[శ్రీ పి. రాజేంద్రప్రసాద్ గారు రాసిన ‘భూభ్రమణం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
“హలో! ఆపణ్ యాల్ కా?” బీచ్ ఒడ్డున ఇసుకలో కూర్చున్న అతనికి ప్రక్కనుంచి మరాఠీలో ఒక తియ్యని గొంతు వినిపించింది. పలుచటి చీరలో ఉన్న ఒక అమ్మాయి వయ్యారంగా నిలబడి అడుగుతోంది. కొద్ది మాత్రం తెలివితేటలు ఉన్నవారికెవరికైనా ఆమె ఎందుకలా అడుగుతోందో అర్థమైపోతుంది. అతను మాత్రం అర్థం కానట్టు కూర్చున్నాడు.
నిహాల్ హైదారాబాద్ నుంచి ముంబాయి వచ్చాడు. అతడు వచ్చిన పని మధ్యాహ్నమే పూర్తయిపోయింది. సాయంకాలం దాకా రూములో టీవీ చూస్తూ గడిపాడు. బోర్ అనిపించింది. రూమ్ ఖాళీ చేసేశాడు. ట్రైన్ టైమ్ దాకా కొద్దిసేపు గడపాలని బీచ్‌కి వచ్చాడు. బీచ్‌లో కూర్చున్నాక మిక్స్చర్లూ, ఐస్ క్రీమ్‌లూ అమ్మేవాళ్ళ కేకలు సముద్రపు హోరును మించిపోయాయి. స్టేషన్‌కి వెళ్లిపోయి వెయిటింగ్ హాల్లో కూర్చుంటేనే బాగుంటుందని అనిపించింది అతనికి. ఇంతట్లో ఈ అమ్మాయి కనిపించింది. కట్టూ బొట్టూ ఇక్కడివాళ్ళలా లేదే అనుకున్నాడు.
“హలో! ఆతే క్యా!” అతనికి అర్థం కాలేదనుకుని ఈ సారి హిందీలో అడిగింది ఆ అమ్మాయి. సమాధానం చెప్పేలోపునే అతని ఫోన్ మోగింది.
“హలో! చెప్పండి!” అన్నాడు ఫోన్ లిఫ్ట్ చేసి. అందంగా కనిపించే అమ్మాయి కన్నా బిజినెస్ చాలా ముఖ్యం. తను చేద్దామనుకున్న ఫోన్ వాళ్ళ పార్ట్‌నరే చేశాడు. నిహాల్ దానిని వీడియో కాల్‌గా మార్చాడు. అవతల వాళ్ళతో పదినిమిషాలు ఇంగ్లీషు, తెలుగులలో మాట్లాడాడు. అందులో కొన్ని బిజినెస్ పదాలలా ఉండి ఎవరికీ అర్థం కాకుండా ఉన్నాయి.
మాట్లాడడం పూర్తిచేయగానే, ప్రక్కనుంచి సన్నని రోదన ధ్వని వినిపించింది. ఆశ్చర్యపడి తల తిప్పి చూశాడు. ఇందాకటి యువతే! సందేహం లేదు. మోకాళ్లలో తల పెట్టుకొని ఏడుస్తున్నది. ఆ ఏడుపు అంతకంతకూ అధికమౌతున్నది. నిహాల్ ఊహించింది నిజమయ్యింది.
ఆమె తలెత్తి నిహాల్‌ను చూసింది. కళ్ళు తుడుచుకుని “మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను. ఏమీ అనుకోకండి.” వెనక్కి తిరిగి వడి వడిగా వెళిపోబోయింది.
నిహాల్ అప్రయత్నంగా “ఆగు!” అని, “నువ్వు తెలుగు అమ్మాయివా?” అడిగాడు.
“ఏం! తెలుగమ్మాయి మీకు కుదరదా?” కోపంగా అడిగిందామె. మళ్ళీ తనే.. “ఐ యాం సారీ. చాలా రోజులకు నా ఊరి మాట వినిపిస్తే దుఃఖమో, సంతోషంతో అదేదో తెలియని ఏడుపు వచ్చింది. ఏమీ అనుకోకండి. వెళ్లి వస్తాను.” ఆమె భాష విని, ఎంతో చదువుకుంటే గాని ఎవరికీ అటువంటి పదాలు నోటివెంట రావని అతనికి అర్థమయ్యింది. ఆ అమ్మాయి పొరపాటునే ఈ వృత్తిలోకి వచ్చి ఉంటుందని కూడా అనిపించింది.
“సారీ! ఏమీ అనుకోవద్దు! మీ పేరు ఏమిటి? మీరు ఇక్కడ ఎందుకు ఈ పరిస్థితుల్లో ఉన్నారు? మీకు అభ్యంతరం లేకపోతే చెపుతారా?” అడిగాడు నిహాల్.
“తెలుసుకొని ఏం చేస్తారు? మీ పని మీరు చూసుకోండి. వెళ్ళిరండి. నమస్తే. నేను ఇంకొకణ్ణి వెతుక్కోవాలి.” గిరుక్కున వెనక్కు తిరిగిందామె.
నిహాల్ గబుక్కున ఆమె చేయి పట్టుకున్నాడు. “నా పేరు నిహాల్. మీరు తెలుగు వాళ్లంటున్నారు. నేనూ సాటి తెలుగువాడిగా చేతనైనంత సాయం చేయాలని ఉంది. ప్లీజ్ మీ గురించి చెప్పండి.” వేగంగా అన్నాడు.
“సారీ అండీ! ఆవేశపడ్డందుకు మన్నించండి. నా గురించి చెపుతాను. ఎందుకో మీరు నాకు ఆప్తుల్లా అనిపిస్తున్నారు. మీరు సాటి తెలుగు వారైనందువల్ల చెప్పాలని ఉంది. మీరేమనుకుంటారో మరి..” అర్థోక్తిలో ఆగిపోయింది.
“ఫరవాలేదు చెప్పండి.” అన్నాడు నిహాల్.
ఆమె దీర్ఘంగా నిట్టూర్చింది. “నిహాల్ గారూ! తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు అవని. బహుశా భూదేవిలాగా అన్నీ భరిస్తానని కాబోలు అలాంటి పేరు పెట్టారు. ఇక్కడ నా పేరు వేరే అనుకోండి. అసలు మా ఊరు రాజమండ్రి దగ్గరలోదే.” అంటూ తన ఊరి పేరు చెప్పింది.
“మాదీ రాజమండ్రి దగ్గరే! కానీ ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నాను.” గబుక్కున అన్నాడు.
ఆమె భావరహితంగా కొనసాగించింది. “ఎంతో కాదు. కేవలం ఆరు నెలల క్రితం మాట. నేను ఊళ్లో చదువు పూర్తి చేసి, రాజమండ్రి వచ్చి హాస్టల్‌లో ఉంటూ ఎమ్.ఏ. ఇంగ్లీషు లిటరేచర్‌లో చేసి, ఆ తరువాత పీహెచ్‌డీకి ప్రిపేర్ అవుతూ ఉండేదాన్ని.”
“మీరు పోస్టు గ్రాడ్యుయేటా!” నిహాల్ ఆశ్చర్యంతో అన్నాడు.
అతని వైపు అలాగే చూసి కొనసాగించింది అవని.
“చదువుతూ ఉండగానే అనుకోకుండా అప్లై చేసిన ఉద్యోగానికి అహ్మదాబాద్‌లో ఇంటర్వ్యూ వచ్చింది. ఒక్కదాన్నే వెళ్ళడానికి అమ్మా నాన్నా ఒప్పుకోలేదు. తామూ వెంట వచ్చారు.”
“ట్రైన్లో దూర ప్రయాణం అలవాటు లేకపోవడంతో రాత్రి పడుకోగానే గాఢంగా నిద్రపట్టేసింది. హఠాత్తుగా పెద్ద విస్ఫోటనం. అర్థరాత్రి మంచి నిద్రలో ఉన్న మేమందరం ఎక్కడెక్కడికో విసిరి వేయబడ్డాం. మేము ఎక్కిన బోగీ విద్రోహుల బాంబు తాకిడికి రెండు ముక్కలుగా విడిపోయింది. నేను ఎక్కడో పడిపోయాను. పడిపోయిన మరుక్షణం స్పృహ తప్పిపోయింది.
నా అదృష్టమో దురదృష్టమో నేనొక పొలంలోని గడ్డిమోపు మీదపడి ఏ గాయమూ కాకుండా తప్పించుకున్నాను. ‘అమ్మా నాన్న ఏరీ?’ అనుకుంటూ వెతుకుతున్న కొద్దిసేపటికే నా గుండెను వేయి ముక్కలు చేస్తూ రాళ్ళూ రప్పల మధ్యలో నిర్జీవంగా పడి ఉండి కనిపించారు. దుఃఖం పొరలు పొరలుగా తెరలు తెరలుగా పొంగుకొచ్చింది. ఏడుస్తూ ఉండిపోయాను.
అంతలో నా భుజం మీదో చెయ్యి పడింది. ఎవరో తెలియదు. కన్నులు దయను కురిపిస్తున్నాయి.
“అమ్మా! ఎంతసేపు ఏడుస్తావు లేమ్మా! నేను రైల్వే అధికారిని. రామ్మా, నిన్ను మీ ఊరికి చేర్చే మార్గం చూద్దాము.”
“సార్! మా అమ్మా, నాన్నా!” అన్నాను భోరుమంటూ.
“అయ్యో తల్లీ! వాళ్ళు మీ అమ్మా నాన్నలా? ఒకేసారి ఇద్దరినీ పోగొట్టుకున్నావామ్మా! ఊరుకో తల్లీ! వాళ్ళిద్దరి సంగతి నేను ఏర్పాటు చేస్తానమ్మా! నువ్వు లే!” అన్నాడాయన. అతనే చెప్పాడు ట్రైను బ్రిడ్జీ మీద వెళుతుంటే విద్రోహులు పెట్టిన బాంబుల కారణంగా తెల్లవారు ఝాము మూడూ నాలుగూ మధ్య ఈ ప్రమాదం జరిగిందనీ మేం మహారాష్ట్ర శివార్లలో ఉన్నామనీ. ఏడుస్తూనే వెనకకు తిరిగి తిరిగి అమ్మనూ నాన్ననూ చూసుకుంటూ అతనితో నడిచాను. నా భుజం మీద చెయ్యి వేసి నడిపించాడతడు.
అతను నన్ను ముందుగా ఓ రెస్టారెంటుకు తీసుకెళ్లి ఏడుస్తున్నదాన్ని ఓదార్చి ముఖం కడుక్కోమని, వద్దు వద్దంటున్నా బలవంతంగా భోజనం పెట్టించాడు. అతను టాక్సీ తీసుకొచ్చాడు. నాకు అనుమానం రాకుండా, రైల్వే స్టేషన్ చాలా దూరమనీ గవర్నమెంటు వాహనాల్లో చాలామంది వెళ్లిపోయారనీ, మళ్లీ అవి తిరిగి వచ్చేందుకు లేటవుతుందనీ చెప్పాడు. చాలా సేపు ప్రయాణించిన తరువాత ఒక ఇంటి ముందు ఆపాడు. టాక్సీ దిగమన్నప్పుడు భయం వేసింది.
“ఇదేమిటి? ఇది రైల్వే స్టేషన్ కాదే?” అన్నాను.
“కాదు.. కాదు.. ఆక్సిడెంట్లో ఇరుక్కుని అదృష్టవశాత్తూ గాయపడకుండా బయటపడి ఉన్నవాళ్ల కోసం సహాయ కేంద్రం. ఇక్కడ ఉన్న ఆఫీసర్లు మీకు మీ లగేజీ ఎక్కడుందో తీసుకోవడానికీ, మీ దగ్గరి వాళ్ళెవరైనా చనిపోతే వారిని గుర్తుపట్టడమూ, క్రిమేషనూ కంపెన్సెషనూ లాంటివి చూస్తారు. మరేం భయలేదమ్మా! దిగు!” అంటూ ఆ ప్రత్యక్ష నరకంలోకి నేరుగా నడిపించాడు. పిచ్చిదానిలా నేనూ నడిచాను. లోపల ఒక గదిలో ఉన్న మంచం చూపించి “నువ్వు రెస్టు తీసుకోమ్మా! నేను మీ అమ్మానాన్నల సంగతి చూస్తాను.” అంటూ వెళ్ళిపోయాడు. తాత్కాలికంగా వాళ్ళ గురించి మర్చిపోయిన నాకు మళ్లీ దుఃఖం వెల్లువలా పొంగుకొచ్చింది. భోరుమంటూ మంచం మీద పడి ఏడవసాగాను. ఏడుస్తున్న నా భుజం మీదొక చెయ్యిపడింది. ఈ సారి ఆ చేతితో ఇంకొన్ని చేతులు కలిశాయి. నా శరీరం నిర్దాక్షిణ్యంగా దోచుకోబడింది. నా అరుపులూ, కేకలూ అరణ్యరోదనలయ్యాయి. పది రోజులు ఈ హింసాకాండ జరుగుతుంటే ఒక్కసారి కూడా ఎవరికీ నా ఆర్తనాదం వినిపించలేదు. ఇలా ఎన్ని రోజులు జరిగేదో తెలీదు కానీ అనుకోకుండా ఎలా తెలిసిందో పోలీసులొచ్చారు. నన్ను స్టేషనుకి తీసుకెళ్లి రక రకాల ప్రశ్నలడిగారు. వారి భాష నాకు రాక ఇంగ్లీషులో సమాధానం చెప్పాను. వాళ్లకి ఏమర్థమయిందో ఏమో నన్ను హాస్పిటల్‌లో చేర్చారు.
అక్కడ కూడా వార్డ్ బాయ్ నుండి సీనియర్ డాక్టర్ దాకా చేసే పనులు భరించలేక అక్కడ నుండి ఒక అర్ధరాత్రి పారిపోయాను. ఎలాగో రైల్వే స్టేషన్ చేరుకుని, కనిపించిన ట్రైన్ ఎక్కి అది చేర్చిన గమ్యానికి వచ్చాను. తినడానికి ఏమీ లేక ఈ బీచ్ దగ్గర కళ్ళుతిరిగి పడిపోతే నాలాంటి ఈ వృత్తి చేసుకునే నా అక్కలూ చెల్లెళ్ళూ అన్నం పెడితే తిని వేరే దారి ఏదీలేని నేను, అదే వృత్తిగా బతుకును సాగిస్తున్నాను. సర్టిఫికెట్లు అన్నీ పోయాయి. ఇంటికి వెళ్ళడానికి సరిపడినంత డబ్బు కూడగట్టుకోలేక పోయాను. అయినా అమ్మా, నాన్నా లేని ఊరికి చుట్టాల దగ్గరికి వెళ్లి నా పరిస్థితిని ఏమని చెప్పుకోను? అయినా ఎలాగైనా మా ఊరు చేరుకొని పోయిన నా సర్టిఫికెట్లు సంపాదించుకుని ఏదైనా ఉద్యోగం చేసుకోవాలనీ ఆలోచన వచ్చింది. అందుకోసం నేను సంపాదించిన దాంట్లో తినీ తినకా డబ్బు కూడబెడుతున్నాను. ఇప్పుడు ఆ ప్రయత్నంలోనే మిమ్మల్ని కలిశాను.” మాట మధ్యలోనే సముద్రపు పోటును మించిన ఒక దుఃఖపు కెరటం ఆమెను ముంచెత్తింది. ఎప్పటికో ఆమె ఉధృతం ఆగింది. ఆతని చెయ్యి ఆమె వీపుపై ఓదార్పుగా రాస్తున్నది. ఆమెకు అది ఎందుకో సహజంగా తోచింది.
ఆమె దుఃఖపు తెర ఆగగానే అతడు ఆమె చేయి తన చేతిలోకి తీసుకొని “అవనీ! లే!” అన్నాడు. ఆమె తడబడింది “నీకు నేనున్నాను, నన్ను నమ్మి నాతో వస్తావా?” అన్నాడు. ఆమె మౌనంగా అభావంగా ఉండిపోయింది. గత అనుభవం ఆమె గుండెల్లో ఇంకా పచ్చిగానే ఉంది. “అమ్మా, నాన్నా గుర్తొచ్చారా” అన్నాడు.
అవునన్నట్లు తల ఊపింది. “ఇకనుండి నీకు అమ్మా, నాన్నాలేని లోటు కనబడనివ్వను. నీకు నేను జీవితాంతం తోడుగా ఉంటాను” దృఢంగా చెప్పాడు. ఆమె అతని వైపు అపనమ్మకంగానే చూస్తూ ఉండిపోయింది.
***
ట్రెయిన్ బయలుదేరింది. ఆ ప్రయాణం సాగుతుండగా నిహాల్, ఊళ్లో తన మాట కెదురాడని తల్లిదండ్రుల గురించీ, తన పోస్టుగ్రాడ్యుయేట్ చదువుతో తను చేసే ప్రభుత్వ ఉద్యోగం సంగతీ చెప్పుకొచ్చాడు. అవనిని తన గతంలోని చీకటి కోణం గురించి ఎవరికీ చెప్పవద్దన్నాడు. అసలు తననే ఆ పీడకల గురించి మరచిపొమ్మన్నాడు.
ఆ కుపేలో వాళ్లిద్దరే ఉన్నారు. అవనిని పొదివి పట్టుకొని గుండెలమీదకు లాక్కున్నాడు. అతని గుండెలపై తల పెట్టుకున్న ఆమె ఆలోచిస్తోంది. ‘ఇది కలా! నిజంగానే జరుగుతోందా! నిజమే అని అతని గాఢ పరిష్వంగం చెపుతున్నది. ఈ చేయి నా తోడుంటే సమాజాన్ని లెక్కచేయవనవసరం ఏముంది? కడదాకా అతడి తోడు ఎంత హాయిగా..తీయగా ఉంటుందో.. తలుచుకుంటుంటే ఎంతో అద్భుతంగా ఉంది!’ మరింత గట్టిగా అతనిని అల్లుకుంది.
అతనూ అనుకుంటున్నాడు. ‘నిన్నటి దాకా హైదరాబాదు నుండి ముంబాయి పిట్టల్ని చేరేశాను. ఈ రోజు అటు నుంచి ఇటు. కొంచెం కూడా కష్టపడకుండా బలే దొరికింది ఇది. ట్రెయిన్ దిగేదాకా కాపాడితే చాలు. అక్కడ్నించి దీన్ని కొనుక్కున్న వాడే అంతా చూసుకుంటాడు. వీడియో కాల్ లో దీన్ని చూపించగానే భలే బేరం కుదిరిపోయింది. ఈ సారి రెండు వైపులా ఆదాయమే!’ మనసులోనే గట్టిగా నవ్వుకున్నాడు.
అవని ఎంతో వేగంగా తన చుట్టూ తాను తిరుగుతూనే ఎక్కడికో పోవాలని తిరుగుతూ ఉంటుంది. కానీ తను ఆ సూర్యుడి చుట్టూనే తిరుగుతున్నదని ఆమెకు తెలియనే తెలియదు. ఈ లోపున తనని ఎవరు అపహరించినా మళ్ళీ విష్ణుమూర్తి ఏదో ఒక అవతారం ఎత్తేవరకూ ఎవరూ కాపాడేవారే లేరు. అప్పటిదాకా అవని తనని తానే కాపాడుకోవాలి ఈ కలియుగంలో..