[24 ఏప్రిల్ 2025 భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారి ఆరాధనా మహోత్సవం సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు శ్రీ విడదల సాంబశివరావు.]
భారతీయ సంస్కృతి యొక్క ప్రతిరూపమే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా.
భగవాన్ ఏది చేసినా, ఏది బోధించినా, ఏది అనుగ్రహించినా అంతా పరిపూర్ణంగానే వుంటుంది. అస్తవ్యస్తంగా పరిభ్రమిస్తోన్న మానవ జీవన యానాన్ని క్రమ పద్దతిలో నియమానుసారంగా నడిపించడానికే భగవాన్ ప్రేమావతారిగా అవతరించారు.
దైవం పరిపూర్ణుడు. దీనికి ఆధారమైన శృతివాక్యం.. ‘పూర్ణ మదః పూర్ణ మిదం పూర్ణాత్పూర్ణ ముదచ్యతే!’. తాను పరిపూర్ణుడు.. తన సృష్టి పరిపూర్ణం.. అని శృతివాక్యం చెబుతుంది.
తన సృష్టి పరిపూర్ణం. అందుకే.. ఈ సృష్టిలో, ఋతువులు, శీతోష్ణాలు, నదులు, పర్వతములు, ఖనిజ సంపద, వృక్ష సంపద, జంతుజాలము – సమస్తము కూడా ఒక క్రమ పద్ధతిలో, ఒక నియమానుసారము వర్తిస్తున్నాయి. కనుకనే.. మానవునికి కూడా ఈ పరిపూర్గత అత్యవసరము. అటువంటి పూర్ణత్వమును మానవునికి సిద్ధింపజేసే నిమిత్తమై ఈ భువిపై మానవ రూపధారియై ‘భగవంతుడు’ అవతరిస్తాడు!
భారతీయ సంస్కృతిలో పూర్వచరిత్రను పరిశీలిస్తే ఆదర్శమానవులు, సత్య నిరతులైన ధర్మమూర్తులు, త్యాగశీలురైన పవిత్రమూర్తుల గాథలు అనేకం మనకు గోచరిస్తాయి. కానీ, పాశ్చాత సంస్కృతి, విదేశీ విద్యా వ్యామోహంతో భోగాసక్తులై – తమయందు అంతర్లీనంగా నిబిడీకృతమై వున్న దివ్యత్వాన్ని, దివ్యశక్తిని అలక్ష్యం చేస్తున్నారు భారతీయులు. ఇలాంటి తరుణంతోనే.. మానవునిలోని దివ్యశక్తిని ప్రేరేపించి – “మీరు సామాన్య మానవులు కాదు.. దివ్యాత్మ స్వరూపులు! మీలో దాగి వున్న శక్తి సామర్థ్యములను మీరు గ్రహించడం లేదు” అని తెలియజేసి.. మానవునిలో అంతర్భూతమై వున్న దివ్యత్వాన్ని మేలుకొలిపే నిమితమై.. భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారు పూర్ణావతారులై, ప్రేమావతారులై ఆవిర్భవించారు.
“శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రాః”
“నీవు మృణ్మయుడవు కాదు – చిన్నయుడవు” అని భగవాన్ పలుమార్లు మనల్ని హెచ్చరించారు. మానవులలో సంపూర్ణమైన పరిణామాన్ని తీసుకురావడం కోసం వారు అనుసరించిన సంస్కరణ విధానం కూడా దివ్యమై, భవ్యమై, నవ్యమై అలరారినది.
మనకు తెలియకుండానే, మనలో సంపూర్ణమైన పరిణామాన్ని సునాయాసంగా తీసుకురావడం కోసం మూడు రకాల సంస్కరణలు ప్రవేశపెట్టి – సంస్కరణోద్యమానికి శ్రీకారం చుట్టారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా.
ఈ సంస్కరణలు మూడు రకాలుగా విభజించబడినాయి.
1.వ్యక్తి స్థాయిలో సంస్కరణ 2. సమిష్టి స్థాయిలో సంస్కరణ 3. ఆధ్యాత్మిక సంస్కరణ.
తన బిడ్డలైన మానవులు విలువైన జీవన మార్గంలో పయనించడానికి బదులుగా అజ్ఞానంతో పెడ మార్గంలో ప్రయాణిస్తూ కష్ట నష్టాలకు గురియై వేదనాభరిత జీవితాన్ని అనుభవిస్తున్నారు. అజ్ఞాన, అహంకారాలతో దారి తప్పి పయనిస్తోన్న తన బిడ్డలను సంస్కరించి మోక్షమార్గమునకు దారి చూపడానికే తాను ‘అవతరించాన’ని భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారు, పలుమార్లు తను దివ్యోపన్యాసాలలో తెలియజేశారు. భగవాన్ ఆచరణాత్మకంగా ప్రవేశపెట్టిన మనుషులను సంస్కరించిన విధానాలను తెలుసుకుందాం.
1) వ్యక్తి స్థాయిలో సంస్కరణ:
మనిషిలో అంతర్లీనంగా దాగివున్న దివ్యశక్తిని మేలుకొలిపి – తల్లిగా, తండ్రిగా, ప్రాణ సఖుడిగా, గురువుగా, మార్గదర్శకుడిగా – అనేక విధాలుగా ఉత్సాహ ప్రోత్సాహములను అందించారు భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారు. తొలిసారిగా “నేనెవరు? నా గమ్యం ఏవిటి?” అనే ఆధ్యాత్మిక చింతనను ప్రేరేపించారు భగవాన్. ఈ విధమైన విచారణామార్గమును అవలంభించిన వెంటనే మానవుడు బాహ్యాకర్షణల నుండి విముక్తుడై వేదాంత పరమైన భక్తి శ్రద్ధలను అలవరచుకుంటాడు, ఈ కారణంగా మానవుడు ఆత్మానందానుభూతిని పొందుతాడు. తద్వారా వ్యక్తిలో కలిగిన మానసిక పరిణామము నిత్యమై సత్యం శోభాయమానంగా ప్రకాశిస్తుంది. ఈ రీతిగా భగవాన్ తన బిడ్డలైన మానవులను అహంకార మమకారముల నుండి, రాగద్వేషముల నుండి విముుక్తులను గావించి నిర్మల, పవిత్ర హృదయులుగా తీర్చిదిద్ది మానవజాతి జీవిత రథసారథియై ప్రతి క్షణమూ సక్రమ మార్గములో నడిపిస్తూ వుంటారు. తన భక్తులను, కాలానుగుణంగా ఉత్తమ సంస్కారవంతులుగా తీర్చిదిద్దడమే భగవాన్ ఆశయం. తదనుగుణంగా.. ‘నీవే తప్ప నితః పరంబెఱుగ’ అనే శరణాగతి తత్వాన్ని పొందేంత వరకూ ఈ సంస్కరణ జరుగుతూనే వుంటుంది. ఓ సాధారణమైన ‘రాయి’ ఎన్నోమార్లు సుత్తి వేట్లకు గురియై.. అద్భుతమైన, అపురూపమైన, అందమైన ‘శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహము’ గా మారి నీరాజనాలు అందుకుంటుందో – మనము కూడా అదే రీతిగా ఆత్మానందాన్ని అనుభవించే ఉన్నత స్థితికి చేరుకుంటాము. ఈ విధమైన సంస్కరణను వ్యక్తి స్థాయిలో ప్రారంభించి తన భక్తులను సుసంపన్నమైన జీవన మార్గంలో పయనించేట్లు చేస్తారు భగవాన్.
2) సమిష్టి స్థాయిలో సంస్కరణ:
మానవుడు సంఘజీవి. పలువురు వ్యక్తుల కలయికయే సమాజము. ఏ ఒక్కరో బాగుపడితే, అది సమాజం యొక్క ఉద్ధరింపు కాజాలదు. సమాజంలోని ప్రజలందరూ ఐకమత్యంతో వుండి, మంచి నడవడికలో, ఉన్నతమైన భావజాలంతో, ఆదర్శవంతమైన జీవన విధానంతో మెలిగితేనే సమాజం అభివృద్ధి పథంలో పయనిస్తుంది. అందుకే మనిషిలో సంకుచిత భావాలను, స్వార్థ ప్రయోజనాలను రూపుమాపి, పరోపకార బుద్ధిని వృద్ధి చేయడానికి యువత కోసం సేవా విభాగాన్ని స్థాపించారు భగవాన్. ‘అహంకార రహితమైన, నిష్కామ భావంతో కుండిన సేవ చేయాల’ని భగవాన్ సూచించారు. “నేను సేవ చేస్తున్నాను” అనే భావనతో చేస్తే అది సరైన సేవ కాదు. “ఈ సేవ నా కోసమే.. నేను తరించడానికీ స్వామి నాకు ఈ అవకాశమును ప్రసాదించారు” అనే దివ్యమైన భావనను ప్రతి సేవాదళ్ కార్యకర్త కలిగియుండాలి. త్యాగభావంతో చేసే సేవయే సేవ. తద్వారా కలిగే ఆనందానుభూతి వర్ణనాతీతం.
సమాజము సక్రమమైన మార్గంలో పయనిస్తేనే దేశము పురోభివృద్ధి చెందుతుంది. నేడు సమాజంలోని అలజడలకు, వైషమ్యాలకు కారణము మానవతా విలువలు లోపించడమే! ఇట్టి విలువలు ఆధ్యాత్మిక రంగములోనే లభిస్తాయి. దీనికి సంబంధించి స్వామి ఓ మంచి ఉదాహరణ చెప్పారు. “ఒక చిన్న విత్తనాన్ని ఓ పెట్టెలో పెట్టి నీరు పోస్తే అది మొలకెత్తుతుందా? మొలకెత్తదు. భూమిలో నాటితేనే అది మొలకెత్తుతుంది. అదే విధముగా.. మానవతా విలువలనే విత్తనాలు.. ఆధ్యాత్మికతతో కూడిన హృదయక్షేత్రములోనే మొలకెత్తుతాయి కానీ.. ‘ప్రాపంచికము’ అనే అట్ట పెట్టెలో కాదు!”
ఇటువంటి సమిష్టి స్థాయి పరిణామము కోసమే శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఏర్పాటు చేశారు భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారు. ఈ సంస్థల ద్వారా అనేక మంది ఉత్తకు వ్యక్తులుగా తీర్చిదిద్దబడుతున్నారు. విద్యార్థులు, యువకులకు, పెద్దలకు అనుకూలముగా వారి వారి వయసును, మానసిక స్థాయిని బట్టి భగవాన్ అన్ని వర్గాల వారిని దృష్టిలో వుంచుకొని సంస్థలో అనేక విభాగాలను ఏర్పరిచారు. మానవుడు, బాల్యం నుండే ఆదర్శాలతో, ఆధ్యాత్మిక భావాలతో, దైవ భక్తితో మిళితమైన విద్యలను అభ్యసించాలని ‘బాలవికాస్’ సంస్థను స్థాపించారు. విద్యార్థులకు లౌకిక విద్యతో బాటుగా ఆధ్యాత్మిక విద్యను కూడా బోధించాలని అద్వితీయమైన విద్యా సంస్థలను ఎన్నింటినో ఏర్పరిచారు. “విద్య జీతము కోరకో, జీవనోపాధి కొరకో కాదు.. విద్య జీవితం కోసం!! ఈ సదాశయంతో విద్యను నేర్చుకోవాలి. డిగ్రీలు భిక్షాపాత్రులు కారాదు. సద్గుణములు, సద్బుద్ధి, సత్యనిరతి, భక్తి, శ్రీమశిక్షణ, కర్తవ్యపాలనము నేర్పునదే విద్య” అన్నారు భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారు.
3) ఆధ్యాత్మిక సంస్కరణ:
ప్రేమ, కరుణ, సర్వమత సమన్వయము ప్రాతిపదికలుగా ఆచరణాత్మకమైన ప్రబోధ ప్రచారముల ద్వారా ఆత్మానందానుభూతిని పొందడం కోసం ‘ఆధ్యాత్మిక విభాగము’ ను శ్రీ సత్యసాయి సంస్థలలో ప్రవేశపెట్టారు భగవాన్. ఈ ఆధ్యాత్మిక సంస్కరణోద్యమము ద్వారా ఎలాంటి ఫలితాలను పొందగలమో భగవాన్ చక్కగా వివరించారు. “హరేర్నామ హరేర్నామ హారీర్నామైవ కేవలం। కలౌ నాస్త్యేవ నాస్త్యేవ నాస్త్యేవ గతిరన్యధా॥”.
“బ్రాహ్మీముహూర్తంలో మేల్కొని ఓంకారాన్ని జపించడం ఆరోగ్యానికి, ఆహ్లాదానికి ఆధారమవుతుంది. నామాన్ని స్మరిస్తూ నగర సంకీర్తన చేస్తూ, తాము ఆనందాన్ని పొందుతూ ఇతరులకు కూడా ఆనందాన్ని పంచగలిగితే జన్మ ధన్యతను పొందినట్లే. ప్రభాత సమయంలో ప్రణతోచ్ఛారణతో, భక్తి పారవశ్యంతో చేసే నగర సంకీర్తన అంతశ్శుద్ధిని అందించడమేగాక – దుర్భావములతో కలుషితమైన బాహ్య వాతావరణాన్ని (నేటి మనుషులలో) కూడా పవిత్రం గావిస్తుంది. ప్రతి ఉదయం సద్భావనలతో, సత్ చింతన లలో ప్రారంభించినట్లయితే – ఆ రోజంతా ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండటమే గాకుండా ఆత్మ సంతృప్తిని కూడా పొందగలుగుతారు.”
ఈ రీతిగా, మానవాళిలో సాంఘికంగా, నైతికంగా, ఆధ్యాత్మికంగా పరివర్తన కలిగించడమే స్వామి చేపట్టిన సంస్కరణోద్యమ ప్రధాన లక్ష్యం. ఇట్టి సంస్కరణల ఫలితంగా నరుడు నారాయణుడవుతాడు. “సర్వం విష్ణుమయం జగత్” అనే సూక్తి నిత్యానుభవం లోనికి వస్తుంది. అంతే గాకుండా.. “మనిషి, మతి, మతము” – ఈ మూడింటిని సక్రమమైన మార్గంలో ఉద్ధరించాలని సంకల్పించిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి సత్సంకల్పం కూడా సఫలీకృతమవుతుంది.
శ్రీ విడదల సాంబశివరావు గారు 22 జనవరి 1952 న గుంటూరు జిల్లా, చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలో ఉన్న పురుషోత్తమపట్నం గ్రామంలో ఓ మధ్య తరగతి ‘రైతు’ కుటుంబంలో జన్మించారు. శ్రీమతి సీతమ్మ, రాములు వీరి తల్లిదండ్రులు. స్వగ్రామంలో ప్రాథమిక విద్య, చిలకలూరిపేటలో ప్రాథమికోన్నత విద్య, తెనాలిలో బి.ఎస్.సి. పూర్తి చేశారు.
బాల్యం నుంచి నటనపై అభిరుచి ఉంది. అనేక నాటికలలోనూ, నాటకాలలోనూ నటించి ప్రశంసలందుకొన్నారు. వివిధ సంస్థల నుండి పతకాలు పొందారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ నటుడిగా బహుమతులు పొందారు. వీరు రచించిన ‘పుణ్యభూమి నా దేశం’ (నాటకం), ‘తలారి తీర్పు’ (నాటిక) ప్రసిద్ధమయ్యాయి. టివి ధారావాహికల్లోనూ, కొన్ని సినిమాల్లోనూ ముఖ్య పాత్రలు పోషించారు.
సాంబశివరావు గారు వెయ్యికి పైగా కవితలు రాశారు. వాస్తవిక జీవితాలని చిత్రిస్తూ అనేక కథలు రాశారు. కవితలు, నాటకాలు, కథలు కలిపి 14 పుస్తకాలు ప్రచురించారు. పలు పత్రికలలో ఫీచర్లు నిర్వహిస్తున్నారు.
నాటకరంగలోనూ, రచన రంగంలోనూ ఉత్తమ పురస్కారాలు అందుకొన్నారు. నీహారిక పౌండేషన్ అనే సంస్థని స్థాపించి సమాజ సేవ చేస్తున్నారు.