Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అరవై నవలల విశిష్ట పరిచయం – ‘భారతీయ నవలాదర్శనం’-2

[శ్రీమతి వాడ్రేవు వీరలక్ష్మీదేవి రచించిన ‘భారతీయ నవలాదర్శనం’ అనే పుస్తకాన్ని విశ్లేషిస్తున్నారు డా. కాళిదాసు పురుషోత్తం. ఇది 2వ భాగం.]

వీరలక్ష్మీదేవిగారు భగవతీ చరణ్ వర్మ హి౦దీ నవల ‘చిత్రలేఖ’తో ఆరంభించి, నాలుగు హిందీ నవలలను ఈ సంపుటంలో పరిచయం చేశారు. ‘చిత్రలేఖ’ తెలుగు అనువాదం 1960 లోనే వెలువడింది. మానవ జీవితాన్ని, మంచిచెడుల్ని పరిశీలించే తన దృష్టి కోణాన్ని, భగవతీ చరణ్ వర్మ తన ‘ఆత్మాలాపం’గా అభివర్ణించారు. ఈ నవలలో కథ పాత్రల ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుందని రచయిత్రి అంటారు. మౌర్య చంద్రగుప్త పాటలీపుత్రాన్ని పాలిస్తున్న కాలంలో చిత్రలేఖ అనే గొప్ప నర్తకి చివరకు బౌద్ధ సన్యాసిని కావడమే కథ. రెండు మూడు తరాలు ఈ నవలను తాదాత్మ్యంతో పఠించి ఉంటారు. హిందీ సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన ‘చిత్రలేఖ’ నవలను అద్భుతంగా పరిచయం చేశారు.

హిందీ సాహిత్యంలో యశ్‍పాల్ గొప్ప సాహిత్యకారులు, వారి నవలలు, కథలు, యాత్రాసాహిత్యం అన్ని భాషల్లోకి అనువాదమయ్యాయి. యశ్‌పాల్, హిందీ సాహిత్యంలో ప్రేమ్‌చంద్ తర్వాతి స్థానాన్ని పొందిన రచయిత అంటారు. అయన నవల ‘మనుష్య-కే-రూప్’ తెలుగు అనువాదం ‘మనిషి రూపాలు’. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నడచిన ఒక వితంతు యువతి కథే ఈ నవల ఇతివృత్తం. లారీ డ్రైవర్ ధన్‌సింగ్ ఈ నవలలో ప్రధాన పాత్ర. యశ్‍పాల్ విప్లవభావజాలంతో ప్రభావితులైన రచయిత. మనిషి పరిస్థితుల ప్రభావాలతో రకరకాలుగా మారవచ్చని, ప్రేమలు, మానవ సంబంధాలు పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయని ఈ నవలలో చెప్పడానికి ప్రయత్నించారు. నా తరం యువకులు యశ్‍పాల్ నవలలు, హిందీలోను, తెలుగు అనువాదాలలో చదవకుండా ఉండరు.

మహాత్మా గాంధీజీ ఆదర్శాలతో ప్రేరణ పొంది జాతీయోద్యమంలో పాల్గొన్న మరొక సుప్రసిద్ధ నవలా రచయిత విష్ణుప్రభాకర్, కవిత్వం మినహా అన్ని సాహిత్య ప్రక్రియలతోను కృషి చేసిన మహనీయులు.

“ఒకరి పాత్రను మరొకరు నింపండి, ఒక పాత్ర లోంచి మరొకరు తాగకండి” అన్న ఖలీల్ జిబ్రాన్ మాటల్ని పదేపదే ‘అర్ధనారీశ్వరుడు’ నవల స్మరణకు తెస్తుందని ఈ నవలా పరిచయం మొదలపెట్టారు వీరలక్ష్మీదేవి ‘భారతీయ నవలాదర్శనం’లో.

‘పాత కాలపువాడు, వృద్ధుడు’ అయిన విష్ణు ప్రభాకర్ అత్యాధునిక స్త్రీవాద భావజాలంతో ఈ నవల రాయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అత్యాచార బాధితురాలు ఆత్మకథనంతో నవల మొదలవుతుంది. సుమిత – కధానాయిక – వివాహితురాలు. తన భర్త చెల్లెల్ని పాడుచేయకుండా ఉండేందుకు తానే అత్యాచారానికి అంగీకరించి బలవుతుంది. ఆ తర్వాత ఆమె పడిన మానసిక సంఘర్షణని ఈ నవల వర్ణిస్తుంది. వేదన నుంచి బయటపడడానికి సుమిత రకరకాలుగా ప్రయతించి చివరకు స్త్రీల మీద జరిగే అత్యాచారాల మీద పత్రికలకు రాస్తుంది, అత్యాచార బాధిత మహిళలను కలిసి వారికి ధైర్యం చెప్తుంది.

‘బలాత్కారం’ కన్నా జీవితం చాలా విలువైనదని, బలాత్కరించబడిన స్త్రీలు తమ మానసిక సంఘర్షణ నుంచి, ప్రయత్నించి విముక్తి పొందడం నవలా రచయిత లక్ష్యం. సుమిత, రాజకలి, కిరణ్ వంటి పాత్రలు తమలాగా సంఘ దుష్టత్వానికి బలైన స్త్రీలను ఆదుకోవడం ద్వారా సంఘర్షణ నుంచి విముక్తి పొందుతారని రచయిత సూచించారు.

స్త్రీ హృదయాన్ని విశ్లేషించడంలో విష్ణు ప్రభాకర్ ఘటికుడు. నవల చదువుతూంటే మన గుడిపాటి వెంకట చలం, శరత్ బాబు గుర్తొస్తారని వీరలక్ష్మీదేవి అంటారు. గురజాడ లాగే విష్ణు ప్రభాకర్ సమకాలికుల కంటే కాంతి సంవత్సరాలు ముందున్నారని నాకనిపిస్తుంది.

‘దీవార్ పర్ ఏక్ ఖిడికీ రహతీ థీ’ నవలారచయిత వినోద్ కుమార్ శుక్లా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత. శుక్లా దాదాపు ‘మాజికల్ రియలిజం’ ధోరణిలో ‘ఛత్తీస్‌గఢ్’ జీవితం ఎలా వుంటుందో ‘ఖిలేగా తొ దేఖేంగే’ నవలలో చిత్రించారని రచయిత్రి అంటారు.

‘దీవార్ పర్ ఏక్ ఖిడికీ రహతీ థీ’ నవలను తెలుగులో ‘ఆ గోడకు ఒక కిటికీ ఉండేది!’ పేరుతో మలయశ్రీ అనువదించారు. దాంపత్య జీవన మాధుర్యాన్ని, భావావేశ బంధాలనూ, చిక్కనైన హాస్యమిళిత పాత్రల ద్వారా పారకులకు అందించారు ఈ నవలలో. ఇదొక వింత నవల. నవలంతా కేవలం దైనందిన జీవన వర్ణన, కాలేజీ అధ్యాపకుడు రఘువరప్రసాద్ తొలి యవ్వనం, ఉద్యోగం, కొత్తకాపురం అనుభవాలు, రఘు నిత్యం ఏనుగు వాహనం మీద కాలేజీకి వెళ్ళడం, చిన్నచిన్న మామూలు సంఘటనలే. స్థిమితంగా నిదానంగా సాగే జీవితానికి నవలలో ఏనుగు ప్రతీక కావచ్చని వీరలక్ష్మీదేవి వ్యాఖ్యానిస్తారు. నవల “రఘువర ప్రసాద్ ఇంటిముందున్న వేపచెట్టు తనను ఎవరూ వదలిపెట్టిపోలేదు అన్నట్టు నిలిచి ఉంది. విభాగాధ్యక్షుడు తన తొందరలో వెళ్ళిపోతూ ఆ వేపచెట్టును గమనించి ఉండకపోవచ్చు” అన్న వాక్యంతో ముగుస్తుంది. చాలా సెన్సిటివ్‍గా, తన చుట్టూ ఉన్న ప్రకృతిని గమనించి ఆనందించే మనసున్న వారు తప్పక చదవవలసిన నవల ‘దీవార్ పర్ ఏక్ ఖిడికీ రహతీ థీ’.

ఉపేంద్ర కిశోర్ దాస్ వంశపారంపర్యంగా ప్రభుత్వోద్యోగాలు చేస్తూ వచ్చిన ‘కులీన’ కుటుంబంలో పుట్టినా, చదువుకు తిలోదకాలిచ్చి జాతీయోద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని, కటక్‌లో స్థిరపడి కళాత్మక సృజనకే జీవితాన్ని అంకితం చేసిన రచయిత.

దాస్ నవల ‘మరహవా చాంద్’. తెలుగులో ‘రాలిపోయిన చందమామ’. 1922లో అచ్చయింది. దీని ఒరియా భాషలో సినిమాగా తీశారట! ఈ నవలలో సత్యభామ అనే పాత్ర స్వగతం ద్వారా కథ చెప్పిస్తారు దాస్ గారు. సత్యభామ తెలిసీ తెలియని వయస్సులో వివాహ బంధంలో ప్రవేశించిన తర్వాత, ఒక స్త్రీ జీవితం ఎలా ఎలా నడచి ఎక్కడకు చేరుతుందనేదే ఇందులో కథ. సత్యభామ చిన్ననాటి చెలికాడి పట్ల ఆకర్షణ, తండ్రి ధనాశతో ఆమెను ఒక విధురుడు, బిడ్డుల తండ్రి అయిన జమీందారుకిచ్చి కట్టబెడతాడు. సత్య చిన్ననాటి చెలికాడు నాథం చదువుకొని తిరిగి వస్తాడు, ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది.

సత్యభామను కాపురానికి పంపిస్తారు. వయసులో పెద్దవాడైన జమీందారును తప్పించుకుని తిరుగుతున్నా, అతని చిన్నారి కొడుకు పట్ల వాత్సల్యంతో, ఆమె ఆ బాలుడి అలనాపాలన బాధ్యత స్వీకరిస్తుంది. ఇంట్లో దాసీతో తన భర్తకు సంబంధం ఉందని ఆమె గ్రహిస్తుంది. కోడలు సత్య పట్ల, తన కుమారుడు (జమీందారు) ప్రవర్తన సహించలేక ఆమె అత్తగారు కాశీకి వెళ్ళిపోతుంది.

జమీందారు, అతని ఉంపుడుగత్తె, సత్యను ఒక జాతరకు వెంటపెట్టుకుని పోయి, అక్కడ ఆమెను వదిలించుకుంటారు. ఆ జాతర జనంలో దిక్కు లేకుండా తిరుగుతున్న సత్యభామకు చిన్ననాటి నేస్తం నాథం కనిపించి ఆమెను వెంటపెట్టుకొని ఆమె భర్త జమీందారు వద్దకు పోయి అప్పగించబోతే, ఆమె భర్త సత్యభామను దూషించి, అవమానించి తిరస్కరిస్తాడు. నాథం ఆమెను కటక్ తీసుకొని వచ్చి తన ఇంట్లో పెట్టుకుంటాడు. చివరకు నాథం ఆర్థిక ఇబ్బందుల్లో పడి ఇద్దరూ సొంత ఊరికి వెళ్తారు. కలరా వచ్చి సత్య తల్లిదండ్రులు చచ్చిపోయారు. నాథం తల్లి కాశీ వెళ్ళిపోయింది.

నాథం ఆమెను తనతో పాటు ఇంట్లో ఉంచుకుంటే, ఆ గ్రామస్థులు ఇద్దర్నీ వెలివేస్తారు. సత్య వెళ్ళిపోతే నాథం వెలిని తొలగిస్తామని గ్రామస్థులు అంటారు. సత్య నాథం క్షేమం కోరి నదిలో దూకి ప్రాణాలు విడుస్తుంది. ఈ కథంతా సత్య స్వగతంలోనే సాగుతుంది. హృదయాన్ని పిండివేసే కరుణామయ గాథ. సత్య జీవితంలో అన్నీ ఆమె ఇచ్ఛకు సంబంధం లేకుండానే జరుగుతాయి. ఆమె అటు సంసారంలోను, ఇటు సంఘంలోనూ నియమాలను దాటలేకపోయింది. కాలం మారినా, అత్యాధునిక యుగంలో ఉన్నా సమాజం మారకపోతే స్త్రీల జీవితాలలో మార్పు రాదని ఈ నవలలో రచయిత అంటారు.

ఈ నవలలో గ్రామీణ వాతావరణాన్ని సందర్భానుగుణంగా కవితాత్మకంగా చిత్రించారని రాస్తూ, “పెరటి లోని మామిడితోట అడ్డు చెప్తున్నా లెక్కచేయకుండా వెన్నెల సర్వత్రా వ్యాపించసాగింది”; “నది ఒడ్డున రెల్లు పూల ఉత్సవం ముగించుకొని శరత్తు వెళ్ళిపోయింది” వంటి వాక్యాలను ఉదహరించారు రచయిత్రి వీరలక్ష్మీదేవిగారు.

“సమాజంలో దుర్బలుల జీవితాలు అన్నిచోట్లా ఒకేలా ఉంటాయని ఈ ఒరియా నవల చదివినప్పుడు అనిపించి గుండె బరువవుతుంది” అని వ్యాఖ్యానించారు వీరలక్ష్మీదేవి. ఈ నవలా పరిచయం చదివిన తర్వాత నిజంగానే నా గుండె బరువెక్కింది.

పద్మభూషణ్ కాళిందీచరణ పాణిగ్రాహి స్వాతంత్ర్య సమర యోధులు, నాటకకర్త, చింతనాశీలురు, ఒరిస్సాలో అభ్యుదయ సాహిత్యానికి అంకురార్పణ చేశారు. వీరి ‘మటిర్ మనుష’ (మట్టిమనుషులు) నవలను మృణాల్ సేన్ సినిమాగా తీశారు.

మట్టిమనుషులు నవలలో ‘బరజు పధామ’ తన ఆదర్శాల కోసం సర్వస్వం త్యాగం చేస్తాడు. అతని కథే ఈ నవల. మట్టిని నమ్ముకొన్న అన్నదమ్ములు ఆస్తిని వదిలేసి తాము కలిసిపోవడంతో నవల ముగుస్తుంది. వదులుకోవడం అన్నది ఎక్కడ మొదలు పెట్టాలి – ఎక్కడిదాకా వెళ్ళాలి అన్న అంశం ఎంతో ఔన్నత్యంతో కేవలం 150 పేజీలలో రాసిన కథ ఇది. బతుకు భయం లేనివాడు మనుషుల్ని ప్రేమిస్తాడు, ప్రేమించడం కోసం మిగతావన్నీ అవలీలగా వదలుకోగలుగుతాడు. “పూరీ జిల్లా డెలాంగ గ్రామంలో ఒక కర్షక కుటుంబంలో జరిగిన కథే ఇది. రచయిత ఆ అన్నదమ్ములలో అన్న ద్వారా ఈ కథ విని, గాంధీ దర్శన ప్రభావంతో నవలగా రాసానని చెప్పారు. దీన్ని పురిపండా అప్పలస్వామి తెలుగు భాషలోకి 1958లోనే తెచ్చారు.” అని వీరలక్ష్మీదేవి గారు ఈ నవలను గురించి వివరణ ఇచ్చారు.

ఒరిస్సాలోని జగత్‍సింగ్‌పూర్ జిల్లాలో జన్మించిన ప్రతిభారాయ్ బోధనా రంగంలో పనిచేశారు, ఒరిస్సా పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు, ఇంకా అనేక పదవులు నిర్వహించారు. ఇరవైకి పైగా కథాసంకలనాలు, 18 నవలలు, యాత్రా చరిత్రలు రాశారు. ఆమె నవల ‘యాజ్ఞసేని’ అనేక పురస్కారాలు, బహుమతులు పొందింది.

మిడిమిడి జ్ఞానంతో మహాభారతంలోని ద్రౌపది పాత్రను కొందరు వికృతంగా చిత్రించారన్న బాధతో ప్రతిభారాయ్ స్వయంగా చదివి, మహాభారత కథ బోధపరచుకుని ద్రౌపది పాత్ర కేంద్రంగా ఈ నవల ‘యాజ్ఞసేని’ని రాశారని వీరలక్ష్మీదేవి గారంటారు.

“భాగవతంలో చెప్పిన నవవిధ భక్తి మార్గాల్లో సఖ్యం ఒకటి. సఖా-సఖి సంప్రదాయానికి ఈమె దానినే ఆధారంగా తీసుకుంది..” ద్రౌపది, శ్రీకృష్ణుడు పరమ మిత్రులుగా మారిపోయారని, అనుబంధపు మాధుర్యాన్నంతటినీ కలుషితం చెయ్యడానికి ఒక చపలవాక్యం రాసినా చాలు. అటువంటి ఒక్క మాట గానీ, ఒక్క భావంగానీ లేకుండా ఆద్యంతమూ మహోదాత్తంగా నిర్వహించగలగడమే ఈ నవల గొప్ప విశేషం అని వీరలక్ష్మీదేవి నవల మూల్యాన్ని, విలువను ప్రశంసించారు.

అర్జునుడు కావాలనే సమయభంగం చేసి, పన్నెండేళ్ళు తీర్థయాత్రలకు వెళ్ళినట్లు ప్రతిభారాయ్ తమ నవలలో చిత్రించారని, పన్నెండేళ్ళు అన్నది మహాభారతంలో లేదని, “ఎవరైతే తనను గెలుచుకున్నారో (అర్జునుడు) అతనితో ఆమెకు ఎప్పుడూ ఎడబాటే. ఇది ఆమె జీవితాంతం నడిచింది.” అని వీరలక్ష్మీదేవి గారు నవలా పరిచయంలో రాశారు. కర్ణుని పరాక్రమం పట్ల ద్రౌపదికి గౌరవం, కుతూహలం; ద్రౌపది సౌందర్యం పట్ల కర్ణునికి గొప్ప ప్రశంస ఉన్నాయేగాని, వారి మధ్య శారీరిక మోహావేశాలకు, ఆకర్షణకి నవలలో ప్రతిభారాయ్ తావివ్వలేదని వీరలక్ష్మీదేవి ప్రశంసిస్తారు. “ప్రతిభారాయ్ ‘యాజ్ఞసేని’లో రాసిన విశ్లేషణ చదివిన తర్వాత కూడా ఆమె (ద్రౌపది) కాముకత గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి హృదయమే లేదనాలి. బుద్ధి ఎలాగూ లేదు.”

వీరలక్ష్మీదేవి ఆక్రోశం, బాధ ద్రౌపది పాత్రను వక్రీకరించి, ఆ పాత్ర ఔన్నత్యాన్నంతా దిగదార్చి రచన చేసిన మేధావులను గురించేనేమో!

ప్రతిభారాయ్ నవల ప్రభావం ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ నవల ‘ద్రౌపది’ మీద ఉందనే వారికి వీరలక్ష్మీ దేవి సమాధానంగా “అవును, వుంది. కానీ ఈ యాజ్ఞసేని నవలలోని గొప్పదనం ఆయనకి తెలీదు. అందువల్ల సఖీసఖ అనుబంధాన్ని, తన నవలలో నిర్వహించ లేకపోయారు.. పురాణ పురుషులయిన వేదవ్యాసుడు, యుధిష్టిరుడు వంటి వారి కామకలాపాలను వర్ణించడం ఔచిత్యం కాదు. అది మన తల్లిదండ్రుల కామకలాపాలను వర్ణించడంతో సమానమే.. దోషాలు ఉన్నప్పుడు ఆ నవలను బహుమతికి సూచించడం, అంగీకరింపజెయ్యడం ఎంతవరకు ధర్మమో వారే చెప్పాలి” అంటూ నిర్మొహమాటంగా రచయిత్రి వీరలక్ష్మీదేవి వ్యాఖ్యానించారు.

“నవల చదువుతున్నంత సేపూ ద్రౌపది లోని మానవీయ మహత్తు మననీ ఆవహిస్తుంది.” అని వీరలక్ష్మీదేవి నవలను ప్రశంసించారు. హిందీ నుంచి ఈ నవలను తెలుగులోకి జయశ్రీ అనువదించారు. ప్రతిభారాయ్ ‘యాజ్ఞసేని’కి ప్రతిష్ఠాత్మకమైన ‘మూర్తిదేవి’ పురస్కారం లభించింది.

ఎమెస్కో ప్రచురణ ‘యాజ్ఞసేని’ అందరికి ఇప్పుడు అందుబాటులో ఉంది. నవల చదవలేదు గాని, ఈ పరిచయం మాత్రమే చదివిన నేనూ ఒక ట్రాన్సు లోకి వెళ్ళిపోయాను.

***

భారతీయ నవలాదర్శనం
రచన: వాడ్రేవు వీరలక్ష్మీదేవి
పేజీలు: 520
వెల: ₹ 350
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్. ఫోన్: 9000 413 413
ఆన్‍లైన్‌లో:
https://www.telugubooks.in/products/bharateeya-navala-darshanam

 

 

 

(ఇంకా ఉంది)

Exit mobile version