డా. జి.వి. పూర్ణచందు గారు రచించిన – ‘భువనవిజయ కవులు’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]
రాయలవారు కొలువు దీరే సభా ప్రాంగణం భువనవిజయం. రాయలవారు ఉండే ఇంటి పేరు మలయకూటం. మలయకూటం నుండి భువనవిజయానికి వచ్చి రాచకార్యాలు నిర్వహించేవాడు శ్రీకృష్ణదేవరాయలు.
“మలయకూట ప్రాసాదనివేశి’యని పారిజాతాపహరణంలో ముక్కు తిమ్మన రాయల వారి నివాసానికి మలయకూటం అనే పేరుందని వ్రాశాడు.
“శ్రీసదన లోచనాబ్జ ద
యాసార మరంద పోషితార్థి భ్రమరో
ల్లాసగుణ మలయకూట
ప్రాసాదనివేశ! కృష్ణరాయమహీశా!”
కృష్ణరాయలి నేత్రాలు సౌభాగ్య కలితాలైన తామరల్లా ఉంటాయని, తామరల్లోని తేనె లాగా ఆయన కళ్ళు దయా రసాన్ని వర్షిస్తాయని, ఆ మకరందంతోనే ఆయనా ఆశ్రితులైన కవుల్ని కళాకారుల్ని పోషిస్తున్నాడనీ దీని భావం. సమకాలీనుడు విన్నవో కన్నవో కాకుండా ప్రత్యక్షంగా చూసి వ్రాసిన సాక్ష్యం ఇది. అల్లసాని పెద్దన కూడా మనుచరిత్రలో మలయకూట ప్రస్తావన చేశాడు.
“తిరుమల దేవీ చరణో
దరలాకూ కల్పకల్పిత స్థలకమల
స్ఫుర దిందీవర బంధుర
హారిహయమణి మలయకూట హర్మ్యవిహారీ” అంటూ పెద్దనగారు ‘హారిహయమణి మలయకూట హర్మ్యవిహారీ’ అని సంబోధించాడు. భువనవిజయం రాయలవారి మానసపుత్రిక. ఇష్టపడి మనసుకు నచ్చినట్టు కట్టించుకున్నాడు. ఇది గొప్ప సంసద్భవనం. ఇక్కడనుండి తెలుగు సారస్వతం రాయలవారి నేతృత్వంలో కనీసం 15 యేళ్ళ పాటు రాజ్యం చేసింది.
భువన విజయానికి పెద్దనగారి మనుచరిత్ర, తిమ్మన గారి పారిజాతాపహరణ కావ్యాలకూ సంబంధం ఉంది. ఈ రెండు గ్రంథాలనూ ఇందులోనే రాయలవారికి, రాయలవారు ఆముక్తమాల్యదను శ్రీవెంకటేశ్వరునకీ అంకితం ఇవ్వటం ఈ భువనవిజయం సాక్షిగానే జరిగాయి.
“భువనవిజయాఖ్య సంస
ద్భవన స్థీత భద్రపీఠి బ్రాఙ్ఞులగోష్ఠిన్
గవితామధురిమ డెందము
దవులన్ గొలువుండి సదయతన్ నను బల్కెన్”
అని పెద్దనగారు భువనవిజయం అనే ప్రసిద్ధి పొందిన సంసద్భవనంలో జరిగే ప్రాఙ్ఞుల గోష్ఠి సమయంలో కవితా మధురిమ గుండె నిండా నింపుకుని సదయతతో రాయలవారు తనతో ఇలా పలికాడంటాడు ఈ పద్యంలో పెద్దనగారు. పారిజాతాపహరణంలో నంది తిమ్మన గారు కూడా ఇలాంటి పద్యమే వ్రాశారు.
“భువనవిజయాఖ్య సంప
న్నవరత్న విభాప్రభాత నలినాప్త! రమా
ధవచరణ కమలసేవా
ప్రవణసుతీ! వీరరుద్రపర్వత వజ్రీ!”
భువనవిజయ సభోభవనము నవరత్న ఖచితం అనీ, ఆ నవరత్నాలకి బాలసూర్యుడి లాంటివాడు రాయలవా రంటాడీ పద్యంలో! బాలసూర్యుడు రత్నాల్ని ప్రకాశింప చేస్తాడు. కృష్ణరాయమహారాజు భువనవిజయం అనే పేరుగల తన కొలువులోని రత్నాల్లాంటి సభాసదుల హృదయాలను వికసింప చేస్తాడని భావం.
పెద్దన, తిమ్మన ఇద్దరూ భువనవిజయంలో అష్టదిగ్గజాలుండేవారని ప్రస్తావించలేదు. అష్టదిగ్గజాలనే భావన ప్రజల్లో ఉన్నదే గానీ వాస్తవంలో ఎంత ఉన్నదీ తెలీదు.
1938లో పురావస్తుశాఖవారు సౌతిండియా యాన్యువల్ రిపోర్టులో ఈ అష్టదిగ్గజాలనేవారు తెలుగు కవులనీ, అల్లసాని పెద్దన, నంది తిమ్మన, అయ్యలరాజు రామభద్రుడు, ధూర్జటి, మాదయగారి మల్లన, పింగళి సూరన, రామరాజ భూషణుడు, తెనాలి రామకృష్ణుడు వీళ్లే అష్టదిగ్గజాలని ఉంది. ప్రచారంలో ఉన్న కథనాన్నే ఈ పురావస్తు శాఖ ప్రచురించింది గానీ, అందుకు తగిన సాక్ష్యాల్ని ఇవ్వలేదు.
రాయలవారు అష్టదిగ్గజాలను ఏర్పరచారో లేదో తెలీదు గానీ, తరువాత రాజ్యానికొచ్చిన రాయల సంబంధీకులు మాత్రం జనంలో ఉన్న నమ్మకాన్ని నిజం చేస్తూ అష్టదిగ్గజాలను తమ ఆస్థానాలలో కొనసాగించారనేది వాస్తవం.
అష్టదిగ్గజాల గురించి విశేషమైన ఆలోచన చేసినవారిలో ప్రముఖులు వీరే!
గురుజాడ శ్రీరామమూర్తి | 1893 | కవిజీవితములు |
కందుకూరి వీరేశలింగము | 1895 | ఆంధ్రకవులచరిత్ర; |
చిలుకూరి వీరభద్రరావు | 1903 | జీర్ణకర్ణాటరాజ్య చరిత్ర; |
కొమర్రాజు వేంకట లక్ష్మణరావు | 1915 | మహమ్మదీయమహాయుగము; |
వేటూరి ప్రభాకరశాస్త్రి | 1922 | చాటుపద్య మణిమంజరి |
నేలటూరి వేంకట రమణయ్య | 1935 | Studies in the History of the Third-Dynasty of Vijayanagara |
చాగంటి శేషయ్య | 1950 | ఆంధ్రకవితరంగిణి |
ఇంకా నిడుదవోలు చేంకటరావుగారు, గాడిచర్ల హరి సర్వోత్తమరావుగారు, కుందూరు ఈశ్వరదత్తుగారూ ఇలా ఎందరో విజయనగర చరిత్రని విశ్లేషించే ప్రయత్నం చేశారు.
అష్టదిగ్గజాలంటే కేవలం కవులేనా? ఇతర రంగాల్లో దిగ్గజాలు ఉండరా? అని పింగళి లక్ష్మీకాంతంగారూ ప్రశ్నించారు. పింగళివారు ఈ కవి దిగ్గజాలంతా తెలుగు కవులే ననటాన్ని ఆమోదించలేదు. ఆరుద్రగారు ఈ ఎనిమిదిమంది కవులెవరో వారి పేర్లేవో నికరంగా చెప్పలేమనీ, సంకుసాల నరసయ్య కూడా ఈ అష్టదిగ్గజాల్లో ఒకడు కావచ్చనీ అన్నారు. వేటూరివారు అష్టదిగ్గజాల్లో అయ్యలరాజు రామభద్రకవి ఒకడు కానేకాదన్నారు.
క్రీ.శ.1552లో రాయలు కడప మండలం తిప్పలూరు అను గ్రామాన్ని సర్వాగ్రహారముగా అష్టదిగ్గజ కవీశ్వరులకు దానం చేసినట్లు శాసనం ఉంది. కానీ అందులో ఆ దిగ్గజాలు ఎవరో పేర్లు లేవు. వీరి వివరాలతో రాయలు వేయించిన శాసనం ఒక్కటీ దొరక లేదు.
మైసూరు దగ్గర నందిదుర్గలో సోమేశ్వరాలయం ఉంది. అక్కడ ఉన్న కృష్ణదేవరాయల శాసనంలో అప్టదిగ్గజ ప్రశంస ఉందంటూ ఆ శాసనంలోని యీ శ్లోకాన్ని వేటూరి ప్రభాకరశాస్త్రి గారు ప్రచురించారు:
యత్కీర్తి ర్భువనైక భూషణ మభూ ద్యస్యప్రసాదా న్నరా
స్సర్వే రాజసమానతా ముపగతాః, సంప్రాప్య విత్తం బహు
యు స్యాష్టౌ కవిదిగ్గజాః పృథు యశోభారా జగచ్చోభనా
యద్దానోదక సామ్య మేవ సరితా మాసేతుశీతాచలమ్’
అష్టదిగ్గజాల గురించి కేవలం తెలుగువారిలోనే ప్రచారం ఉంది. ఇతర భాషా సాహిత్యాల్లో వాళ్ల ప్రస్తావన లేదు. తెలుగు వారికే పరిమితమైన సాంప్రదాయం ఇది. విజయనగర సామ్రాజ్యానంతరం కూడా ఈ సాంప్రదాయం ఆంధ్రదేశంలో కొనసాగింది.
ఆంధ్రరాజులైన తంజావూరు నాయకరాజులు, తరువాతి కాలంలో పెద్దాపురం, కార్వేటినగరం, గద్వాల లాంటి సంస్థానాలు ఈ సాహితీ సాంప్రదాయాన్ని కొనసాగించాయి. గోల్కొండ నవాబుల యేలుబడిలో ఉన్న సంస్థానాల్లో స్థానికంగా ప్రముఖులైన అష్టదిగ్గజ కవులుండే వారని నిడుదవోలు వేంకటరావుగారు వ్రాశారు.
రాయలకాలంలో అష్టదిగ్గజాల గురించి జనంలో ప్రచారంలో ఉన్న కథలు తప్ప గట్టి సాక్ష్యాధారాలు లేకపోవటం చేత అష్టదిగ్గజాలంటే రాజ్యం మొత్తంలో ఎనిమిది దిక్కులా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు కల్పించిన ఒక ఉన్నత గౌరవంగానే భావించారు! ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఒక కమిటీ లాంటి వ్యవస్థ ఇది అయ్యే అవకాశమే లేదు. ఆనాటి తెలుగు కన్నడ, తమిళ, మళయాళ ప్రాంతాలకు చెందిన ప్రముఖులందరికీ భువనవిజయం సముచిత గౌరవాన్ని కల్పించి ఉంటుందని మనం తప్పక భావించాలి.
అష్టదిగ్గజాలంటే great Poets from Eight corners of the empire రాజ్యం అష్టదిక్కులనుండీ వచ్చిన మహాకవులకు ఈ భువన విజయం అపారమైన గౌరవ సత్కారాలందించిందని అర్థం చేసుకోవాలి. తన సువిశాల సామ్రాజ్యంలోంచి దిగ్గజాలను ఏరాలంటే దక్షిణభారతదేశం ఎనిమిది దిక్కుల్నీ ఆయన జల్లెడ పట్టి మహాకవుల్ని, కళాకారుల్ని గుర్తించవలసి ఉంటుంది.
అఘోరశివాచార్యులు= నంది తిమ్మన, సంగయ్యలకు గురువు. 1449 వాడు. రాయలవారికి సన్నిహితుడు.
అభినవవాది విద్యానందుడు=కన్నడ కవి
అల్లసాని పెద్దన= ఈయన నిస్సందేహంగా రాయల సమకాలికుడే! అష్టదిగ్గజాలనే వారున్నట్లైతే వారిలో మొదటి వాడు కూడా!
ఆచార్య దీక్షితుడు= రాయలవారికి సన్నిహితుడైన సంస్కృత కవి. తెలుగువాడు. ఈయన మనుమడే “తెలుగువాడుగా పుట్టటం తపఃఫలం” అని పేర్కొన్న అప్పయ్యదీక్షితులవారు. రాయలవారు కంచి వరదరాజ స్వామిని దర్శించుకోవటానికి దేవేరితో కలిసి వెళ్లినప్పుడు ఈ ఆచార్యదీక్షితులవారు ఆశువుగా ఓ శ్లోకం చెప్పారు= “కాంచి త్కాంచన గౌరాంగీం వీక్ష్య సాక్షాదివ శ్రియం/వరద సంశయాపన్నః వక్షస్థల మవేక్షత” అని! స్వామివారి ఎదురుగా భక్తిగా నిలుచున్న రాణిగారిని చూసి తన వక్షస్థలం పైన ఉండాల్సిన లక్ష్మీదేవి ఎదురుగా నిల్చున్నదేమిటా అని ఆశ్చర్య పోయి వరదరాజస్వామి తన వక్షస్థలాన్ని తొంగి చూసుకున్నాడట. స్వామి వక్షస్థలం మీద శ్లోకం చెప్పినందుకు ఆచార్య దీక్షితుల్ని స్వామి సన్నిధిలోనే సత్కరించి రాయలవారు ‘వక్షస్థలాచార్య’ అనే బిరుదు నిచ్చి గౌరవించాడని అప్పయ్యదీక్షితుల జీవిత చరిత్రలో ఉంది.
ఈశ్వరదీక్షితులు = రాయల ప్రోత్సాహమున వాల్మీకిరామాయణమునకు లఘు గురువ్యాఖ్యలు వ్రాశాడు.
ఊరి దేచమంత్రి= తిమ్మరుసు మేనల్లుళ్ళ పాలనలో ఉన్న కొండవీడుకు మంత్రిగా ఉన్నాడు. ‘శివపంచస్తవి’కి సంస్కృత వ్యాఖ్య వ్రాశాడు. తెనాలిరామలింగకవి ‘ఉదృటారాధ్యచరిత్ర’ గ్రంథాన్ని అంకితం తీసుకున్నాడు.
ఎడపాటి ఎర్రన= మల్హణ చరిత్రము, కుమార నైషధం కర్త
కందుకూరి రుద్రకవి= వేటూరి ప్రభాకర శాస్త్రిగారు, నేలటూరి వెంకటరమణయ్యగారు, నిడుదవోలు వెంకట్రావుగారు కందుకూరు రుద్రకవిని అష్టదిగ్గజ కవిగా లేదా రాయల సమకాలికుడిగా చాలామంది అంగీకరించినా కొందరు అంగీకరించలేదు.
కనకదాసు: 1509లో జన్మించాడు. హరిదాసుగా ప్రసిద్ధుడు.
కవిరాట్టు= వేటూరి ప్రభాకర శాస్త్రిగారు ఈ తెలుగు కవిని అష్టదిగ్గజాల్లో ఒకడిగా భావించారు.
కుమార సరస్వతి తమిళ కవి
కుమార డిండిమ కవిసార్వభౌమ= బహుభాషావేత్త. కవిరాజరాజు, కృష్ణరాయల ఆస్థానంలో ఉన్నాడు. ‘వీరభద్రవిజయం’ కర్త.
ఙ్ఞానప్రకాశర్=తమిళ కవి
చాటు విఠలనాథుడు=కన్నడ కవి
చింతలపూడు ఎల్లన= రాధామాధవకవి అంటారీయన్ని. రాయల సమకాలికుడు. నిడదవోలు వెంకటరావుగారు ఈయన అష్టదిగ్గజంలోని వాడుగా భావించారు.
చైతన్య మహాప్రభువు= ప్రతాప రుద్రగజపతికి గురువు. రాజమహేంద్రవరం తదితర తెలుగు ప్రాంతాలను సందర్శించాడు. రాయలవారి సమకాలికుడు. కానీ రాయలవారికి ఆయనతో ఎంత సంబంధం ఉండేదో తెలీదు.
తత్త్వప్రకాశకవి = తమిళకవి
తాళ్లపాక తిమ్మక్క= అన్నమాచార్యుని భార్య. అన్నమయ్య 1424-1503 మధ్యకాలంలో జీవించాడని వేటూరివారు నిర్ధారించారు. కాబట్టి ఈమె కాలం కూడా అదేనని మన కవి జీవిత చరిత్రకారులంతా వ్రాయగా ఊటుకూరు లక్ష్మీ కాంతమ్మగారు ఈమె మొల్లకన్నా ముందునాటిదని భావించారు. మొల్లమాంబ 1440-1530 మధ్యకాలంలో జీవించింది. ఆమె రామాయణ రచనా కాలానికి ప్రబంధ యుగం ఇంకా ఆరంభం కాలేదు. తిమ్మక్క వ్రాసిన సుభద్రాపరిణయం ప్రబంధ పోకడలు కలిగిన కావ్యం. కాబట్టి తొలి కవయిత్రి మొల్లమాంబే కావచ్చు. భారతదేశంలోనే ఆమె మొదటి కవయిత్రి కూడా! సంగమ కాలంనాటి అవ్వయ్యార్ సూఫీ కవయిత్రి లల్ల లాంటి మహిళామణులు ఉన్నప్పటికీ కావ్యరచన మొల్లతోనే ప్రారంభం అయ్యిందని పరిశీలకుల అభిప్రాయం.
తిమ్మణ్ణభట్టు= వ్యాసరాయలు (వ్యాసతీర్థులు)= ప్రసిద్ధ కన్నడ కవి
తిరుమల తాతాచార్యులు= తమిళ వైష్ణవుడు. ‘పంచమతభంజనం’ అనే ప్రసిద్ద గ్రంథం వ్రాశారు. రాయలవారికి గురువు.
తిరుమలాంబ= ‘వరదాంబికా పరిణయం’ చంపూ కావ్యం వ్రాసింది. రాయలవారి తమ్ముడు అచ్యుతదేవరాయలు, వరదాంబిక పెళ్ళి కథ ఇందులో ఇతివృత్తం.
తుక్కాదేవి= ప్రతాపరుద్రగజపతి తనయ, రాయలమహిషి. సాంసారికా నందము ననుభవింప నోచుకొనని యభాగ్యురాలు. ‘తుక్కాపంచకం’ కర్త అని చెప్తారు.
తెనాలి రామకృష్ణకవి= అష్టదిగ్గజాల వివాదం తెనాలి రామకృష్ణుడితోనే మొదలయ్యింది. రామరాజభూషణుడి వసుచరిత్ర తరువాతే రామకృష్ణుడి పాండురంగ మహాత్మ్యం వెలువడిందని ఎక్కువ మంది భావిస్తున్నారు. భట్టుమూర్తి అళియరామరాజు కాలంలో రామరాజభూషణుడిగా గుర్తింపు పొందాడు. కాబట్టి రామకృష్ణకవి నిస్సందేహంగా రాయల అనంతర కాలం వాడు. బహుశా చంద్రగిరికి రాజధాని మారిన తరువాతి కాలం వాడు కావచ్చు.
దివాకరుడు= ఈ తెలుగు కవి కూడా లొల్ల లక్ష్మీధర పండితుడితో పాటే ప్రతాపరుద్ర గజపతి ఆస్థానం నుండి రాయలవారి దగ్గర చేరాడు. అనేక గ్రంథాలు వ్రాశాడు. పారిజాతాపహరణ నాటకం కూడా వ్రాశాడు.
ధూర్జటి = అష్షదిగ్గజంలోని వాడేనని దాదాపుగా అందరూ అంగీకరించారు. ధూర్జటి రాయల ఆస్థానంలో ఉన్నట్టు కొన్ని చాటువులున్నాయి. ‘కృష్ణరాయవిజయ’ కావ్యంలో కుమార ధూర్జటి కృష్ణరాయలు ధూర్జటిని ఆదరించినట్టు వ్రాశాడు. కానీ, “రాజూల్ మత్తులు, వారి సేవ నరక ప్రాయంబు” అని ధూర్జటి రాజుల్ని నిందించి, తన ‘శ్రీకాళహస్తీశ్యర శతకము’, ‘శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యము’ గ్రంథాల్ని తన ఇష్టదైవానికి అంకితం ఇచ్చుకున్నాడు. దీన్ని బట్టి ధూర్జటి అష్టదిగ్గజాల్లో వాడు అయినా కాకపోయినా రాయలవారి సమకాలీనుడు కావచ్చు.
నంది తిమ్మన= ముక్కు తిమ్మనగా కూడా ఈయన ప్రసిద్ధుడు. పారిజాతాపహరణం కృతి అంకితం ఇచ్చాడు కాబట్టి, నిస్సందేహంగా రాయలవారి సమకాలికుడు, ఆంతరంగికుడు కూడా!
నాదిండ్ల గోపమంత్రి = తిమ్మరుసు మేనల్లుడు కొండవీటి ఉపపాలకుడు. స్వయంగా కవి. ప్రబోధ చంద్రోదయం నాటకానికి చంద్రిక వ్యాఖ్య, కృష్ణార్జున సంవాదం పేరుతో తెలుగులో ద్విపదలో కృష్ణార్జున యుద్ధ కావ్యాన్ని వ్రాశాడు.
పరాంకుశస్వామి=నరసింహస్తవం వ్రాసిన సంస్కృతకవి. క్రీ.శ. 1497-1511 నాటి వాడు. అహోబిలమఠాధిపతులలో నారవవాడు.
పింగళి సూరన= రాయల సమకాలికుడు కాకపోవచ్చని, ఇతను అళియరామరాజు కాలంలో నంద్యాల కృష్ణరాజు ఆశ్రయంలోని వాడని నిడదవోలు వెంకటరావుగారు భావించారు.
పుత్తేటి రామభద్రకవి= చాలామంది ఈ పుత్తేటి రామభద్రకవిని అయ్యలరాజు రామభద్రకవిగా పొరబడ్డారని కొందరు విమర్శకులు వాదించారు. నేలటూరివారూ అయ్యలరాజు రామభద్రకవిని రాయల సమకాలికుడిగా అంగీకరించలేదు. ఆ రామభద్రుడు పుత్తేటి రామభద్రకవే నన్నారు. రాయలవారి ‘సకల కథాసార సంగహం’ గ్రంథాన్ని తెలుగులోకి అనువదించించి ఈ పుత్తేటి వీరభద్రుడే గానీ అయ్యలరాజు రామభద్రుడు కాదని చాగంటి వారి అభిప్రాయం.
పురందరదాసు: కన్నడ సంస్కృత వాగ్గేయకారుడు.
బండారు లక్ష్మీనారాయణకవి= రాయల యాస్థానంలో ప్రసిద్ధుడైన తెలుగు వాగ్గేయకారుడు. ‘సంగీతసూర్యోదయం’ అనే సంగీత శాస్త్రీయగ్రంథాన్ని రాయలకు అంకితం ఇచ్చాడు. అభినవ భరతాచార్య, సూక్ష్మభరతాచార్య బిరుదాలతో పాటు, బంగారుపల్లకి, గజారోహణం, ముత్యాలు పొదిగిన రెండు శ్వేతఛత్రాల సన్మానం రాయలనుండి పొందాడట.
భానుకరుడు= రాయలవారి ప్రోత్సాహంతో రసమంజరిని వ్రాశాడు. రాయల్నిఈ కవి ప్రశంసిస్తూ చెప్పిన రెండు శ్లోకాలున్నాయి.
మండలపురుషుడు= తమిళ కవి
మాదయగారి మల్లన= వేటూరి వారు మల్లన కవి అష్టదిగ్గజాలలోని వాడు కాడన్నారు.
మొల్ల: రామాయణ మహాకావ్యా రచన చేసింది. రాయల సత్కారము అంది ఉండునని శ్రీ వీరేశలింగం వ్రాశారు.
రామచంద్రభట్టు= వల్లభాచార్యుని శిష్యుడు
రూప గోస్వామి=చైతన్య మహాప్రభు శిష్యుడు
లొల్ల లక్ష్మీధర పండితుడు= ఒడీసా వీరరుద్రగజపతి ఆస్థాన కవి. తన ప్రభువు పేరున మునిసిపల్ పాలనకు సంబంధించిన గ్రంథం వ్రాశాడంటారు. ప్రతాపరుద్రగజపతి కుమార్తె తుక్కాదేవి (అన్నపూర్ణ)ని రాయలవారు వివాహం చేసుకున్నాక ఆమె వెంట విజయనగరానికి వచ్చాడని చెప్తారు.
వల్లభాచార్యులు= ఆంధ్రుడు, రాయల సమకాలికుడు, వల్లభ మత స్థాపకుడు
శంకరకవి= దేచమంత్రి కుమారుడు. ‘హరిశ్చంద్రోపాఖ్యానం’ వ్రాశాడు.
శఠకోపయతి= అహోబల మఠానికి 7వ అధిపతి. 1512-22దాకా ఉన్నారు. ఈయన ‘వాసంతికాపరిణయం’ అనే సంస్కృత కావ్యం వ్రాశారు. తాతాచార్యులవారికి పూర్వాశ్రమంలో మేనల్లుడు.
సంకుసాల నృసింహ కవి: రాయల సమకాలికుల్లో ప్రసిద్ధి ఉన్న సంస్కృతాంధ్ర కవి. ఈయన కూడా అష్టదిగ్గజాలలోని వాడు కావచ్చని ఆరుద్ర వ్రాశారు.
సాళువ తిమ్మరును = సాళువ నరసరాజుకు మంత్రిగా పనిచేసి సాళువ తిమ్మరుసుగా ప్రసిద్ధుడయ్యాడు. కృష్ణదేవరాయలు అప్పాజీ అని నోరారా పిలిచిన వ్యక్తి. రాయలే అతన్ని కళ్ళు పొడిపించి చంపినట్టు కట్టుకథలు మనవాళ్లే అల్లారు. కన్నడంలోనో తమిళంలోనో అల్లినవి కావివి. అప్పాజీ సంస్కృతకవి. సహృదయ చూడామణి అనే గ్రంథం వ్రాశాడు. అగస్త్యవిద్యానాథ కృత బాలభారత కావ్యానికి మనోహరి అనే వ్యాఖ్య వ్రాశాడు.
హరిహరదాసు= తమిళ కవి
వీళ్ళంతా రాయల సమకాలికులు. కొందరు ఆయనకన్నా వయోవృద్ధులు కాగా, కొందరు చాలా చిన్నవాళ్లు. దక్షిణ భారతదేశం మొత్తానికీ ఏలికగా ఉన్న ఆ మహానాయకుడికి తన మహాసామ్రాజ్యంలోని అన్ని భాషల కవులతోనూ సంబంధ బాంధవ్యాలు సహజం.
అన్నమయ్యతో అనుబంధం
తెలుగు పదకవితా పితామహుడైన అన్నమాచార్యుడు, కర్ణాటక సంగీత పితామహుడైన కన్నడ వాగ్గేయకారుడు పురందర దాసుకన్నా ముందరివాడు. అన్నమాచార్యుల మనుమడు చినతిరుమలాచార్యుడికి పురందరదాసు సమకాలీనుడు. ఈ చినతిరుమలాచార్యుడు, పురందర దాసు, రాయల అనంతర ప్రభువులు అచ్యుతదేవరాయలు (1529-42) సదాశివరాయలు (1542-76), ‘స్వరమేళ కళానిధి’ గ్రంథ రచయిత తంజావూరు రామయ్యమంత్రి వీరందరి సమష్టి కృషితో సరళీస్వరాలు, జంటస్వరాలు, గీతాలు, అలంకారాలు, వర్ణాలు, అనే క్రమతరగతి పద్ధతిలో సంగీత విద్యార్థులకి శిక్షణ ఏర్పాటు జరిగాయని, రాజులు కన్నడ రాజ్య రమామణులు కాబట్టి పాలనా భాష తెలుగైనప్పటికీ, సంగీతాన్ని కర్ణాటక సంగీతం అనే పిలిచారని ‘తెలుగువారి సంగీతరీతులు’ అనే వ్యాసంలో రజనీగారు పేర్కొన్నారు.
“చిన్నన్న ద్విపద కెఱఁగును, బన్నుగఁబెదతిరుమలయ్య పదమున కెఱఁగున్,
మిన్నంది మొరసె నరసి గన్న కవిత్వంబు పద్యగద్య శ్రేణిన్”
చిన్నన్న అనే చినతిరుమల వేంగళనాథుడు అన్నమయ్యకి మనుమడౌతాడు. పెదతిరుమల్లయ్య కుమారుడు. ఆయన ద్విపదలు వ్రాయటంలో ప్రతిభావంతుడు. అష్టమహిషీ కళ్యాణం, పరమయోగి విలాసం వ్రాశాడు. పెద తిరుమలయ్య క్రీ.శ. 1480-1547 కాలం నాటి వాడు. తండ్రికి తగిన తనయుడు. కొన్ని సందర్భాల్లో అధికుడు కూడా!
ఈ పెద తిరుమలాచార్యుని కాలానికి ప్రబంధ యుగం ఊపు మీద ఉంది. రాయలనాటి మూడు ప్రబంధాలు పారిజాతాపహరణం, మనుచరిత్ర, ఆముక్తమాల్యద ప్రభావంతో గొప్పగొప్ప ప్రబంధాలు అవతరించిన కాలం అది. ఆ ప్రభావం పెదతిరుమలయ్య మీద ఉంది. అతను వ్రాసిన ‘చక్రవాళమంజరి’ అనే శ్రీనివాసుని ప్రణయకావ్యంలో అలమేలుమంగ వేంకటేశ్వరునిపై వలపు పెంచుకుని శృంగారావస్థలకు లోనై చివరికి నాయకుని చేరటం ఇతివృత్తం. ప్రబంధ కవులు అనుసరించిన కావ్యరచనా విధానాన్ని ఇందులో పాటించాడాయన.
పెదతిరుమలయ్య అన్నమయ్య ఒరవడిని కొనసాగిస్తూ అనేక పదసంకీర్తనలు కూడా వ్రాశాడు. వాటిలో చాలా వరకూ రాగిరేకుల్లో, తంజావూరు సరస్వతీ గ్రంథాలయంలో ఉన్నాయని చెప్తారు. ఈ వంశీకుడే నరసింగన్న. కవికర్ణ రసాయన కర్త. తాళ్లపాక నృసింహకవి అసలు పేరు. బహుశా చినతిరుమలాచార్యుడి తరువాతి తరంవాడు. ఆయనకన్నా వందేళ్లు చిన్నవాడని, మానవల్లి రామకృష్ణకవి అభిప్రాయపడ్డారు. ఇలా, తాత, కొడుకు, మనుమడు పద కవితాప్రక్రియలో శేముషీ కృషిచేసి ఆంధ్ర పదకవిత్రయంగా ప్రసిద్ధులయ్యారు.
శ్రీవారి బంగారు వాకిటి దగ్గర భాష్యకారుల విగ్రహాలు అన్నమాచార్యుల విగ్రహం సంకీర్తనభండారం ఉన్నాయి.
“అదివో తాళ్ళపాక అన్నమాచార్యులు/యిదె వీఁడె శ్రీవెంకటేశునెదుట/వెదవెట్టి లోకములో వేదము లన్నియు మంచి పదములు సేసి పాడి పావనము సేసెను ఈతడే||” అనే పెదతిరుమలయ్య కీర్తన వెంకటేశ్వరుని చెంత అన్నమయ్య స్థానాన్ని చాటుతోంది.
శ్రీకృష్ణదేవరాయలు పాలనకొచ్చేసరికి అన్నమయ్య కడు వృద్ధుడు. ఆయన కుమారుడు పెదతిరుమలయ్య మధ్యవయస్కుడు. మనుమడు చినతిరుమలయ్యకి 1503లో అన్నమయ్య స్వయంగా బ్రహ్మోపదేశం చేసి, ఉపనయనం చేశాడని వేటూరి వారు వ్రాశారు. పెదతిరుమలయ్య అన్నమాచార్యుని రెండవ భార్యయగు అక్కలాంబకు పుట్టాడు. 1553 దాకా జీవించాడు. అల్లసాని పెద్దనకి అన్నమయ్య స్వయంగా గురువు. 1512 నుండి, 1523 దాకా 7సార్లు తిరుమలకు రాయలవారు వచ్చారని రికార్డులు చెప్తున్నాయి. ఆయనకు అన్నమయ్య గురించి తెలీదని అనటానికి లేదు. అన్నమయ్య మరణించిన 4 యేళ్ళకు గానీ రాయలు పట్టాభిషిక్తుడు కాలేదు. కాబట్టి రాయలవారిని ప్రస్తావించే అవకాశం అన్నమయ్యకు లేదు. రాయలవారు ఎందరో కవుల్ని పోషించి ఆంధ్రభోజుడనిపించుకున్నాడు. స్వయంగా సంస్కృతాంధ్ర కవి. రాయల కాలానికే పెదతిరుమలయ్య కూడా కవిగా ప్రసిద్ధుడైనవాడు. పెదతిరుమలయ్య కొడుకు చినతిరుమలయ్య కూడా రాయలు జీవించిన కాలంలోనే కవిత్వం చెప్పి ప్రాచుర్యం పొందిననవాడు. రాయలవారికి అన్నమయ్య కుటుంబం సమకాలీనులే!
డా. జి. వి. పూర్ణచందు విజయవాడ వాస్తవ్యులు, ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు, వివిధ సాహిత్య ప్రక్రియలలో సృజనాత్మక, సామాజిక, వైఙ్ఞానిక రచనలు చేసిన సాహితీవేత్త. 130 పుస్తకాలు వివిధ ప్రచురణ సంస్థల ద్వారా ప్రచురితం అయ్యాయి. 50 అంతర్జాతీయ, జాతీయ సదస్సులలో కీలక ప్రసంగం, సభాధ్యక్షత లేదా, పత్రసమర్పణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న ‘హంస’ పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, సద్గురు శివానంద మూర్తి వికారి నామ సంవత్సర శ్రీరామనవమి ప్రతిభా పురస్కారం, మద్రాస్ విశ్వవిద్యాలయం ఆర్కాటు ప్రసాదరావు ధర్మనిథి పురస్కారం ఇంకా 50కి పైగా సంస్థల పురస్కారాలు అందుకున్నారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు 4 పర్యాయాలు ప్రధానకార్యదర్శిగా వ్యవహరించారు.