[17 జూలై 2025 ప్రపంచ ఎమోజీ రోజు సందర్భంగా శ్రీమతి దివాకర్ల రాజేశ్వరి రచించిన ‘బొమ్మ – భాష’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]
లలిత కుటుంబం పెద్దది. దేశ విదేశాల్లో ఉండే బంధువులు, మిత్రులు కలసి తమ కుటుంబానికి ప్రత్యేకంగా వాట్స్‌అప్ సమూహం ఏర్పరచుకున్నారు. నిరంతర సంప్రదింపుల కోసం దీన్ని చక్కగా వాడుకుంటున్నారు. వేగంగా.. అతి సులభంగా అవతలివారికి కనెక్ట్ అవుతున్నారు.
మూడు తరాలు గడచిన ఆ కుటుంబంలో లలిత తోడికోడళ్ళందరిలో పెద్దది. తన పెద్దరికాన్ని నిలబెట్టుకుంటూ, అందరి వివరాలు తెలుసుకుని, సందర్భానుసారంగా అవసరం అయినంత మేరకు చక్కగా స్పందించి సందేశాలను పంపుతుంది.
బంధువులందరితో తాను సంపర్కం కలిగి ఉన్నందుకు ఇప్పుడు ఆమె ఎంతో సంతసిస్తోంది. బంధువులలో కొందరు తానున్న ఊళ్ళోనే ఉన్నా వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి కూచుని వాళ్ళ పనులకు అంతరాయం కలిగించకుండా పలకరింపులు కొనసాగించడం ఆమెకు అనుకూలంగా ఉంది. మొన్నటికి మొన్న మనవరాలి వరుస కౌముదికి శ్రీమంతం జరిగిన సందర్భంలో ఆ వార్త తెలిసిన వెంటనే వాట్స్‌అప్ లోని మిఠాయి దుకాణం నుంచి తీపి తినుబండారాలను ఆదేశించింది. వాళ్ళకు సమయానికి అందాక తాను కూడా ఆ ఉత్సవంలో పాలు పంచుకున్నట్లు భావించింది.
ఆప్తులయిన వాళ్ళందరనీ శుభోదయం అంటూ ప్రతి ఉదయం సందేశంతో పలకరిస్తుంది.
పనీ పాటూ లేదా! ఈవిడకు.. అని కొందరు విసుక్కుంటారని తెలుసు. తన పలకరింపు వల్ల వాళ్ళ ఉనికిని తాను నిత్యం స్మరించిన భావం వాళ్ళకు కలుగుతుందని ఆశ పడుతుంది.
ఒక్కొక్కసారి తను రాసిన కవితను కూడా పంచుతుంది.
తను రాసిన కవిత ‘ఇవ్వాల్టి దూరం’
గోరు ముద్దలను తినిపిస్తూ
కొండ జాబిలిని కాక
గగన విమానాన్ని చూపించి నప్పుడు
మింగుడు పడని గుక్కల్లోనే కదా!
నేనిక్కడకు వచ్చి చేరుకున్నది..!
సముద్రం లో వేలాడే నిచ్చెన
కొర్కెల సోపానమై
ఊగుతూ ఉంటుంది..
ఇత్యాదిగా సాగిన కవితను పంచింది.
ఆ కవితకు ప్రశంసలను సూచించే ఎమోజీలను పంపారు కొందరు.
ఈ మధ్య పిల్లల పుట్టినరోజులు, శుభవార్తలు, సాధించిన విజయాలు, పరిస్థితులు ఏవైనా కుటుంబ సభ్యులు ఆ యా విషయాలకు తెలుపుతున్న స్పందనలకు, ఆశ్చర్యపడుతోంది.
ముఖ్యంగా ఆరోజు కుటుంబానికి ఎంతో కావలసిన వ్యక్తి, దగ్గర బంధువు నడి వయస్సులో ఉన్న మేనకోడలు ‘విద్య’కు పెద్ద ఆపద కలిగింది. ఆ సంగతిని తెలుసుకున్న వెంటనే అందరూ స్పందించారు. సానుభూతిగా సందేశాలను పంపారు. వాళ్ళల్లో కొందరు, ఆమెను ఓదార్చిన విధానానికి లలిత ఎంతగానో ఉద్వేగానికి లోనయింది.
‘మీకు మనస్సు అనేది ఉందా! లేదా? ఏ సందర్భంలో ఎలా వ్యక్తం చేయాలో తెలీదా? అవతల వ్యక్తులు ఎంత బాధ పడుతున్నారో అర్థం చేసుకోవక్కరలేదా? దూర భారాల వల్ల ఒకరినొకరు కలుసుకునే వీలు లేదని ఒప్పుకుందాం. కనీసం సందేశాలలోనైనా ఆప్యాయత వ్యక్తం చేయలేరా?’
ఇలా అలజడి కలిగిన భావుకత్వంతో కొద్దిగా వొణుకుతున్న వేళ్ళతో టైప్ చేసి సమూహంలో పెట్టింది.
దాదాపు వారం రోజుల తరువాత, తాను ఎవరి గురించి బాధపడుతూ, ఇతరులకు సలహా ఇచ్చిందో, స్వయంగా ఆమె దగ్గరనుంచే జవాబు వచ్చింది.
ఆ జవాబు చూసి చేతిలో చరవాణిని అలాగే పట్టుకుని మ్రాన్పడిపోయింది లలిత.
ఆ జవాబు ఇలా ఉంది,
“అత్తయ్యా, నాపరిస్థికి నువ్వెంతో బాధపడ్డావు. నా కెంతో ధైర్యం చెప్పావు, వీలుంటే వచ్చి చూస్తానన్నావు.
అత్తయ్యా! ఇప్పుడు కాలం మారింది. ఇప్పుడు అందరూ ఎమోజీలతోనే మాట్లాడుతున్నారు. రెండు లైన్లు టైప్ చేసే కన్నా సందర్భానికి తగినట్టు ఎంపిక చేసుకుని ఎమోజీని పంపిస్తే చెప్ప దలచుకున్న దాన్ని సులభంగా చెప్పచ్చు..”
ఇంత బాధలోనో ఆమె పంపిన సందేశాన్ని చూసి, సమాధాన పడలేక పోయినా అంత బాధ లోనూ ,మేన కోడలు ఇతరుల ప్రవర్తన పట్ల చూపిన సంయమనానికి మెచ్చుకుంది. “జాగ్రత్త, ధైర్యంగా ఉండు” త్వరలో బయలుదేరి వస్తాను” అని జవాబు పంపించింది.
అవును, పదాలలో వ్యక్తం చేయలేని భావాల అవాంతరాలను మించిన భాషగా ‘ఎమోజీ’లను వాడవచ్చు.. ఎమోజీలను అర్థం చేసుకోడానికి నిఘంటువులు అవసరం ఉండదేమో అనుకుంది.
చరిత్రలో కాస్త వెనక్కి వెళితే, ఎమోజీలను వాడడం మనకు కొత్తేమీ కాదు, రాతి యుగంలో తోటి వ్యక్తులకు తాము చెప్పదలుచుకున్నది అర్థం కావడం కోసం మనుషులు రాళ్లపై గుర్తులు గీసేవారు. అటు వైపు వచ్చిన ఇతరులు ఆ ఆనవాళ్లని ఆసరాగా చేసుకుని వాళ్లేం చెప్పదలు చుకున్నదీ అర్థం చేసుకునే వారు.
అలా ఆలోచిస్తూ కూచున్న లలితను.. “అమ్మా!” అంటూ తను కూడా చరవాణిని చూస్తూ పద్మ వచ్చింది.
“చూసావా అమ్మా! విద్యకు కలిగిన కష్టానికి ఎంత మంది విచారం వ్యక్తం చేసారో” అంది.
“ఏమిటో! మాటలు కరువైనట్టు, భాష రానట్టు, ఈ బొమ్మలేమిటే?” అంది లలిత.
“అమ్మా! మనసులో ఉన్న భావం చాలా సందర్భాల్లో సమర్థవంతంగా అవతలివారికి అర్థం కాకపోవచ్చు. దాంతో అపార్థాలు ఏర్పడుతుంటాయి. సరిగ్గా ఈ సమస్యను అధిగమించడానికి ఎమోజీలు ఉపయోగపడతాయి” అంది పద్మ.
“తాము టైప్ చేసిన విషయానికి చివర్లో, దాన్ని ఏ అర్థంతో మాట్లాడామో తెలియజేస్తూ స్మైలీలు చేర్చేవారు కూడా లేకపోలేదు. ఎలాంటి భావాన్నయినా, సులభంగా వ్యక్తపరచడానికి తగ్గట్లు పెద్ద మొత్తంలో ఎమోజీలు ఇప్పుడు లభించటంతో వీటి వాడకం బాగా పెరిగింది. ఒకప్పుడు, ప్రపంచవ్యాప్తంగా బాగా వాడబడిన పాపులర్ పదంగా హార్ట్ ఎమోజీ నిలిచింది. ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ ‘2015 వర్డ్ ఆఫ్ ఇయర్’గా సంతోషంలో కళ్ల వెంట నీళ్ళు వచ్చే ఎమోజీని ఎంపిక చేసింది..
యువతరం ఎమోజీలను వినియోగించటంలో ముందజలో ఉంది. అయితే పాతతరం మాత్రం ఎమోజీల కన్నా టెక్స్ట్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం స్పష్టంగా గమనించవచ్చు. ఏ అనుభూతులకు ఎలాంటి ఎమోజీ వాడాలో తెలియకపోవడం, ఎమోజీల ద్వారా మనస్సులో ఉన్న ఎమోషన్ మొత్తం వ్యక్తం చెయ్యలేమన్న భావన కొద్దీ చాలామంది పాతతరం ఎమోజీలను వాడడానికి విముఖత చూపిస్తున్నారు. ఎమోజీలకు అర్థాలు తెలుసుకోవడం కోసం ప్రత్యేకంగా ఎమోజీపీడియా అనే వెబ్‌సైట్ కూడా అందుబాటులో ఉంది..” తనకు తెలిసిన సాంకేతిక విషయాలన్నీ అమ్మకు చెబుతోంది పద్మ.
ఎప్పుడూ టైం లేదంటూ అంతగా మాట్లాడని పద్మ చెప్పిన విషయాలని శ్రద్ధగా వింది లలిత.
“ఎమోజీల వాడకం పెరిగితే. పెరిగింది గానీ బొమ్మ పరోక్షంగా భాషని చంపేస్తోంది కదే” అంది లలిత.
“అన్నట్టు అమ్మా! నువ్వు రాసే, చదివే కవిత్వంలో కూడా ఇమేజ్ ఉంటుంది కదమ్మా! కవిత్వం అంటే పదాలతో వేసిన చిత్రమే కదా.. నువ్వు మాకందరికీ పంచిన కవిత కూడా పద చిత్రమే.. ఆ చిట్టి పాపను విదేశానికి పంపాలనే తల్లి కోరికనూ ఆశకూ భాషతో చిత్రం గీసావు. ఇప్పుడు ఎమోజీలతో బొమ్మతో భాషను వ్యక్తం చేస్తున్నారు!” అంటూ నవ్వు తూ అమ్మకు తానేదో బోధపరచినట్టు తృప్తి పడింది పద్మ.
అవును పద్మ చెప్పిన మాటల్లో నిజం ఉంది.
“గుండెల్లో
మెత్తగా దిగబడే
కాగితపు కత్తి
కరెన్సీ నోటు”
అలిశెట్టి ప్రభాకర్ ఇరవై అక్షరాల కవితలో మానవసంబంధాలన్నీ ఆర్ధికసంబంధాలే అన్న మార్క్స్ మాటను నిరూపించాడు. డబ్బు కత్తిలా ప్రతిబింబిస్తుంది. గుండెలోకి ఆ అక్షరాలు పదునుగా దిగిన చప్పుడు ప్రతిధ్వనిస్తుంది. కవిత్వంలో ఇమేజెరీ స్థానం ఎంతగొప్పదో మాటల కు అందని భావాలను చిత్రిస్తుంది అనుకుంది లలిత. ‘అంత ఉరిమీ ఇంతేనా కురిసేది’ లాంటి సామెతల్లో, పొడుపు కథల్లో కూడా భాషకు అందని భావాల చిత్రం కనిపిస్తుంది.
“ఏమైనా అక్షరాల పద చిత్రాలు భాషకు ఆలోచనను జోడించి, భావ చిత్రాలను గీస్తాయి. ఎమోజీలు పూర్తి స్థాయిలో ఒక వ్యక్తి లోని భావాన్ని అన్ని సందర్భాల్లో అనుసంధించ లేవు, అవసరానికి మించి అతిగా ఎమోజీలను వాడడం వల్ల వ్యక్తుల మధ్య సంబంధాలు దెబ్బతినే ప్రమాదం కూడా లేకపోలేదు. మనసులో మాటని అక్షరాలు మాత్రమే చక్కగా వ్యక్తం చేస్తాయి..” అంటూ నిట్టూర్చింది లలిత.