[తెలుగు సాహిత్యం పట్ల కొన్ని తరాలలో ఆసక్తి రగిలించి, ఆధునిక తరానికి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్తూ, యువతకు ఉత్తమ సాహిత్యం ద్వారాఉత్తమ వ్యక్తిత్వాన్నివ్వాలని నిరంతరం తపించే యువభారతి సంస్థ స్థాపించి వచ్చే దసరాకు 60 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు సాహిత్యానికి, సమాజానికి యువభారతి చేసిన సేవను తెలుగు పాఠకులకు పరిచయం చేసే ఉద్దేశంతో ప్రతి ఆదివారం సంచికలో యువభారతి ప్రచురించిన పుస్తకాల పరిచయం వుంటుంది. ఈ శీర్షిక వచ్చే విజయదశమి వరకూ సాగుతుంది.]
భారతీయ పునరుజ్జీవనం
మానవుని చరిత్రలో, యూరపు పునరుజ్జీవనం ఒక మహోజ్జ్వల అధ్యాయం. పునరుజ్జీవనం (Renaissance) అనే మాట అక్కడే పుట్టి ప్రపంచమంతటా వాడుకలోకి వచ్చింది. ఆ ఒక్క మాటలో ఆధునిక మానవ నాగరికత అంతా ఇమిడి ఉంది. యూరపు పునరుజ్జీవన మంతటి ప్రతిభా సమన్వితమైనది కాకపోయినా భారతీయ పునరుజ్జీవనం అల్పమైనదేమీ కాదు. యూరపులో కొన్ని శతాబ్దాల కృషివల్ల సాధ్యమైన గొప్ప ఫలితాలు భారతదేశంలో ఒక్క శతాబ్దం లోనే సిద్ధింపజేసుకోబడినవి.
రాజా రామ్ మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, కందుకూరి వీరేశలింగం పంతులు మొదలైన వారు విద్యావ్యాప్తికి, సంఘ సంస్కరణకు కృషి చేయగా, దయానంద సరస్వతి, వివేకానందుడు, దాదాభాయి నౌరోజీ, బాలగంగాధర తిలక్, మహాత్మా గాంధీ – భారత జాతీయతకు ప్రాతినిధ్యం వహించి ప్రజలలో జాగృతిని, చైతన్యాన్ని కలిగించారు. ఈ మహనీయుల కృషి ఫలితంగా, సాంస్కృతిక రంగంలో నూతన చైతన్యం ఉద్భవించింది. స్వాతంత్ర్య సాధన కృషి సాగింది. ఈ నూతన చైతన్యాన్నే పునరుజ్జీవనంగా పేర్కొనవచ్చు.
విశిష్టమైన రెండు గొప్ప నాగరికతల సమ్మేళనం వలన ఈ పరివర్తనం సాధ్యమైంది. ఇట్టి అపూర్వ పరివర్తనం ఎలా సంభవించింది? దీని లక్షణాలేమిటి? దీని వలన కలిగిన సత్ఫలితాలేమిటి? మనం సాధించిన విశేషాలేమిటి? అన్న అంశాలను సమీక్షిస్తూ, దాస్య తమస్సుల్లో తాత్కాలికంగా మాటుబడిన భారతీయుడు తన ప్రతిభా లతకు మారాకు హత్తిన వైనాన్ని, శ్రీ డి రామలింగంగారు ఈ పుస్తకంలో రుచిరంగా వివరించారు. వీరు సుప్రసిద్ధ కథకులు, సమీక్షకులు, పాత్రికేయులు, ఆంధ్రాంగ్ల భాషా విశారదులు, చక్కని విమర్శకులు, వీటన్నిటితో పాటు సహృదయతా సంపత్తికి నిధులు.
క్రింద ఇవ్వబడిన link ను క్లిక్ చేసి ఈ పుస్తకాన్ని ఉచితంగానే చదువుకోండి.
లేదా క్రింద ఇవ్వబడిన QR code ను scan చేసినా ఆ పుస్తకాన్ని ఉచితంగా చదువుకోవచ్చు.
శ్రీ పత్రి అశ్వనీ కుమార్ గారి నివాసం నవీ ముంబై, మహారాష్ట్ర.
విద్యాభ్యాసం అంతా విజయవాడ లోనే జరిగింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి MBA పట్టా పుచ్చుకుని, ఉద్యోగార్ధం హైదరాబాద్ వచ్చిన తర్వాత యువభారతి సంస్థతో (1982) నలభై ఏళ్ళ అనుబంధం.
వృత్తిరీత్యా రిలయన్స్ ఇండస్ట్రీస్ లో Finance & Accounts లో Senior Management Team లో పనిచేసి 2016 లో పదవీ విరమణ చేసినా, ప్రవృత్తి మాత్రం – సంగీత సాహిత్యాలే. ప్రస్తుతం ఒక Youtube Channel కి Voice Over artiste గా, స్వరమాధురి సంగీత సంస్థకు అధ్యక్షునిగా వారి విశ్రాంత జీవితాన్ని బిజీ గా, ఆనందంగా గడుపుతున్నారు.