్లీ సాయంత్ర వెళ్ళిపోతాం” అని అంటే “ఊళ్లోకి వచ్చి ఇంటికి రాకుండా పోవడం ఏంటిరా. మధ్యాహ్నం భోజనానికి రండి ఇద్దరూ” అని పిల్చాడు బాబాయి. వాళ్ళ ఇల్లు గుడికి అట్టే దూరం కూడా కాదు అనటంతో, “అలాగే” అని చెప్పి వెళ్లాము. వెళుతూ వెళుతూ ఓ అరకిలో స్వీటు, పండ్లు పట్టుకెళ్ళాం. ఆటోలో దిగిన మమల్ని చూసి “ఓరోరి ఎన్నాళ్ళయిందిరా నిన్ను చూసి. మీ నాన్న అదే మా అన్నయ్య ఉన్నప్పుడు అప్పుడెప్పుడో మీ ఇంట్లోనే చూసాను. పినతండ్రి, పెదతండ్రి పిల్లలమైనా చాలా ఆపేక్షగా ఉండే వాళ్ళం రా ఇద్దరం.” అన్నాడు బాబాయి. “అయ్యో ఆ విషయం నాకు తెలియకపోవడం ఏంటి బాబాయి. నా చిన్నప్పుడు చూసేవాడినిగా. తరచూ మా ఇంటికి వచ్చేవాడివి నువ్వు. నువ్వు రాగానే మా అమ్మ సత్యానికి బొబ్బట్లంటే ఇష్టం అని అవి చేసింది. నాకూ ఇష్టం గనుక నీ పేరు మీద చేసినవయినా నేనూ బాగా లాగించేవాడ్ని” అని నేనంటే, “అబ్బో. ఇక మీ అమ్మ ప్రేమలు, మర్యాద గురించే చెప్పావూ” అన్నాడు బాబాయి.
బాబాయిది చిన్న పెంకుటిల్లు. రెండు పడక గదులు, ఒక హాలు, ఒక ముందు గదీ, వంటిల్లు అంతే. గది గోడలు, ఇంటిపై కప్పు, దూలాలు అన్నీ చూస్తుంటే ఏ యాభై ఏళ్ళ క్రితమో కట్టిన ఇల్లు.. అని తెలిసిపోతూ వుంటది, పాతదనంతో.
ఇంటిని పరకాయించి చూస్తున్న నన్ను ఉద్దేశించి “మా తాతగారు కట్టించిన ఇల్లు” అన్నాడు బాబాయి.
సుభద్ర పిన్ని మేము వచ్చిన అలికిడి అవగానే హడావిడిగా బయటికి వచ్చి “బాగున్నావా ప్రకాశం” అంటూ నన్ను ఆప్యాయంగా అక్కున చేర్చుకుంది. నా పేరు ప్రకాశ్..! నాకన్నా పెద్దవాళ్ళు, దగ్గరివాళ్ళు నన్ను అలా ప్రకాశం అని పిలుస్తారు. పిన్నికి మా ఆవిడ సరోజను పరిచయం చేసాను. “ఇదే చూడటం. పెళ్ళికి వద్దామంటే కుదరలేదు” అంది పిన్ని. “నేను వెళ్ళాగా – కుందనపు బొమ్మ లాంటి అమ్మాయి అని అప్పుడే అనుకున్నాను” అన్నాడు బాబాయి.
సరోజు వాళ్ళిద్దరి కాళ్ళ వంగి నమస్కరిస్తుంటే ఆమెను చూసి నేనూ ఆ పని చేసాను.
మా ఆవిడ నా జీవితభాగస్వామి అయినా ఆమె కూడా నాకు ఒక గురువు లాంటిదే. ఆమెను చూసి నేను కొన్ని నేర్చుకుంటూ వుంటాను.
“కూర్చోండిరా” అన్నాడు బాబాయి “కూర్చోమ్మా!” అంది పిన్ని సరోజనుద్దేశించి.
అప్పుడు సోఫా మీద నా దృష్టి పడింది – యాష్ కలర్ బట్టతో కుట్టిన సోఫా కవర్ మీద ఒక దుప్పటి పరిచివుంది. ‘సోఫా మాయకుండా కాబోలు’ అనుకున్నా గానీ సోఫాపై అంచు మీది నుంచి కొద్దిగా కిందికి జారిన ఆ పక్కబట్ట కింది నుంచి సోపా చిరుగు ఒకటి వచ్చి నా దృష్టిలో పడింది. అప్పుడనుకున్నాను ‘సోఫా చిరుగులను కవర్ చేయటానికి ఆ బట్ట వేసారు’ అని. అది, మా పిన్ని గబగబా వచ్చి, జారిన ఆ పక్క బట్ట కొసను పైకి లాగటంతో ఆ విషయం నాకు కన్ఫమ్ అయింది. మేము ఇలా కూర్చున్నామో లేదో సోఫాకు 2 అడుగులు కిందకి కూరుకుపోయాం మేము. కుషన్స్ పాడై సోఫా కిందికి జారిపోయిందని అర్థమయింది నాకు.
అది చూసి పిన్ని బాబాయి వంక షార్ప్‌గా ఒక చూపు చూసింది. దాంతో రోజూ ఆ సోఫాలు బాగు చేయించమని బాబాయిని పోరుతోందని – బాబాయి ఏవో కారణాల వల్ల చేయించడం లేదనీ నాకు అర్థమయింది. పిన్ని స్టీలు గ్లాసుల్లో మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది. “భోజనానికి కొంచెం టైమ్ వుందిగా – కాఫీ తాగుతారా?” అని అడిగింది. “వీలుంటే కొంచెం టీ ఇవ్వు పిన్ని” అన్నాను. సరోజ మొహమాటం లేకుండా ఏమిటా అడగటం అన్నట్టు నా వంక సింది. “పాలున్నాయా, తేనా?” అన్నాడు బాబాయి. పిన్ని ఈసారి కళ్ళతోనే బాబాయికి క్లాసు పీకింది.
ఇదిగో ఈ చూపులు, ఈ మాటలు, తమ స్థితిగతులను తెలియచేస్తున్నట్టు వుండే వస్తువులు.. ఇవే నాకు మనుషుల్ని, వాళ్ళ మనస్తత్వాలను, వాళ్ళ పరిస్థితులను పాఠం చదివినట్టు చదవటానికి ఉపయోగపడతాయి, ఇంటి గుట్టు, మనీ మ్యాటర్సు, మర్యాదలు వంటి విషయాలలో మగవాళ్లు ఎప్పుడూ అమాయకులుగా, పసిపిల్లలుగా ప్రవర్తిస్తుంటారు ఎందుకనో – ఆడవాళ్లు అందుకే పరిస్థితిని కవర్ చేయటానికి విషయాన్ని మ్యానేజ్ చెయ్యటానికి రెడీగా ఉంటారు. “ఈయనకు టీ పిచ్చి – ఎన్నిసార్లు, ఎంతమంది ఇచ్చినా వద్దనరు” అంటూ నా మాటలకు కొత్తరకం కోటింగ్ ఇచ్చింది మా ఆవిడ. “అయ్యో టీ కేం భాగ్యం” అంటూ రెండు కప్పుల్లో టీ తెచ్చి ఇచ్చింది పిన్ని. పిన్ని చేతుల్లో రెండు కప్పులు ఉండటం చూసి “నేను తాగను.” అన్నాడు బాబాయి ఈసారి తెలివిగా. “మీ సంగతి నాకు తెలుసుగా – అందుకే తేలేదు” అంది పిన్ని, ‘అడిగితే నీ సంగతి చెబుతా’ అన్న ధ్వనితో.
కప్పు చేతిలోకి తీసుకుంటూ చూసాను – కప్పు అంచుల దగ్గర కలర్ కోటింగ్ పోయి అక్కడక్కడా నల్ల మచ్చలు కనబడుతున్నాయి. వాటి బాడీని చూస్తుంటే ‘రెండు దశాబ్దాల చరిత్ర అయినా వీటికి వుండివుంటుంది’ అనుకున్నాను నేను. కప్పు అంచు నొక్కుళ్ళ వల్ల పెదవులు గుచ్చుకుంటున్నట్టు అనిపించింది. అలాగే సిప్ చేస్తే టీ రుచి చూరునీళ్ళలా పల్చగా నాలుకకు తగిలింది.
ఇంతలో ఒక టీనేజ్ కుర్రాడు “తాతా.. నాకు డబ్బులు కావాలి. ఇస్తావా?” అంటూ లోపలికి వచ్చి మమ్మల్ని చూసి ఠక్కున ఆగిపోయాడు.
“మా మనవడు – ఇండే వుండి చదువుకుంటున్నాడు, పెద్దమ్మాయి కొడుకు” అంది పిన్ని. చిన్న చిన్న దుకాణాల్లో ఎక్కడో తక్కువ ధరకు దొరికే ప్యాంటు షర్టు వేసుకున్నాడని ఆ బట్టల వాలకం చూస్తే అనిపిస్తోంది. జుట్టు గుబురుగా పెరిగి వుంది, తైల సంస్కారం లేక పెరిగినట్టు.
“దేనికిరా డబ్బులు? క్షవరం చేయించుకోమని వారం రోజుల నుంచి చెబుతున్నా వినకుండా పిచ్చాడి వాలకమో ఫ్యాషన్ అన్నట్టు తిరుగుతున్నావు. ఇంక దేనికి మరి?” అడిగాడు బాబాయి.
“ఫ్రెండ్స్‌తో కలిసి సినిమాకెళ్తాను తాతా!”
“సినిమాకెళ్తావా – ఇప్పుడు సినిమా టికెట్ ధర ఎంతో నాకు తెలియదనుకున్నావా – ఆ డబ్బులు పెడితే మన ఇంటిల్లిపాదీ రెండు రోజులు కడుపు నిండా అన్నం తినొచ్చు. డబ్బు విలువ నీకేమయినా తెలుస్తోందా – కష్టపడి సంపాదిస్తే తెలుస్తుంది” అని బాబాయి అంటూంటే లోపలున్న పిన్ని ఆ మాటలు విన్నట్లుంది – “కృష్ణా – ఇలారా” అంటూ మనవడ్ని లోపలికి పిలిచింది. బాబాయి నోరు మూయించడం కోసం అన్నట్టూ, సిట్యుయేషన్‌ని టాకిల్ చేయడానికీ అన్నట్టు.
‘అమ్మో. ఈ ఆడవారు మహా సెన్సిటివ్. మహా అఖండులు కూడా’ అనుకున్నాను నేను. అవేమీ తెలియని బాబాయి పిచ్చి ధర్మరాజులా నోరాడించేస్తున్నాడు.
“మా పెద్దమ్మాయి ఆర్థిక పరిస్థితి పాపం అంతంత మాత్రం రా ప్రకాశూ. దానికి తోడు దానికి నలుగురు పిల్లలు, అందుకని వీడి బాధ్యతను నేను తీసుకున్నాను, ఏదో వేడేళ్ళకు చన్నీళ్లు తోడు అన్నట్టు చిరు సహాయం.. మా అల్లుడికే ఏదో మామూలు చిన్న ఉద్యోగం” అంటూ చెప్పుకుంటూ పోతున్నాడు బాబాయి.
“మీ బాబాయి మాట్లాడటం మొదలు పెట్టారంటే, ఆ పురాణం ఇప్పుడు ముగిసేది కాదు కానీ ఇక లేవండి భోజనానికి ప్రకాశం!” అంటూ వచ్చింది పిన్ని బయటికి.
‘జీవితపురాణం! బాగుంటుంది. చెప్పనీయ్ పిన్ని’ అని మనసులోనే అనుకుంటూ భోజనానికి లేచాను. స్టీలు కంచాల్లో అన్నం వడ్డించింది పిన్ని, “నేను స్పెషల్స్ ఏమీ చెయ్యలేదయ్యా” అంటూ.
“అయ్యో. వద్దు పిన్ని, ఇవి చాలు” అన్నాను నేను.
“చాలా శ్రమ పెడుతున్నాం మిమ్మల్ని” అంది మా ఆవిడ అప్పడు, చిలకలా పలుకుతూ.
“అయ్యో. ఏం చేసానని – మేము రోజూ తినేవే చేసాను. బియ్యం కొంచెం ఎక్కువ పడేసాను. అంతే.” అంది పిన్ని.
పిన్ని వంట, వడ్డన చూసి నేను ఆశ్చర్యపోయాననే చెప్పాలి. బెండకాయ కూర చిన్న బౌల్‍లో కనిపించింది. తోటకూర పప్పు ఒక చిన్నె గిన్నెలో గరిటె జారుడు కన్నా కొంచెం ఎక్కువ పలుచగా. చారు వడ్డిస్తూ “మీ బాబాయికి రోజూ చారు ఉండాలి” అంది. మేము నలుగురం తిన్నాక గిన్నెలో ఒక్క మెతుకు అన్నం మిగలలేదు. వాళ్ళ మనవడు మాకన్నా ముందే తినేసి బయటకు వెళ్ళిపోయాడు. పిన్ని ఆ పొదుపరితనం చూసి ‘చూసి నేర్చుకో. కరెక్ట్‌గా వండటం ఎలాగో’ అన్నట్టు సరోజ వంక చూసాను. వస్తుంటే పిన్ని సరోజకు బొట్టు పెట్టి – బ్లౌజ్ పీస్ ఇస్తూ, “మా సందున కాసిన జామకాయలు” అంటూ రెండు జాంపండ్లు చేతిలో పెట్టింది.
“అయ్యో. ఎందుకంటే ఇప్పుడు?” అంది సరోజ మొహమాటపడతూ, మర్యాదపూర్వకంగా.
“భలే దానివే. మొదటిసారి మా ఇంటికొచ్చావ్. అసలయితే చీర పెట్టాలి. ఇంట్లో సమయానికి కొత్తచీరలేమి లేవు. నేను ఇప్పుడు బయటికెళ్ళి తేలేను” అంది పిన్ని లోగొంతుతో.
‘పొదుపుగా, ఆర్థిక పరిస్థితిని బట్టి సంసారాలు చేసుకునే దిగువ మధ్య తరగతి వాళ్ళు అలాగే వుంటే బాగుంటుంది – మధ్యలో ఈ సంజాయిషీలు సవరింపు మాటలు లేకుండా. ఫాల్స్ ప్రిస్టేజ్ అనేది మనిషిని వాళ్ళకే తెలియకుండా వాళ్ళని బయట పడేస్తుంది’ అనుకుంటూండగా సరోజ సెల్ మోగింది.
ఒక పక్కకు వెళ్ళి మాట్లాడి వచ్చి “చిదంబరం మామయ్య ఫోన్ చేసాడండి. మనం విజయవాడ వచ్చామని తెలిసిందట. ‘మా ఇంటికి రాకుండా పోతారా?’ అంటూ ‘ఎక్కడున్నారు?’ అని అడిగాడు. ఇక్కడ అని చెపితే ‘అక్కడే వుండండి – కారు పంపిస్తాను’ అంటున్నాడు. ఓ గంట కూర్చుని టీ తాగి వెళుదురు గానీ రాత్రి 7 గంటలకు కదా మీ బస్సు?” అంటున్నాడు, అంటూ ‘ఏం చెప్పును’ అన్నట్టుగా నా వంక చూసింది సరోజ.
‘సరే’ అన్నట్టు తల ఊపాను నేను.
***
చిదంబరం గారి పెద్ద బంగళా ముందు ‘మా కారు’.. కాదు.. ‘వాళ్ళ కారు’ ఆగింది. పెద్ద గేటు. గేటు ముందు సెక్యూరిటీ గార్డు – లోపల ఆల్సేషియన్ డాగ్. దాని కోసం ఓ చిన్న డాగ్ హౌస్. మేము వెళ్ళేసరికి చిదంబరం గారు ఎవరితోటో ఫోన్‍లో మాట్లాడుతున్నారు.
“ఫ్లయిట్ టికెట్స్ ఇంకా బుక్ కాలేదు కదా. బిజినెస్ క్లాసులో రండి. డోంట్ టేక్ స్ట్రయిన్” అంటున్నారు. ఆయన బిజీ గనుక డిస్ట్రర్బ్ చెయ్యకూడదు గనుక చెయ్యి ఊపి విష్ చేసి నేను సోఫాలో కూర్చున్నాను – ఆయన చెయ్యి జాపి సైగ చేసి కూర్చోమన్నాక.
సరోజ, వాళ్ల మామయ్యకు వేవ్ చేసి చనువుగా లోపలికి వెళ్లింది. తన ముఖంలో నవ్వు – ఆనందం. వాళ్ళ మామయ్య పంపిన కారులో కూర్చున్నప్పటి నుంచే గొంతు విప్పి గలగలా మాట్లాడటం మొదలుపెట్టింది. నేనేమో గొంతు స్విచ్ఛాఫ్ చేసినట్లు మౌనం పాటిస్తున్నాను. ‘ఎవరివాళ్ళ దగ్గర వాళు అంతే – పరాయివాళ్ళ దగ్గర ఇంతే కాబోలు, అది సహజం’ అని అనుకున్నాను.
చిదంబరం గారు ఫోన్ పెట్టేసి “హలో, బాగున్నారా? మా అబ్బాయి, మా అమ్మాయి. ఇద్దరూ యు.ఎస్.లో ఉంటారు. వాడు సాఫ్ట్‌వేర్ జాజ్. అది ఎమ్.ఎస్ చేస్తోంది. ఇద్దరూ కలిసి నెక్స్ట్ వీక్ వస్తున్నారు” అన్నాడు ఆయన. ఇల్లంతా ఖరీదైన సోఫాలతో, కర్టెన్ లతో, షోకేస్ లతో, పెయింటిగ్స్‌తో అడుగడుగునా రిచెనెస్‌ను తెలియచేస్తూ కనిపిస్తోంది.
ఆయన – మనిషి కూడా అలాగే ఉన్నాడు. గోల్డ్ ప్రేమ్ కళ్ళద్దాలు, మెళ్ళో ప్లాటినమ్ గొలుసు, చేతికి బ్రాస్లెట్, ఉంగరాలతో.
నీట్ డ్రస్సింగ్‌లో ఉన్న ఓ పనమ్మాయి – ఆ అమ్మాయిని చూస్తుంటే పనమ్మాయి అని అనాలని అనిపించటం లేదు. ట్రే లో కుకీసు, స్వీట్స్, ఫ్రూట్స్, నట్స్, కూల్ డ్రింకు పెట్టుకొని వచ్చింది.
తన వెనకనే సరోజ, వాళ్ళ అత్తయ్య వచ్చారు. నడివయసులో వున్న ఆమె ఇంట్లో కూడా పట్టుచీరే కట్టుకొని వుంది. ఆమెను చూడగానే ఇందాక నడిపాత కాటన్ చీరలో, ముడతలు పడ్డ రవికతో బయటికి వచ్చిన మా పిన్ని గుర్తుకు వచ్చింది. ‘కొని ఎన్నేళ్ళయిందో అన్నట్టూ, అసలు బంగారం వేనా’ అనిపించేటట్టు వున్న చిన్న సైజు 18 క్యారెట్ బంగారం దుద్దులను ఆమె పెట్టుకుంటే ఈమె డైమండ్ దుద్దులను పెట్టుకుంది.
మెళ్లో ఆమెకు పుస్తెలతాడు, నల్లపూసల గొలుసు తప్ప మరొకటి లేదు. భువనేశ్వరి అని పేరు గల సరోజ వాళ్ళ అతయ్యకు ఒళ్ళంతా వజ్రాలు, వైడ్యూర్యాలూ పొదిగిన ‘చొక్క బంగారమా’ అన్నట్టు ధగధగా మెరుస్తున్నాయి. నా కంటికి ఏదన్నా కనిపించటం ఆలస్యం.. మనసు అధ్యయనం మొదలు పెడుతుంది. ఆ తర్వాత పోలికలు, అంచనాలు షురూ అవుతాయి. తద్వారా మనస్తత్వ పఠనం..!
నా జీవితం నాకే కాదు – అందరి జీవితాలూ తెరిచిన పుస్తకాలే నాకు. ఇది ‘అలవాటు’ దశ నుంచి ‘వ్యసనం’ దశకు చేరుకుంది నాలో. ఎవరెలా అయితే నాకేం అని అనుకోలేను. అందరి గురించే నాకే కావాలి – అదేం ఆసక్తో గానీ – అనుకుంటూ నాలో నేనే నవ్వుకున్నాను. “తీసుకోండి” అన్నారు చిదరంబం గారు నా ముందున్న టీపాయ్ మీది ప్లేట్ వంక చూపిస్తూ. తినాలంటే నాకెందుకో మొహమాటంగా అనిపించింది; పెట్టగానే గబగబా తీసుకొని తింటే ‘ఇలాంటి ఖరీదైన తిండి మాకు దొరకదు’ అని చెప్పక చెప్పినట్లు అవుతుందేమోనని. అందుకే సుతారంగా ఒక యాపిల్ ముక్క తీసుకొని ప్లేట్‌ని ఆయన వైపు జరిపాను మర్యాదగా.
“నో. నో. నేను తీసుకోను. నా డైట్ అంతా ప్లాన్డ్‌గా వుంటుంది” అన్నాడు ఆయన నవ్వుతూ.
‘అంటే నేనే – తిండి విషయంలో ఒక పద్ధతీ, పాడు లేని ‘తిండియావ’ మనిషినా.?’ అన్న ప్రశ్న వచ్చి నా ముందు నిలిచింది. అందుకే ప్లేట్ వంక మళ్లీ చెయ్యి చాచలేదు నేను. సరోజ వాళ్ళ మామయ్య, అత్తయ్యలతో గలగలా మాట్లాడుతోంది. మా డీలక్స్ ఫ్లాట్ గురించీ, మా పిల్లలు చదువుతున్న కార్పొరేట్ స్కూలు గురించి, పెరిగిన కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించీ సరోజ చెబుతుంటే వాళ్ళ అత్తయ్య, మామయ్య – వాళ్ళకు సిటీలో వున్న విల్లాల గురించీ, వాళ్ళ పిల్లలు చిన్నప్పుడు చదివిన టెక్ స్కూల్సు గురించీ, ఖరీదైన న్యూ మోడల్ కార్ల గురించీ, లగ్జరీస్ గురించే వాళ్లు చెబుతున్నారు. ఆ మాటలని సైలెంట్‌గా వింటూ కూర్చున్న నేను ప్లేట్లో రంగు మారుతున్న యాపిల్ ముక్కల మీద, డ్రై గా అవుతున్న కలాకండ్ పీస్‌ల మీద దృష్టి సారించాను. వాళ్ళ టాపిక్స్ పొంతన లేకుండా ఉన్నట్లుండే భిన్న ధృవాలు ఒక దగ్గర కలుసుకున్నట్టు వింతగా అనిపించింది.
“ఏం చేస్తున్నారు మీరు?” నేను అస్సలు మాట్లాడకుండా కూర్చోవడంతో పలకరించడం కోసం అన్నట్టు అడిగాడు చిదంబరం గారు.
“సాఫ్ట్‌వేర్..!”
ఆ తర్వాతి మాటలు ఇంకా నా నోట్లో నుంచి బయటకు రాకుండానే “ఇప్పుడు అందరూ.. ఎవర్ని చూసినా సాప్ట్‌వేర్ – సాఫ్ట్‌వేర్!” అన్నాడు. ‘ఎవర్ని చూసినా’ అన్న మాట మనసులో గుచ్చుకున్నట్టు అనిపించింది. తన కొడుకూ సాఫ్టవేర్ ఇంజనీరు అయినా నన్ను ఉద్దేశించే ఆయన అలా అన్నట్టయి మనసు నొప్పి పుట్టింది.
వస్తూ వస్తూ మేం తెచ్చిన అరకిలో స్వీటు, పండ్లు, ఇంకా అక్కడే టీపాయి మీద పడి ఉన్నాయి. వాళ్ళు పెట్టిన కాస్ట్లీ స్వీట్స్, బాదామ్ మిల్కు పక్కన చిన్నబోయిన ముఖాలతో కనిపించాయి. ‘మన ఫార్మాలిటీస్ మనవి – మనకు చేతనయినంతలో’ అని మనసుకు ఎంత సర్ది చెప్పినా అది సరిపుచ్చుకోలేదు.
“ఇంక వెళ్దామా?” అన్నాను సరోజ వంక చూస్తూ.
“రాత్రి డిన్నర్‌కు వుండండి” అంది సరోజ అత్తయ్య భువనేశ్వరి.
“మాకు ఆల్రెడీ బస్ టికెట్ వుందండీ హైదరాబాద్‌కు” అన్నాను నేను.
“కారులో రాలేదా? బన్ జర్నీ బోర్ – కొట్టుకొని కొట్టుకొని ఆగకుంటూ ఆగుకుంటూ వెళుతుంది అది. ఒళ్ళు హూనమవుతుంది. అది నా ఓల్ట్ ఎక్స్‌పీరియన్స్ అనుకోండి. ఇప్పుడు ఎక్కడికెళ్ళినా ఫ్లయిటే. అరగంటలో వెళ్ళిపోవచ్చు సుఖంగా” అంటూ నాన్‌స్టాప్‌గా మాట్లాడుతున్నాడు చిదంబరం గారు.
‘డబ్బులుంటే అన్నీ సుఖాలే. ఎక్కిదక్కి ఉన్నవాడికి లెక్కపెట్టుకోవలసిన పని లేదేమో గానీ – బొటాబొటి అన్నట్టు ఉండేవాడికి జీవితమే ఒక లెక్కల పుస్తకంలా తయారవుతుంది’ అనుకున్నాను మనసులోనే నేను. ఐదంకెల జీతం అయినా కార్పొరేట్ స్కూళ్ల ఫీజులు, కార్పొరెట్ హాస్పటల్స్ వైద్యం, ఈజీ లైఫ్ లీడింగ్, లగ్జరీల మీద మోజు – ఇవన్నీ మధ్యతరగతి వాడి జీతాన్ని సవాల్ చేస్తున్నట్టు, వెక్కిరించినట్టుగా తయారయ్యాయి. ‘అందుకే పైన పటారం లోన లొటారం అన్నట్టుగా మారి, మధ్య మధ్య ఇలా బైట పడిపోవాల్సి వస్తోంది’ అనుకున్నాను నా జీతానికి, జీవితానికి నేనే వ్యాఖ్యానం చెప్పుకుంటూ.
ఇంక వెళ్ళొస్తామని లేవగానే సరోజకు వాళ్ళత్తయ్య పట్టుచీర వున్న కవర్ చేతిలో పెట్టింది, “తప్పకుండా కట్టుకో “అంటూ.
“పట్టుచీర ఎందుకత్తయ్యా – ఇప్పుడేమన్నా పెళ్ళా, ఒడుగా – ఏదో అనుకోకుండా, మామయ్య రమ్మన్నాడని కాజువల్‌గా వస్తే..” అంది సరోజ.
“ఎవరు ఇంటికొచ్చినా నేను ఇదే పెడతాను.. మామూలువి పెడితే మీ మామయ్య ఊరుకోరు కూడా!” అంది భువనేశ్వరి అనే సరోజ అత్తయ్య దర్భం ఉట్టిపడేలా.
అడుగడుగునా ఇక్కడ ‘మేము ఎక్కువ’ అన్న అహంభావ తత్వం. అక్కడ అడుగడుగునా సర్దుబాటు తత్వం. నా బోటివాడి ఇంట్లోనేమో అటు అహంభావం ఉండదు ఇటు సర్దుబాటూ వుండదు.. ఉండలేని – లేకున్నా ఉండేలా కనిపించే అటూఇటూ కాని, చాలీచాలని విచిత్ర సంకట స్థితి తప్ప. ‘లేదు’ అని చెప్పుకోవాలంటే నామోషీ.. ‘ఉంది’ అంటూ లావిష్ ఖర్చూ చెయ్యలేని లోటు బడ్జెట్, నిల్ బాలెన్స్‌ల ఆర్థిక స్థితి – దానికి తోడు ‘సింగిల్ ఎర్నింగ్ మెంబర్ కావడం!’ అనుకుంటూ బయటికి వచ్చాను. సరోజ నన్ను అనుసరించింది సహధర్మచారిణిలా..
అన్ని పుస్తకాలలోకీ నడుస్తున్న ‘బ్రతుకు పుస్తకం’ అధ్యయనం చాలా జ్ఞానాన్ని, ఎంతో అనుభవసారాన్ని మనకు అందిస్తుంది. ఇప్పటికిప్పుడు పుస్తకాలను కేవలం చదవటం కాదు – అద్యయనం చేసాను. ఒకటి: సత్యమూర్తి బాబాయి, ఆయన భార్య సుభద్రల జీవితపుస్తకం, రెండోది సరోజ మామయ్య, చిదంబరం గారు, ఆయన భార్య భువనేశ్వరిల కుటుంబ కథా పుస్తకం – మూడోది నిత్యపారాయణ గ్రంథం లాంటిదయిన మా కుటుంబ చరిత్ర.. మూడింటి మధ్యా ఎంత వ్యత్యాసం, ఎంత భిన్నత్వం. అయినా అన్ని జీవిత గ్రంథాలే. ‘ఒక్కో మనిషీ ఒక్కో నడుస్తున్న విజ్ఞాన సర్వస్వమే, మనం చదవగలగాలిగానీ’ అనిపించింది నాకు.
డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతి రావు డిగ్రీ కాలేజీ లో తెలుగు లెక్చరర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. వారు వ్రాసిన 500 పైన కథలు వివిధ పత్రికలలో వచ్చాయి.
కథా వాణి పేరిట వారికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అందులో తన కథలనే 500 వీడియోల దాకా తన స్వరంతో వినిపించారు ఇప్పటి వరకూ..
ఇంకా రాస్తున్నారు.. వినిపిస్తున్నారు. ఫోన్: 9849212448