[శ్రీ ఎం.వి.ఎస్. రంగనాధం గారి ‘భవిష్యవాణి తెలుసుకోవడం మంచిదా?’ అనే రచనని అందిస్తున్నాము.]
భవిష్యవాణి సరిగ్గా చెప్పేవారు ఉన్నారు అని అనుకుంటే, మనకి భవిష్యత్తులో ఏం జరుగబోతోందో ముందే తెలుసుకోవడం మంచిదా? కాదా? తెలిస్తే, ఏం చేస్తాం? మంచి జరుగుతుందని తెలిస్తే ఇబ్బంది లేదు. మహా అయితే, తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి గొప్పలు చెప్పుకుంటాము. ఒకవేళ ఏదన్నా చెడు జరుగుతుందని తెలిస్తే ఏమిటి గత్యంతరం? ఏమయినా జాగ్రత్తలు తీసుకుని ఆ చెడుని నివారించడం కుదురుతుందా? మహా భారతంలో ధర్మారాజుకి ఎదురైన ప్రశ్నలు చెడుకి సంబంధించినవే.
మహాభారతం లోని సభాపర్వంలో రాజసూయ యజ్ఞం సందర్భంగా శ్రీకృష్ణునికి ధర్మరాజు అగ్ర పూజ చెయ్యడం, దాన్ని శిశుపాలుడు వ్యతిరేకిస్తూ సభలో రాజు లందరి ముందు శ్రీకృష్ణుని నిందించడం, అతడు శిశుపాలుని శిరస్సు ఖండించడం జరిగాయి. యజ్ఞం సమాప్తి అయ్యింది కదా అని వ్యాస మహర్షి ధర్మరాజుకి వీడ్కోలు చెప్పడానికి వస్తాడు. అప్పుడు, ధర్మరాజు వ్యాసుణ్ణి ఒక సందేహం తీర్చమని అడుగుతాడు.
నేను రాజసూయ యాగం చెయ్యాలని, అలా చేస్తే నా పూర్వీకులు ఇంద్రసభకు వెళ్తారని, నా తండ్రి పాండురాజు యమసభలో కలిసినపుడు తనకు చెప్పాడనీ, ఆ యాగం చేయడం వలన ఈ భూమి మీద సర్వ వినాశకరమైన యుద్ధానికి దారితీసే సంఘటన జరిగే అవకాశం కూడా ఉంది, కాబట్టి ఆలోచించుకుని నీకు ఏది మంచిది అనిపిస్తే అది చెయ్యి, అని నారదుడు నాకు చెప్పాడు అని ధర్మరాజు అన్నాడు. నారద మహర్షి ఆ సందర్భంలో నాకు మూడు రకాల ఉత్పాతముల (ఉపద్రవములు) గురించి చెప్పాడు, శిశుపాల వధ వల్ల ఆ మహోత్పాతాలు శాంతించాయా? అని ధర్మరాజు వ్యాస మహర్షిని సందేహం అడిగాడు. దానికి జవాబుగా వ్యాసుడు “శిశుపాల వధ ఉత్పాతమే, ఆ ఉత్పాత ఫలం 13 ఏళ్ళ వరకు ఉంటుంది, అది సమస్త క్షత్రియ నాశనానికి దారి తీస్తుంది, నీ కారణంగా రాజు లందరు పరస్పరం పోరాడి మరణిస్తారు, ఆ వినాశము దుర్యోధనుడి అపరాధాల వల్ల భీమార్జునుల వీరత్వము చేత కలుగుతుంది” అని ధర్మరాజుకి భవిష్య వాణి చెప్పాడు. అన్నిటికన్నా “నీ కారణంగా రాజు లందరు పరస్పరం పోరాడి మరణిస్తారు” అన్న మాట ధర్మరాజు మనస్సుని బాగా కలచి వేసింది.
అప్పుడు ధర్మరాజు, దైవ నిర్ణయాన్ని పురుష ప్రయత్నముతో తప్పించలేము, వ్యాసుడు చెప్పాడు అంటే అది తప్పకుండా జరిగి తీరుతుంది, అని చింతించి, తమ్ముళ్ళని పిలిచి వ్యాసుడు చెప్పిందంతా చెప్పి, నేను జీవించి ఉపయోగం లేదు, అంత మందిని పొట్టన పెట్టుకోవడం కన్నా నేను చావడమే మేలు, అని అంటాడు. అర్జునుడు అది విని ధర్మరాజుతో మోహంలో పడవద్దు, ఏది మంచో ఆలోచించి ఆ పని చెయ్యి అని ఓదారుస్తాడు.
అప్పుడు ధర్మరాజు చాలా ఆలోచించి ఈ విధంగా సభలో అందరి ముందు ప్రతిజ్ఞ చేస్తాడు: “సోదరుల చావుకి కారణం అవడానికి నేను పదమూడు ఏళ్ళు బ్రతకాలా? ఒక వేళ నేను జీవించి ఉండాల్సొస్తే, ఒక మాట మీద నిలబడతాను. అది ఇవాళ్టి నుండే పాటిస్తాను. నేను నా సోదరులతోను ఇతర రాజులతోను ఎప్పుడూ కటువుగా మాట్లాడను. బంధువులు అడిగిందల్లా ఇస్తాను. లోకంలో తగువులకి భేదభావమే కదా కారణం, అందుకని ఎవరితోనూ భేదభావం (difference of opinion) వైరం (enmity) లేకుండా చూసుకుంటాను. అందరికీ మేలు చేస్తూ నింద పడకుండా చూసుకుంటాను.”.
భవిష్యవాణి తెలుసుకున్న ధర్మరాజు మనఃస్థితి, అతడు ఎలాంటి విపత్తుకీ తాను కారణం కాకూడదని నిశ్చయించుకుని తనను తాను కట్టడి చేసుకోవడానికి చేసిన ప్రతిజ్ఞ, తరువాతి జీవితంలో అతణ్ణి అతి జాగ్రత్తపరుడుగా చేశాయేమో అని అనిపిస్తుంది. కొన్ని సంఘటనలు ఎలా ఉంటాయంటే, ధర్మరాజు లాంటి ధర్మాత్ముడు ఇలా ఎలా చేశాడు అని ముక్కున వేలేసుకునేటట్లుగా ఉంటాయి. అసలు ధర్మరాజేనా, అట్లా చేసింది, అయ్యిండదు, మళ్ళీ సరిగా చదవండి అని పాఠకులు ఒకరికొకరు వాదించుకోవడానికి ప్రోత్సహించేటట్లుగా ఉంటాయి కొన్ని ఘట్టాలు. భవిష్యవాణి తెలియకుండా ఉంటే అంత తర్కవిరుద్ధమయిన (illogical) పనులు చేసి ఉండేవాడా ధర్మరాజు అంటే అనుమానం వచ్చే విధంగా ఉంటుంది అతని ప్రవర్తన.
రాజసూయంలో ధర్మరాజు పక్షాన కానుకలు స్వీకరించడానికి నియమింపబడ్డ దుర్యోధనుడు, కానుకల రూపంలో వచ్చిన అపార సంపదని, యజ్ఞ సమయంలో రాజులందరూ ధర్మరాజుని అడుగులకి మడుగులొత్తుతూ సేవించడాన్ని, చూసి ఈర్ష్య చెంది, యజ్ఞం పూర్తయిన తరువాత మయసభలో భ్రమకి గురి అయ్యి, అక్కడ తనని చూసి భీమార్జున నకుల సహదేవులు పరిహసించారని కుపితుడై, కడు దుఃఖంలో ఉండడం చూసి శకుని కారణ మడుగుతాడు. “మామా! పాండవుల అభివృద్ధిని నేను చూడలేకుండా ఉన్నాను, నాకు చావే శరణ్యము” అని దుర్యోధనుడు వాపోతాడు. అది విని శకుని మొదట్లో న్యాయమే బోధిస్తాడు. “పాండవులు వాళ్ళు సంపాదించుకున్నదే అనుభవిస్తున్నారు, నువ్వు వాళ్ళ పైన పన్నిన కుట్రలన్నీ విఫలమయ్యాయి. నీ కేమి బలగం తక్కువా? నువ్వు కావాలనుకుంటే, మేమంతా తోడుంటాము, ఈ సమస్త భూమండలాన్ని నువ్వు జయించవచ్చు, వాళ్ళని చూసి ఈర్ష్య చెందకూడదు” అని శకుని అంటాడు. ఆ మాట దుర్యోధనుడు ఒప్పుకోకపోవడం వల్ల, వేరే ఉపాయంగా ద్యూతం ఆడి పాండవుల సంపద హరించవచ్చు, నాకు ఆ ప్రజ్ఞ ఉంది అని శకుని చెబుతాడు.
తరువాత, ఇద్దరూ కలిసి ధృతరాష్ట్రుణ్ణి ఒప్పిద్దామని వెళ్తారు. ధృతరాష్ట్రుడు కూడా పలు విధాల జూదం అనర్థదాయకం అని దుర్యోధనుడికి బోధిస్తాడు. కానీ, దుర్యోధనుడు, ధర్మరాజు వైభవాన్ని, తాను మయ సభలో భ్రమ పడడం చూసి భీముడు కృష్ణార్జునులు స్త్రీలతో పాటు ద్రౌపది నవ్వి చేసిన అవమానాన్ని, గురించి చెబుతాడు. మయ సభ నుండి బయటకి వెళ్ళడానికి ద్వారం ఎక్కడ ఉన్నదో తాను తెలుసుకోలేక పోయాననీ, నకుల సహదేవులు తనకు ద్వారం చూపించగా, భీముడు “ధృతరాష్ట్ర పుత్రా” అని తనని సంబోధించి (అంటే, గుడ్డివాడి కొడుకా అన్నట్లు) తాను కూడా ద్వారం చూపించాడని చెబుతాడు. మొత్తానికి రెండబద్ధాలు, ఒకటి ద్రౌపది అక్కడ లేకపోయినా ఉందనీ తనని చూసి నవ్విందనీ, రెండవది భీముడు “గుడ్డివాడి కొడకా” అని తిట్టినట్లు, చెప్పి, ధృతరాష్ట్రుణ్ణి రెచ్చగొట్టి ఒక ద్యూత సభ నిర్మాణం జరగాలని, ఆ సభ చూడడానికి, అక్కడ మిత్రద్యూతం (friendly match లాంటిది) ఆడడానికి ధర్మరాజుకి విదురుడి ద్వారా ఆహ్వానం పంపాలని ఒప్పిస్తారు.
ధృతరాష్ట్రుడి ఆజ్ఞ ప్రకారం, విదురుడు ధర్మరాజు దగ్గరకు వెళ్ళి, ద్యూతానికి ఆహ్వానం పలికి కౌరవులు చేయదలుచుకున్న కుట్ర గురించి కూడా చెప్పి, నీ ఇష్టం అంటాడు. “నాకు జూదమాడే కోరిక లేదు, నన్ను ధృతరాష్ట్రుడు పిలువకుంటే నేను శకునితో ఎప్పటికీ జూదమాడను, కాని, పిలిస్తే వెనుదీయను, అది నా నియమము” అని తాను చేసిన ప్రతిజ్ఞకి అనుగుణంగా సమాధానం చెబుతాడు ధర్మరాజు. హస్తినాపురం వెళ్ళి, ద్యూతంలో శకుని, దుర్యోధనుడు ఎలా చెబితే అలా నడుచుకున్నాడు, అదే ప్రతిజ్ఞ ననుసరించి. ద్యూతసభలో పాండవులకి, ద్రౌపదికి జరిగిన పరాభవం అందరికీ తెలుసు. వాళ్ళ రాజ్యం, సంపదలు ధృతరాష్ట్రుడు వెనక్కి ఇచ్చిన తరువాత పాండవులు ఇంద్రప్రస్థానికి బయలుదేరుతారు. వాళ్ళు సాంతం చేరకుండానే దారిలోనే, వెనక్కి రావాలి, వచ్చి మళ్ళీ జూదం ఆడాలి, అన్న కబురొస్తుంది ధర్మరాజుకి, ధృతరాష్ట్రుణ్ణించి. మళ్ళీ ధర్మరాజు తన ప్రతిజ్ఞ ప్రకారం ఒప్పుకుని జూద మాడడం, ఓడిపోవడం, 12 ఏళ్ళు వనవాసం ఒక ఏడు అజ్ఞాతవాసం కోసం అడవులకి బయలుదేరడం జరిగాయి. అడవులకి వెళ్ళిన తరువాత కూడా ధర్మరాజుని వ్యాసుడు చెప్పిన మాటలు తరుముతూనే ఉన్నాయి.
వనవాసానికి వెళ్ళిన కొత్తల్లో కృష్ణుడు దృష్టద్యుమ్నుడు వచ్చి ఆవేశంగా కౌరవుల మీద యుద్ధం ప్రకటిద్దామన్నప్పుడు, పదమూడు మాసాల వనవాసం తరువాత భీముడు ఒక రోజు “ఇక చాలు అన్నయ్యా, మనం కౌరవుల మీద దాడి చేసి మన రాజ్యం మనం వెనక్కి లాక్కుందాం” అన్నప్పుడు, ధర్మరాజు, తన సభలో తాను చేసిన ప్రతిజ్ఞ, కురు సభలో తాను 12 ఏళ్ళ వనవాసం ఒక ఏడాది అజ్ఞాతవాసం చేస్తానని ఇచ్చిన మాట, గుర్తుకు రాగా, అలా చెయ్యడం కూడదని వాళ్ళని వారించాడు. తరువాతి వనవాస సమయంలో, తీర్థయాత్రలు చేస్తూ ప్రభాస తీర్థాన్ని పాండవులు సందర్శించినప్పుడు కూడా బలరామాదులు కౌరవులతో యుద్ధ ప్రస్తావన తెచ్చినప్పుడు మళ్ళీ ధర్మరాజు వాళ్ళని అదే కారణం చేత శాంత పరచాడు.
వనవాసము అజ్ఞాతవాసము ముగిసిన తరువాత జరిగిన రాయబార పరంపరలో సంజయ రాయబారము చాలా ముఖ్యమైనది. ఆ సందర్భంలో ఉభయ పక్షాల క్షేమ సమాచారం అరసిన తరువాత, ధర్మరాజు సంజయుడితో ఇలా అన్నాడు: “భీష్మ విదురాదులకు మమ్మల్నందరిని యుద్ధ ప్రసక్తి నుండి కాపాడమని చెప్పు. కౌరవుల మధ్యలో కోపంగా ఉన్న దుర్యోధనుణ్ణి అనునయిస్తూ “నువ్వు చేసిన తప్పులన్నీ క్షమించాము. నువ్వు మాకు కలిగించిన దుఃఖాన్ని మాలోనే అణచుకుని ఓర్పు వహించాము. శాంతిని కోరే మాకు రాజ్యంలో కొంత భాగమైనా ఇవ్వు. అవిస్థలము, వృకస్థలము, మాకంది, వారణావతము అన్న నాలుగు గ్రామాలు, ఐదవది నీ కిష్టమైనది, మా ఐదుగురు సోదరులకి ఇవ్వు, దీనితో మనకు యుద్ధం జరగదు.” అని చెప్పు. సంజయుడు వెళ్ళిన తరువాత ధర్మరాజు తన తమ్ముళ్ళతో కృష్ణుణ్ణి కౌరవ సభకు వెళ్ళి మనం భీష్మ ద్రోణ కృప బాహ్లికాది కురువీరులతో యుద్ధం చెయ్యాల్సిన అవసరం రాకుండా చూడమని అడుగుదాము అని అన్నాడు. అదే కృష్ణ రాయబారానికి దారితీసింది. కృష్ణుడికి తన ఆలోచనలు మళ్ళీ చెబుతూ, ధర్మరాజు, ఐదు గ్రామాలు కాని (అవిస్థలము, వృకస్థలము, మాకంది, వారణావతము, ఇంకోటి ఏదైనా) లేకపోతే ఒక పట్టణం కానీ ఇవ్వమని చెప్పు, అని అన్నాడు. తనకి ముందు ఉన్నది, తరువాత తనకి రాజసూయంలో లభించినది లేకపోయినా పరువాలేదనుకొని, ఇలా ధర్మరాజు ఎందుకు చేశాడంటే, యుద్ధానికి తాను కారణం కాకూడదని.
చివరకు యుద్ధం జరగనే జరిగింది. అవ్వాల్సిన నాశనం అయ్యింది. ధర్మరాజు మనస్సులో అంతులేని అశాంతి మొదలై వైరాగ్యం పుట్టించింది. రాజ్యం వద్దు, ముని వృత్తి చేపడతాను అని అతని చేత అనిపించింది. అందరూ సద్ది చెప్పగా తన ప్రయత్నం విరమించుకుని పట్టాభిషేకానికి తయారు అయ్యాడు ధర్మరాజు.
దీన్ని బట్టి తెలిసేదేమంటే, ఒక్కొక్కసారి భవిష్యవాణి గురించిన జ్ఞానం ఉంటే, అది మనస్సుకి ఒత్తిడిని కలుగజేసి మన చేత చెయ్యరాని పనులు చేయించవచ్చు. ఆ ఒత్తిడే, భవిష్యవాణిలో చెప్పిన పరిణామాలు మామూలుగా కన్నా ఇంకా త్వరగా ఒనగూడడానికి, ప్రేరకంగా కూడా పని చేయవచ్చు. జరిగేది జరుగుతుంది అని అనుకున్న వాళ్ళు, జరగబోయే దాని వెంటబడి అదేమిటో తెలుసుకుని దాన్ని నిరోధించడానికి వెర్రిమొర్రి ప్రయత్నాలు చేయరు. అదే మంచిదేమో.
ఎం.వి.ఎస్. రంగనాధం గారు సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్‌లో డైరక్టర్ జనరల్‌గా పదవీ విరమణ చేశారు.