Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

భిన్న స్వరాలు

[డా. శ్రీదేవీ శ్రీకాంత్ గారు రచించిన ‘భిన్న స్వరాలు’ అనే కథని అందిస్తున్నాము.]

హైదరాబాద్, 2025.

మహానగరంలో ఎన్నో సదుపాయాలున్న సృష్టి ఆసుపత్రి. ప్రాంగణమంతా జనసంద్రంతో నిండి ఉంది. మధుమాలిని, ఆసుపత్రి ముందు కారు దిగింది. విలేకరులు, కెమెరాలు, ఛానెల్ వాహనాలు గుమిగూడి ఉన్నాయి. మధుమాలిని, పేరుగాంచిన సినీనటి. తన కారు దిగి ఆసుపత్రి వైపు నడిచింది. ఆమె ముఖంలో ఆందోళన, గత జ్ఞాపకాల బాధ కనిపించసాగాయి. ఆమె కొడుకు దుష్యంత్ ఎదురువచ్చి శకుంతలకు పుట్టిన బిడ్డ విషయం చెప్పాడు. ఆ మాటలు మధుమాలిని మనసును కలచివేశాయి. మహానటి మధుమాలిని కుటుంబంలో వింత అంటూ అన్ని ఛానెల్స్‌లో వార్తలు రాసాగాయి. మధుమాలిని కాళ్ళ కింద భూమి కంపించినట్లయ్యింది. గతించిన జ్ఞాపకాల వేదనల కడలి అలలు ఉవ్వెత్తున లేచి తనను ముంచుతున్నట్లు అనిపించసాగింది. నిదానంగా కళ్ళు మూసుకుంది. ఇరవై ఐదు సంవత్సరాల వెనక్కి, తూర్పు గోదావరి జిల్లాలోని సీతాపల్లిలోకి జారుకుంది.

***

సీతాపల్లి, పచ్చని అడవులతో చుట్టుముట్టబడిన చిన్నగ్రామం. గుణవతి తన భర్త చెల్లెలు మంగమ్మ ఇంట్లో పనిమనిషి. ఆస్తి కోసం తన అన్న మల్లయ్యను మంగమ్మ చంపించిందనే విషయం తెలిసినా ఊర్లో ఎవరూ మంగమ్మ నోటికి జడిసి బయటికి మాట్లాడరు. భర్త మరణంతో వితంతువయిన గుణవతి కూతురు కావేరితో చిన్న పూరింట్లో నివసించసాగింది.

“అమ్మకు రెండు రోజుల నుండి ఛాతీనొప్పి. అమ్మను ఆసుపత్రికి తీసుకు వెళదాము” అంటూ రొప్పుతూ వచ్చిన కావేరిని చూసి,

“మీ అమ్మ ఏదో కుంటిసాకు చెప్పి పని తప్పించుకోవాలని చూస్తుంది. ఆసుపత్రీ లేదు ఏమీ లేదు. నువ్వెళ్ళి మీ అమ్మని రమ్మని చెప్పు. ఇంట్లో ఎక్కడ పనక్కడ ఉండిపోయింది” అంది విసురుగా.

“అత్తయ్యా! అమ్మ పనిచేసే స్థితిలో లేదు. నీకు పుణ్యముంటుంది ఆసుపత్రికి తీసుకుని వెళదాము. సాయం చెయ్యి” దీనంగా బ్రతిమలింది కావేరి.

“చిన్న నొప్పికే పట్నం ఆసుపత్రికి తీసుకుని వెళ్ళడానికి నాకేమీ పని లేదా!? మీ మామయ్య అసలు ఇంటిపట్టునే ఉండడు. మా అన్నయ్య నువ్వు పుట్టినప్పుడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళాడు. అప్పటి నుండి నిన్ను, మీ అమ్మను సాకుతున్నాను. విశ్వాసం లేదు” అంది ఈసడింపుగా మంగమ్మ.

“అత్తయ్యా! అమ్మేగా ఇంటెడు చాకిరీ చేసేదీ? నొప్పి తగ్గిపోతే పనిలోకి వస్తుందిలే!”

“నాకు ఎదురు చెప్పకు. నచ్చదు. పోయి మీ అమ్మను రమ్మని చెప్పు” అంది విసురుగా.

కావేరి కళ్లనిండా నీళ్ళునిండాయి. ఇక బ్రతిమాలి లాభం లేదని గుడిసె వైపు పరుగుతీసింది. చుట్టు పక్కల వాళ్ళు గుణవతి చుట్టుముట్టి ఉన్నారు. గుణవతి నొప్పితో విలవిల లాడిపోసాగింది.

కావేరి తల్లి తలను తన ఒడిలో పెట్టుకుని దీనంగా చూడసాగింది. పక్కింటి ఎల్లయ్య ఎద్దులబండి కట్టి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళదామన్నాడు. గుణవతి, కూతురు కళ్లలోకి చూస్తూ.. “ఇక నేను బ్రతకను.. నేను పోయాక నీ చదువు మానిపించి నీతో వెట్టి చాకిరీ చేయిస్తుంది మీ మేనత్త. మీ అత్తయ్య ఇంట్లో బయటివాళ్లకు తెలియదనుకుంటున్న రహస్యమొకటుంది. మీ అత్తయ్య నిన్ను..” అని ఏదో చెప్పబోతూ రొప్పుతూ కన్నుమూసింది గుణవతి. “అమ్మ నాకేదో చెప్పాలనుకుని చెప్పకుండానే వెళ్ళిపోయింది. సూరమ్మ పిన్నీ! అమ్మ లేనినాకు దిక్కెవరు” అంటూ బోరున ఏడ్వసాగింది కావేరి. మంగమ్మ “నడుము పట్టేసింది” అంటూ కనీసం వదిన అనే కనికరం కూడా లేకుండా గుణవతి శవాన్ని చూడడానికి కూడా రాలేదు.

***

తల్లి మరణం తరువాత కావేరి మేనత్త మంగమ్మ ఇంట్లో పనిమనిషిలా మారింది. ఒకసారి భోజనం తీసుకుని ఆ ఇంట్లో మూల గదిలోకి అడుగుపెట్టిన కావేరి ఒక్కసారిగా స్తబ్ధురాలైంది. ఊహకు కూడా ఎప్పుడూ చూడని దృశ్యం. పులిలా తినేసేవాడిలా చూడసాగింది కుడి తల. రెప్పవేయకుండా చూడసాగింది ఎడమ తల. కుడి తల కళ్లల్లో రౌద్రం కనిపిస్తే, ఎడమ తల కళ్లల్లో ఆప్యాయత కనిపించింది. ఒకే మొండెం. పొడవాటి రెండు మెడలకు రెండు తలలు.

‘బ్రహ్మ దేవునికి నాలుగు తలలు. ఆ నాలుగు తలలు ఎలా పనిచేస్తాయో? ఎవరికీ పెద్దగా ఆలోచన వచ్చినట్లు వినలేదు. ఒక మనిషి శరీరం పై రెండు తలలా!? అమ్మ నాకు ఎందుకు చెప్పలేదు!? అత్తయ్య ఎందుకు రహస్యంగా వీళ్ళని ఈ గదిలో పెట్టి బాహ్య ప్రపంచానికి తెలియకుండా పెంచుతుంది!?’ ఎన్నో ఆలోచనలు కావేరి మనసులో ముసురుకున్నాయి.

అందమైన కన్నెను మొదటిసారిగా చూస్తున్న కుడి తల.. కలువ రేకులా విచ్చుకున్న కావేరీ కళ్లలోకి తినేసేలా చూస్తూ “కాళిదాసు ప్రబంధ నాయికలా ఉన్నావు” అన్నాడు.

కావేరి మాట్లాడలేదు. కుడితల అతను “నా పేరు చంద్ర” అన్నాడు.

కావేరిలో తెలియని భయం ఆవహించింది. ‘ఇది నిజమా! మనుషులు ఇలా కూడా ఉంటారా!?’ అనుకోసాగింది.

“నా పేరు శరత్” అన్నాడు ఎడమవైపు అతను.

ఇద్దరినీ మార్చి మార్చి చూసింది..

‘ఇద్దరిలో ఎడమవైపు శరత్ చాలా అందంగా ఉన్నాడు. బహుశా ఆరు అడుగుల పొడవు ఉంటారు’ అనుకుంది.

రాస్తున్న పుస్తకాన్ని పక్కన పెట్టి, శరత్ కావేరి కళ్ళల్లోకి చూస్తూ – “రెండు తలలతో ఒకే శరీరంతో ఉన్న మమ్మల్ని శాస్త్రీయంగా డైసెఫాలిక్ కంజాయిండ్ ట్విన్స్ అంటారు. నాకు లెక్కలు, సైన్స్ చాలా ఇష్టమైతే, చంద్రకు ఆంగ్లం ఇష్టం. మా ఇద్దరివి వేరే వేరే వ్యక్తిత్వాలు. రెండు మెడలు, రెండు గుండెలు, రెండు మెదడులు, కాస్త పెద్ద పొట్ట, కొంత కలసిన స్పయినల్ కార్డ్స్‌తో పాటు మిగతా అవయవాలు మాత్రం అందరిలా ఉంటాయి. నాకు సాత్విక ఆహారం ఇష్టం. చంద్రకి మాంసాహారం ఇష్టం. కొన్ని పనులు ఇద్దరం సమన్వయంతో చేస్తాము. బహుశా నువ్వు మాలాంటి వ్యక్తిని చూసి ఉండవు” అన్నాడు శరత్. అంతా వింటున్న కావేరి ఆశ్చర్యపోయింది.

“నాలుగు తలలున్న బ్రహ్మ దేవుడి బొమ్మ చూడడం తప్ప నేను ఎప్పుడూ ఇలా చూడలేదు. మొదటి సారి మిమ్మల్ని చూశాను” అంది కావేరి.

“బ్రహ్మదేవుడు నాలుగు తలలు నాలుగు వేదాలకు చిహ్నమని, నాలుగు దిక్కులకు చిహ్నమని రకరకాల కథలున్నాయి” అన్నాడు శరత్.

“దేవుళ్ళకు ఎక్కువ చేతులు, తలలు ఉన్నా మనకేమీ అనిపించదు, కానీ మనుషులకు” అంటూ ఆపేసింది.

“మాది అసాధారణ జన్మ. మా అమ్మ మమ్మల్ని ఈ గదిలో పెట్టి చదువు చెప్పిస్తుంది. సరేగాని నువ్వేమి చదువుకున్నావు” అన్నాడు శరత్

“నేను పది వరకు చదువుకున్నాను” అంది కావేరి

చంద్ర కళ్ళు మూసుకుని హెడ్ఫోన్ పెట్టుకుని మ్యూజిక్ వినసాగాడు.

***

మంగమ్మ భర్త గోపాలరావు పట్నం నుండి వచ్చాడు. కనురెప్ప వేయకుండా కావేరి వైపు చూడసాగాడు.

అది గ్రహించిన మంగమ్మ “ఆ పిల్ల నా మేనకోడలు. మీకు చెప్పడం మరిచిపోయాను. మా వదిన చనిపోయింది” అంది.

“మీ మేనకోడలు భలే ఏపుగా ఎదిగింది. చిన్నప్పుడు ఎప్పుడో చూసాను” అన్నాడు.

“మీ చూపులు ఏదోగా ఉన్నాయి. పట్నంలో ఏ తిరుగుళ్ళు తిరిగినా ఇక్కడ కాస్త బుద్దిగా ఉండండి. ఏమున్నా ఊరంతా పొక్కుతుంది” అంది.

“మాష్టారు పిల్లలకి చదువు చెప్పడానికి వస్తున్నాడా!?” అన్నాడు మాట మార్చుతూ.

“వస్తున్నాడు.”

“ఎంత కాలం పిల్లల్ని బంధించి బయటి ప్రపంచానికి తెలియకుండా పెంచుతావు?”

“జీవితాంతం.”

“ఇలాంటి పిల్లలు ఇతర దేశాలలో కూడా ఉన్నారంట. వాళ్ళని స్వేచ్ఛగా పెరగనివ్వాలి. ఇప్పటికన్నా మించిపోయింది లేదు. నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటా” అన్నాడు.

“ఇంత వయసొచ్చి, మీకిప్పుడిదేమి బుద్ధీ” అంది.

“వయసుదేముంది మంగా! నీకు మళ్ళీ రెండు తలల పిల్లలు పుడతారేమో! అని పిల్లలొద్దు అనుకున్నావు. సక్రమంగా పుట్టే పిల్లలు కావాలి అని నాకుండదా! నువ్వు గుట్టుగా నేను చెప్పినట్టు విను. ఈ కావేరిని నేను..”

మాట పూర్తికానీయకుండానే.. “మతుండే మాట్లాడుతున్నారా!? కావేరి మనకు కాబోయే కోడలు” అంది పెద్ద గొంతుతో.

“ఇంత అందమైన పిల్ల ఈ రెండు తలల పిల్లలతో ఏమి సుఖపడుతుంది? నా మాటకు ఎదురు చెప్పకు. నేను పట్నం వెళుతున్నాను. వచ్చాక పెళ్లి చేసుకుంటాను” అన్నాడు.

***

శరత్, చంద్రలకు పాఠాలు చెప్పడానికి వచ్చిన శశిధర్‌కి ఫలహారం పెట్టి, కాఫీ ఇచ్చింది కావేరి. “నాకు చదువుకోవాలని ఉండేది మాష్టారు. అమ్మ చనిపోవడంతో నేను ఈ ఇంట్లో బంధీనయ్యాను. ఈ పంజరంలో నుండి బయటికి పారిపోవాలనిపిస్తుంది” అంది.

శశిధర్ కావేరిని చూసి జాలి పడ్డాడు. చాలా వరకు కావేరీ, శశిధర్ లు కన్నులతో సంభాషించుకోసాగారు శరత్ చంద్రల కంటికి కనిపించకుండా.

***

“తల్లిపోయిన సంవత్సరంలో పెళ్లి చేస్తే మంచిది. వింటున్నావా!?” అంది మంగమ్మ కావేరి వైపు తిరిగి.

‘అమ్మను కాపాడలేని అత్తయ్య. మనసులేని మనిషి. నేను ఈ ఇంటి నుండి ఎంత త్వరగా వీలైతే అంతా త్వరగా వెళ్ళిపోవాలి.’

“నీతోనే మాట్లాడుతున్నాను. నువ్వు ఎక్కడో ఆలోచిస్తున్నావు. నిన్నే, మాట్లాడవే” అంది కాస్త కటువుగా.

“నాకు ఈ పెళ్లి ఇష్టం లేదత్తయ్యా!”

“నీ ఇష్టాయిష్టాలతో నాకు పనిలేదు. నువ్వు పుట్టినప్పటినుండి నిన్ను పోషించాను. నీ మీద సకల హక్కులూ నాకున్నాయి” అంది.

పట్నం నుండి భర్త వచ్చేలోగా కావేరికి శరత్ చంద్రలతో మంగమ్మ బలవంతంగా పెళ్లి చేసింది. మంగమ్మ, వేరే ఊరు నుండి వచ్చిన పంతులు గారు, ఇంట్లో నమ్మకంగా ఉంటూ పనిచేస్తున్న రామయ్య పెళ్ళికి ఆహుతులు.

కావేరికి మొదటి రాత్రి బెదిరిపోయింది. చంద్ర బలవంతంగా తన వాంఛ తీర్చుకున్నాడు. శరత్ కావేరిని ముద్దు పెట్టుకుంటుంటే శరత్ చెంపపై కొట్టాడు చంద్ర. ఇద్దరూ పోట్లాడుకోసాగారు. “కావేరీ! నువ్వు నేను చెప్పినట్లే వినాలి” చంద్ర స్వరం కటువుగా పలికింది.

***

రోజులు గడుస్తున్నాయి. కావేరి జీవితం చాలా నరకంగా మారింది.

పగలంతా పనులతో అలసిపోయిన కావేరి రాత్రి చంద్ర చేసే ఆగడాలు భరించలేకపోయేది. ‘మాష్టారు నాకు మాట ఇచ్చారు. మరుసటి రోజునుండే రావడం మానేశారు. నా తలరాత ఇలా ఉంది. ఇలాంటి జీవితం కంటే చచ్చిపోవడం మేలు. చంద్ర కామాగ్నికి నేను బలైపోతున్నాను. తరచూ చంద్రా శరత్‌లు కలహించుకోసాగారు’ ఆలోచిస్తున్న కావేరిని శరత్ ఆప్యాయంగా దగ్గరగా తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. శరత్ తనని చుట్టుకునే సరికి చంద్ర విసురుగా శరత్ జుట్టు పట్టుకున్నాడు. ‘దేవుడా ఇద్దరి మధ్య నన్ను కాల్చుతున్నావు? ఏమిటీ నా జన్మ?’ అని మూగగా రోధించసాగింది కావేరి.

ఎంతో అందంగా ఉండే కావేరి ముఖం వాడిపోయింది. మనిషి చిక్కి శల్యమయ్యింది.

కర్ర సాయంతో నడుస్తూ వచ్చిన శశిధర్.. కావేరిని చూసి వేదనాభరితుడయ్యాడు.

తనకు ఆక్సిడెంట్ జరిగిన విషయం చెప్పాడు. కావేరి పెళ్ళి విషయం తెలుసుకుని చాలా బాధపడ్డాడు. “మాష్టారూ! ఈ పంజరంలో పక్షిలా విలవిలలాడుతున్నాను. నన్ను దూరంగా తీసుకుని వెళ్ళండి. ఎక్కడైనా పనిచేసుకుని బ్రతుకుతాను” అని ప్రాధేయపడింది.

“నీ రెక్కల శబ్ధం ఆకాశానికి వినిపించేంత ఆనందం నువ్వు పొందేట్లు చేస్తాను, దిగులుపడకు” అన్నాడు.

***

శరత్ చంద్రల పెళ్లి గురించి తెలుసుకున్నగోపాలరావుకి, మంగమ్మ మధ్య గొడవ జరిగింది.

“ఇక ఈ కొంపకే రాను” అంటూ విసురుగా వెళ్ళిపోయాడు. మంగమ్మ తాగి పడుకుంది.

శశిధర్ అనుకున్న పథకం ప్రకారం అందరూ గాఢ నిద్రలో ఉండగా కావేరిని ఆ ఇంటినుండి తీసుకుని వెళ్ళాడు.

“నన్ను ఆ బంధిఖానా నుండి విముక్తురాల్ని చేసి కొత్త జీవితం ఇచ్చారు” అంది.

“నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను కావేరీ!” అన్నాడు.

“నేను అమ్మను కాబోతున్నాను. మిమ్మల్ని పెళ్ళి చేసుకోలేను.”

“పుట్టబోయే బిడ్డకు తండ్రిని అవుతాను కావేరీ!” శశిధర్ ప్రేమగా కావేరి కళ్లల్లోకి చూశాడు.

“మా అమ్మ పెళ్లి చేసుకుని ఏ సుఖాన్ని పొందలేదు. ఆస్తి కోసం మా అత్తయ్య మా నాన్నను చంపించిందని విన్నాను. మా అమ్మ అనేది – స్త్రీకి ఒక్కసారి తాళి పడితే విలువని. నేను పెళ్ళైన ఆరునెలలూ ఎంతో నరకాన్ని చూశాను. ఒళ్ళంతా చంద్ర చేసిన గాయాలతో ఎంతో బాధను అనుభవించాను. నా మూలంగా శరత్, చంద్రల మధ్య నిత్యం గొడవలు. నిజానికి మిమ్మల్ని ఎంతగానో ఆరాధించాను. మీ యాక్సిడెండ్ రూపంలో విధి మనల్ని విడదీసింది. ఒకసారి పెళ్లై, ఆ వంశాంకురాన్ని మోస్తున్న నేను..” అంటున్న కావేరి కళ్లు వర్షించాయి.

“బాధపడకు కావేరీ!” అన్నాడు తల నిమురుతూ.

“నాకు ఆ ఇంటి నుండి ముక్తిని ప్రసాదింపచేశారు. నాకు ఆప్తులు మీరు. నన్ను అర్థం చేసుకోండీ!” ‘కావేరిని చూసిన మొదటి రోజే పెళ్లంటూ చేసుకుంటే తననే చేసుకోవాలి, లేకుంటే ఇలా ఉండిపోవాలి అనుకున్నాను. అనుకున్నవి జరగాలి అనిలేదు’ తీవ్రంగా మథనపడ్డాడు శశిధర్. కాలం కదలికలో ఆరు నెలలు గడిచాయి. కావేరికి మగపిల్లవాడు పుట్టాడు. దుష్యంత్ అని పేరు పెట్టారు.

***

“మాష్టారూ! కొత్త నటీనటులు కావాలనే ఈ ప్రకటన చూడండి.నాకు సినిమాల్లో నటించాలని ఉంది.”

“సినిమాల్లో నటించడం అంటే ఎన్నో కష్టాలుంటాయి కావేరీ!”

“నీతిని నమ్ముకున్న నాకు ధైర్యం ఎక్కువ” అంటూ సినిమాలో చేరింది కావేరి మధుమాలిని అనే పేరుతో.

మొదటి సినిమా హిట్టయ్యింది. మరో సినిమాలో ఛాన్స్ వచ్చింది. అలా ఎన్నో సినిమాలు చేసి మధుమాలిని మంచి పేరుతో పాటు కోట్లు సంపాదించింది.

***

‘ఇరవై ఐదు సంవత్సరాలు నా పాత గాయాన్ని మర్చిపోయి హాయిగా బ్రతుకుతున్నాను. ఇప్పుడు ఈ సంఘటన నన్ను చిత్రవధ చేస్తుంది..’ అంటూ దుష్యంత్ భార్య శకుంతలను చూడడానికి లేబర్ రూమ్‌కి వెళ్ళింది కావేరి.

‘ఒకే మొండెం, రెండు తలలు. అచ్చు శరత్ పోలికతో పుట్టారు’ ఆలోచిస్తున్న కావేరి వైపు తిరిగి..

“అమ్మా! రెండు తలల శిశువులు పుట్టడం ఆశ్చర్యంగా ఉంది కదూ” అన్నాడు దుష్యంత్.

“నీకు ఆశ్చర్యం, నాకు గతం. నా జీవితం గురించి నీకు చెప్పలేదు” అంటూ పూర్తిగా చెప్పింది.

“అమ్మా! నీ జీవితం.., వెనుక ఇంతటి విషాదం ఉందా! నన్ను ఏ బాధా తెలియకుండా ఎంతో ఉన్నతునిగా తీర్చిదిద్దావు. నీ ప్రేమను త్యాగం చేశావు. నిజంగా శశిధర్ అంకుల్ ఎంత మంచివారు? నిన్ను రక్షించారు. పరిస్థితులకు కుంగిపోకుండా నీ టాలెంట్‌తో ఎంతో గొప్పదానివయ్యావు. గాయాల మట్టి లోంచి ఎదిగిన గంధపు పువ్వుగా నిన్ను మలచిన శశిధర్ అంకుల్ ఎక్కడున్నారమ్మా!?”

“నాకు మంచి జీవితాన్నిచ్చిన మాష్టారు – నీకు రెండు సంవత్సరాల వయసప్పుడు అనారోగ్యంతో కాలం చేశారు.”

“చాలా బాధగా ఉందమ్మా. నిన్ను ఆ ఇంటి నుండి రక్షించిన మాష్టారు కారణజన్ములు.”

“నిజమే దుష్యంత్”

“మనం నా బిడ్డలను నానమ్మలా బంధించి పెంచవద్దమ్మా”

“అవును దుష్యంత్! మన పెంపకం బట్టి పిల్లలు ఉంటారు. అమెరికాలో అబ్బి, బ్రిటానీ ఇలాగే పుట్టారు. ఇద్దరూ ఒకే శరీరాన్ని పంచుకున్నా ప్రత్యేక వ్యక్తులుగా సెలబ్రిటీలు అయ్యారు. ఇలాంటి వాళ్ళు ప్రపంచంలో ఇంకా కొందరున్నారు. మనసులు రెండు వేరయినా మంచి సంకల్పం ఉంటే జీవితం అధ్భుతంగా మారుతుంది. దైవం కొన్ని జీవితాలను అసాధారణంగా సృష్టిస్తాడు – వారిని అర్థం చేసుకునే హృదయాల క్రమశిక్షణపై పిల్లల పెరుగుదల ఉంటుంది. ఈ పిల్లల శరీరాలు కలిసి ఉండవచ్చు, కానీ సమాజ దృష్టిలో ఉన్నతులుగా మెలగాలి. పిల్లలలో అసాధారణతను చూసి క్రుంగిపోకుండా, వారిపట్ల అత్యంత బాధ్యతగల తల్లిదండ్రులే నిజమైన దేవుళ్ళు. ఎందుకంటే, దేవుడు అధ్భుతాల్ని సృష్టిస్తాడు – కానీ ఆ అద్భుతాన్ని ప్రేమతో పోషించే హృదయం మాత్రం తల్లిదండ్రులలో ఉంటుంది. ప్రేమ అనే వేరు గుండెల్లో ఒక మంత్రంలా పాదుకోవడమే ఆపిల్లల ఎదుగుదలకు శక్తి అవుతుంది. ఎక్కువ తలలున్న దేవతలు మన పురాణాలలో బ్రహ్మ తరువాత దత్తాత్రేయుడు, షణ్ముఖుడు, పంచముఖ ఆంజనేయుడు, కొందరు శక్తి దేవతలు ఉన్నారు. ఈ అసాధారణ రూపం మంచి కారణానికి బీజం. దిగులుపడకుండా మన బిడ్డలు మంచికి మారుపేరుగా సమాజ కళ్యాణానికి వారసులయ్యే ఉత్తమ నడవడికతో పెంచుదాము” అంది గట్టి మనో సంకల్పంతో కావేరి.

Exit mobile version