Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

భోగమా? యోగమా?

[యన్.వి. శాంతి రెడ్డి గారు రచించిన ‘భోగమా? యోగమా?’ అనే వేదాంత కథని అందిస్తున్నాము.]

శ్రుతి: పాశ బద్ధ స్తధా జీవః! పాశ ముక్త స్సదా శివః!!

భావం: కర్మ పాశములో కట్టుబడి యుండునంత వరకు జీవుడిగా నున్నవాడే పాశం నుండి విడివడితే శివుడు అగుచున్నాడు!!

***

కాకినాడలో భాగ్యవంతుల పేర్లు పది చెప్పమంటే అందులో శ్రీమాన్ కాటమరెడ్డి సత్యనారాయణ రావు గారి పేరుంటుంది! ఆయన ముద్దుల భార్య సుబ్బలక్ష్మి, తల్లిదండ్రులకు ఏకైక పుత్రిక కాబట్టి వారి అనంతరం ఆస్తి మొత్తం కలిసి రావడంతో సంపద రెట్టింపైంది! కరణం గారి జంక్షన్‌లో ఎకరం నేలలో కోట లాంటి భవంతి. కనీసం ఇరవై మంది సేవకులు పని చేస్తున్న ఆ భవంతిలో నివసించేది కేవలం ముగ్గురు. భార్యా, భర్త, వారి ఏకైక పుత్రిక అద్వైత!

అరిస్ట్రోక్రటిక్ ఫ్యామిలీ కావడాన ఆ భవంతిలో ఎవరి ఏర్పాట్లు వారికున్నాయి. ముగ్గురూ ఎప్పుడో గానీ కలుసుకోరు.

కాటమ రెడ్డి గారెప్పుడూ వ్యాపారం – సంపాదన లోనే గడుపుతారు. అవకాశం దొరికితే సాయత్రం టౌన్ హాల్‌కి వెళతారు. తన కిష్టమైన బ్లాక్ లేబుల్ విస్కీ కొన్ని పెగ్గులు తీసుకొని, కార్డ్స్ ఆడుకొని రాత్రి ఎప్పుడో ఇంటికి చేరుతారు. ఇక సుబ్బలక్ష్మి గారు మహిళా మండలిలో చాలా బిజీ కార్యకర్త. మంచి డోనరు కూడా! మార్కెట్ లోకి మంచి నగ వచ్చినా, మంచి డ్రెస్ వచ్చినా అది తమ ఇంటికి రావాల్సిందే! మిగిలింది మిస్ అద్వైత, జె.యన్.టి.యు.కె.లో యం.బి.ఎ. చేసింది. యూనివర్సిటీ టాపర్.

ఇప్పుడు పెళ్లి సంబంధాలు చూసే పనిలో ఆ దంపతులు బిజీగా ఉన్నారు. అద్వైతకు పెళ్ళి చేసి ఆ దంపతులకు మొత్తం వ్యాపారాలు, సంపద అప్పజెప్పేస్తే తాము ఇంకా ఎక్కువగా లైఫ్ ఎంజాయ్ చెయ్యవచ్చు అనే తలంపుతో వున్నారు.

పెళ్లి విషయం ప్రస్తావనకు తేవడానికి చాలా కాలం తర్వాత సుబ్బలక్ష్మి గారు కూతురు గదిలోకి వెళ్ళారు.

గదిని పరికించి చూసి నివ్వెరపోయారు. ఆమె కుడి కన్ను అదిరింది. అద్వైత యోగా మాట్ మీద పద్మాసనంలో కళ్ళు మూసుకొని ధ్యాన ముద్రలో కూర్చుని వుంది. పక్కనే ఉన్న బ్లూ టూత్ స్పీకర్ లోంచి శ్రీ శాంతి ఆశ్రమ ఉత్తర పీఠాధిపతి వినమ్రానంద సరస్వతీ మాతాజీ వారి గైడెడ్ మెడిటేషన్ శ్రావ్యంగా వినిపిస్తుంది. రూము లోని అల్మరాల నిండా ఆధ్యాత్మిక పుస్తకాలే! శ్రీ రామకృష్ణ పరమహంస, స్వామీ వివేకానంద, భగవాన్ రమణ మహర్షి, స్వామీ ఓంకార్, స్వామీ తత్త్వవిదానంద, స్వామీ దయానంద, నిసర్గ దత్త మారాజ్, స్వామీ చిన్మయానంద, స్వామి శివానంద వార్ల వేదాంత గ్రంథాలతో నిండిపోయి వున్నాయి. ఇన్ని పుస్తకాలు ఎలా సేకరించిందో అనుకుంది సుబ్బలక్ష్మి. తల్లి రాకను గమనించలేదు అద్వైత! గైడెడ్ మెడిటేషన్ తన్మయత్వంలో వుంది. కూతుర్ని డిస్ట్రబ్ చేయదలచలేదు. అక్కడి సోఫాలో కూర్చుని బ్లూ టూత్ స్పీకర్ లోంచి వస్తున్న వేదాంత వచనాలు వినసాగింది సుబ్బలక్ష్మి! స్వామిని వినమ్ర ఆనంద గొంతు శ్రావ్యంగా వినిపిస్తుంది!

“సంసార వృక్షం కాలం పుట్టినప్పుడు పుట్టింది. అది మహా అజ్ఞాన వృక్షం. జ్ఞానం అనే ఖడ్గంతో నరికెయ్యకపోతే వంద కోట్ల కల్పముల వరకూ అలాగే వుంటుంది. ఎన్నో ఏళ్ల నుండీ పెంచి పోషించిన సంసారం మనిషినీ మృత్యువు కౌగిట్లోకి తీసుకుంటున్నప్పుడు మాత్రమే విడిచి పెడుతుంది! దుఃఖం అస్తి అంటే ‘సంసారం’, అహం దుఃఖి అంటే ‘సంసారి’. ఎందుకంటే సంసార బంధంలో వున్నది కేవలం దుఃఖం మాత్రమే! సంసారులు ఒక దానిని పొందటానికి ఎంత కష్టపడతారో దాన్నే విడిచి పెట్టాలంటే అంత కన్నా అనేక రెట్లు కష్ట పడాలి. సాధకులారా! మీ దృష్టి సంసారం నుండి మీ స్వరూపం వైపు పెట్టండి! మీకు ఆత్మ దర్శనం అవుతుంది. మీ వద్ద సర్వ సంపదలూ వున్నా పూర్ణత్వం లేదు, అభయం లేదు. అదే సంసారం! ఈ సంసారం మిథ్య అని తెలుసుకున్న వారు జనన మరణాల నుండి, సుఖ దుఃఖాల నుండి, పుణ్య పాపముల నుండి ముక్తి పొందుతారు. సంసారం లేని స్థితి అంటే భయం లేని స్థితి! సంసారులు తాము ఎటువంటి సంసారులో తమ పిల్లలను కూడా అదే అనుభవంతో తీర్చిదిద్దుతారు! నీవు ఒక వస్తువును ఎంతగా అపేక్షిస్తావో అంతగా దాన్ని పోగొట్టుకుంటావు. నీ గురించీ నీ ఎదుట ఉన్న జగత్తు గురించీ నీకు వున్న తప్పుడు భావాలే నీ మానసిక బాధలకు కారణము!

‘దేహాభిమానే గలితే విజ్ఞాతే పరమాత్మని’! నేను శరీరాన్ని అనే అభిమానం జారిపోతే ఈ శరీరం క్షేత్రం, నేను అందులోవున్న క్షేత్రజ్ఞుడిని అనే భావం స్థిరపడి ‘అహం బ్రహ్మాస్మి’ మహా మంత్రం అనుభవం లోకి వస్తుంది! అలా ఆత్మలో రమించే కొలదీ నేను శరీరాన్ని అనే అపోహ తొలగి పోతుంది.”

సిగ్నల్స్ సరిగా లేని కారణాన స్వామిని వచనాలకి అంతరాయం రావడంతో అద్వైత మెల్లగా కన్నులు తెరచి, ఎదురుగా కూర్చున్న తల్లిని చూసి నివ్వెర పోయింది. ఎంతో అర్జెంట్ పని వుంటేనే ఇలా తన రూము లోకి వస్తుంది. సంవత్సరంలో ఒక సారైనా ఇలా జరగడం అరుదు!!!

“ అమ్మా! నువ్వు.. ఇక్కడ..?” సందేహంగా అంది అద్వైత.

“నీతో మాట్లాడే పనుండి వచ్చాను. నీవు మెడిటేషన్‌లో వున్నావని డిస్ట్రబ్ చేయలేదు.” అన్నారు సుబ్బలక్ష్మి.

“చెప్పమ్మా!” అంది అద్వైత

“నేనూ, నాన్నగారు నీ ఎం.బి.ఎ అయిన దగ్గర నుంచి మంచి వరుడి కోసం వెదుకుతున్నాము. ఇప్పటికి మా అంచనాలకు, మన అంతస్తుకు సరితూగే సంబంధం వచ్చింది. ఒక్కడే కొడుకు, మన ఆస్తిని మించిన ఆస్తి. మనది, వాళ్ళదీ కలిస్తే ఈ కాకినాడ లోనే కాదు ఈ జిల్లా లోనే మనతో సరితూగే వాళ్ళు మరొకరు వుండరు! నీకు చెప్పి పెళ్లిచూపులు ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నాము.” చెప్పారు సుబ్బలక్ష్మి.

“క్షమించు అమ్మా! నేను వివాహం చేసుకోను. మీ ప్రయత్నాలు విరమించుకోండి! నన్ను నేను తెలుసుకొనే వైపు నా ప్రయాణం సాగుతుంది.” తన మార్గాన్ని స్పష్టం చేసింది అద్వైత.

గాలి తీసేసిన బెలూన్ లాగా అయింది సుబ్బలక్ష్మి మొహం. “అంటే.. ఈ సంపదలూ, భోగ భాగ్యాలు.. ఎవరి కోసం? నీ కేమన్నా పిచ్చి పట్టిందా?” కోపంతో వూగి పోయింది సుబ్బలక్ష్మి.

“దీన్ని మీరు పిచ్చి అనుకుంటే నేనేమీ చెప్పలేను. నన్ను నేను తెలుసుకోవడానికే ఈ మనుష్య జన్మ వచ్చిందని నేను నమ్ముతున్నాను.” దృఢంగా అంది అద్వైత.

“ఈ భోగ భాగ్యాలన్నీ విడిచి పెట్టి సన్యాసం స్వీకరిస్తావా? పెద్ద యోగినిలా మాట్లాడుతున్నావ్?” అంది నిష్ఠూరంగా.

“అమ్మా! యోగులు కాలేక సంసార చక్రంలో భోగులై చివరకు రోగులై ఒక మరణం నుండి మరో మరణానికి పయనిస్తున్నారు జనులు! ఈ జనన మరణ చక్రం నుండి విడివడటానికే నా సాధన! నేను సన్యాస ఆశ్రమ దీక్ష స్వీకరిస్తాను. అన్నీ విడిచి పెట్టేసాను, ఒకటి తప్ప. అదే.. మానవత్వం!!!” చెప్పింది చాలా స్థిరంగా.

చాలా చిరాగ్గా నుదురు పెద్దగా కొట్టుకుంటూ విసవిసా బయటకు వెళ్లిపోయింది సుబ్బలక్ష్మి!!!

స్వస్తి.

Exit mobile version